ఆర్సెనిక్‌ను వడకట్టడం ఇక సులువు!
→
భూగర్భ జలాల్లో ఉండే ఆర్సెనిక్ వంటి భారలోహ కాలుష్యకారకాలను వడకట్టేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
→
ఇది పర్యావరణ అనుకూల విధానమని వారు తెలిపారు.భారత్‌లోని 223 జిల్లాల్లో ఆర్సెనిక్ స్థాయి లీటరుకు 1.5 మిల్లీగ్రాముల మేర ఉంది.
→
ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన పరిమితి కన్నా ఇది చాలా ఎక్కువ.
→
దీనివల్ల మానవులు, జంతువుల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది.
→
ఆర్సెనిక్‌ను వడకట్టి, శుద్ధమైన తాగునీటిని అందించే పరిజ్ఞానాలు ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నాయి.
→
అయితే నీటి నుంచి వేరుచేశాక ఆ విషతుల్య పదార్థాన్ని ఎక్కడ పడేయాలన్నదే ఇక్కడ కీలకం.
→
అది తిరిగి పర్యావరణంలోకి ప్రవేశించకుండా చూడాలి. ప్రస్తుతమున్న విధానాల్లో ఈ అంశం కొరవడుతోంది.
→
వడకట్టిన ఆర్సెనిక్‌ను నేలలో పూడ్చిపెట్టడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల మళ్లీ అది భూగర్భ జలాల్లోకి చేరుతోంది. ఈ సమస్యను ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు పరిష్కరించారు.
→
వడకట్టిన ఆర్సెనిక్‌ను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వదిలించుకోవడానికి వారు రూపొందించిన విధానం ఉపయోగపడుతుంది.
→
ఇందులో మూడు అంచెలు ఉంటాయి. ఈ పద్ధతిలో వెలువడే విషతుల్య అకర్బన ఆర్సెనిక్‌ను.. విషతుల్యత పెద్దగా లేని సేంద్రియ ఆర్సెనిక్‌గా మారుస్తారు.
→
ఇందుకోసం ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవుల సాయంతో మిథైలేషన్ అనే ప్రక్రియను చేపడతారు. 8 రోజుల్లోనే ఇది పూర్తవుతుంది.
→
దీన్ని సురక్షితంగా గోతుల్లో పూడ్చిపెట్టవచ్చు.
→
→