ర్యానిటిడిన్‌ వినియోగంపై అమెరికా, ఐరోపా సహా పలు దేశాల్లో ఆంక్షలు


→ ఛాతీలో మంట, కడుపులో గ్యాస్, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో ర్యానిటిడిన్‌ హెచ్‌సీఎల్‌ ఒకటి.
→ ఈ మాత్ర ధర తక్కువే. ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) అమ్మకాలు అధికం. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విస్తృతంగా వాడుకలో ఉంది.
→ మన దేశంలోనూ అంతే. డాక్టర్ల సిఫారసుతో కొంతమంది వాడుతుంటే, డాక్టర్‌ చిట్టీ(ప్రిస్క్రిప్షన్‌)తో పని లేకుండా తమకు తామే మందుల షాపులో ఈ ట్యాబ్లెట్‌ తీసుకుని వినియోగించే వారెందరో.
→ రోజులు, వారాలు, నెలల తరబడి ఈ మాత్ర వాడుతున్న వారూ కనిపిస్తారు.
→ క్యాన్సర్‌ ముప్పు?: ర్యానిటిడిన్‌ హెచ్‌సీఎల్‌లో నైట్రోసెమైన్‌ ఇంప్యూరిటీస్‌ (ఎన్‌డీఎంఏ- నైట్రోసొడిమెథైలమైన్‌) ఉన్నట్లు అయిదేళ్ల క్రితం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) గుర్తించింది. ఎన్‌డీఎంఏ మలినాలు అధికంగా మనిషి శరీరంలోకి చేరితే, క్యాన్సర్‌ ముప్పు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ మందు వినియోగంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) దీని ఉత్పత్తి, పంపిణీని నిలిపి వేసింది. ఈ మందు వినియోగాన్ని బాగా తగ్గించే దిశగా ఆ దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇదే మాదిరిగా మరికొన్ని దేశాలు సైతం ఆంక్షలు విధించాయి. తాజాగా ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలో ఈ మందును నిషేధించారు. ‘ర్యానిటిడిన్‌ మందులో ఎన్‌డీఎంఏ ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ మందు వినియోగాన్ని నిలిపివేస్తున్నాం’ అని నమీబియా మెడిసిన్స్‌ రెగ్యులేటరీ కౌన్సిల్‌ (ఎన్‌ఎంఆర్‌సీ) ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
→ మన దగ్గర చర్యలేం లేవు: మన దేశంలో ఈ మందు వినియోగంపై ఔషధ నియంత్రణ సంస్థల నుంచి స్పష్టత కొరవడడాన్ని వైద్య నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా సహా పలు దేశాలు ర్యానిటిడిన్‌ హెచ్‌సీఎల్‌ మందు వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తుంటే, మనదేశంలో దీనిపై ఎటువంటి పరిశీలన, అధ్యయనం చేయడం లేదని పేర్కొంటున్నారు. మన దేశంలో నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ (ఎన్‌ఎల్‌ఈఎం) జాబితా నుంచి 2022లో ర్యానిటిడిన్‌ మందును తొలగించారు. ఇదొక్కటే ప్రభుత్వం తీసుకున్న చర్య. అంతకు మించి ఎటువంటి ఆంక్షలు లేవు.
→ 1981 నుంచి వినియోగం : ర్యానిటిడిన్‌ మందు 1981లో తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
→ అప్పటి నుంచి గెర్డ్‌(జీఈఆర్‌డీ) వ్యాధులుగా పేర్కొనే ‘అరగకపోవడం, కడుపులో మంట, గ్యాస్‌’ చికిత్సలో ఈ మందు ఎంతో క్రియాశీలకమైనదిగా మారింది.
→ ప్రపంచ వ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఈ మందును అధికంగా వినియోగిస్తున్నారు. దీన్లో ఎన్‌డీఎంఏ మలినాలు ఉన్నట్లు 2019లో గుర్తించారు.
→ యూఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (ఈపీఏ) అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలం పాటు ర్యానిటిడిన్‌ను వినియోగించడం వల్ల కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు. ర్యానిటిడిన్‌ మందు ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే, అందులో అంత అధికంగా ఎన్‌డీఎంఏ మలినాలు పెరుగుతాయి.