భవనంలోని పైఅంతస్తుకు సునాయాసంగా చేరుకోవడానికి లిఫ్ట్ వాడుతుంటాం.
→
అదే రీతిలో మరింత పైకెళితే? రోదసిని చేరుకోగలిగితే..! ఇదంతా సైన్స్ కాల్పనిక సాహిత్యంలా అనిపిస్తోంది.
→
ఇన్నాళ్లు ఆలోచనలకే పరిమితమైన ఈ బృహత్తర ప్రాజెక్టును నిజం చేసేందుకు జపాన్‌కు చెందిన ఒక కంపెనీ ప్రయత్నిస్తోంది.
→
అంతరిక్ష లిఫ్ట్‌ను నిర్మించాలనుకుంటోంది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది.
→
ఇది సాకారమైతే చాలా సులువుగా, చౌకలో రోదసిలోకి మానవులను, సరకులను చేరవేయవచ్చు.
→
→
→
130 ఏళ్ల నాటి ఆలోచన :-
→
రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్‌స్టాంటిన్ సియోల్‌కోవ్‌స్కీ తొలుత ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు.
→
1895లో ఆయన రాసిన ‘డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.
→
అందులో ఆయన 22 వేల మైళ్ల ఎత్తయిన ఒక ఊహాజనిత టవర్‌ను వర్ణించారు.
→
ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజినీర్ యూరి ఆర్ట్స్‌టానోవ్ మరింత ముందుకు తీసుకెళ్లారు.
→
భూమి నుంచి భూ అనువర్తిత కక్ష్యలోని ఒక ఉపగ్రహం వరకూ ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు.
→
→
→
పనిచేసేది ఇలా:-
→
స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా పుడమి నుంచి రోదసిలోని భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహం వరకూ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో సమానంగా భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ అది భూమికి ఎగువన నిర్దిష్టంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది.
→
అంతరిక్ష లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరిస్తుంది. దీని కౌంటర్‌వెయిట్ ఇక్కడే ఉంటుంది.
→
భూమధ్యరేఖా ప్రాంతంలో సముద్రంలో ‘ఎర్త్ పోర్ట్’ను ఏర్పాటు చేస్తారు.
→
ఎర్త్ పోర్ట్‌లో బలాస్ట్ ఉంటుంది. కేబుల్ తన్యత (టెన్షన్)ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎర్త్‌పోర్ట్‌కు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాగరంలోని ఎర్త్ పోర్ట్‌కు చేరుకోవడానికి.. సముద్రం కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు.
→
ఈ కేబుల్ సాయంతో క్లైంబర్ అనే విద్యుదయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్లడం, కిందకి రావడం చేస్తాయి. వాటిలో మానవులు ప్రయాణించొచ్చు. సరకును రవాణా చేయవచ్చు.
→
స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్టులో భాగంగా కేబుల్ వెంబడి 36వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్‌ను నిర్మిస్తారు. సందర్శకులు అక్కడికి వెళ్లి.. శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విశ్వాన్ని వీక్షించొచ్చు. అక్కడి నుంచి భూస్థిర కక్ష్య ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు.
→
→