అంతర్జాతీయం
బంగ్లాదేశ్‌లో ఆరుగురికి మరణదండన
అర్ధ శతాబ్దం కిందటి యుద్ధ నేరాలకుగాను బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాకిస్థాన్ సైనికులతో చేతులు కలిపి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు వీరిపై నాలుగు చొప్పున అభియోగాలు ఉన్నాయి. దోషులు ఆరుగురూ ‘రజాకార్ బాహిని’కి చెందినవారు. నాడు పాక్ ఆర్మీకి అనుబంధంగా పనిచేసిన తూర్పు పాకిస్థాన్ పారామిలటరీ దళంగా ఈ సంస్థకు పేరుంది. జస్టిస్ మహమ్మద్ షాహినుర్ ఇస్లాం నేతృత్వంలోని త్రిసభ్య ట్రైబ్యునల్ ఖుల్నా నగర కోర్టులో ఈ తీర్పును వెలువరించింది. దోషులు అంజద్ హొసేన్ హొవ్లాదార్, సహర్ అలి సర్దార్, అతియార్ రెహ్మాన్, మోటాచిమ్ బిల్లా, కమలుద్దీన్ గోల్దార్ న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలో కోర్టు బోనులో ఉన్నారు. ఆరో దోషి నజ్రుల్ ఇస్లాం పరారీలో ఉన్నాడు. తీర్పు ప్రకటించిన వెంటనే అయిదుగురినీ ఢాకా సెంట్రల్ జైలుకు తరలించారు. సామూహిక హత్యలు, దహనాలు, చిత్రహింసల వంటి నేరాలకు పాల్పడిన వీరంతా ఖుల్నా జిల్లాకు చెందినవారని ట్రైబ్యునల్ తెలిపింది.పాక్ పంజాబ్ సీఎంగా పర్వేజ్ ఇలాహీ
పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా 76 ఏళ్ల చౌధరి పర్వేజ్ ఇలాహీ ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ సీఎం ఎన్నికలో 10 ఓట్లు చెల్లవంటూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహమ్మద్ మజారీ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఖాయద్ (పీఎంఎల్ - క్యూ) నేత ఇలాహీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం డిప్యూటీ స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు ఇస్తున్న ఇలాహీని ముఖ్యమంత్రిగా న్యాయస్థానం ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇలాహీతో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయించారు.2024 తర్వాత ఐఎస్‌ఎస్‌కు సెలవు
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. భూకక్ష్యలో సొంతంగా ఇలాంటి కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ అధిపతి యూరి బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి ఐఎస్‌ఎస్ ఒక నిదర్శనంగా నిలిచింది. భిన్న ధ్రువాలుగా ఉన్న అమెరికా, రష్యాలు దీని కోసం చేతులు కలిపాయి. ఐరోపా దేశాలు, జపాన్, కెనడాల భాగస్వామ్యంతో భారీ వ్యయప్రయాసలకోర్చి భూకక్ష్యలో ఈ అంతరిక్ష కేంద్రాన్ని సాకారం చేశాయి. 1998లో దీని నిర్మాణం మొదలైంది. భూమికి 420 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమించే ఐఎస్‌ఎస్‌లో 22 ఏళ్లుగా విడతలవారీగా వ్యోమగాములు నివాసం ఉంటున్నారు. అక్కడ సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో సైన్స్ ప్రయోగాలు నిర్వహించారు. భవిష్యత్‌లో చంద్రుడు, అంగారకుడి వద్దకు చేపట్టే యాత్రలకు అవసరమైన పరిజ్ఞానాలను పరీక్షించారు.చైనా ల్యాబ్ మాడ్యూల్‌లోకి వ్యోమగాముల ప్రవేశం విజయవంతం
భూ కక్ష్యలోకి చైనా ప్రయోగించిన ల్యాబ్ మాడ్యూల్ విజయవంతంగా స్వీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. అనంతరం ముగ్గురు వ్యోమగాములు అందులోకి ప్రవేశించారు. ప్రస్తుతం చైనా, తియాంగాంగ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులోని కోర్ భాగమైన తియాన్హే ఏడాది కిందటే సిద్ధమైంది. అందులో ముగ్గురు వ్యోమగాములు ఉంటున్నారు. రెండో భాగమైన ‘వెంటియాన్’ ల్యాబ్ మాడ్యూల్‌ను చైనా నింగిలోకి ప్రయోగించింది. అది అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ముందు భాగంతో అనుసంధానమైంది. 20 టన్నుల బరువున్న ఒక భాగం, ఈ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావడం ఇదే మొదటిసారి. అలాగే తియాంగాంగ్‌లో వ్యోమగాములు నివాసం ఉంటున్న సమయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇది తొలిసారి.‣ ల్యాబ్ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన వ్యోమగాములు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. కొద్దివారాల తర్వాత వెంటియాన్‌ను ఒక రోబో యంత్రం సాయంతో అంతరిక్ష కేంద్ర ముందు భాగం నుంచి పక్క భాగానికి మళ్లిస్తారు. అక్కడే అది దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇందులో వర్క్ క్యాబిన్, ఎయిర్‌లాక్ క్యాబిన్, రిసోర్స్ క్యాబిన్ ఉంటాయి. ఇందులో సైన్స్ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబరులో మెంగ్టియాన్ అనే మరో ల్యాబ్ మాడ్యూల్‌ను దీనికి అనుసంధానిస్తారు. చైనా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుంది. దీంతో సొంతంగా స్పేస్ స్టేషన్ కలిగిన ఏకైక దేశంగా డ్రాగన్ గుర్తింపు పొందుతుంది. ప్రస్తుతం రోదసిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) ఉన్నప్పటికీ అది అమెరికా, రష్యా తదితర దేశాల సంయుక్త ప్రాజెక్టు.
