మెంథాల్‌తో అల్జీమర్స్‌ నుంచి ఉపశమనం!


→ మెంథాల్‌ వాసన చూడటం ద్వారా అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందే వీలుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైందని వారు తెలిపారు.
→ అనూహ్యంగా వెలుగు చూసిన ఈ అంశం.. ఈ వ్యాధికి కొత్త చికిత్స మార్గాన్ని చూపొచ్చని పేర్కొన్నారు.
→ అల్జీమర్స్‌ అనేది చాలా తీవ్రమైన నాడీ క్షీణత వ్యాధి. కాలం గడిచేకొద్దీ అది మరింత తీవ్రరూపం దాల్చొచ్చు.
→ ఈ వ్యాధి బాధితుల మెదడులో మార్పులు వస్తాయి. ఫలితంగా నాడీ కణాలు, వాటి మధ్య సంధానతలు బలహీనపడతాయి.
→ బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైంది.. జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణించడం. అలాగే ఆలోచనశక్తి, సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయి.
→ తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు.. ఆల్‌ఫ్యాక్టరీ, ఇమ్యూన్, కేంద్ర నాడీ వ్యవస్థల మధ్య చర్యలు ఎలా ఉంటాయన్నది పరిశీలించారు.
→ మెంథాల్‌ వాసనను పదేపదే చూపితే ఎలుకల్లో రోగనిరోధక ప్రతిస్పందన పెరిగినట్లు మునుపటి అధ్యయనంలో తేలింది.
→ విషయగ్రహణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచే సామర్థ్యం ఈ పదార్థానికి ఉందా అన్నది తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు.
→ ఇందుకోసం అల్జీమర్స్‌ లక్షణాలు కలిగి ఉన్న ఎలుకలను జన్యుమార్పిడి పద్ధతిలో రూపొందించారు.
→ ఆరు నెలల పాటు వాటికి తరచూ మెంథాల్‌ వాసన చూపారు. అనంతరం ఈ జీవుల్లో రోగ నిరోధక ప్రతిస్పందన, విషయగ్రహణ సామర్థ్యాన్ని పరిశీలించారు.
→ అల్జీమర్స్‌ కలిగిన ఎలుకలు.. ఆశ్చర్యకరంగా గణనీయ స్థాయిలో ఉపశమనం పొందినట్లు వెల్లడైంది.
→ రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మెంథాల్‌ సాయపడింది. అలాగే విషయగ్రహణ సామర్థ్యం క్షీణించకుండా నివారించింది.
→ జ్ఞాపకశక్తి, అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరిచింది.