అంతర్జాతీయ అందాల పోటీల్లో డిజిటల్‌ భామ!


→ అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతవరీ వందలమందిని వెనక్కినెట్టి టాప్‌-10 తుది జాబితాలో ఒకరిగా నిలిచింది.
→ ఇందులో మతలబు ఏమిటంటే.. ఈ జారా అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు.
→ కృత్రిమ మేధతో (ఏఐ) సృష్టించిన ఓ ‘డిజిటల్‌ భామ’! ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
→ రీల్స్, వాణిజ్యసంస్థల ప్రచారం, ప్రకటనల ద్వారా విపరీతంగా వీరు ఆకట్టుకొంటున్నారు.
→ నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యం కాని ఈ ఊహా సుందరుల కోసం ‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది.
→ ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లాగే ఇందులో గెలిచినవారికి ‘మిస్‌ ఏఐ’ టైటిల్‌ ఇవ్వనుంది. ప్రపంచంలో ఈ తరహా పోటీ ఇదే తొలిసారి.
→ ఈ పోటీల్లో పలు దేశాల నుంచి 1,500 మంది ఏఐ మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు.
→ వీరి నుంచి ‘టాప్‌ 10’ ఫైనలిస్టులను ఎంపికచేయగా.. భారత్‌కు చెందిన జారా అందులో చోటు దక్కించుకుంది.
→ భారత్‌లోని ఓ మొబైల్‌ యాడ్‌ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చౌధరీ జారాను సృష్టించారు.
→ ఈమె ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తోంది.
→ న్యాయనిర్ణేతలు ఈ భామల చూపులు, ఉపయోగించిన సాంకేతికత, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని విజేతను ఎంపిక చేస్తారు.