అంతరిక్ష కేంద్రం కోసం ల్యాబ్ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించిన చైనా
భూ కక్ష్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం కోసం తొలి ల్యాబ్ మాడ్యూల్‌ను చైనా విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. తద్వారా 2022 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. వెంటియాన్ అనే ఈ ల్యాబ్‌ను భారీ లాంగ్ మార్చ్-5బి వై3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. హైనాన్ ప్రావిన్స్‌లోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. అంతరిక్ష కేంద్రంలోని కోర్ మాడ్యూల్ అయిన తియాన్హేకు ప్రత్యామ్నాయంగా కూడా కొత్త ల్యాబ్ ఉపయోగపడుతుంది. అలాగే శక్తిమంతమైన ప్రయోగాలకు వేదికవుతుంది. తియాంగాంగ్ అనే ఈ అంతరిక్ష కేంద్రంలో తియాన్హే, వెంటియాన్‌లతో పాటు మెంగ్టియాన్‌గా పిలిచే ల్యాబ్ మాడ్యూల్ కూడా ఉంటుంది. దాన్ని ఈ ఏడాది అక్టోబరులో ప్రయోగిస్తారు. ప్రస్తుతం కోర్ మాడ్యూల్‌లో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.పాకిస్థాన్‌లోని పంజాబ్ సీఎంగా హమ్జా షరీఫ్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుమారుడు హమ్జా షరీఫ్ (47) పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేశారు. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నాటకీయ పరిణామాల మధ్య కేవలం మూడు ఓట్ల తేడాతో ఆయన సీఎంగా మళ్లీ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు అసెంబ్లీలో తగిన సంఖ్యా బలం లేకున్నప్పటికీ హమ్జా షరీఫ్ ఎన్నికైనట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ, చౌధరి పర్వేయిజ్ ఎలాహీకి చెందిన పీఎంఎల్ (క్యూ) కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిచాయి. అయితే, డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహమ్మద్ మజారీ, పీఎంఎల్ (క్యూ)కు చెందిన 10 మంది ఓట్లను లెక్కించకపోవడంతో హమ్జా షరీఫ్ మూడు ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లయ్యింది. 368 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో హమ్జా షరీఫ్‌కు 179 ఓట్లు వచ్చాయి.శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్దెన
రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన సీనియర్ రాజకీయవేత్త, మహాజన ఏక్‌సాథ్ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్ గుణవర్దెన (73) శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. దరిమిలా అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్ సహచరులతో ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని గుణవర్దెనతో పాటు మరో 17 మంది మంత్రులు ఇందులో ఉన్నారు. కీలకమైన ఆర్థిక శాఖ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె వద్దనే కొనసాగుతుండగా, మిగతా మంత్రులకు శాఖలు కేటాయించారు. ప్రధాని దినేశ్ గుణవర్దెనకు గతంలో విదేశాంగ, విద్య మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. గత ఏప్రిల్‌లో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈయన్ను హోంమంత్రిగా నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, ప్రధాని దినేశ్ గుణవర్దెన పాఠశాల స్థాయిలో కలిసి చదువుకోవడం విశేషం. నెదర్లాండ్స్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన గుణవర్దెన 1979లో తన తండ్రి ఫిలిప్ గుణవర్దెన నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించారు.ఆహార ధాన్యాల ఎగుమతికి ఉక్రెయిన్, రష్యా పరస్పర అంగీకారం
నల్ల సముద్ర రేవుల నుంచి ఉక్రెయిన్ ఆహార ధాన్యాలనూ, రష్యా ఆహార ధాన్యాలతో పాటు ఎరువులనూ ఎగుమతి చేయడానికి రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒక్క సానుకూల పరిణామం మినహాయిస్తే రెండు దేశాల మధ్య యుద్ధం హోరాహోరీగా కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతంపై పట్టు కోసమే ప్రధానంగా పోరాడుతూ వచ్చిన రష్యా, ఇక నుంచి ఇతర ప్రాంతాలనూ కైవసం చేసుకొంటానని ప్రకటించింది.శ్రీలంక అధ్యక్షుడిగా విక్రమసింఘె ప్రమాణస్వీకారం
శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె (73) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయసూర్య సమక్షాన ఆయన ప్రమాణం చేశారు. విక్రమసింఘె జులై 22న 20-25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన దినేశ్ గుణవర్ధన (73) ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ రాజీనామా
ఇటలీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు కోల్పోవడంతో ప్రధాని మారియో ద్రాగీ తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో పెరుగుదల, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ కొన్నాళ్లుగా తీవ్రంగా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జీవన వ్యయం పెరుగుదల సంక్షోభం నుంచి దేశ ప్రజలను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును ప్రభుత్వం గత వారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అది ఆమోదం పొందలేదు. ఆ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ద్రాగీ ముందుకొచ్చారు. అందుకు నిరాకరించిన దేశాధ్యక్షుడు మాటరెలా, మరోసారి పార్లమెంటును సమావేశపరిచి బిల్లు ఆమోదానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ మేరకు మళ్లీ భేటీని ఏర్పాటు చేయగా మిత్రపక్షాలూ గైర్హాజరయ్యాయి. దీంతో ద్రాగీ రాజీనామా చేయాల్సి వచ్చింది.శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె (73) ఎన్నికయ్యారు. పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ సభ్యులు రణిల్‌కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు. ప్రధాన ప్రత్యర్థి, అధికార పక్షమైన శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) చీలిక వర్గం నేత దులస్ అలహప్పెరుమకు 82 ఓట్లు వచ్చాయి. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నేత అనుర కుమార దిశనాయకె కేవలం మూడు ఓట్లు సాధించాడు. దేశాన్ని దివాలా తీయించిన గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన విక్రమసింఘె ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. శ్రీలంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. దేశ ప్రధానిగా ఆరు సార్లు పని చేసిన అనుభవం రణిల్ విక్రమసింఘె సొంతం. ఆయన జులై 21న శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గే పెళ్లిళ్ల బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం
స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించేలా అమెరికా చర్యలు చేపట్టింది. ఈ మేరకు దిగువ సభలో బిల్లును ఆమోదించింది. పలువురు రిపబ్లికన్లు ఈ బిల్లును వ్యతిరేకించినా 47 మంది మాత్రం డెమోక్రాట్లకు మద్దతు పలికి బిల్లును ఆమోదించడంలో సహకరించారు. దీంతో 267-157 ఓట్ల తేడాతో బిల్లు దిగువ సభ గడప దాటింది. బిల్లుకు సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. 100 స్థానాలు ఉన్న ఈ సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చెరిసగం ఉన్నారు. అమెరికాలోని సాధారణ పౌరుల్లో స్వలింగ సంపర్కుల వివాహాలపై సానుకూలత వ్యక్తమవుతోంది. జూన్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో 70 శాతం అమెరికా వయోజనులు గే వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుకున్నారు.శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నిత్యావసరాల సరఫరాను నిరాటంకంగా కొనసాగించడం కోసం దేశంలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ప్రకటించారు. జులై 17వ తేదీతో ఉన్న ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మే 13న తాను ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. ప్రస్తుతం ఇంధన ధరలు దిగివస్తున్నాయని, విద్యుత్ సరఫరా మెరుగుపడిందని పేర్కొన్నారు.శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘె బాధ్యతల స్వీకరణ
సంక్షుభిత శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జులై 20న జరగనుంది. దీని కోసం అదే రోజు ఆ దేశ పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. తొలుత మాల్దీవులకు, ఆ తర్వాత సింగపూర్‌కు పరారైన గొటబాయ రాజపక్స ఈమెయిల్ ద్వారా పంపిన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ప్రకటించారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె బాధ్యతలు చేపట్టారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి కంటే పార్లమెంటుకే ఎక్కువ అధికారాలు కల్పించే 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తామని తెలిపారు. త్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూరియ సమక్షంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిని సంబోధిస్తూ గౌరవ సూచికంగా పలికే ‘హిజ్ ఎక్సెలెన్సీ’ పదాలను నిషేధించాలని నిర్ణయించినట్లు రణిల్ వెల్లడించారు.శ్రీలంక అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలకు కత్తెర వేస్తూ, పార్లమెంటుకు ఎక్కువ అధికారాలను కల్పిస్తూ 2015లో ఆ దేశ పార్లమెంటు 19వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీనిని తీసుకురావడంలో విక్రమసింఘె కీలకపాత్ర వహించారు. అయితే, 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన గొటబాయ రాజపక్స 19వ సవరణను రద్దు చేశారు. ప్రధాన మంత్రికి దక్కాల్సిన అధికారాలను సైతం గుప్పిట పెట్టుకున్నారు.
క్యాట్సా నుంచి భారత్‌కు మినహాయింపు
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన భారత్‌కు ‘క్యాట్సా’ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే ఒక చట్ట సవరణకు అమెరికా ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. భారత అమెరికన్ సభ్యుడు రో ఖన్నా ఈ బిల్లును రూపొందించి ప్రవేశపెట్టారు. చైనా వంటి ప్రత్యర్థి దేశం నుంచి రక్షణ కోసం ఈ ఆయుధ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి, ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరారు.క్యాట్సా అనేది కఠినమైన అమెరికా చట్టం. 2014లో క్రిమియాను ఆక్రమించుకోవడంతో పాటు 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం దీన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది.