అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాసము యొక్క అవగాహన వివిధ సిద్ధాంతాలు




మానసిక వికాసము - పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము

→ ఎల్లప్పుడూ మారుతున్న పరిసరాలతో వ్యక్తి తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకొనుటకు, క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుటకు కావలసిన మానసిక శక్తుల అభివృద్ధియే. - మానసిక వికాసము
→ వ్యక్తి ఆలోచన, వివేచన, ఊహ, స్మృతి, ప్రజ్ఞ, భాష మొదలగు మానసిక శక్తుల అభివృద్ధిని తెలియజేయు భావనయే - మానసిక వికాసము
→ ప్రత్యక్షంగా గ్రహించటం, గుర్తించటం, భావనలు ఏర్పరచుకోవటం, ఊహించటం, విశ్లేషించటం, సంశ్లేషణ చేయటం, వర్గీకరించటం, భేదాలు గుర్తించటం, ఉదాహరణలివ్వటం, వినియోగించటం మానసిక వికాసంలో భాగాలు, ఈ మానసిక వికాసాన్నే ప్రజ్ఞా విలాసము అని సంజ్ఞానాత్మక వికాసము అని, బౌద్ధికాభివృద్ధి అని అంటారు.

మానసిక వికాసం-లక్షణాలు:-
→ మూర్తంగాను,అమూర్తంగాను ఆలోచించగలుగుట
→ అన్వేషణా శక్తి కలిగి ఉండుట
→ ఆకారం, పరిమాణం, దూరం, కాలము వంటి భావనలు ఏర్పడి ఉండుట.
→ ప్రణాళికలను రూపొందించే సామర్ధ్యం ఏర్పడుట. * సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఏర్పడుట.
→ ఆత్మభావన ఏర్పడి ఉండుట,
→ మెదడు మరియు జ్ఞానేంద్రియాలు సంపూర్తిగా అభివృద్ధి చెంది వుండుట.
→ పరిణతి చెందిన వైఖరులు, ప్రవర్తనలను కలిగి వుండుట.
→ ఏ విషయాన్నయినా గ్రహించగల సామర్థ్యం, అభ్యసించగల సామర్ధ్యము కలిగివుండుట మొదలైనవి.

సంజ్ఞానాత్మకత గురించి పియాజే భావనలు:-
→ శిశువు తెలివితేటలు, గుణాత్మక వికాసాన్ని గురించి స్విట్జర్లాండక్కు చెందిన జీనిపియాజే పరిశోధన చేశారు. ముఖ్యంగా మేధాశక్తి పెరుగుదలకు కావలసిన ప్రత్యక్షాభివృద్ధి మొదలైన వాటి గురించి సిద్ధాంతీకరించారు.
→ సంజ్ఞానాత్మకత అంటే వ్యక్తి తన గురించి, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం.
→ పిల్లల వికాసంలో ప్రజ్ఞా వికాసం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్రజ్ఞా వికాసములో ఆలోచన అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. సంజ్ఞానాత్మకత అనేది ఆలోచనాభివృద్ధికి ప్రధాన సూచికగా భావించారు.
→ వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని పియాజె తెలిపారు. వాటినే 'స్కేమాటా'లు అన్నాడు. ఈ స్కీమాటాలు వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి వ్యక్తి వాటికి స్పందింపచేసే ప్రక్రియలు. మనిషి పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలను కలిగి ఉంటాడు.
ఉదా: పీల్చటం, తన్నటం, పట్టుకోవటంలాంటివి.
→ శిశువు పుట్టిన నాటినుండి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వలన స్కీమాటాలలో పరివర్తన జరిగి వ్యక్తపరచబడే ఉన్నత మానసిక చర్యలు
(ప్రణాళికలు, నియమాలు, వర్గీకరణ, సమస్య పరిష్కరణ)గా మార్పు చెందుతాయి. వీటినే పియాజ్ 'ఆపరేషన్స్' (ప్రచాలకాలు) అన్నాడు.

→ వ్యక్తి సృష్టించుకొనే ఈ సంజ్ఞానాత్మక వ్యవస్థకు ప్రధానమైన కారణం 2 కార్యాచరణ నియమాలు. అవి:
1) అనుకూలత
2) వ్యవస్థీకరణ.
అనుకూలతలో మరల రెండు ప్రక్రియలున్నాయి. అవి (1) సాంశీకరణము/స్వాయక్తీకరణము (2) అనుగుణ్యత/సానుకూలత.

→ సాంశీకరణ : పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కీమాటాలను ఉపయోగిస్తారు. తమలో ముందే కలిగి ఉన్న స్కీమాటాలతో ప్రస్తుతం ఏర్పడే అనుభవాలను అర్థం చేసుకొంటారు మరియు పోల్చుకుంటారు.
ఉదా : ఎప్పుడూ గాలిలో ఎగిరే విమానం చూడని పిల్లవాడు మొదటిసారి విమాసంను చూసినపుడు తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షి అనుకుంటాడు.

→ అనుగుణ్యం:-
ప్రస్తుత ఆలోచనా విధానం పరిసరాలను పూర్తిగా గ్రహించటానికి సరిపోదని తెలుసుకొని పాత స్కీమాటాలను 'మార్పు' చేసుకుంటాడు.
లేదా కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటాడు. అనగా ఇది వ్యక్తిని పునఃశిక్షణను గురిచేసే ప్రక్రియ.
ఉదా:- ఇంతకు పూర్వము విమానంను చూసి పక్షి అనుకున్న శిశువు దాని ఆకారం, శబ్దంను బట్టి అది పక్షికాదు వేరేది అని గుర్తించగలుగుట.

→ సమతుల్యత: పిల్లలు ఎప్పుడు 'కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కీమాటాకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణం నుండి అనుగుణ్యం వైపు మళ్ళుతారు. ఇలా సాంశీకరణం మరియు అనుగుణ్యతల మధ్య సమతుల్యతను పొందుతుంటారు.

→ వ్యవస్థీకరణం : పిల్లలు కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తరువాత వాటిని ఇతర స్కీమాటాలతో జతచేసి తిరిగి ధృడమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకుంటారు. భౌతిక లేదా మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధతే వ్యవస్థీకరణ వ్యవస్థీకరణలో సరళ ప్రవర్తనలు సమన్వయం చెంది ఉన్నత క్రమవ్యవస్థగా సంఘటితమవుతాయి. అనగా విడివిడిగా ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలు అన్ని సమన్వయపరచబడి ఏకమవుతాయి.

→పియాజె సూచించిన సంజ్ఞానాత్మక వికాస దశలు :
సంజ్ఞానాత్మక వికాసం నాలుగు దశలలో జరుగుతుందని పియాజె ప్రతిపాదించారు. అవి
1) ఇంద్రియ చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ.

1. ఇంద్రియ ప్రచాలక దశ (పుట్టుక నుంచి 2 సంవత్సరాలు) :
తన సొంత పిల్లల పరిశీలన నుంచి పియాజ్ (1952) ఇంద్రియ చాలకదశను 6 ఉపదశలుగా విబజన చేయడం జరిగింది.
i) సాధారణ ప్రతిచర్యలు : ఇది మొదటి ఉపదశ. ఇది శిశువు పుట్టినప్పటి నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. అంటే శిశువు జీవితంలో మొదటి నెల. శిశువు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా బాహ్యప్రేరణకు ప్రతిస్పందన తెలియజేస్తుంది.
ఉదా:- వేలును శిశువు పెదవులపై పెట్టినప్పుడు శిశువు అసంకల్పితంగా వేలును చూషణం చేస్తాడు.

ii) ప్రాథమిక వృత్తాకార స్పందనలు : ఇది రెండవ ఉపదశ. ఈ దశ శిశువు మొదటి నెల నుంచి నాలుగవ నెల వరకు ఉంటుంది. ఈ దశలో స్కీమా, ఇందియ స్పందనల మధ్య సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకుముందు తటస్థంగా జరిగి, తనకు తృప్తినిచ్చిన సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటాడు.

