కొలెస్ట్రాల్‌కు జన్యు ఔషధాలతో కళ్లెం
→
రక్తంలో సహజసిద్ధంగానే అధిక స్థాయిలో లిపిడ్లను కలిగిన వారిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జన్యు ఆధారిత ఔషధాలు తోడ్పడగలవని రెండు అధ్యయనాలు తేల్చాయి. ఈ మందులను ఏటా నాలుగుసార్లు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అధ్యయనంలో భాగంగా ప్లొజాసిరాన్, జోడాసిరాన్ అనే రెండు జన్యు ఆధారిత ఔషధాల పనితీరును ఫేజ్-2బి క్లినికల్ ప్రయోగాల్లో పరిశోధకులు విశ్లేషించారు. ఈ ఔషధాలు ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా రూపొందాయి. అంటే.. జీవుల్లో ఉండే రైబోన్యూక్లిక్ యాసిడ్‌కు సంబంధించిన చిన్నపాటి తునకల సాయంతో వీటిని తయారుచేశారు.
→
ఆర్‌ఎన్‌ఏ.. డీఎన్‌ఏ నుంచి ఏర్పడుతుంది. అది డీఎన్‌ఏలోని సమాచారాన్ని శరీర విధులకు అవసరమయ్యే ప్రొటీన్లుగా మారుస్తుంది. తాజా ఔషధాల్లోని ఆర్‌ఎన్‌ఏ పదార్థం.. శరీరంలో సహజసిద్ధంగా ఉన్న ఆర్‌ఎన్‌ఏతో బంధం ఏర్పరుస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు తయారుకాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో అపోలిపోప్రొటీన్ సి3 అనే ప్రొటీన్ ఉత్పత్తిని ప్లొజాసిరాన్ ఔషధం తగ్గిస్తుంది. జోడాసిరాన్ మాత్రం యాంజియోపొయెటిన్ లైక్ 3 (ఏఎన్‌జీపీటీఎల్3) అనే ప్రొటీన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. శరీరంలో సహజసిద్ధంగానే అధిక స్థాయిలో కొలెస్ట్రాల్, కొవ్వు కలిగిన (హైపర్‌లిపిడెమియా) వారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని ఈ మందులు గణనీయంగా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ట్రైగ్లిజరైడ్ పరిమాణం పెరిగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు ఆస్కారం పెరుగుతుంది. ఇలాంటి రోగులు ఇప్పటికే.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్ అనే మందులను వాడుతున్నారు.
→
→