సౌర విద్యుత్‌తో ఈవీల ఛార్జింగ్‌కు ప్రత్యేక అడాప్టర్‌


→ సౌర విద్యుత్‌ సాయంతో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)ను ఛార్జ్‌ చేయడానికి జోధ్‌పుర్‌లోని ఐఐటీ పరిశోధకులు ఒక ప్రత్యేక అడాప్టర్‌ను అభివృద్ధి చేశారు.
→ దీని ధర రూ.వెయ్యి లోపే ఉంటుందని వారు చెప్పారు. ఇళ్లపైకప్పుల మీద ఏర్పాటు చేసిన సౌరఫలకాల ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌తో ప్రజలు తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను రీఛార్జి చేసుకోవడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దినెలల కిందట ప్రకటించారు.
→ దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి తమ అడాప్టర్‌ బాగా ఉపయోగపడుతుందని జోధ్‌పుర్‌ ఐఐటీలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు.
→ దీన్ని ఒకవైపున సౌర ఫలకానికి, రెండో పార్శ్వాన్ని ఈవీ ఛార్జర్‌కు అనుసంధానించాలని చెప్పారు.
→ అవసరానికి తగినట్లు విద్యుత్‌ను సరఫరా చేయడానికి అందులో రెండు పాయింట్లు కూడా ఉన్నాయి.
→ పవర్‌ కన్వర్టర్‌ లేకుండా ప్రస్తుతం సౌరశక్తి నుంచి గరిష్ఠస్థాయిలో విద్యుత్‌ను ఒడిసిపట్టడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.
→ ఇందుకోసం ఒక ఛార్జింగ్‌ అడాప్టర్‌ అవసరం. కంపెనీలు అందించే ఛార్జర్‌.. సౌర విద్యుత్‌ నుంచి కరెంటును సేకరించలేదు.
→ దీన్ని పరిష్కరించడానికి భారత్‌ సహా అనేక దేశాలు పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నాయి.
→ తాజా అడాప్టర్‌ అన్ని రకాల వాహనాలకు అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు.