యాంటీ బయాటిక్స్‌ నియంత్రణకు ఏఎంఆర్‌ఎక్స్‌!


→ ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్‌ మందుల వాడకం బాగా పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.

→ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు ఏఎంఆర్‌ఎక్స్‌ అని నామకరణం చేశాయి. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణుడు తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధిని ఎలా విశ్లేషిస్తారో అలాగే చేస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా తార్కికంగా ఆలోచిస్తాయో అలాగే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఫలితాలు తక్షణమే వస్తాయి కాబట్టి అనవసరంగా యాంటీ బయాటిక్‌ ఔషధాల వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది.

→ ఇప్పటిదాకా చాలా మంది వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీ బయాటిక్‌ ఔషధాలను వాడిస్తూ... నివేదికలు వచ్చిన తర్వాత అసలు యాంటీ బయాటిక్స్‌ అవసరమా, తగ్గించాలా, పెంచాలా అని నిర్ణయిస్తున్నారు.