ఉదా:- శిశువు అనుకోకుండా నోటిలో వేలు పెట్టుకొని చూషణం చేయడం వల్ల సంతృప్తి చెందితే, ఆ కృత్యానికి చేసిదాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటాడు.

iii) ద్వితీయ వృత్తాకార స్పందనలు : ఇది మూడవ ఉపదశ. ఈ దశ శివువు 4-8 నెలల మధ్య ఉంటుంది. ఈ దశలో శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది.
ఉదా:- శబ్దం చేసే ఏదైనా వస్తువును అది శబ్దం చేసేటట్లు ఊపడం చేస్తుంది. అంటే ఇక్కడ వస్తువు దగ్గరికి చేరి దానిని పట్టుకొని ఊపే చలనాలను నేర్చుకుంటాడు.

iv) ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం : ఇది నాలుగవ ఉపదశ. ఈ దశ 8-12 నెలల మధ్య ఉంటుంది. దశలో తనకు ఇష్టమైన కృత్యాలను మరల తిరిగి చేయం కంటే శిశువు తను నేర్చుకొన్ని జ్ఞానాన్ని ఉపయోగించి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే తన ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ సమయంలో నేర్చుకొనే ఒక ముఖ్యమైన భావన వస్తువు స్థిరత్వం అంటే తన ఎదుట లేకపోయినా ఆ వస్తువు మనుగడలో ఉందనే పరిజ్ఞానం శిశువుకు కలుగుతుంది.) దాచిపెట్టిన వస్తువును వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఉదా:- తను ఆడుకొనే బొమ్మను దాచిపెడితే దానిని శిశువు వెతకడం.

v) తృతీయ వృత్తాకార స్పందనలు : -
ఇది అయిదవ ఉపదశ. ఇది శిశువు 12 నెలల నుంచి 18 నెలల వరకు ఉంటుంది. నవ్యత, జిజ్ఞాసతో కూడుకున్న దశ. ఈ దశలో వస్తు లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు.
ఉదా:- వివిధ వస్తువులను కిందపడేసి అవి చేసే, శబ్దాల మధ్య భేదాలను గమనించి ఒక ఆటలా ఆనందిస్తాడు.

vi) స్కీమాల అంతరంగీకరణ : ఇది ఆఖరి ఉపదశ. ఈ ఉపదశ 18 నెలల నుంచి 24 నెలల వరకు ఉంటుంది. శిశువు యత్నదోష పద్ధతి నుంచి కొంతవరకు అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. అంటే పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యల పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు.

ఉదా :- అందని వస్తువును స్టూల్ లేదా కుర్చీ ఎక్కి అందుకోవటం. దూరంగా ఉన్న వస్తువును కర్ర పెట్టి దగ్గరకు లాక్కోవటం.

2. పూర్వ ప్రచాలక దశ (2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు):
→ దశ ప్రారంభంలో శిశువు ఇంద్రియచాలక అన్వేషణకు బదులుగా సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు.
→ ఈ దశ (1) పూర్వ భావనాత్మక దశ (2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు), (2) అంతర్భుద్ధి దశలుగా (4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు) విభజింపబడినది.
→ రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనివల్ల శిశువుకు సమస్యాపరిష్కార సామర్ధ్యం బాగా అభివృద్ధి చెందుతుంది.
→ ఈ దశలో పిల్లలు వస్తువులను గుర్తించి, వాటి పోలికల ఆధారంగా వర్గీకరణలను చేయడం ప్రారంభిస్తారు.
→ ఈ దశలోని రెండు ముఖ్య పరిమితులు - సర్వాత్మకవాదం, అహంకేంద్ర నాదం.
→ జీవంలేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించడం సర్వాత్మకవాదం (యానిమిజం),
సర్వాత్మక వాదములో :
1) శిశువు తాను ఆదుకొనే బొమ్మలకు స్నానం చేయించటం, అన్నం పెట్టటం, నిద్రపుచ్చటం లాంటివి చేస్తాడు.
2) ఊహాత్మక క్రీడలు (Make believe play) ఆడతాడు.
3) ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభాసాత్మక ఆలోచన కలిగి ఉంటాడు.
ఉదా: కర్రను తుపాకీలా భావించి అందర్నీ కాల్చివేయటం, చెక్కముక్కను గుర్రములా భావించి టక్కమని ఊపటం
→ తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడి ఉందనుకోవడం అహంకేంద్రవాదం అనగా ప్రపంచాన్ని, ఇతరులను తన దృష్టి కోణం నుండి మాత్రమే చూచుట.
ఉదా : ఇది తను నడుస్తుంటే తనతోపాటే సూర్యుడు కూడా నడుస్తున్నాడని భ్రమపడటంలాంటిది.

→ 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో వస్తువులను పోల్చడం, వర్గీకరించడం వంటి మానసిక చర్యలను మెరుగ్గా చేయగలరు.
→ సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు.
→ ఈ కాలంలోని పరిమితులు : పదిలపరచుకొనే భావన లోపం మరియు విపర్యయాత్మక భావన లోపం..
→ పదిలపరచుకొనే భావనలోపం అంటే ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉంటాయి లేదా పదిలపరచబడి ఉంటాయి అనే భావాన్ని పొంది ఉండకపోవడం.
ఉదా : రెండు సన్నని పొడవు గ్లాసులలో ఒకే గీత వరకు నీరును చూపించి, ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి, వెడల్పు గ్లాసులోకి పోసి, నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెబుతాడు అంటే ఇక్కడ శిశువు ఒకే విశేషంపై ఆలోచనను కేంద్రీకరించడం జరుగుతుంది.
→ విపర్యయాత్మక భావన లోపం అంటే ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడ చేయవచ్చు అనే భావన ఉండకపోవడం.
ఉదా:-ఒకే పరిమాణం, ఆకారంలో ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకొని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పటికీ దానిని తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని గుర్తించలేదు. ఇక్కడ జరిగే విషయం మార్పులు చెందుతున్నప్పుడు జరిగే పరివర్తనలపై దృష్టి కేంద్రీకరించకపోవడం.


3. మూర్త ప్రచాలక దశ (7 నుండి 11 సం॥లు):-
→ పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు, ఉద్దేశాలతో కూడా వ్యవహరించడం నేర్చుకొంటారు.
→ పిల్లల ఆలోచన ఈ దశలో ఎక్కువ తార్కికంగా, క్రమబద్ధంగా అవుతుంది. వారు విచక్షణ, తీర్మానాలను చేయడానికి ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తారు.
→ పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు. నిగమనాత్మక ఆలోచన పెరుగుతుంది.
ఉదా : ప్రార్థన సమావేశంలో ఒకటి నుంచి నాలుగవ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు, మూడవ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవు అని, పాఠశాలకు రావలసిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు.

→ ఈ వయస్సులో విపర్యయాత్మక భావన పెరిగి తన ఆలోచనను ఒకే విశేషకంపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
→ ఈ దశలోని పిల్లవాడు తనకు అక్క ఉంటే, తన అక్కకు తమ్ముడు ఉన్నాడని అర్థం చేసుకొంటాడు.
→ ఈ దశలోని సమస్య పరిష్కరణలోని పరిమితి పిల్లవాడు ఉద్దీపనలను భౌతికంగా చూస్తేనే పరిష్కరణ చేయగలదు కాని గైర్హాజరులో కాదు.
ఉదా : ఈ దశలోని పిల్లవాడు ఎక్కడినుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కాని ఇంటికి దారిని చెప్పలేడు.
స్థూపమును, వృత్తమును ఎదురుగా చూపితే పోల్చగలడు కాని అవి ఎదురుగా లేనప్పుడు వాటిని పోల్చలేడు.

4. అమూర్త ప్రచాలక దశ / నియత ప్రచాలక దశ (11 నుండి ప్రారంభం):-
→ తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడాన్ని నేర్చుకోవడం వల్ల వారి సంజ్ఞానాత్మక వికాసం, పనితీరు సునిశితంగా మారతాయి.
→ మూర్త సమస్యలకు అన్వయించే నియమాలనే ఊహాజనిత ప్రతిపాదనలు, పరికల్పనలను మానసికంగా పరిష్కరించడానికి ఉపయోగించవచ్చని తెలుసుకొంటారు.
→ క్రమబద్ధమైన, తార్కికమార్గంలో సమస్యలను, విభిన్న విధాలుగా గ్రహించి వివిధ పరిష్కారాలను అన్వేషిస్తారు. ఈ దశలో కౌమారులు వివిధ ఆధారాల నుంచి సమాచారాన్ని కలిపి పరిమాణాలను, ఫలితాలను సూచించగలుగుతారు.
→ సమస్య పరిష్కరణలో ఒకే కారకంపై దృష్టి నిలుపక వివిధ కోణాలలో అలోచించి పరిష్కరిస్తారు.
→ సారళ్యత, మానసిక ప్రాక్కల్పనలను పరీక్షించడం, వివిధ కోణాలలో ఆలోచించడం, సమస్యలో సంక్లిష్టతను అర్థం చేసుకోవడం. ఈ దశలో గమనించవచ్చు.
→ ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరుకోలేడు.

నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం

→ మంచికి-చెడుకి, తప్పుకి - ఒప్పుకి, న్యాయానికి అన్యాయానికి మధ్య తేడాను తెలుసుకొని విచక్షణగా ప్రవర్తించటమే నైతిక ఏకాసము.
నైతిక వికాసం కలిగిన వ్యక్తి లక్షణములు :
→ నిజాయితీగా వ్యవహరించటం
→ అబద్ధాలు చెప్పకుండుట
→ దొంగతనాలు, దౌర్జన్యాలు చేయకుండుట
→ ఇతరులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారిని గౌరవించుట.
→ ఆత్మగౌరవం మరియు మంచి ఆత్మభావన కలిగి ఉందుట.
→ స్వీయ క్రమశిక్షణను పాటించుట.
→ కర్తవ్య నిర్వహణలో ధర్మంను, న్యాయమును పాటించుట.
→ నియమ, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించుట.
→ మంచి నైతిక విలువలు కలిగి ఉండుట.
→ హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞానశాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ వివిధ సంస్కృతులకు సంబంధించిన కొన్ని వందల మంది పిల్లలను అధ్యయనం చేసిన తరువాత నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కొన్ని నైతిక సందిగ్ధమైన కథలను చెప్పి ఆ పరిస్థితులలో మీరు ఎలా ప్రతిస్పందించేవారు అనే ప్రశ్నల ద్వారా వివిధ వయస్సుల వారి నుండి రాబట్టిన జవాబులను విశ్లేషించి ఈ సిద్ధాంతమును ప్రతిపాదించారు. నైతిక వికాస సిద్ధాంతాలలో ఈయన సిద్ధాంతం అత్యంత ప్రాచుర్యం పొందింది.
→ సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉండే ఈ నైతిక వికాసంలో కోల్బర్గ్ మూడు స్థాయిలను చెప్పాడు. ప్రతి స్థాయినీ రెండు దశలుగా విభజించాడు.
→ ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తాయని కోల్బర్గ్ తెలిపారు. అంటే వ్యక్తి ప్రజ్ఞానాత్మక వికాసం, స్థాయి, అభ్యసనానుభవాల ఆధారంగా నైతిక తీర్పులను చేస్తారని వీరు భావించారు.
→ ప్రతి వ్యక్తి నైతికత్వం అతని సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవాలపై ఆధారపడి ఉంటుందని కూడా అతను పేర్కొన్నాడు.
కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాసంలోని మూడు స్థాయిలు :
స్థాయి 1: పూర్వ సంప్రదాయ నైతికత (4-10 సం॥లు) :
→ ఈ దశలో నైతికతను శారీరక శిక్షలపరంగా మరియు పొందే బహుమతుల ఆధారంగా అంచనా వేస్తారు. ఈ స్థాయిలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది.
ఈ స్థాయిలోని రెండు దశలు కలవు అవి:-

→ మొదటి దశ:-
విధేయత, శిక్ష ఓరియంటేషన్ ఈ దశలోని పిల్లలు, పెద్దల నుంచి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి వారి మాటలను గౌరవించి, పాటిస్తారు. వారిపట్ల విధేయతగా ఉంటారు. శిక్ష గురించిన భయం వల్ల వీరి నైతికత నియంత్రించబడుతుంది.
ఉదా : హోంవర్కు చేయకపోతే టీచరు శిక్షిస్తాడనే భయంతో హోంవర్కు చేసుకొని వచ్చుట.

→ రెండవ దశ :-
సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్ ఈ దశలోని పిల్లలు బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు. వీరిలో పరస్పరత కనబడినప్పటికీ అది నిజమైన న్యాయభావనతో కాకుండా వస్తుమార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం ఆధారంగా ఉంటుంది.
ఉదా:- టి.వి. చూడనిస్తేనే హోంవర్కు చేస్తానని శిశువు తన తల్లితో చెప్పుట.

→ పిల్లల యొక్క ఇష్టాలను, అవసరాలను తీరుస్తారు కాబట్టి తల్లిదండ్రులు, పెద్దల ఆజ్ఞలను, పాటించి నియమాలకు కట్టుబడి ఉంటారు.
స్థాయి - 2 : సంప్రదాయ నైతికత (11-13 సం॥లు) :
→ ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావిస్తారు.
→ ఇతరులు ఇష్టాయిష్టాలు, సమాజంలో పాటిస్తున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టం, న్యాయం ఆధారంగా వారి నైతిక తీర్పు నియంత్రించబడుతుంది. ఇష్టానుసారంగా కాకుండా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకొంటే సరైన మానవ సంబంధాలను, సాంఘిక పద్ధతిని పాటించవచ్చని నమ్ముతారు. ఈ స్థాయిలో రెండు దశలు కలవు.

→ మూడవ దశ:- మంచి బాలుడు / బాలిక నీతి ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావించడం జరుగుతుంది.
వీరి నైతిక తీర్పు ఇతరుల ఆమోదం కోసం అయిష్టత తిరస్కరణను తప్పించుకోవడం కోసం అంటే మంచి అబ్బాయి, మంచి అమ్మాయిగా పిలవబడటానికై ఉంటుంది.

ఉదా:-మంచి అమ్మాయిని మెచ్చు కుంటారని ఉపాధ్యాయుడు చెప్పిన పనులను ఎదురు తిరగకుండా విద్యార్థి చేయుట.

→ నాలుగవ దశ :
అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి :
ఈ దశలోని పిల్లలు నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని భావిస్తారు. ఈ దశలో వ్యక్తుల ఆమోదాన్ని మాత్రమే కాకుండా సమాజ ఆమోదాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటారు. చట్టం, ధర్మం, ప్రకారం నడచుకొంటారు. సమాజంలో ఎక్కువమంది ఈ స్థాయి నైతికతను దాటలేరు.
ఉదా : స్కూల్లో క్రమశిక్షణగా ఉండడం ప్రతి విద్యార్థి బాధ్యత అని గుర్తించి క్రమశిక్షణగా విద్యార్ధి మెలుగుట..

స్థాయి 3: ఉత్తర సంప్రదాయ నైతికత (14 సం॥లపైన):
→ ఈ స్థాయిని కోల్బర్గ్ సంప్రదాయ నైతికత లేదా స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పేర్కొన్నారు. మానసిక, సామాజిక వికాసముతో విమర్శనా దృష్టితో మంచి చెడుటను తన దృష్టి కోణముతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ శక్తి వ్యక్తికి మాత్రమే ఉండటం వల్ల దీనిని నైతిక సాధనలో అత్యున్నతస్థాయిగా గుర్తించవచ్చు. స్వీయ ఆమోదం గల నైతిక సూత్రాల చట్రంలో ఇమిడితేనే వస్తువులకు, విషయాలకు, ఆలోచనలకు విలువనిస్తారు. అనుసరిస్తారు. ఈ స్థాయిలో కూడా రెండు దశలు. ఉంటాయి. అవి:
→ ఐదవ దశ : ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి ఓరియంటేషన్: ఈ దశలో నైతిక తీర్పులు వ్యక్తిలో అంతర్లీనమవుతాయి. ఈ దశలో వ్యక్తి, సమాజం, సంక్షేమం, మానవుల హక్కులకు విలువ ఇచ్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించి, తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుందని నిరూపించబడితే, నైతిక ప్రమాణాలనుమార్పు చేసుకోవడం కోసం నైతిక నమ్మకాలలో సారళ్యత ఉండాలని ఈ దశలోని వ్యక్తులు నమ్ముతారు.
ఉదా : వ్యక్తి ఇతర మతస్థులను, కులస్తులను గౌరవించటం మరియు వారి హక్కులను గౌరవించటం

→ ఆరవ దశ : వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి : ఈ దశలోని వ్యక్తి ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మనిందను తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు, మనలో భాగమైనటువంటి ఆదర్శాలకు రెండింటికీ అనుగుణంగా ప్రవర్తిస్తాడు.
ఉదా : విశ్వ క్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనటం తన ఆస్తులను ఆపన్నులకు పంచటం.

→ సాంఘిక అభిశంసను తప్పించుకోవడం కంటే స్వయం దండనను తప్పించుకోవడం కోసం సాంఘిక ప్రమాణాలు, అంతర్గతమైన ఆదర్శాలు రెండింటికీ వ్యక్తులు కట్టుబడి ఉంటారు. ఈ దశలో వ్యక్తి స్వంత కోరికల కంటే ఇతరుల గౌరవంపై నైతికత ఆధారపడి ఉంటుంది..

భాషా వికాసం - నోమ్
→ భాషా సిద్ధాంతాలలో ప్రముఖమయిన సిద్ధాంతముగా పేర్కొనదగినది ఆవారమనోమ్ చోమిస్కీ సిద్ధాంతము.
→ చోమిస్కీ అమెరికాకు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తత్వవేత్త, తర్కవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త.
→ వీరు నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించారు.
→ వీరిని 'father of modern linguistics' అని పిలుస్తారు..
→ వీరు తత్వవిశ్లేషణలో విశేషమైన పాత్రను పోషించి అందరిచే ప్రశంసలు అందుకున్నారు.
→ వీరు అమెరికాలోని 'మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'లో ఆచార్యులుగా పనిచేశారు.
→ వీరు 100 కు పైగా గ్రంథములు రాసినారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

