కొవిడ్‌తో టైప్-1 మధుమేహ లక్షణాలు వేగవంతం!
→ కొవిడ్-19 బారినపడ్డ చిన్నారుల్లో టైప్-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది.
→ కరోనా ఉద్ధృతంగా సాగిన కాలంలో.. చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధారణ రేటు ఎక్కువగా ఉందని వివరించింది.
→ టైప్-1 మధుమేహం అనేది ఆటోఇమ్యూన్ రుగ్మత. అంటే.. వ్యాధి కారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పుతుంది.
→ ఆరోగ్యంగా ఉన్న స్వీయ కణాలు, అవయవాలపైనే దాడి చేస్తుంది. ఈ రుగ్మతున్న వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీరికి చికిత్స కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నప్పుడు ఐలెట్ ఆటోయాంటీబాడీలు ఉత్పత్తవుతుంటాయి.
→ రక్త నమూనాలో వీటి ఉనికి ఆధారంగా టైప్-1 మధుమేహాన్ని గుర్తించొచ్చు.
→ కొవిడ్-19 బారినపడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్ ఆటోయాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు మునుపటి పరిశోధనల్లో తేలింది.
→ తాజాగా జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మరో అంశాన్ని గుర్తించారు.
→ ఐలెట్ ఆటోయాంటీబాడీలు ఇప్పటికే కలిగిన (టైప్-1 మధుమేహం ఆరంభ దశ) చిన్నారులు కొవిడ్-19 బారినపడితే.. వారిలో టైప్-1 మధుమేహ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కనుగొన్నారు.