పిండంలో పెద్ద మెదడు.. తీవ్ర ఆటిజానికి సూచిక!
→
మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశువు మెదడులోని గ్రే మ్యాటర్ చాలా ఎక్కువగా ఉంటే అది తీవ్ర ఆటిజానికి సంకేతం కావొచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
→
జన్మించాక అలాంటి చిన్నారికి సామాజిక, విషయగ్రహణ సామర్థ్యం పరంగా జీవితకాలం పాటు ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→
వారు మాట్లాడటమూ కష్టం కావొచ్చని చెప్పారు. ఒక మోస్తరుస్థాయి, తీవ్ర ఆటిజానికి సంబంధించిన బీజాలు.. పిండం ఏర్పడిన కొద్దివారాలకే పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
→
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఆటిజం ఉన్న పది మంది చిన్నారుల నుంచి, ఆ రుగ్మత లేని ఆరుగురు పిల్లల నుంచి రక్త నమూనాలు సేకరించారు.
→
వాటి నుంచి మూల కణాలను తీసుకున్నారు. వాటి సాయంతో మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ నమూనాలను వృద్ధి చేశారు.
→
అవి.. ఆ చిన్నారుల పిండస్థ దశ నాటి మెదడు భాగాన్ని ప్రతిబింబించాయి. ఈ మినీ మెదళ్లను బ్రెయిన్ కార్టికల్ ఆర్గానాయిడ్స్ (బీసీవో)గా పిలుస్తారు.
→
ఆటిజమ్ ఉన్న పిల్లల మూలకణాలతో వృద్ధి చేసిన బీసీవోలు.. మిగతావారి కన్నా 40 శాతం పెద్దగా ఉన్నాయని గుర్తించారు.
→
‘‘మెదడు ఎంత పెద్దగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందన్నది నిజం కాదు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన అలీసన్ తెలిపారు.
→
తీవ్రస్థాయి ఆటిజం ఉన్న పిల్లలు పిండస్థ దశలో చాలా పెద్ద బీసీవోలను కలిగి ఉన్నారని, ఒక మోస్తరు స్థాయిలో ఉన్నవారికి ఆ పెరుగుదల స్వల్పంగానే ఉన్నట్లు వివరించారు.
→
→