జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్‌!


→ పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు సవరణ)తో చెక్‌పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి.
→ తాజాగా నేత్ర సంబంధిత వ్యాధులకు జన్యు సవరణతో అడ్డుకట్ట వేయవచ్చని భారత శాస్త్రవేత్తలు నిరూపించారు.
→ దిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ, హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్యసంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
→ పరిశోధన అంశాలు ‘నేచర్‌ కమ్యునికేషన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
→ ఈ మేరకు చిన్నతనంలోనే తీవ్రమైన దృష్టి లోపానికి దారితీసే ‘లెబెర్స్‌ కాంజినేటల్‌ అమౌరోసిస్‌ టైప్‌2’ అనే అరుదైన, జన్యుపరమైన కంటి వ్యాధికి జన్యు సవరణతో అడ్డుకట్ట వేయవచ్చని నిరూపించారు.
→ ఇందులో భాగంగా ‘ప్రాన్సిసెల్లా నోవిసిడా’ అనే బ్యాక్టీరియా నుంచి ఒక సీఏఎస్‌9 ప్రొటీన్‌ను తీసుకొని దానిని మెరుగుపర్చి ఈఎన్‌ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 అనే మరింత కచ్చితమైన, సమర్థమైన వేరియంట్‌ను రూపొందించారు.
→ ఈ ప్రొటీన్‌ను కంటి వ్యాధికి కారణమయ్యే జన్యువు సవరణకు ఉపయోగించారు.
→ ఇందులోభాగంగా ఇప్పటికే ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి చర్మ కణాలను తీసుకొని కొత్తగా రూపొందించిన ఈఎన్‌ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 ప్రొటీన్‌తో మూలకణాలను పునర్‌వ్యవస్థీకరించారు.