ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణలో వైద్యులను అధిగమించిన ఏఐ


→ నిత్య జీవితంలో కీలకంగా మారిన అధునాతన సాంకేతికత అయిన కృత్రిమమేధ (ఏఐ) వైద్యరంగంలో పలు మార్పులు తీసుకొస్తోంది.
→ చాలా వ్యాధుల నిర్ధారణలో వైద్యులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. క్యాన్సర్‌ మాటకొస్తే.. వైద్యులను సైతం ఏఐ అధిగమిస్తోందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.
→ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను 87 శాతం కచ్చితత్వంతో ఏఐ పరికరం గుర్తించిందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు.
→ దీన్ని 67 శాతం కచ్చితత్వంతో గుర్తించే వైద్యులను ఈ సాంకేతికత అధిగమించిందని తెలిపారు.
→ ‘అన్‌ఫోల్డ్‌ ఏఐ’ పేరిట ఓ ప్రోగ్రాంను అవెండా హెల్త్‌ సంస్థ రూపొందించింది. దీనికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ధ్రువీకరణ కూడా వచ్చింది.
→ వివిధ రకాల క్లినికల్‌ వివరాల ఆధారంగా ఈ పరికరం ఏఐ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించుకొని క్యాన్సర్‌ సంభావ్యతను గుర్తిస్తుందని ‘న్యూయార్క్‌ పోస్టు’ వెల్లడించింది. ఏడుగురు యూరాలజిస్టులు, ముగ్గురు రేడియాలజిస్టులు ఈ పరికరాన్ని పరీక్షించి కణుతులు తొలగించిన 50 కేసులను విశ్లేషించారు. ఈ అధ్యయనాన్ని మళ్లీ నిర్వహించగా ఏఐ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు గుర్తించారు. తన పేషెంట్లకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణకు అన్‌ఫోల్డ్‌ ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేకు చెందిన యూరాలజిస్టు డాక్టర్‌ అలి కస్రేయన్‌ తెలిపారు.
→ రోగికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తే ఈ పరికరం 3డీ క్యాన్సర్‌ ఎస్టిమేషన్‌ మ్యాప్‌ను రూపొందిస్తుందని చెప్పారు. మరింత కచ్చితమైన రోగ నిర్ధారణలకు, టార్గెటెడ్‌ ట్రీట్‌మెంట్లకు ఈ అధునాతన సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు.