చౌకలో విమానవాహక నౌకల ధ్వంసం




→ ఓ పక్క విమానవాహక నౌకలను పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంటే.. మరోవైపు చౌకరకం బాంబులతో వాటిని పేల్చేసే విధానాలపై అమెరికా కసరత్తు చేస్తోంది.
→ ఇందుకోసం తన తురుపు ముక్క బీ-2 స్టెల్త్‌ బాంబర్లను రంగంలోకి దించింది.
→ జులై 19న హవాయి సమీపంలోని ద్వీపం వద్ద దీనిపై సాధన చేసింది.
→ రిమ్‌ ఆఫ్‌ ద పసిఫిక్‌- 2024 (రిమ్‌ప్యాక్‌) యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని నిర్వహించినట్లు అమెరికా నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.
→ ‘‘వేగంగా పుట్టుకొస్తున్న ముప్పులను తక్కువ వ్యయంతో ఎలా ధ్వంసం చేయాలనేది సాధన చేశాం’’ అని తెలిపింది.
→ ఈ పరీక్షల్లో బాంబుకు లక్ష్యంగా.. 39,000 టన్నుల బరువున్న ఒక పాత ఉభయచర యుద్ధనౌకను అమెరికా ఉపయోగించింది.
→ అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం బీ-2 బాంబర్‌.
→ శత్రు దుర్భేద్య, పటిష్ఠ రాడార్‌ నిఘా ఉన్న గగనతలంలోకీ ఇది అలవోకగా చొచ్చుకెళ్లగలదు.
→ దీనిని గుర్తించే అవకాశాలు చాలా తక్కువ. ఇది చాలా ఎత్తులో ఉన్నా.. యుద్ధక్షేత్రాన్ని స్పష్టంగా చూడగలదు.
→ ఇక క్విక్‌ సింక్‌ బాంబు బరువు 2,000 పౌండ్లు ఉంటుంది. వీటిని అమర్చడం వల్ల బీ2 బాంబర్లు.. జలాంతర్గాముల కన్నా శక్తిమంతంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు.
→ ఒక జలాంతర్గామి.. టోర్పిడోను ప్రయోగించి నౌకను ముంచగలదు. కానీ, అది ఉన్న చోటు శత్రువులకు తెలిసిపోతుంది.
→ దీనికి భిన్నంగా బీ-2 బాంబర్‌ శత్రువు కంటపడదు. క్విక్‌ సింక్‌ బాంబులను 2022లో అమెరికా ఎఫ్‌-15 యుద్ధవిమానాలతో కూడా పరీక్షించింది.
→ చైనా వద్ద 36,000 టన్నులున్న టైప్‌ 075శ్రేణి ఉభయచర నౌకలు మూడున్నాయి.
→ తైవాన్‌పై ఆక్రమణ సమయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
→ ఈ నేపథ్యంలో క్విక్‌ సింక్‌ బాంబులు చైనాను ఆందోళనకు గురిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.