1. Language and mind
2. The logical structure of Linguistic theory
3. Lectures on government and binding
భాషకు సంబంధించి చోమ్ స్కీ ముఖ్య ప్రతిపాదనలు :
→ శిశువు భాషను ఆర్జించుకొనే శక్తితో పుడతాడా? నేర్చుకొనే శక్తితో పుడతాడా? అని వివరించేదే ఈ సిద్ధాంతము. వీరి ప్రకారము భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయము ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము.
→ వీరు భాషలో సాంప్రదాయక వ్యాకరణమును వ్యతిరేకించారు. వీరి సిద్ధాంతం ప్రకారం భాషను ఆర్జించటం, అర్ధంచేసుకోవటం, వినియోగించటంలాంటి భాషాసంబంధ నిర్మాణాలు జీవశాస్త్రపరంగా మానవమెదడులో అనువంశికంగా (జన్యువులద్వారా) బదిలీ అవుతాయి.
→ పిల్లలకు భాషను ఆర్జించే సామర్ధ్యము పుట్టుకతోనే వస్తుంది. దీని ద్వారానే భాషను నేర్చుకుంటారు. దీనినే చోమ్ స్కీ గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అంటారు. ప్రతి శిశువు తన సాంఘిక-సాంస్కృతిక భేదాలకు అనుగుణంగా ఆ భాషా నిర్మాణాలను తల్లిదండ్రుల -జన్యువుల నుండి పంచుకుంటాడు అనేది వీరి వాదన. ఈ విషయములో ప్రవర్తనా వాది అయిన B.F. స్కిన్నర్ను వ్యతిరేకించాడు. స్కిన్నర్ ప్రకారం భాష అనేది ఇతరులతో వివిధ రకాలుగా కమ్యూనికేషన్స్ కలిగి ఉండటం ద్వారా గ్రహించబడేది.
→ ప్రతి మనిషికి స్వభావసిద్ధంగా సహజసిద్ధంగా భాషాసూత్రాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పుట్టుకతోనే ఉంటుంది అని చోమ్ స్కీ భావించారు. ఈ విషయాన్ని తను ప్రతిపాదించిన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం (Universal grammar) లో వివరించారు. ప్రతి ఒక్కరిలో తన మాతృభాషకు సంబంధించిన నిర్మాణాలు పుట్టుకతోనే పొంది ఉంటాడని, ఇది భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడగలదని, ఇది వ్యక్తి యొక్క ఇతర సామర్థ్యాలలాగే క్రమంగా అభివృద్ధి చెందుతుందని వీరు తెలిపారు.
→ పక్షి పిల్లలకు పెరిగి ఎలా 'ఎగుర గలుగుతాయో, అలాగే పిల్లలకు ఎవరో నేర్పటం వల్ల భాషా వికాసము జరగదు. స్వయంగా అంతర్గత నిర్మాణం వల్లనే జరుగుతుందనేది వీరి వాదన. అందుకనే భాషను అభ్యసించటం అని కాకుండా ఆర్జించటం అనే పదాన్ని చోమ్ స్కీ ప్రయోగించాడు.
→ వ్యక్తులందరిలో సహజసిద్ధంగా ఉండే భాషావగాహన సామర్ధ్యానికి కారణమయ్యే వ్యాకరణమును సార్వత్రిక వ్యాకరణము (Universal grammar) అన్నారు. అనగా ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో వాక్య నిర్మాణ సూత్రాలను అర్థంచేసుకొనే వ్యవస్థ పుట్టుకతోనే సంక్రమిస్తుంది. అని, ఎడమ మస్జిష్కార్ధగోళంలోని బ్రోకా ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుంది అనేది వీరి వాదన.
→ సాంప్రదాయక భాషా భావనల ప్రకారం భాష నేర్పబడుతుంది. కానీ చోమ్ స్కీ ప్రకారం భాష అర్జించబడుతుంది. నేర్వడం వల్ల కాకుండా జన్యుపరమయిన అంశాలు వ్యక్తిలో పరిణతి చెందడం వల్ల భాషార్జన జరుగుతుంది.
→ తను ప్రతిపాదించిన భాషాసంబంధమైన విజ్ఞానాన్ని 'సింటాక్టిక్ స్ట్రక్చర్స్' (Syntactic) అను గ్రంథంలో వివరించారు. అలాగే భాషా నిర్మాణానికి సంబంధించిన 'భాషాసంబంధ తార్కిక నిర్మాణాల సిద్ధాంతమును ప్రతిపాదించారు. అలాగే ఉత్పాదక వ్యాకరణము (Gen erative Grammar) రూపాంతర వ్యాకరణము (Transformational Grammar), సార్వత్రిక వ్యాకరణము (Universal Grammar) నియత వ్యాకరణము (Formal Grammar) అను నూతన భావనలు ప్రవేశపెట్టారు.
→ ప్రతి వ్యక్తి భాషార్జనకు కారణం మెదడులోని LAD అని, LAD అనగా Language Acquisition Device (భాషార్జన పరికరం) అని ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
→ వీరు ఒక మానవ శిశువుకు, పిల్లిపిల్లకు ఒకే భాషాసంబంధమున్న పరిసరాలను కల్పించినప్పుడు మానవ శిశువు మాత్రమే భాషావగాహన చేసుకొని తిరిగి భాషను ఉత్పత్తి చేసే సామర్ధ్యమును పొందగలుగుతాడని, కాని పిల్లిపిల్ల మాత్రం భాషను ఉత్పత్తిచేయలేదని దానికి కారణం మానవ మెదడులో ఉండే సహజ భాషార్జన పరికరం అయిన Language Acquisition Device పిల్లిమెదడులో లేకపోవటమే అని వివరించారు. LAD యొక్క వ్యాప్తిని బట్టి ఒకవ్యక్తి వివిధ రకాలయిన భాషలను నేర్చుకోవడం జరుగుతుంది అని భావించారు.
→ శిశువులకు 3 - 10 సం॥ల మధ్య భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని శిశువు 4 సం||ల వయస్సు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్ధం చేసుకుంటాడని చోమస్కీ వివరించారు.
→ మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి భాషా నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని రూపొందాయని వీరు భావించారు.
కార్ల్ రోజర్స్ - స్వీయ/ఆత్మవికాస సిద్ధాంతము:
→ వ్యక్తి ప్రవర్తనను లేదా మూర్తిమత్వ వికాసమును వివరించటంలో భాగంగా ప్రవర్తనా వాదమును, మనోవిశ్లేషణా వాదమును వ్యతిరేకిస్తూ వెలుగులోకి వచ్చిందే మానవతా వాదము/ మానవతా ఉపగమము.
→ ప్రతివ్యక్తి తనతో మరియు బాహ్యప్రపంచంతో తననుతాను మలచుకొనే తీరును, తనయొక్క వ్యక్తిగత పాత్రను మానవతా మనోవిజ్ఞానం ఉద్ఘాటిస్తుంది. ప్రధానంగా వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్తావన మరియు స్వేచ్ఛాపూరిత ఇచ్చపై కేంద్రీకరించి తన భావనలను వివరించిన ఉపగమముగా దీనిని చెప్పుకోవచ్చు.
→ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వివిధ క్షేత్రాలలో అనుప్రయుక్తమయ్యే అతని మూర్తిమత్వాన్ని అతని అవసరాలను, అతని సృజనాత్మక ఆలోచనలను, మానవసంబంధాలను వివరించేదే మానవతా ఉపగమము. అందువలననే దీనిని వ్యక్తి కేంద్ర ఉపగమం అనికూడా
→ మానవతావాదాన్ని ప్రతిపాదించి, విస్తరించిన వార్లలో మొదటివారు అబ్రహం మాస్లో (అమెరికా) కాగా రెండవవారు కార్లో రోజర్స్ (అమెరికా)
→ అబ్రహాం మాస్లో ప్రతిపాదించిన అవసరాల క్రమానుగతశ్రేణి సిద్ధాంతం మరియు కార్లో రోజర్స్ ప్రతిపాదించిన ఆత్మవికాస సిద్ధాంతము రెండూకూడ మానవతా ఉపగమమునకు చెందిన సిద్ధాంతాలే. వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యతనిస్తే కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యతనిచ్చాడు.
→ కార్లో రోజర్స్ మానవతా ఉపగమము (humanistic approach) తోపాటు దృగ్విషయ ఉపగమము (phenomenological ap proach) ను కూడ వివరించాడు. పరిసరాల యదార్ధస్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకుండే అభిప్రాయాలే ముఖ్యమని భావించటమే దృగ్విషయ ఉపగమం అంటారు. ఉదా : కవికి వెన్నెల అద్భుతమనిపిస్తే చోరునకు వెన్నెల దుర్భరమనిపించటం.
→ వ్యక్తికేంద్ర మంత్రణం మరియు శాస్త్రీయమైన రోగ చికిత్సా పరిశోధనల ద్వారా కార్ల్ రోజర్స్ మూర్తిమత్వవికాస సిద్ధాంతము స్వీయ వికాస సిద్ధాంతమును ప్రతిపాదించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్తగా వీరి సిద్ధాంతాలు కూడా క్లయింట్స్తో నిరంతరం జరిపిన అంతశ్చర్యల ఫలితంగా రూపొందించబడినవే కాని సిగ్మండ్ ఫ్రాయిడ్ వాదనకు భిన్నమయినవి.
→ కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథములు:
1. Client centered therapy
2. On becoming a person
3. A way of being

రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతంలో ముఖ్య భావనలు:
→ ఆత్మభావన (self concept). వాస్తవిక ఆత్మభావన (real self concept), ఆదర్శ ఆత్మభావన (Ideal self concept), ఆత్మసాక్షాత్కారము (self- Actualization), అంతరము (incongruity) మరియ అంతరరాహిత్యము/ అన్యోన్యము (congruity) అనేవి ముఖ్యమైన అంశములుగా అమెరికాకు చెందిన కార్ల్ రోజర్స్ తన సిద్ధాంతమును ప్రకటించాడు.
→ వీరి సిద్ధాంతము ముఖ్యంగా స్వీయ/ఆత్మ కేంద్రంగా వివరించబడింది. నేను, నాది అనే భావనలను ఈ సిద్ధాంతము ద్వారా మొదటిగా వివరించారు.
→ వీరి దృష్టిలో ఆత్మభావన అనగా వ్యక్తికి తన లక్షణాల గురించి, తన వ్యక్తిత్వాన్ని గురించి, తన స్వభావాన్ని గురించి, తనకే ప్రత్యేకమయిన తన ప్రవర్తన గురించి తనకు సంపూర్తిగా తెలిసి ఉండటము. ఒక వ్యక్తి తనను గురించి తాను చేసుకొనే ఆలోచన సారాంశమే ఆత్మభావన. తన స్వంత స్వభావము లక్షణాలతో కూడిన ప్రవర్తనల గురించి ఏర్పరచుకున్న నమ్మకాల సమూహమే ఆత్మ భావన. నేను, నాది అనే భావనలకు సంబంధించినదే ఆత్మ భావన.
ఉదా: నేను తెలివిగలవాడను, నేను పిరికివాడిని, నేను ఇతరులను మెప్పించగలవాడను...
→ వీరి ప్రకారం ఆత్మభావన అభివృద్ధి అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాంశాల మీద, వారి ఆలోచనలు, అనుభూతులు, సృజనాత్మకత, ప్రజ్ఞ, ఇతరులతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా స్వీకరించే అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది.
→ వీరి ప్రకారం ఆత్మభావన 2 రకములు.
అవి:
1. వాస్తవిక ఆత్మభావన
2. ఆదర్శ ఆత్మభావన

→ ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి ఆత్మభావన కలిగి ఉంటాడు అనగా ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనేది వ్యక్తికి తెలిసుండడమే వాస్తవిక ఆత్మభావన.
ఉదా: నేను పిరికి వాడిని, నేను కలుగోలుపు వ్యక్తిని ..........
→ ఒక వ్యక్తి తను ఎలాంటి ఆత్మభావనను కలిగి ఉండాలి అనగా ఎలాంటి లక్షణాలను పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన,
ఉదా : నేను నిజాయితీగా ఉండాలి, బాధ్యతలు తెలిసినవాడిగా ప్రవర్తించాలి...........
→ వ్యక్తి పయనం వాస్తవిక ఆత్మభావన నుండి, ఆదర్శ ఆత్మభావన వైపుకు ప్రయాణిస్తుంది.
→ వ్యక్తి తను భావించే తన ఆత్మభావనకు, వాస్తవానికి మధ్య కొంత తేడా ఉండవచ్చు. ఈ తేడానే అంతరము (incongruity) అన్నాడు. ఈ అంతరం అనేది మరీ ఎక్కువగా ఉంటే అది సంఘర్షణలకు, ఒత్తిడికి, వ్యాకులతకు దారితీసి మానసిక ఆరోగ్యం దెబ్బతిని తద్వారా మూర్తిమత్వ వికాసం ప్రభావితమవుతుందని భావించాడు.
→ వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శాత్మక భావనకు మధ్య ఉండే అన్యోన్యత (congruity) మీద వ్యక్తి మానసిక ఆరోగ్యం, మూర్తిమత్వ అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. వాటి మధ్య అంతరం (incongruity) పెరుగుతూ ఉన్నట్లయితే మానసిక ఆరోగ్యం దెబ్బతిని వ్యక్తిత్వవికాసం ప్రభావితమవుతుంది.

→ వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరమును సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేయవచ్చు.
→ శిశువులో ఆదర్శాత్మక భావన అనేది ఇతరులతో గల అనుబంధం, వారు ఆరాధించే వ్యక్తుల వ్యక్తిత్వం, తాను తాదాత్మీకరణం చేసుకొనే వ్యక్తుల మూర్తిమత్వం మీద ఆధారపడి వృద్ధిచెందుతుందని రోజర్స్ భావించారు. ఆదర్శాత్మక భావనలో అనుకరణ ప్రముఖపాత్ర వహిస్తుందని తెలిపారు.
→ వీరి ప్రకారం ప్రతివ్యక్తి ధనాత్మక గౌరవము (positive regard) ను సమాజం నుండి కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి తనను ఇతరులు ఇష్టపడాలని, గుర్తించాలని, గౌరవించాలని కోరుకుంటాడు. ఆ కోణంలోనే ఆదర్శ ఆత్మభావనను పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు.
→ రోజర్స్ ప్రకారం వ్యక్తిలో ఆందోళనలు/ వ్యాకులతలు కలుగచేసేది ఆదర్శాత్మక భావనలోని ఒడిదుడుకులే.
→ వీరి ప్రకారం వ్యక్తి ఆత్మభావన బాల్యం నుండి కౌమారదశ వరకు వికసిస్తుంది.
ఈ కోణంలో 3 రకాల సంభావీయతలు ఉంటాయి. అవి:
1. వ్యక్తి తన ఆత్మభావనకు అనుగుణంగా తననుతాను మలచుకుంటాడు. అలా మలచుకోలేకపోతే ఇతరుల కోసం నటించటం నేర్చుకుంటాడు.
2. తన ఆత్మభావనకు భిన్నమయిన రీతిలో ఎదుటివారి అభిప్రాయాలు ఉంటే వాటిని ఎదుర్కొని నిలదొక్కుకుంటాడు.
3. వ్యక్తి తనకు తాను సరిగా అంచనావేసుకోలేని సందర్భంలో, ఆత్మభావనలో అంతరాలు ఎక్కువగా ఉన్నప్పుడు రక్షక తంత్రములను ఉపయోగించుకొని సంతృప్తి చెందుతుంటాడు.
→ రోజర్స్ ప్రకారం మానవుని యొక్క ఆత్మవికాస భావనలో అంతిమ విషయం ఆత్మసాక్షాత్కారం. నేను ఏమిటి ? నేను ఎలా ఉండను? నేను ఎలా ఉండాలి ? అనే అంశాలను సంపూర్తిగా అర్థం చేసుకొని, తన గురించి తాను సంపూర్తిగా తెలుసుకుని తన శక్తి సామర్థ్యాలన్నింటిని పరిపూర్ణంగా వినియోగించుకొని తననుతాను సంపూర్తిగా తీర్చిదిద్దుకోవటమే ఆత్మసాక్షాత్కారమని వివరించాడు.
కార్ల్ రోజర్స్ ప్రకారం :-
→ వ్యక్తి పయనం వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శాత్మక ఆత్మభావన వైపు పయనిస్తుంది. రెండింటి మధ్య ఎక్కువ అంతరం ఉంటే సంఘర్షణ, వ్యాకులతలకు గురయ్యి మూర్తిమత్వం దెబ్బతింటుంది.
→ వ్యక్తి తను ఎలా ఉండాలని అనుకున్నాడో అలాగే తయారవ్వటమే (ఆదర్శ ఆత్మభావన) ఆత్మసాక్షాత్కారము. ఇది వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందింస్తుంది.
→ ప్రతి వ్యక్తికి ధనాత్మక గౌరవ అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి తనను ఇతరులు గుర్తించాలని, గౌరవించాలని, ముఖ్యంగా తన విలువలను గుర్తించాలని కోరుకుంటాడు.
ఎలాంటి షరతులు లేని ప్రేమాభిమానాలు పొందిన పిల్లలు తమ అత్మభావనను ఎలాంటి ఆటంకాలు లేకుండా వికసింపచేసుకుంటారు. షరతులతో కూడిన ప్రేమను పొందిన పిల్లలు అంతరాన్ని పెంచుకోవటం ద్వారా ఆత్మభావనా వికాసంలో లోపాలు ఏర్పడి తద్వారా మూర్తిమత్వ వికాసం కుంటుపడుతుంది.
ఎరిక్ ఎరిక్సన్ - మనో-సాంఘిక వికాస సిద్ధాంతం:-
→ ఎరిక్సన్ (1902 - 1994) ప్రఖ్యాత మనోవిశ్లేషక వాది. వ్యక్తి వికాసాన్ని అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరులలో ఎరిక్సన్ ముఖ్యుడు. వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనో సాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియజేశాడు. ఎరిక్సనను 'అహం' మనో విజ్ఞానశాస్త్రవేత్త' (Ego Psychologist) అని అంటారు. ఫ్రాయిడ్తగానే ఎరిక్సన్ కూడా మూర్తిమత్వం అనేక దశల పరంపరల్లో వికాసం చెందుతుందని విశ్వసించాడు. అయితే వ్యక్తి పొందే సామాజిక అనుభవాల ప్రభావం జీవితాంతం కొనసాగుతుందన్నాడు.
→ వ్యక్తి వికాసం, అతడు తన సాంఘిక పరిసరాతలతో జరిపే పరస్పర చర్యల ఫలితమని ఎరిక్సన్ తెలిపారు. వ్యక్తి పెరుగుతున్న కొద్దీ అతడు ఎదుర్కొనే ఒత్తిళ్ళు, సంఘర్షణలలో క్లిష్టత ఎదుర్కొంటాడు. సంక్షోభాలను పరిష్కరించుకొనే విధానం వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతుంది. వ్యక్తి ప్రవర్తనను మంచిగా లేదా చెడుగా ప్రతిబింబిస్తుంది.
→ వ్యక్తి సాధారణ వికాసాభివృద్ధి వారి సాంస్కృతిక జీవనశైలి, స్థితిపై ఆధారపడతాయని ఎరిక్సన్ తెలిపాడు. వ్యక్తి అతడి సాంఘిక పరిసరాలతో జరుపుకొనే పరస్పర చర్యలపట్ల ప్రవర్తన లక్షణాలను పొందుతాడు.
క్ర. సం.మనోసాంఘిక వికాస దశవయో పరిమితులుమనోసాంఘీక క్లిష్ఠ పరిస్థితులుగుణం/లక్షణం
1పూర్వ శైశవ దశపుట్టుక - 1 1/2 సం||నమ్మకం - అపనమ్మకంఆశ
2ఉత్తర శైశవ దశ1 1/2 - 3 సం॥స్వయం ప్రతిపత్తి - సిగ్గు, సంశయంమనో బలం
3క్రీడా దశ3 - 5 సం॥చొరవ - అపరాధ భావంలక్ష్యం
4పాఠశాల దశ6 - 12 సం॥శ్రమశీలత న్యూనతసామర్థ్యం
5కౌమార దశ 12 - 20 సం॥పాత్ర గుర్తింపు-పాత్ర సందిగ్ధంవిశ్వసనీయత
6పూర్వవయోజన దశ20 - 30 సం||సాన్నిహిత్యం ఏకాంతంప్రేమ
7మధ్యవయోజన దశ30 - 60 సం॥ఉత్పాదకత స్తబ్ధత సం రక్షణ
8పరిపక్వ దశ సమగ్రత60 సం|| పైబడిచిత్తశుద్ది నిరాశసూక్ష్మ బుద్ధి
1. నమ్మకం Vs అపనమ్మకం (Trust Vs Mistrust) ( పూర్వ శైశవదశ 0-1 1/2 సం॥): -
→ ఈ దశలోని శిశువు తన అవసరాలు తీర్చుకోవడానికి పూర్తిగా తల్లి లేదా సంరక్షకులపై ఆధారపడుతాడు. శిశువులలో ప్రధానంగా నమ్మకం ఈ మౌఖిక - సంవేదన దశలోనే ఏర్పడుతుంది. ఈ దశలో శిశువుకు లభించిన పోషణ, సంరక్షణల నాణ్యత ఆధారంగా వారిలో నమ్మకం లేదా అపనమ్మకం అనే భావం ఏర్పడటం మొదలవుతుంది.
→ తల్లిదండ్రులు, ఇతర సంరక్షకులతో వారికి కలిగే అనుభవాల వల్ల వారిలో ఇతరుల పట్ల నమ్మకమే కాకుండా వారిపట్ల వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది.
→ అలాగే శిశువులకు సరైన పోషణ లభించకపోయినా, వారిపట్ల శ్రద్ధ వహించకపోయినా, కఠినత్వం చూపించినా, అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగినా వారికి కష్టం కలిగి వారిలో అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది.
→ ఈ దశలో ఏర్పడే నమ్మకం లేదా అపనమ్మకం తదుపరి దశలోకి అనుసరించి, మూర్తిమత్వ వికాసంలో ప్రతిబింబిస్తుంది. నమ్మకం, అపనమ్మకం మధ్య ఉండే నిష్పత్తి ఆధారంగా వారిలో 'ఆశ' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
2. స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు, సంశయం (Autonomy Vs Shame and Doubt) (ఉత్తర శైశవదశ 1 1/2 - 3 సం॥) : -
→ ఈ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందిన శారీరక, చలనాత్మక, మానసిక నైపుణ్యాలు, భాషాసామర్థ్యాలను ఉపయోగించి స్వతంత్రంగా పనిచేసుకొనే దిశగా సాగుతారు.
→ స్వయం ప్రతిపత్తిని సాధించడానికి వారు తమ పరిసరాలను శోధించి, తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. ఈ దశలో పిల్లల అనుభవాల నాణ్యతపై వ్యక్తిగత స్వయంప్రతిపత్తి ఆధారపడుతుంది. అందువల్ల స్వయంప్రతిపత్తిని సాధించడానికి సరిపోయేంత అవకాశాలు కల్పించాలి.
→ ఈ దశలో పిల్లలకు అతిగా శౌచాలయ శిక్షణ (Toilet Training) ఇచ్చినా, అతిగా సంరక్షణ (Guardian Ship) ఇచ్చినా వారిలో సిగ్గు, సంశయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ దశలో 'మనోబలం' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
3. చొరవ Vs అపరాధ భావం (Intiative vs Guilt) (క్రీడా దశ 3-5 సం॥) :-
→ ఈ దశలో వారి పరిసరాలతో పరస్పర చర్యలు చేయడానికి చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది. ప్రతి విషయాన్ని గురించి ప్రశ్నలను అడగడం, నిరంతరం పరిసరాలను శోధించడం, ప్రణాళికలను ఏర్పరచుకోవడంలో నిమగ్నమవడం, వివిధ కృత్యాలను చేయడం లాంటి లక్షణాలను ఈ దశలోని పిల్లలలో గమనించవచ్చు.
→ భౌతిక, మానసిక శోధన చేపట్టే చొరవకు తల్లిదండ్రులు, సాంఘిక పరిసరాల నుంచి లభించిన ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో పిల్లలకు ప్రణాళికలను ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి సామర్ధ్యాలు పెరుగుతాయి.
→ తల్లిదండ్రులు, ఇతర సంరక్షకులు పిల్లల పట్ల నమ్మకం లేదా చొరవ తీసుకోవడాన్ని నిరుత్సాహపరచినా లేదా అర్ధంలేని విమర్శలు చేసినా, చిన్న వైఫల్యాలకు తిట్టినా, శిక్షించినా, పిల్లలో అపరాధభావన ఏర్పడి, తద్వారా ప్రణాళిక ఏర్పరచుకొని, కృత్యాలను నిర్వహించుకోవడంలో సందేహం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, చొరవ తీసుకోలేకపోవడం జరిగి తద్వారా అపరాధ భావనకు గురి అవుతాడు. ఈ దశలో 'లక్ష్యం' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.

4. శ్రమశీలత Vs నూనత (Industry Vs Inferiority) (పాఠశాల దశ 6- 12 సం॥) :-
→ (6 నుంచి 12 సంవత్సరాల వరకు): ఈ దశలో పిల్లలు ఎలిమెంటరీ పాఠశాలకు హాజరవుతారు. ఈ దశలో పిల్లలు గృహలలో, పాఠశాలలో మంచి నిష్పాదనను కనబరిచినా లేదా వారి మానసిక చలనాత్మక నైపుణ్యాలు గుర్తించండి. పొగడబడినట్లయితే వారిలో సాధన భావంతో శ్రమశీలత ఏర్పడుతుంది.
→ అలా కాకుండా, పిల్లల నిష్పాదన వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను వారి నిష్పాదన వల్ల తృప్తి పరచలేకపోవడం వల్ల తమను తామే తక్కువగా భావించడం వల్ల న్యూనత మొదలవుతుంది.
→ పిల్లలలో శ్రమశీలత, న్యూనతభావం ఏర్పడటంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల వాతావరణం, సమవయస్సులు, ప్రభావం ఉంటుంది. ఈ దశలో 'సామర్థ్యం' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.

5. పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధత (Indentity Vs Role confusion) (కౌమార దశ 13-20 సం॥):-
→ కౌమార దశలో వ్యక్తులు తాదాత్మ్య భావన (Indentification)కు గురవుతారు. కౌమారులు వారి స్వయం వ్యక్తిత్వ గుర్తింపు అన్వేషణను ప్రారంభిస్తారు.
→ కౌమారులలో మొదలయ్యే ప్రశ్నల అన్వేషణ, పూర్వదశలో ఏర్పడిన సాంఘిక, మానసిక గుర్తింపుల పునర్ నిర్వచనం వారి ఆకస్మిక,వేగవంతమైన శారీరక మార్పులు, భవిష్యత్తు విద్య, ఉద్యోగాల గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల వల్ల కలిగే ఒత్తిడి, వ్యాకులతలకు సంబంధించి ఉంటాయని ఎరిక్సన్ ఉద్ఘాటించారు. తద్వారా, కౌమారులు వారి నూతన పాత్ర. గుర్తింపును గురించి ప్రయత్నం చేస్తారు.
→ పూర్వదశలలోని సంక్షోభాలను నిర్మూలించడంలో విఫలమైతే, వ్యక్తిలో కలవరం (Confusion) ఏర్పడి సరైన పాత్ర గుర్తింపు చేసుకోలేరు. ఏమి చేయాలి? ఎలా ప్రవర్తించాలనే గందరగోళానికి లోనవుతారు. దాని వల్ల వారి విద్య, ఉద్యోగ సంబంధ విషయాల నిర్ణయాలను తీసుకోలేకపోవచ్చు.
→ ఉపాధ్యాయులు కౌమారులలో సరైన తాదాత్యత కలగడానికి తోడ్పడి వారు పాత్ర సందిగ్ధానికి గురికాకుండా చూడాలి. ఈ దశలో 'విశ్వసనీయత' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.

