వైద్యులకు ఏఐ అండ!


→ ఆసుపత్రుల్లో చికిత్సలను మెరుగుపరచడానికి, రోగులు వేగంగా కోలుకునేలా చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) బాగా ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. గత అనుభవాల ఆధారంగా రూపొందిన మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు.. సకాలంలో చికిత్సలు అందించేలా చూస్తాయని గుర్తించారు. రోగుల్లో ప్రతికూల మార్పులను ముందే పసిగట్టి, వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తే.. ఆసుపత్రుల్లో వైద్య పరిరక్షణ 43 శాతం మెరుగుపడుతుందని, అకాల మరణాలూ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. న్యూయార్క్‌లోని మౌంట్‌ సైనాయ్‌ ఆసుపత్రి నిపుణులు ఈ పరిశోధనలు చేశారు.
→ రోగులకు సంబంధించిన వివిధ రకాల డేటాపై శిక్షణ పొందిన ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాలు చేసే హెచ్చరిక సందేశాలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేశారు. తరచూ రోగులు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ చికిత్స పొందాల్సిన అవసరాన్ని ఇవి తప్పించగలవా? ఆసుపత్రిలో అకాల మరణాల ముప్పును తగ్గించగలవా అన్నది విశ్లేషించారు. ఇందులో భాగంగా 2,740 మంది రోగులను పరిశీలించారు.