సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానం
→ సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలకు తోడ్పడే వినూత్న విధానాన్ని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ (ఆర్‌డీసీ)ని వర్మీకంపోస్టింగ్ (ఆర్‌డీవీసీ)తో మిశ్రమం చేశారు. ఈ సమర్థ, పర్యావరణ అనుకూల ప్రక్రియ వల్ల పురపాలక సంస్థలు సేంద్రియ వ్యర్థాల నుంచి ప్రయోజనకర ఉత్పత్తులను పొందడానికి వీలవుతుందని వారు చెప్పారు.→ బహిరంగ డంపింగ్ ప్రదేశాల్లో వేసే మున్సిపల్ ఘన వ్యర్థాల్లో 50 శాతం సేంద్రియ పదార్థాలే ఉంటున్నాయి. ఇవి దీర్ఘకాలంపాటు కుళ్లడం వల్ల తీవ్ర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది పర్యావరణానికి హానికరం. ప్రస్తుతం ఈ పదార్థాల విచ్ఛిన్నానికి (బయోడిగ్రెడేషన్) వాడుతున్న విధానాలకు 2-3 నెలలు అవసరం. అయితే, ఆర్‌డీసీ ద్వారా 20 రోజుల్లోనే దీన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న కంపోస్ట్‌గా మార్చవచ్చు. దీనివల్ల మున్సిపల్ వ్యర్థాల పరిమాణం 60-70 శాతం తగ్గుతుంది. అయితే ఆర్‌డీసీతో ఒక ఇబ్బంది ఉంది.
→ ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తయ్యే కంపోస్ట్ నాణ్యత చాలా తక్కువ. మరోవైపు వర్మీకంపోస్టింగ్ అనేది అద్భుత బయోడిగ్రెడేషన్ ప్రక్రియ. సంప్రదాయంగా ఈ విధానానికి కనీసం 60 రోజులు పడుతుంది. అందువల్ల పురపాలక సంస్థలకు ఇది ఉపయోగపడటంలేదు. ఈ నేపథ్యంలో గువాహటి ఐఐటీలోని వ్యర్థ నిర్వహణ పరిశోధన బృందం.. రెండంచెల బయోడిగ్రెడేషన్ విధానాన్ని రూపొందించింది. ఇందులో ఆర్‌డీసీ విధానాన్ని మరింత మెరుగుపరచి, వర్మీకంపోస్టింగ్‌తో మిశ్రమం చేశారు. తద్వారా బయోడిగ్రెడేషన్ కాలాన్ని తగ్గించారు. ఆ తర్వాత వానపాములు.. పాక్షికంగా విచ్ఛిన్నమైన సేంద్రియ పదార్థాన్ని సులువుగా 27 రోజుల్లోనే వర్మీకంపోస్ట్‌గా మార్చాయి. ఈ పదార్థంలో విషతుల్యత లేదని, నేలకు పనికొచ్చే పోషకాలు పుష్కలంగా ఉన్నట్లు వెల్లడైంది.
→