శస్త్రచికిత్స మధ్యలో డ్రోన్ ద్వారా కణజాలం బట్వాడా
వైద్యరంగంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కర్ణాటకలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో.. రోగి నుంచి సేకరించిన కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేయించింది. ఇందుకోసం డ్రోన్‌ను వినియోగించింది. ఐ-డ్రోన్ ప్రాజెక్టు కింద ఐసీఎంఆర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. కర్ణాటకలోని కర్కలా పట్టణంలో డాక్టర్ టీఎంఏ పాయ్ ఆసుపత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. అతడి నుంచి కణజాలాన్ని సేకరించారు. అందులో క్యాన్సర్ ఉందా అన్నది నిర్ధారించుకునేందుకు దాన్ని డ్రోన్ ద్వారా మణిపాల్‌లోని కస్తూర్బా వైద్య కళాశాలకు తరలించారు. 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి 15-20 నిమిషాల సమయంలోనే ఆ లోహవిహంగం చేరుకుంది. రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తే అందుకు 50-60 నిమిషాలు పట్టేదని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది.
→
కస్తూర్బా గాంధీ ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి నిపుణులు ఆ కణజాల నమూనాను విశ్లేషించారు. అనంతరం సంబంధిత నివేదికను ఎలక్ట్రానిక్ రూపంలో టీఎంఏ పాయ్ ఆసుపత్రికి పంపారు. దాని ఆధారంగా అక్కడి వైద్యులు రోగికి శస్త్రచికిత్సను నిర్వహించారు. దేశంలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి.
→
వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, ఆరోగ్యపరిరక్షణ రంగాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
→
ముఖ్యంగా అత్యవసర సమయంలో టీకాలు, ఔషధాలు, కీలక సరఫరాలను మారుమూల ప్రదేశాలకు చేరవేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. పాథాలజీ నమూనాలను పరిమిత వసతులున్న చిన్న ఆసుపత్రుల నుంచి పెద్ద ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా తరలించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
→
డ్రోన్ల సాయంతో ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, మణిపుర్, నాగాలాండ్‌లోని మారుమూల ప్రదేశాలకు వైద్య సరఫరాలు, టీకాలు, ఔషధాలను ఐసీఎంఆర్ చేరవేసింది. దిల్లీలో బ్లడ్ బ్యాగ్‌ను బట్వాడా చేసింది.
→