తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు జొరావర్ సిద్ధం


→ తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్‌’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి.
→ ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- (డీఆర్‌డీవో), ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా రూపొందించాయి.
→ 25 టన్నుల బరువుండే జొరావర్‌ ట్యాంకును వాయు మార్గంలోనూ రవాణా చేయవచ్చు.
→ చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు.
→ డ్రాగన్‌ కూడా ఇలాంటి ట్యాంకులను అక్కడ రంగంలోకి దించడంతో వీటి రూపకల్పనకు మన దేశం పూనుకుంది.
→ 350కిపైగా జొరావర్‌ ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం భావిస్తోంది.
→ ప్రధానంగా పర్వతమయ సరిహద్దు ప్రాంతంలో వీటిని రంగంలోకి దించాలనుకుంటోంది.
→ జొరావర్‌ ట్యాంకును రికార్డు స్థాయిలో కేవలం రెండేళ్లలోనే వాటిని డీఆర్‌డీవో, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు అభివృద్ధి చేశాయి.
→ దీనికి గుజరాత్‌లోని హజీరాలోని ఎల్‌ అండ్‌ టీ కర్మాగారంలో ప్రాథమిక పరీక్షలు జరిగాయి.
→ తాజాగా ఈ ఫ్యాక్టరీని డీఆర్‌డీవో అధిపతి సమీర్‌ కామత్‌ సందర్శించి, ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
→ ఈ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
→ ‘‘ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. పరీక్షలో భాగంగా జోరావర్‌ చేస్తున్న విన్యాసాలు చూడటం నాకు ఆనందంతో పాటు గర్వంగా ఉంది.
→ డీఆర్‌డీవో, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
→ రాబోయే ఆరు నెలల్లో ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలు కొనసాగుతాయి. అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి దాన్ని సైన్యానికి అందజేస్తాం’’ అని ఆయన తెలిపారు.
→ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్‌ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్‌ మ్యాన్డ్‌ సర్ఫేస్‌ వెహికిల్‌ అనే సాంకేతికతను జోడించారు.
→ మానవ ప్రమేయం లేకున్నా పని చేసే విధంగా రూపొందించారు.