కృత్రిమ మేధతో మొండి బ్యాక్టీరియా నిర్ధారణ


→ ఔషధాలకు లొంగని మొండి బ్యాక్టీరియాను వేగంగా గుర్తించే దిశగా బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.
→ కేవలం సూక్ష్మదర్శిని సాయంతో అందించిన చిత్రాలను నిశితంగా పరిశీలించడం ద్వారా టైఫాయిడ్‌లాంటి ఓ మొండి ఇన్‌ఫెక్షన్‌ను కనిపెట్టే కృత్రిమ మేధ (ఏఐ)ను వారు అభివృద్ధి చేశారు.
→ ప్రస్తుతం ఉన్న విధానాల్లో మొండి బ్యాక్టీరియాను గుర్తించేందుకు రోజుల తరబడి సమయం అవసరమవుతోంది.
→ ఈ సమయాన్ని తగ్గించేందుకు ఏఐని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా కేంబ్రిడ్జి పరిశోధకులు తాజా పరిశోధన చేపట్టారు.
→ టైఫాయిడ్‌ తరహా వ్యాధి లక్షణాలకు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫిమ్యూరియమ్‌ను సూక్ష్మదర్శిని చిత్రాల్లో గుర్తించేలా ఏఐకి శిక్షణనిచ్చారు.
→ అనంతరం 16 కొత్త నమూనాలను దానితో పరిశీలించగా 100% కచ్చితమైన ఫలితాలు వెలువడ్డాయి.
→ ఏఐ కేవలం ఆరు గంటల్లో మొండి బ్యాక్టీరియాను నిర్ధారించిందని పరిశోధకులు తెలిపారు.