6. సన్నిహతత్వం Vs ఏకాంతం (Intimacy Vs Isolation) (పూర్వ వయోజన దశ → 20 - 30 సం॥) :
→ వయోజన దశలోకి అడుగు పెట్టే వ్యక్తులు ఇతరులతో అన్యోన్య సంబంధాలు ఏర్పరచుకొనే ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకొంటారు వ్యక్తి పూజ చేస్తారు.
→ కుటుంబ సభ్యుల కోసం లేదా మిత్రులు, బంధువుల కోసం చేసే త్యాగాల ద్వారా వ్యక్తిలో సన్నిహితత్వ భావన ఏర్పడుతుంది.
→ ఇతరులతో వారి గుర్తింపును విలీనం చేసి తగినంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడంలో విఫలమైనా లేదా ఏవైనా కారణాల వల్ల ఇరువురి మధ్య సంబంధాలు చెడిపోయినా వ్యక్తిలో ఒంటరితనం ఏకాంతం ఏర్పడుతుంది. వ్యక్తి ఇతరులతో సర్దుబాటు చేసుకోవడం అనేది సంక్షోభాలను ఎలా పరిష్కరించుకోగలుగుతారు అనే విషయం పై ఆధారపడుతుంది. ఈ దశలో 'ప్రేమ' అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.

7. ఉత్పాదకం స్తబ్ధత (మధ్య వయోజన దశ→30-60 సం॥) :-
→ తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉన్నవారు, తమ చుట్టూ ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొన్నవారు, తమ సృజనాత్మకతతో కిందితరం వారికి మార్గదర్శకత్వంగా ఉండడం, వారికి సామాజిక విలువలను సంక్రమింపచేస్తూ, వాటిని పరిరక్షించడం, నూతన విలువలను సృజింపచేయడం జరుగుతుంది. ఇదే ఉత్పాదకం.
→ రాజా ఎరిక్సన్ ఈ రకం వారిని గూర్చి నొక్కి వక్కాణిస్తూ వీరివల్లనే సమాజం జీవించ గలుగుతుందనీ, సమాజంలోని విలువలు పరిరక్షించబడతాయనీ నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తాయని పేర్కొన్నారు.
→ ఈ ఉత్పాదక లక్షణం లేనివారు వ్యక్తిత్వ అవగాహన లేక ఏకాంతంలో ఉండే వారు స్వార్థంలోకి కూరుకుపోయి తమ గురించి మట్టుకు పట్టించుకుంటూ స్తబ్దతకు లోనవుతారు. ఈ దశలో 'సంరక్షణ' అదే సద్గుణం ఏర్పడుతుంది.

8. సమగ్రత చిత్తశుద్ధి Vs నిరాశ (Integrity Vs Dispair) (పరివణ దశ→60 సం|| నుండి):
→ మానసిక - సాంఘిక వికాసంలోని ఈ చివరి దశలో వ్యక్తి జీవితానికి చెందిన అంతిమ సంక్షోభం చిత్తశుద్ధి, నిరాశను ఎదుర్కొంటారు. ఈ దశలోని వ్యక్తులు తమ పూర్వ జీవితం గురించిన ఆలోచనలో ఉంటారు.
→ ఏడు దశలలోని సంక్షోభాలను విజయవంతంగా పరిష్కరించుకోగలిగితే వ్యక్తి సంతృప్తి చెంది ప్రపంచం పట్ల, తమపట్ల సానుకూల దృష్టి కలుగుతుంది. తమను తాము సమగ్రత, సమర్థత కలిగిన వ్యక్తులుగా భావిస్తారు. పూర్వ దశలలోని సంక్షోభాలను సరిగ్గా పరిష్కరించుకోలేకపోతున్న వ్యక్తులలో నిరాశ, నిస్పృహ ఏర్పడి జీవతం పట్ల అసంతృప్తితో ఉంటారు.
→ జీవన మార్గాన్ని మార్చుకోవడానికి సమయం లేదు అనే ఆలోచన వారిలో దుఃఖాన్ని పరితాపాన్ని కలిగిస్తుంది. తద్వారా వారిలో నిరాశ ఏర్పడుతుంది. ఈ దశలో 'సూక్ష్మబుద్ధి' (Wisdom) అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
→ అందువల్ల చిత్తశుద్ధి, నిరాశల పట్ల సమతుల్యతతో వ్యవహరించి, జీవితంలోని చివరి సంక్షోభాన్ని ఫలవంతంగా పరిష్కరించుకోవాలి. ఫలితంగా ప్రపంచంపట్ల ఆశావాద దృష్టి కలిగి మిగిలిన జీవితకాలాన్ని సంతోషంగా గడుపుతారని ఎరిక్సన్ తెలిపారు.

వికాస కృత్యాలు - విపత్తులు :
→ ప్రతి వికాసదశలో శిశువుకు కొన్ని అవసరాలు కలుగుతాయి. ఆ అవసరాలను తీర్చుకొనుటలో ఆశించిన ప్రవర్తనల గురించి ప్రస్తావించేవే వికాసకృత్యాలు.
→ ప్రతి నిర్దిష్టమయిన వికాసదశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి ప్రవర్తనను సమాజం ఆశిస్తుందో అదియే వికాసకృత్యంగా చెప్పుకోవచ్చు.
→ వికాసకృత్యము అనే భావనను ప్రవేశపెట్టినవారు 'ఇండియానా'కు చెందిన రాబర్టేమ్స్ హావిగ్ హార్ట్ అను విద్యావేత్త. వీరు చికాగో యూనివర్సిటీలో 'ఎడ్యుకేషన్' విభాగంలో ఆచార్యులుగా పనిచేసినారు.
→ హావిగ్ హార్డ్ రచించిన ప్రముఖ గ్రంథము - "హ్యూమన్ డెవలప్ మెంట్ అండ్ ఎడ్యుకేషన్".
→ హావిగ్ హార్స్ట్ ప్రకారం వికాసకృత్యము అనగా 'ఒక నిర్దిష్ట వయోదశలో ఒక వ్యక్తి నుండి ఎటువంటి నైపుణ్యసాధనను ఆశిస్తామో తెలిపేది'.
→ వికాసకృత్యములు అనేవి జీవిత పర్యంతము వ్యక్తిలో వచ్చు మార్పులను అర్థం చేసుకొనుటలో, వ్యక్తి తన అవసరములను తీర్చుకొనుటలో, తన వ్యక్తిగత లక్ష్యములను చేరుకొనుటలో సంతృప్తికరమైన జీవనాన్ని తెలియజేస్తాయి. జీవితంలో వ్యక్తి పాత్ర యొక్క అవసరాన్ని వ్యక్తికి తెలియజేస్తాయి.
→ వ్యక్తియొక్క వికాసం సంపూర్ణంగా జరగాలంటే ప్రతి దశలో కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలను తప్పనిసరిగా వెలువరించగలగాలి. వీటినే వికాస కృత్యములు అంటారు.
→ జీవిత పర్యంతము జరిగే క్లిష్టమైన వికాసకృత్యములను R.J. హావిగ్ హార్స్ట్ గుర్తించారు.
వీరు వికాసకృత్యములు మూడు రకాలుగా సంభవిస్తాయని పేర్కొన్నారు. అవి:
1. భౌతిక పరిపక్వత ద్వారా సంభవించే వికాసకృత్యాలు నడక నేర్చుకొనుట, మాట్లాడటం నేర్చుకొనుట, మధ్యవయస్సులో మెనోపాజ్ లక్షణాలకు సర్దుబాటు అగుట మొదలగునవి.
2. వ్యక్తిగత వనరుల ద్వారా సంభవించే వికాసకృత్యాలు చదువుట, రాయుట నేర్చుకొనుట, వృత్తిలో విజయం కోసం నైపుణ్యాలు నేర్చుకొనుట.... మొ||వి.
3. సమాజం యొక్క ఒత్తిడి ద్వారా సంభవించే వికాసకృత్యాలు : కుటుంబ జీవనమునకు సిద్ధపడుట, పౌర బాధ్యతలు స్వీకరించుట,సమూహాలలో చేరుట... మొ||వి.

