నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్‌కు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక
→ అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.→ సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య-ఎల్1 నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్ (ఎల్1)కు చేరుకుంది.
→ హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ (హెచ్‌ఓఐ) అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
→ ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. దేశం మరో మైలురాయిని దాటిందని, భారత్ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుందని ప్రకటించారు.
→ దీర్ఘవృత్తాకారంలో ఉండే ఎల్1 ఆర్బిట్‌లో వ్యోమనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టాలి.
→ దీని కోసం ఆదిత్య-ఎల్1 ఇంజిన్లను మండిస్తూ సెకనుకు 31 కి.మీ. వేగాన్ని అందించి సరైన మార్గంలోకి ప్రవేశించేలా చేశారు.
→ అయిదేళ్ల పాటు పరిశోధనలు:-
→ సెప్టెంబరు 2న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి57 ద్వారా ఆదిత్య-ఎల్1ను ఇస్రో ప్రయోగించింది. ప్రస్తుతం ఇది భూమి నుంచి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న తన లక్ష్యానికి చేరుకుంది. ఈ ప్రాంతం నుంచి గ్రహణాలు, ఇతర అడ్డంకులు లేకుండా ఆదిత్యుణ్ని నిరంతరం పరిశీలించేందుకు వీలవుతుంది.
→ ఇప్పటి నుంచి అయిదేళ్ల పాటు ఆదిత్య-ఎల్1 సూర్యుని ఉపరితలంపై జరిగే మార్పులు, అవి అంతరిక్షంలో చూపే ప్రభావంపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆదిత్య-ఎల్1లో శాస్త్రవేత్తలు ఏడు పేలోడ్‌లను పంపించారు. వీటిలో నాలుగు పేలోడ్‌లు భానుడికి ఎల్లప్పుడూ అభిముఖంగా ఉంటూ పరిశోధనలు చేపడతాయి. మిగిలినవి అంతర్గతంగా ఉండి.. వివిధ అధ్యయనాలను నిర్వహిస్తాయి.
→ పేలోడ్‌లలో ఉండే విద్యుదయస్కాంత, కణ, అయస్కాంతక్షేత్ర డిటెక్టర్లు సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌తోపాటు సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనాను అధ్యయనం చేస్తాయి. అక్కడి నుంచి వచ్చే కరోనల్ మాస్ ఎజక్షన్, ప్లాస్మా ఉష్ణోగ్రత, సాంద్రతల సమాచారాన్ని ఇస్రో విశ్లేషిస్తుంది.
→ ఈ అధ్యయనాల ద్వారా సౌర తుపానుల రాకను ముందే పసిగట్టొచ్చని.. తద్వారా ఇక్కడి సమాచార వ్యవస్థ, ఉపగ్రహాలు దెబ్బతినకుండా కాపాడొచ్చని ఇస్రో భావిస్తోంది.