22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
→ అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది.→ అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది.
→ నాసాకు చెందిన ‘సైకీ’ వ్యోమనౌక నుంచి అది వెలువడింది.
→ గత ఏడాది అక్టోబరులో సైకీని నాసా ప్రయోగించింది.
→ పూర్తిగా లోహంతో తయారైనట్లుగా భావిస్తున్న ‘సైకీ 16’ అనే గ్రహశకలంపై పరిశోధనలకు దాన్ని పంపింది.
→ సౌర కుటుంబంలో ఇలాంటి ఖగోళవస్తువులు చాలా అరుదు. అంగారకుడు, గురు గ్రహం మధ్య ఉన్న గ్రహశకల వలయంలో అది ఉంది.
→ సైకీ వ్యోమనౌక ద్వారా దీనిపై పరిశోధనలు చేయడంతోపాటు లేజర్ కమ్యూనికేషన్లనూ పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
→ ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డీఎస్‌వోసీ) వ్యవస్థను అందులో ఏర్పాటు చేశారు.
→ అంతరిక్షంలో సుదూర తీరాల మధ్య లేజర్ కమ్యూనికేషన్లను సాకారం చేయాలన్నది నాసా లక్ష్యం.
→ దీనివల్ల ప్రస్తుతమున్న విధానాల కంటే వేగవంతమైన సంధానత సాధ్యమవుతుంది.
→ సైకీ వ్యోమనౌకలో ప్రధానంగా రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తన సత్తాను చాటుకుంది.
→ ఆ సాధనం ఇటీవల.. 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా ఇంజినీరింగ్ డేటాను భూమికి చేరవేసింది.
→ ఇది పుడమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 1.5 రెట్లు ఎక్కువ.
→ వ్యోమనౌక నుంచి 10 నిమిషాల డూప్లికేటెడ్ డేటాను తాము అందుకున్నట్లు నాసా శాస్త్రవేత్త మీరా శ్రీనివాసన్ తెలిపారు.
→ ఒరిజినల్ డేటాను రేడియో ఫ్రీక్వెన్సీ ఛానళ్ల ద్వారా నాసాకు చెందిన డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు బట్వాడా చేసినట్లు వివరించారు.
→ సంప్రదాయ విధానాల స్థాయిలో ఈ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పనిచేస్తుందా అన్నది పరిశీలించినట్లు తెలిపారు.
→ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థలు టెస్ట్ డేటాను గరిష్ఠంగా 267 ఎంబీపీఎస్ వేగంతో చేరవేయగలవని నాసా నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది.
→ ఇది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వేగంతో సమానం.
→ అయితే వ్యోమనౌక చాలా దూరంలో ఉండటం వల్ల తాజా ప్రయోగంలో డేటా బట్వాడా రేటు తక్కువగా ఉంది.
→ అది గరిష్ఠంగా 25 ఎంబీపీఎస్ వేగంతో డేటాను పంపింది. ప్రాజెక్టు లక్ష్యమైన 1 ఎంబీపీఎస్ వేగాన్ని అది అధిగమించింది.
→