వికాసకృత్యాలకు సంబంధించి R.J. హావిగ్ హవిగ్ హార్ స్ట్ వ్యక్తీకరించిన కొన్ని భావనలు:
→ ప్రతి వికాస దశలో వ్యక్తి కొన్ని వికాసకృత్యాలను ఎదుర్కోవాలి.
→ తరువాత వయోస్థాయి వికాసకృత్యాలు ఎదుర్కోవాలంటే దానికి పూర్వం వయోస్థాయి వికాసకృత్యాలను పూర్తి చేయాలి.
→ ప్రతి వ్యక్తి తన వికాసకృత్యాలను తానే పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోబుట్టువులు, పెద్దలు తగిన ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.
→ వికాసకృత్యాలు విజయవంతం అయితే వ్యక్తిగత సంతోషము, విజయాన్ని పొందిన భావన, సంఘ ఆమోదం పొంది జీవనం సులభతరం అవుతూ భవిష్యత్తు కృత్యాలు సాధించటం సులభతరం అవుతుంది. పరాజయం పొందితే వ్యక్తిగత బాధ, సామాజిక తిరస్కరణ, భవిష్యత్ కృత్యాలకు ప్రతికూలత సంభవిస్తాయి.

రాబర్ట్ హవిగ్ హార్ట్ వికాసకృత్యములను 6 వయోస్థాయిలకు విస్తరిస్తూ వివరించాడు. ఆ ఆరు వయోస్థాయిలు:
1) Early childhood - 0-5 years-బాల్యారంభ దశ
2) Middle childhood - 6-12 years - మధ్యబాల్య దశ
3) Adoloscence - 13-18 years - కౌమార దశ
4) Early adulthood - 19-29 years - వయోజన ఆరంభ దశ
5) Middle adulthood - 31-60 years - మధ్య వయోజన దశ
(6) Later Maturity - 61 పైన - (పరిపక్వ దశ / వృద్ధాప్య దశ)

1వ వయోస్థాయి వికాసకృత్యములు (0-5 సం॥లు) :-
→ నడకను నేర్చుకొనుట,
→ ఘనాహారం తీసుకొనుట నేర్చుకొనుట.
→ మాట్లాడటం నేర్చుకొనుట
→ శరీరం నుండి వ్యర్థ పదార్ధములను విసర్జించుటలో క్రమమైన అదుపును సాధించుట.
→ లింగభేదాలు గుర్తించుట మరియు లింగపరమైన సిగ్గును కనపరచుట.
→ శారీరకపరమైన స్థిరత్వంను పొందగలుగుట,
→ భౌతిక, సాంఘిక వాస్తవానికి సంబంధించిన సరళమైన భావనలు ఏర్పరచుకొనుట.
→ తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర పిల్లలతో ఉద్వేగపరమైన సంబంధములను కలిగి ఉండుట.
→ తప్పు, ఒప్పులను గుర్తించే చేతనాత్మక ప్రవర్తనను అభివృద్ధి చేసుకొనుట.
→ చదువుకు సంసిద్ధం అగుట.

2వ వయోస్థాయి వికాసకృత్యములు (6 - 12 సం॥లు) :
→ సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు నేర్చుకొనుట.
→ అభివృద్ధి చెందుతున్న తన అవయవాలకు సంబంధించిన జాగ్రత్తలు నేర్చుకొనుట.
→ సమవయస్కులతో వ్యవహరించే తీరును నేర్చుకొనుట.
→ సంఘంలో తనవంతు లైంగిక పాత్రను గురించి తెలుసుకొనుట.
→ చదువుట, రాయుట, గణితం (3R) చేయుటకు అవసరమైన మూల సూత్రములు / నియమాలు నేర్చుకొనుట.
→ దైనందిన జీవనానికి తప్పనిసరి అయిన భావనలను పెంపొందించుకొనుట.
→ చేతనత్వమును, నీతి, నియమాలను, విలువలను అభివృద్ధి చేసుకొనుట.
→ వ్యక్తి స్వేచ్ఛను సాధించుట.
→ సాంఘిక సమూహాలు, మరియు సంస్థలపట్ల వైఖరులను అభివృద్ధి చేసుకొనుట.

3వ వయోస్థాయి వికాసకృత్యములు (13-18 సం॥లు) :-
→ సమవయస్కులయిన ఆడ, మగవారితో పరిపక్వమయిన సంబంధాలను కలిగి ఉండుట.
→ ఆడ, మగ ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించుట,
→ తన శరీర సౌష్టవాన్ని అంగీకరిస్తూ తన శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకొనుట.
→ తల్లిదండ్రులు, ఇతర పెద్దల నుండి భావోద్వేగ స్వాతంత్ర్యమును పొందుట.
→ ఆర్థిక స్వేచ్ఛకు తగిన భరోసాను పొందగలుగుట.
→ వృత్తిని ఎంపిక చేసుకొని లక్ష్యమును చేరుకొనుటకు సంసిద్ధమగుట.
→ వివాహం చేసుకొని కుటుంబ జీవనంకై సిద్ధపడుట.
→ పౌర అధికారం కోసం అవసరమైన నైపుణ్యాలు, భావనలు అభివృద్ధి చేసుకొనుట.
→ బాధ్యతాయుత ప్రవర్తనతో కూడిన సామాజిక జీవనాన్ని కోరుకోవటం దానిని సాధించటం.
→ నీతివంతమైన, విలువలు కలిగి అందరికి మార్గదర్శకమైన ప్రవర్తనను పొందుట.
4వ వయోస్థాయి వికాసకృత్యములు (19-29 సం॥లు):-
→ జీవిత భాగస్వామిని ఎంచుకోవటం.
→ జీవిత భాగస్వామితో కలసి జీవించటం.
→ కుటుంబ జీవనాన్ని ప్రారంభించటం.
→ పిల్లలందరిని బాధ్యతగా పెంచటం.. కౌ గృహాన్ని సక్రమంగా నిర్వహించటం.
→ ఏదైనా వృత్తిని ప్రారంభించటం,
→ పౌర బాధ్యతలు స్వీకరించటం.
→ అనుకూలమైన సమూహాలను ఎంపిక చేసుకొని వాటిల్లో చేరటం.

గమనిక: మిగిలిన రెండు దశలు మధ్య వయోజన దశ (30-60 సం॥లు) మరియు పరిపక్వ దశ / వృద్ధాప్యదశ (61 సం॥లుపైన మీరు 3వ వయోస్థాయి వరకు నేర్చుకుంటే సరిపోతుంది.

వికాసకృత్యాలు - ఆటంకాలు / విపత్తులు:-
→ వ్యక్తి వికాసం సంపూర్ణంగా జరగాలంటే ప్రతిదశలో కొన్ని నిర్దిష్ట ప్రవర్తనలను తప్పనిసరిగా వెలువరించాలి. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతికపరమైన అవరోధాలనే ఆటంకాలు / విపత్తులు అంటారు.
ఆటంకాలకు ఉదా : అంగవైకల్యం, ప్రజ్ఞ తక్కువ కావటం, ఆత్మన్యూనత, అధికమైన కోపం, కులము, మతము, సమాజం అంగీకరించకపోవటం మొ॥వి.
→ వికాస కృత్యాలకు కలుగు ఆటంకాలకు పై అంశములే కాక ఇంకా కొన్ని కారణములు కలవు.
1) ఒక దశలో సాధించవలసిన కృత్యాలను తన సామర్థ్యానికి మించి ఆశించటం.
ఉదా :- చదువు నైపుణ్యాలు సరిగా లేనప్పటికి డాక్టరు కావాలనుకోవటం.

2) ఒక దశలో సాధించాల్సిన కృత్యాలలో విఫలమైనపుడు దాని ప్రభావం తరువాత దశలో సాధించవలసిన కృత్యాలకు ఆటంకంగా పరిణమిస్తుంది.
ఉదా:- అభ్యసన సంసిద్ధత ఏర్పరచుకోలేని శిశువు తరువాత దశలలో 3R లను సాధించలేదు.

3) ఒక దశలోని కృత్యాలను పూర్తి విజయవంతంగా నిర్వహించలేకపోవటం అనేది తరువాత దశలలో ఎదురయ్యే కృత్య నిర్వహణలో ఒత్తిడికి గురిచేస్తుంది.
ఉదా :- వివాహ జీవితానికి సిద్ధం కాలేని వ్యక్తి జీవిత భాగస్వామితో కలసి జీవించటంలో ఒత్తిడికి గురి అవుతాడు.

వివిధ వయోస్థాయిలు వికాసకృత్యాలకు ఎదురయ్యే ఆటంకాలు :-
వయోదశ:-
1. బాల్యారంభ దశలో వికాసకృత్యాల నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలు

1)అనువంశిక వ్యాధులు
2) పరిపక్వత లోపాలు
3) ఉద్వేగ కారణాలు (భయం, భీతి...) మొ॥వి.
2.మధ్య బాల్యదశలో వికాసకృత్యాల నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలు
1) భౌతిక ప్రమాదాలు
2) శారీరక రుగ్మతలు
3) ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, తక్కువగా ఉండటం
4) సరిఅయిన భావనలు ఏర్పడకపోవటం
5) అభిరుచులు, అనుకూల వైఖరులు సరిగా ఏర్పడకుండుట మొదలగునవి

3.కౌమారదశలో వికాసకృత్యాల నిర్వహణలో ఎదురయ్యే అటంకాలు
1) అపజయాలు
2) సంఘర్షణలు, ఒత్తిడి, కుంఠనం
3) ఆత్మభావనా లోపం
4) లైంగిక కాముకత ఎక్కువగా ఉండటం
5) మార్గదర్శకత్వ లేమి మొ॥వి.