పేగులోని సూక్ష్మజీవులకు ఆటిజంతో సంబంధం


→ పేగుల్లో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు చిన్నారుల్లో ఆటిజానికి కారణమవుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. మల నమూనాల విశ్లేషణ ద్వారా ఈ రుగ్మతను నిర్ధారించొచ్చని తెలిపింది. చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆటిజం రుగ్మతను త్వరగా గుర్తించడానికి వీరు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నమూనాను కూడా అభివృద్ధి చేశారు.
→ ఆటిజం అనేది నాడీ సంబంధ రుగ్మత. ఈ సమస్య ఉన్నవారు ఒక పనిని పదేపదే చేస్తుంటారు. వారి సామాజిక వ్యవహారశైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఒక చిన్నారిలో ఈ రుగ్మత ఉందని నిర్ధారించడానికి సాధారణంగా 3-4 ఏళ్ల సమయం పడుతుంది. చాలా కేసుల్లో.. ఆరేళ్ల వయసు వచ్చాక వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఆటిజం తలెత్తడానికి పేగు బ్యాక్టీరియాకు ప్రమేయం ఉందని గత కొన్ని దశాబ్దాల్లో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ రుగ్మత ఉన్న చిన్నారుల్లోని పేగుల్లో బ్యాక్టీరియా భిన్నంగా ఉందని కూడా తేలింది. వీరి పేగు బ్యాక్టీరియాలో వైవిధ్యం సాధించడంలోనూ జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ అధ్యయనాలు చాలావరకూ ఈ చిన్నారుల్లోని బ్యాక్టీరియాపైనే దృష్టిసారించాయి.
→ తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు శిలీంద్రాలు, వైరస్‌లు వంటి ఇతర సూక్ష్మజీవులతోపాటు ఆటిజం ఉన్న చిన్నారుల పేగుల్లో వీటి వ్యవహారశైలిని కూడా పరిశీలించారు. ఇందుకోసం 13 ఏళ్లలోపు వయసున్న 1,630 మంది చిన్నారుల మల నమూనాలను మెటాజీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ విధానం ద్వారా విశ్లేషించారు. వారు తినే ఆహారం, వాడే మందుల డేటానూ సేకరించారు. వీరిలో 900 మంది చిన్నారులకు ఆటిజం ఉంది. ఆటిజం ఉన్న పిల్లల్లో 50 రకాల బ్యాక్టీరియా, ఏడు రకాల శిలీంద్రాలు, 18 వైరస్‌ జాతులు ఉన్నట్లు తేల్చారు. ఈ చిన్నారుల్లో 12 రకాల జీవక్రియల విధులు విభిన్నంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. 31 రకాల సూక్ష్మజీవులు లేదా వాటి విధుల ఆధారంగా చిన్నారుల్లో ఆటిజం ఉన్న వారిని గుర్తించడానికి వీరు ఒక ఏఐ నమూనాను కూడా రూపొందించారు. ఇది చాలా త్వరగా వ్యాధి నిర్ధారణ చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
→ ఆటిజానికి జన్యుపరమైన అంశాలు చాలావరకూ కారణమవుతుండగా.. పేగుల్లోని సూక్ష్మజీవులకూ ఇందులో ప్రమేయం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి రోగనిరోధక ప్రతిస్పందన, న్యూరోట్రాన్స్‌మిటర్‌ ఉత్పత్తి, జీవక్రియకు సంబంధించిన చర్యల ద్వారా వ్యాధిపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు.