జాబిల్లి రెండోవైపు దిగిన చాంగే-6!




→ చంద్రమండల యాత్రల్లో చైనా మరో ముందడుగు వేసింది. ఈ దేశానికి చెందిన చాంగే-6 వ్యోమనౌక విజయవంతంగా జాబిల్లి రెండోవైపు దిగింది.
→ సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ బేసిన్‌లో అది సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది.
→ అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనుంది. 2019లో కూడా చైనా చాంగే-4ను చంద్రుడి రెండోవైపునకు ప్రయోగించింది.
→ తాజాగా పంపిన ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి.
→ మే 3న భూమి నుంచి బయల్దేరిన చాంగే-6 వివిధ దశలను అధిగమించి జాబిల్లి కక్ష్యను చేరింది. గత నెల 30న ఆర్బిటర్‌-రిటర్నర్‌ మిశ్రమం నుంచి ల్యాండర్‌-అసెండర్‌ వేరైంది. తాజాగా అది సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ బేసిన్‌లో ఉన్న అపోలో బేసిన్‌లో దిగింది. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగం (నియర్‌ సైడ్‌)గా దాన్ని పేర్కొంటారు. రెండో పార్శ్యాన్ని ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు. ఆ భాగం నుంచి చందమామ నమూనాల సేకరణకు పూనుకోవడం ఇదే మొదటిసారి. అపోలో బేసిన్‌లో నమూనాల సేకరణ ప్రక్రియను చాంగే-6 రెండు రోజుల్లో పూర్తిచేస్తుంది. ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరిస్తుంది. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంటుంది. అనంతరం భూమికి తిరిగి వస్తుంది.
→ చాంగే-6 యాత్ర ద్వారా చందమామ వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
→ చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్‌ సెన్సింగ్‌ పరిశీలనల్లో వెల్లడైంది.
→ చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది.