అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసనా వనరులు


→ అభ్యాసకుడు పొందిన జ్ఞానమంతయు పాఠశాలల్లోనే లభించదు. అనేక ఇతర ప్రతినిధి సంస్థల ద్వారా కూడా అభ్యసిస్తూ ఉంటుంటాడు. ఇలా జ్ఞానమును వేనినుండి పొందగలుగుతున్నాడో వాటినన్నింటిని అభ్యసనా వనదులుగా చెప్పుకోవచ్చు.

→ అభ్యాసకుడు జరిపే అభ్యసనము మూడు విధాలుగా ఉంటుంది.
1) నియత అభ్యసనము : అనగా నియమ నిబంధనలతో కూడి పాఠశాలలనుండి, కళాశాలల నుండి ఉపాధ్యాయుల బోధన ద్వారా గ్రహించబడిన జ్ఞానము.

2) అనియత అభ్యసనము : నియమ, నిబంధనలు ఏమీ లేకుండానే అనియత విద్యా విధానం ద్వారా అందించబడే జ్ఞానము.
ఉదా : కరస్పాండెన్స్ కోర్సులు, టి.వి., రేడియో, కంప్యూటర్లు.

3) యాదృచ్ఛిక అభ్యసనము : ఇవి పాఠశాలలు, కళాశాలలు, కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా కాకుండా యాదృచ్ఛికంగా, తల్లిదండ్రులు కుటుంబము, స్నేహితులు, పెద్దలు, సమాజము నుండి స్వీయ అనుభవాల ద్వారా ఏర్పడే జ్ఞానము. అభ్యసనా అనుభవాలను కల్పిస్తూ, అభ్యసనా ప్రక్రియకు తోడ్పడే వాటన్నింటిని అభ్యసన వనరులు అని చెప్పుకోవచ్చు.

→ అభ్యసనం అనగా అనుభవం ద్వారా ఏర్పడే వ్యక్తిలోని శాశ్వత మార్పు. ఆ మార్పును కలిగించే అభ్యసనా వనరుగా పేర్కొనవచ్చు. అలాంటి అభ్యసనా వనరులలో ముఖ్యమైనవి.
1) స్వీయ వనరులు
2) కుటుంబము
3) పాఠశాల
4) సమాజము
5) సాంకేతిక వనరులు

→ స్వీయ వనరులు:
→ అభ్యసనములో ప్రధాన పాత్ర అభ్యాసకుడే. ప్రతి అభ్యాసకుడు ఇతరులతో పోల్చినపుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన శక్తులు గలవాడుగా చెప్పుకోవచ్చు. అందరిలో ఈ శక్తులు ఉన్నప్పటికి వ్యక్తికి, వ్యక్తికి ఆ శక్తి సామర్థ్యాలలో ఎంతోకొంత తేడాలుంటాయి. వ్యక్తులకుండే ఈ ప్రత్యేక శక్తులను అభ్యసనమునకు సంబంధించి స్వీయ వనరులుగా చెప్పవచ్చు.
→ ప్రత్యేక శక్తులు విద్యార్థి యొక్క ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, స్మృతి, అవధానం, ప్రేరణ, కాంక్షాస్థాయి, సృజనాత్మకత, విశ్లేషః సామర్ధ్యము, కల్పనాశక్తి, భాషా సామర్థ్యం, ఆలోచనాభివృద్ధి, సమస్యా పరిష్కారశక్తి, భావప్రసార నైపుణ్యము మొదలగునవి.
→ ప్రత్యేకశక్తులకు మూలాధారము : జ్ఞానేంద్రియములు, మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం.
కుటుంబ వనరులు:
→ శిశువులో అభ్యసనం యొక్క ప్రారంభం అనేది కుటుంబం ద్వారా మొదలవుతుంది. అందువలన శిశువు అభ్యసనకు కుటుంబమే మొదటి పాఠశాలగా చెప్పుకోవచ్చు.
→ కుటుంబం అనేది యాదృచ్ఛిక అభ్యసనమును అందించు మొదటి ప్రతినిధి సంస్థగా చెప్పుకోవచ్చు.
→ శిశువు కుటుంబంలోని సభ్యులను పరిశీలిస్తూ, వారి ప్రవర్తనను అనుకరిస్తూ, అనుసరిస్తూ, భాషను, నడవడికను, ఆచార సాంప్రదాయాలన పెద్దలను గౌరవించటం లాంటి మర్యాదను నేర్చుకుంటాడు. జీవితంపై సరి అయిన వైఖరులను ఏర్పరచుకుంటాడు.
→ కుటుంబంలో సభ్యుల మధ్య ఉండే సంబంధాలను పరిశీలిస్తూ ప్రేమ, అనురాగం, సహకారంలాంటి గుణాలను వృద్ధి చేసుకుంటాడు.
→ పాఠశాలలో, సమాజంతో చక్కగా వ్యవహరించటానికి అవసరమైన కృత్యములను కుటుంబం నుండి ముందే నేర్చుకుంటాడు.
→ సవ్యమయిన ప్రవర్తన ఏర్పడటంలో కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబం ఏర్పాటు చేసిన పునాదులపైనే ఆ శిశువు యొక భావి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. .
→ తల్లిదండ్రులు చేస్తున్న అనేక పనులను, వృత్తులను జాగ్రత్తగా నేర్చుకొని భావి జీవితానికి పునాదులు ఏర్పరుచుకుంటాడు.
→ విధంగా కుటుంబం శిశువు యొక్క మొదటి అభ్యసనా వనరుగా మారి శిశువు ప్రవర్తనా మార్పుకు దోహదం చేస్తుంది.

