అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాస సూత్రములు




వికాస సూత్రములు

→ ఒక సూక్ష్మకణంగా మొదలయ్యి మనిషి జీవితకాలంపాటు ఒక ప్రవాహంలాగా మార్పుచెందుతూనే ఉంటాడు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసము అవిచ్ఛిన్నమైనది/ వికాసము నిరంతరమైనది.
→ వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా జీవితపర్యంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసము నిరంతరమయినది / వికాసము అవిచ్ఛిన్నమయినది.
→ మానవునిలో పుట్టినప్పటినుండి మరణించేవరకు మూర్తిమత్వ వికాసము జరుగుతూనే ఉంటుంది. దీనిలో ఇమిడియున్న వికాస సూత్రము - వికాస అవిచ్ఛిన్న సూత్రము / వికాస నిరంతర సూత్రము.
→ వికాసము అనేది ప్రతి శిశువులో ప్రతి అంశములో ఒక క్రమమయిన వరుసలో కొనసాగుతూ ఉంటుంది. ఈ విషయము ఏ వికాస సూత్రమును తెలియజేస్తుంది - వికాసము క్రమానుగతమయినది.
→ ప్రతి శిశువులో మొదట ఇంద్రియచాలక ఆలోచన, తర్వాత మూర్త ఆలోచన, చివరిగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి. మొదట ఏకమితి, తర్వాత ద్విజ్యామితి, తర్వాత త్రిజ్యామితి భావనలు వరుసగా ఏర్పడతాయి. దీనిని వివరించే వికాస సూత్రము- వికాసము క్రమానుగతమయినది.
→ చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో ప్రాకటం, కూర్చోగలగటం, నిలబడగలగటం మరియు పరిగెత్తగలగటంలు వరుసక్రమంలో జరుగుతాయి. దీనిని వివరించే వికాస సూత్రము - వికాసము క్రమానుగతమయినది.
→ శిశువు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు, తరువాత అస్పష్ట శబ్దాలు చేయటం, చిన్ని మాటలు, సరళపదాలు, వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలుగుటను వివరించు వికాస సూత్రం - వికాస క్రమానుగత సూత్రము.
→ వికాసము అన్ని దశలలో ఒకేరకంగా, ఒకేవేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం - వికాస అసమాన సూత్రము.
→ శైశవ దశలో శారీరక వికాసం (ఎత్తు) బాగా వేగంగా జరిగి, ఉత్తర బాల్యదశలో నెమ్మదిస్తుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు - వికాస అసమాన సూత్రము.
→ కౌమారదశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి, వయోజనదశలో, మధ్యవయస్సులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. దీనిని వివరించు వికాస సూత్రము- వికాస అసమాన సూత్రము.
→ వికాసము 2 నిర్దిష్ట దిశలలో జరుగుతుంది. అవి
(1) శిరః పాదాభిముఖ వికాసము.
(2) సమీప దూరస్థ వికాసము
→ శిరఃపాదాభిముఖ వికాసము మరియు సమీప దూరస్థ వికాసములు రెండు వికాసదిశా సూత్రంలో భాగము.
→ వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అనే సూత్రము - శిరః పాదాభిముఖ సూత్రము.
→ అనగా శరీర నిర్మాణం అభివృద్ధి మొదట తల భాగంలో జరిగి తరువాత మొండెమునకు వ్యాపించి చివరకు కాలి ప్రాంతానికి ప్రాకుతుంది అని మనోవైజ్ఞానికుల అభిప్రాయము.
→ ముందు తల నిలిపిన తరువాత, మొండెమును కూర్చోబెట్టగలగటం, తరువాత కాళ్ళపై నిలబడగలగటంను వివరించు వికాసదిశా సూత్రము - శిరఃపాదాభిముఖ వికాస సూత్రము.
→ వికాసము దేహ మధ్యస్థభాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాసదిశా సూత్రము - సమీప దూరస్థ వికాస సూత్రము.
→ ఒక వస్తువును అందుకొనేటప్పుడు మొండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు ఆ తరువాత చేతివేళ్ళను ఉపయోగించటం జరుగుతుంది. దీనిని వివరించు వికాసదిశా సూత్రము - సమీప దూరస్థ వికాసము.
→ సమీప దూరస్ధ వికాస సూత్రం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కందరాలపై అదుపువచ్చి ఆ తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. అందువల్లే శిశువు ముందు చేతులు చాచటం, గుప్పిటి విప్పటం, చివరిగా వస్తువులను వేళ్ళతో పట్టుకోవటం చేస్తాడు.
→ ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలను కనపరచి తరువాత నిర్దిష్ట మరియు గమ్యనిర్దేశిత ప్రతిస్పందనలను కనపరుస్తాడని తెలియచెప్పే వికాస నియమము - వికాసం సాధారణం నుండి నిర్దిష్టంవైపుకు సాగుతుంది.
→ ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువును సాధారణ భయంతో కూడిన ప్రతిస్పందనతో ఎదుర్కొనును. ఆ తరువాత భయంతో కూడిన ప్రతిస్పందనలు సందర్భానుసారంగా ఏడ్వటం, పరుగెత్తటం, తప్పించుకోవటం వంటి నిర్దిష్ట ప్రతిస్పందనలను వ్యక్తం చేయును. దీనిని వివరించు వికాససూత్రము - వికాసము సాధారణం నుండి నిర్దిష్టంవైపుకు సాగుతుంది.
→ ఉద్వేగ వికాసంలో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయిన ఆహ్లాదం అనేది తరువాత ఆనందం, ప్రేమ, జాలిగా మరియు విచారము అనేది అసూయ, పగ, కోపం అనే నిర్దిష్ట ప్రతిస్పందనలుగా విడిపోవటంను ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. - వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది.
→ మానసిక వికాసంలో భాగంగా పాఠ్యాంశాలలో చిన్న తరగతులలో ఒక అంశానికి సంబంధించి సరళమయిన మౌలిక భావనలు కలుగచేసి ఉన్నత తరగతులలో వాటికి సంబంధించిన క్లిష్ట అంశములను లోతుగా వివరిస్తారు. దీనిలో ఇమిడియున్న వికాస సూత్రము - వికాసము సాధారణం నుండి నిర్ధిష్టం వైపుకు సాగుతుంది.
→ శారీరక మార్పులయినా, మానసిక మార్పులయినా ఒక్కసారిగా సంభవించక గతంలోనే ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులతో, చేర్పులతో జరుగుతుంది అని వివరించే వికాస సూత్రము - వికాస సంచిత సూత్రము.
→ ఒక వికాస కృత్యానికి కారణమయిన ఎన్నో ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతూ ఒక ప్రక్రియ ఆధారంగా మరో ప్రక్రియ సంభవిస్తూ అవన్నీ సమన్వయం చెందటం ద్వారా హఠాత్తుగా ఒకరోజు బయటకు కన్పించే మార్పును వివరించు వికాస సూత్రము. డా 'చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత, శరీరముపై అదుపు, ఎముకలు బలంగా తయారగుటలాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా - వికాస సంచిత సూత్రము.
→ శిశువు చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమఘనమును అలాగే దీర్ఘచతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా దీర్ఘఘనమును గీయగలడు. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. - వికాస సంచిత సూత్రము.
→ వికాసము ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికి అందరిలో ఒకే వేగంగా, ఒకే గుణాత్మకంగా జరగదు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ చలన వికాసంలో భాగంగా కొందరు శిశువులు 6 నెలలకు నిలబడగలిగితే మరికొందరు 9 నెలలకు నిలబడగలగటం, కొందరు 9 నెలలకు నడవగలిగితే మరికొందరు 1 సం॥కు నడవగలగటం అనేది వికాసం యొక్క ఏ సూత్రంను వివరిస్తుంది. - వికాస వైయక్తిక భేదాల సూత్రము.
→ కొందరు నైతిక వికాసంలో భాగంగా కోల్బర్గ్ చెప్పిన 4వ స్థాయి వరకే చేరుకుంటే మరికొందరు 5వ స్థాయికి, ఇంకొందరు 5వ స్థాయివరకు చేరుకుంటారు. దీనిని వివరించే వికాస సూత్రము - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ కవల సోదరులయిన సుబ్బుకంటె రాములో అమూర్త ఆలోచనా స్థాయి 50 రెట్లు అధికంగా ఉంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు - వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.
→ ఒక దశలోని శిశువు యొక్క ప్రస్తుత వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలోని వికాస లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాస ప్రాగుక్తీకరణ సూత్రము.
→ 8 సం||ల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సం॥ల కల్లా శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. దీనిని వివరించు వికాస సూత్రము - వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు.
→ కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు అని వివరించే వికాస సూత్రం - ప్రాగుక్తీకరణ వికాస సూత్రం.
→ వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి అని తెలియచెప్పే వికాస సూత్రము - వికాస పరస్పర సంబంధ సూత్రం / వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది.
→ నైతిక వికాసం ఎప్పుడు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియచేశాడు. దీనిని వివరించు వికాస సూత్రం - వికాస పరస్పర సంబంధ సూత్రం.
→ మానసిక వికాస లోపంతో బాధపడే విద్యార్థి శారీరక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసంలో కూడా వెనుకబడిపోయి వుంటాడు. దీనిని వివరించే వికాస సూత్రము - వికాస పరస్పర సంబంధ సూత్రము.
→ ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలసి ఆడుకోవటానికి అవసరమయిన భౌతిక, చలన వికాసములు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక, ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. దీనిని వివరించు వికాస సూత్రము - వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది / వికాస పరస్పర సంబంధ సూత్రము.