కిసాన్ కవచ్’తో అభయం!
→ పంట పొలాలకు పురుగు మందులు వాడే క్రమంలో రైతులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోతుండడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆరోగ్యానికి అభయమిచ్చేలా బెంగళూరుకు చెందిన ది ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ (ఇన్‌స్టెమ్) ఆధ్వర్యంలో ‘కిసాన్ కవచ్’ పేరిట పీపీఈ కిట్‌ను ఇటీవల రూపకల్పన చేశారు. తెలుగు శాస్త్రవేత్తలు ప్రవీణ్‌కుమార్ వేముల, ఓంప్రకాశ్ సున్నపు, అరవింద్ శంకర్ నారాయణ, వెంకటేశ్‌రావుల బృందం ఈ కిట్‌ను తయారు చేసింది.
ఎలా పని చేస్తుందంటే :-
→ ఇన్‌స్టెమ్ శాస్త్రవేత్తలు రూపొందించిన కిసాన్ కవచ్ కిట్‌లో ప్యాంట్, షర్టుతోపాటు తల, ముఖాన్ని కప్పి ఉంచే మాస్క్ ఉంటుంది.
→ దీనికి ఉపయోగించే వస్త్రంలో ఆక్సెమ్ అనే రసాయనం.. పురుగు మందుల నుంచి వచ్చే ఎస్టర్లతో రసాయనిక చర్య జరిపి వాటిని నిర్వీర్యం చేస్తాయి.
→ ఈ కిట్‌ను రెండేళ్ల వ్యవధిలో 200 సార్లు ఉతికి తిరిగి ఉపయోగించవచ్చు. ఇప్పటికే ల్యాబ్‌లో ఎలుకలపై చేసిన పరీక్ష విజయవంతమైంది. తొలుత కిట్ ధర రూ.3000గా ఉంటుంది.