రక్తాన్ని పలుచబరిచే మందుతో పాముకాటుకు విరుగుడు


→ రక్తాన్ని పలుచబరిచే ఒక సాధారణ ఔషధం పాముకాటుకు చౌకైన విరుగుడుగా అక్కరకొస్తుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది. అది ప్రాణాపాయాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది.
→ తాచుపాము కాటు వల్ల నెక్రోసిస్‌ తలెత్తుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో కణజాలం చనిపోతుంది.
→ ఇది తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు ఆ అవయవాలను తొలగించాల్సి రావొచ్చు.
→ ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మానవ జన్యువులను మార్పిడి చేశారు.
→ తద్వారా తాచుపాము విషాన్ని అడ్డుకునేందుకున్న భిన్న మార్గాలను గుర్తించారు.
→ హెపారిన్‌ సహా రక్తాన్ని పలుచబరిచే అనేక ఔషధాల్లో మార్పులు చేర్పులు చేశారు.
→ వీటిని మానవ కణాలు, ఎలుకలపై పరీక్షించారు. తాచుపాము కాటు వల్ల కలిగే నెక్రోసిస్‌ను హెపారిన్‌ అడ్డుకోగలదని గుర్తించారు.
→ రక్తం గడ్డకట్టినప్పుడు జంతువులు, మానవుల్లోని అనేక కణాల్లోనూ హెపారిన్‌ ఉత్పత్తవుతుంటుంది. పాము విషం దీనితో బంధాన్ని ఏర్పరుస్తుంటుంది.
→ మొత్తంమీద రక్తాన్ని పలుచబరిచే ఔషధాలు ‘నకిలీ విరుగుడు’లా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ కాటుపడిన ప్రదేశాన్ని హెపారిన్‌ తరహా పదార్థాలతో ముంచెత్తడం ద్వారా అవి విష పదార్థాలను ఎదుర్కోగలవని వివరించారు.