పాఠశాల వనరులు:
→ విద్యార్ధి భావి జీవితము సుఖమయం కావటంలో, ప్రయోజనకారిగా రూపొందటంలో పాఠశాల ప్రధానపాత్ర పోషిస్తుంది.
→ నియత విద్యా విధానంలో బోధన చేస్తూ జ్ఞానమును పొందటానికి వీలు కల్పించే ప్రతినిధి సంస్థ పాఠశాల.
→ శిశువులోని బౌద్ధిక సామర్థ్యాలు పాఠశాల ద్వారా అభివృద్ధి చెందుతాయి.
→ కుటుంబంలో పరిశీలన ద్వారా, యత్నదోషం ద్వారా, నిబంధనం ద్వారా మాత్రమే అభ్యసనం జరిగితే పాఠశాలలో పై పద్ధతుల ద్వారానే కాకుండా, అన్వేషణ, ప్రయోగ, ప్రాజెక్ట్, కృత్యాధారలాంటి అనేక పద్ధతుల ద్వారా అభ్యసనం జరుగుతుంది.
→ పాఠశాలలో ఉపాధ్యాయుల మూర్తిమత్వము, విద్యార్థులను ఇట్లే ఆకర్షించటం ద్వారా శిశువు ఉపాధ్యాయుని ఒక నమూనాగా తీసుకొని అనేక ప్రవర్తనాంశములను అనుకరించటం జరుగుతుంది.
→ నిర్ధారిత సత్యాలు, వివిధ భాషల జ్ఞానము, సామాజిక అంశాలు, పరిపాలన వ్యవస్థలు, ఆర్థిక సంబంధ విషయాలు, శాస్త్ర సాంకేతికతలు, గణిత సంబంధ సమస్యా పరిష్కారములు, ప్రపంచంలోని వివిధ భౌగోళిక పరిస్థితులు మొదలగు వాటిని పాఠశాల ద్వారా అభ్యసించ గలుగుతాడు.
→ శిశువు తన సొంత కాళ్ళపై నిలబడటానికి అవసరమైన ఎక్కువ మొత్తం జ్ఞానమును పాఠశాల నుండే అభ్యసిస్తాడు.
→ నైతిక విలువలను, సామాజిక విలువలను, ఆర్ధిక విలువలను, క్రమశిక్షణమైన జీవితమును పాఠశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
→ జీవిత లక్ష్యములను పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకొనేట్లు చేసి వాటిని సాధించుకోవటానికి అవసరమయిన అభ్యసనా అనుభవాలను పాఠశాల అందిస్తుంది.
→ ఈ విధంగా మానవ సుఖమయ జీవితానికి అతి ప్రధాన అభ్యసన వనరుగా పాఠశాలలు పలు అభ్యసనా అనుభవాలను కల్పిస్తుంది.

సమాజ వనరులు:
→ వివిధ రకాలయిన సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలకు నిలయమైనది సమాజం.
→ సమాజం అనేది వ్యక్తికి యాదృచ్ఛిక జ్ఞానంను అందించు అభ్యసనా వనరుగా చెప్పుకోవచ్చు.
→ సాంఘిక వికాసానికి కుటుంబంలోనే పునాదిపడినా మిగిలిన సాంఘిక నైపుణ్యాలు, సంఘజీవనము, కలిసి బ్రతకటం, ఒకరికొకరు సహకారం అందించుకోవటం, మొదలగు లక్షణాలను శిశువు సమాజములోని ఇరుగు పొరుగు జీవనశైలిని పరిశీలిస్తూ నేర్చుకుంటాడు.
→ నాయకత్వ లక్షణాలను సమాజంలోని తనను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులను పరిశీలించి గ్రహించగలుగుతాడు.
→ సమాజంలోని ఇతర వ్యక్తుల అనుభవాలను పరిశీలించటం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటాడు.
→ సమాజంలోని వివిధ వృత్తి పనివార్లను పరిశీలించి తనకు తగిన నైపుణ్యమున్న వృత్తిని ఎంచుకొని దానిని పూర్తి స్థాయిలో అభ్యసించి తనకాళ్ళపై తాను నిలబడగలుగుతారు.
→ ఈ విధంగా సమాజము అనేది వ్యక్తికి ముఖ్యంగా సాంఘికీకరణలో, సంఘజీవనం గడుపుటకు అవసరమయిన నైపుణ్యాలను అందించే ప్రధాన వనరుగా చెప్పుకోవచ్చు.

సాంకేతిక వనరులు: -
→ ఆధునిక సమాజంలో బహుళ ప్రసార మాధ్యమాలు ఎంతో కీలకమయినవి. వీటి ద్వారా అందే జ్ఞానము అనియతమైనది మరియు యాదృచ్ఛికమైనదిగా చెప్పుకోవచ్చు.
→ ఇవి ముద్రణా మాధ్యమాలుగాను (పత్రికలు, గ్రంథాలు, జర్నల్స్), దృశ్య శ్రవణ మాధ్యమాలుగాను ఉంటాయి (టి.వి.లు, సినిమాలు, కంప్యూటర్లు)
→ ఈనాడు ఎక్కువ సమాచారమును విద్యార్థి ఇంటర్నెట్ నుండి అభ్యసిస్తున్నాడు. ఈ రోజున ప్రపంచంలో వివిధ రకాల సమాచారమును చిటికెలో గ్రహించి నేర్చుకోగలుగుతున్నాడు. డా వివిధ పత్రికలు, జర్నల్స్, గ్రంథాల ద్వారా సామాజిక సమస్యలు - పరిష్కారాలు లాంటి అనేక రకాల సమాచారమును నేర్చుకోగలుగుతున్నాడు.
→ ప్రస్తుతం ఇంటర్నెట్లోని గూగుల్ ద్వారా దేనికి సంబంధించిన సమాచారాన్నయినా ఆ క్షణంలోనే చూచి నేర్చుకోగలుగుతున్నాడు. అన్నీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను, గత ప్రశ్నా పత్రాలను, డౌన్లోడ్ చేసుకొని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగలుగుతున్నాడు.
→ పాఠశాల స్థాయి పాఠాలను శాటిలైట్ ప్రసారాల ద్వారా, టి.వి.లో చూసి అభ్యసించగలుగుతున్నాడు.
→ మనదేశంలో NCERT ఆధ్వర్యంలో నడుస్తున్న CIET సంస్థ 'ఎడ్యుశాట్' ఉపగ్రహం ద్వారా విద్యకు సంబంధించిన టీ.వి మరియు రేడియో కార్యక్రమాలను ప్రసారం చేసి నూతన తరహాలో అభ్యసనకు ఊతమిస్తుంది.
→ శాటిలైట్ సహాయంతో MANA TV ప్రసారం చేసే అభ్యసనా కార్యక్రమాలు అభ్యాసకులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
→ ఇలా అనేక రకాలుగా సాంకేతిక పరికరాలు ఒక ప్రధానమైన అభ్యసనా వనరులుగా మారుతున్నాయి. వీటన్నింటిని ఉపయోగించుకొని మానవుడు వివిధ రకాలైన అభ్యసన అనుభవములను పొందగలుగుతున్నాడు.