సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్‌ మాయం!


→ మెదడు క్యాన్సర్‌ చికిత్సలో దిల్లీ ఐఐటీ ముందడుగు వేసింది. గ్లియోబ్లాస్టోమా రకం క్యాన్సర్‌ కణితిని అంతం చేసేందుకు ఎలుకలపై అది నిర్వహించిన ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. ఓ ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
→ ‘‘గ్లియోబ్లాస్టోమా కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స, రేడియేషన్‌ కీమోథెరఫీలాంటి వైద్య విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ, రోగులు 12-18 నెలలకు మించి జీవించలేకపోతున్నారు. అలాంటివారికి దీర్ఘాయువును ప్రసాదించేందుకు మేం కొత్త చికిత్సా విధానాన్ని ఆవిష్కరించాం. ఈ పరిశోధనలు ప్రఖ్యాత బయోమెటీరియల్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇక్కడి బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జయంత భట్టాచార్య మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ విద్యార్థి విదిత్‌ గౌర్‌ ప్రాథమికంగా ఈ అధ్యయనం చేశారు.
→ చికిత్స కోసం విదిత్‌ ఇమ్యూనోసమ్స్‌ పేరుతో వినూత్న నానో ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేశారు.
→ ఇది శక్తిమంతమైన యాంటీబాడీ సీడీ40ని ఆర్‌ఆర్‌ఎక్స్‌-001 అనే చిన్న అణు నిరోధకంతో జతచేస్తుంది.
→ ఈ విధానం మెదడులోని కణితులపై చికిత్స సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎలుకలపై దాన్ని ప్రయోగించగా ట్యూమర్‌ పూర్తిగా మాయమైంది.
→ దీనికితోడు మెదడు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే బలమైన రోగనిరోధక శక్తి అందింది.
→ మూడు నెలల విరామం తర్వాత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ భట్టాచార్య నేతృత్వంలోని పరిశోధక బృందం అవే ఎలుకల్లోకి గ్లియోబ్లాస్టోమా కణాలను జొప్పించి మళ్లీ ప్రయోగాలు చేశారు. అయితే వాటిలో కొత్తగా కణితి ఏమీ వృద్ధి చెందలేదు’’ అని ప్రకటనలో దిల్లీ ఐఐటీ పేర్కొంది.
→ గ్లియోబ్లాస్టోమా రోగులపై ఈ చికిత్సా విధానాన్ని ప్రయోగించి మంచి ఫలితాలు సాధించాలనుకుంటున్నట్లు జయంత భట్టాచార్య పేర్కొన్నారు.