అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




బోధనలో మంచి సంధానకర్తగా / సౌకర్యకర్తగా ఉండదగిన ఉపాధ్యాయుని యొక్క సాధారణ మరియు విషయ సంబంధ నైపుణ్యాలు


→ బోధనలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమయినది. బోధన అభ్యసన ప్రక్రియ విజయవంతం కావటం అనేది ఉపాధ్యాయుని వ్యక్తిత్వంపై, ఉపాధ్యాయుని బోధనా సామర్ధ్యంపై, బోధనా ప్రణాళికపై తరగతి గదిని నియంత్రించే విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఆదర్శవంతమయిన ఉపాధ్యాయుడు యొక్క లక్షణాలు:-
→ చక్కని విషయ పరిజ్ఞానము, సంభాషణా నైపుణ్యములు,
→ హాస్యచతురత, జవాబుదారీతనము, సృజనశీలి.
→ ఓర్పు, సహనము, దయ, అంకితభావం, సానుకూల దృక్పథం, అంతర్గత ప్రేరణ, వృత్తిపట్ల అభిరుచి, నైతికత,
→ బోధనా ప్రణాళికలను రచించుకొనే సామర్థ్యము, మూల్యాంకనము చేయు సామర్ధ్యము.
→ ఇంకనూ తనూ కొత్త విషయాలు అభ్యసించాలనే జిజ్ఞాస
→చక్కని నాయకత్వ లక్షణాలు, చక్కని తరగతి గది నిర్వహణ, సరిఅయిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. బోధనలో నూతన అన్వేషణలు.
→ సహ ఉపాధ్యాయులతో చక్కని స్నేహపూర్వక సంబంధాలు.
→ సరి అయిన మార్గదర్శకత్వం - మంత్రణమును అందించే సామర్ధ్యము..
→ ఇతరులను ప్రభావితం చేయు సమగ్ర మూర్తిమత్వము మొ||గు లక్షణములను కలిగి ఉంటాడు.
→ సాంప్రదాయ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కీలకంగా ఉండేది. విద్యార్థుల పాత్ర చాలా తక్కువగా ఉండేది. కాని ప్రస్తుతం వచ్చిన నూతన పోకడలకు అనుగుణంగా ఉపాధ్యాయుని పాత్రలో చాలా కీలకమయిన మార్పులు వచ్చినాయి. సాంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానం అందించేవాడుగానే ఉండేవాడు. కాని ప్రస్తుతం ఉన్న బోధనా పద్ధతులు మరియు అభ్యసనా పద్ధతులు అన్నియు శిశు కేంద్రీకృతమయినవి.
→ శిశు కేంద్రీకృతం / అభ్యాసక కేంద్రీకృతం అనగా బోధన - అభ్యసన ప్రక్రియలో శిశువును చురుకుగా ఉండేట్లు చేయుట. శిశువు క్రియాత్మక పాత్రను పోషించేట్లు చూచుట, పిల్లల మానసిక వికాసంకై ప్రణాళికలను రూపొందించి అమలు చేయుట,
→ శిశు కేంద్రీకృత విద్యలో ఉపాధ్యాయుని పాత్ర బోధకుడిగా కాకుండా సంధానకర్తగా మరియు సౌకర్యకర్తగా మారింది. సంధానకర్త అనగా బోధనకు - అభ్యసనకు మధ్య అవసరమయిన 'కనెక్టివిటీ' కల్పించేవాడు అని అర్ధము. సౌకర్యకర్త అనగా అభ్యసనలో విద్యార్ధిని చురుకుగా ఉంచుటకు, క్రియాత్మకంగా ఉంచుటకు అవసరమయిన అన్ని సౌకర్యాలు కల్పించేవాడు అని అర్ధము. అనగా ఈ శిశుకేంద్రీకృత అభ్యసనలో అభ్యాసకుడే స్వయంగా నేర్చుకోవటానికి అవసరమయిన సౌకర్యాలను, అభ్యసనా అనుభవాలను ఉపాధ్యాయుడు కల్పించాలి. అభ్యాసకుడే స్వయంగా కృత్యాధారంగా నేర్చుకొనేట్లు చేయాలి. తన భాగస్వామ్యం తక్కువగా ఉండి పిల్లల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. తరగతిలో ఆచరణ ద్వారా అభ్యసనం జరిగే విధంగా వనరులు కల్పించాలి. సాంప్రదాయ ఉపాధ్యాయుడిగాకాక ఒక సంధానకర్తగా, ఒక సహాయకుడిగా, ఒక సౌకర్యకర్తగా ఉండాలి.

బోధనా ప్రక్రియలో సాంప్రదాయ ఉపాధ్యాయుని శైలి:-
→ ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండి బోధనాంశమునకు ప్రాధాన్యత ఇస్తాడు.
→ బోధనా అంశమును ఉపన్యాసపద్ధతిలో అందిస్తాడు. సామూహిక బోధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వైయక్తిక భేదాలను విస్మరిస్తాడు.
→ పరస్పర బోధనకు, సహకార బోధనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వదు.
→ విద్యార్థుల్లోని జ్ఞానంను వెలికి తీయకుండా, తనకు తెలిసిన విషయమును వారి మెదడులో నించటానికి ప్రయత్నం చేస్తాడు.
→ ఉపాధ్యాయుని క్రియాత్మక భాగస్వామ్యం ఉంటుందే కాని విద్యార్థుల క్రియాత్మక భాగస్వామ్యం ఉండదు.
→ విద్యార్థి అభ్యసనంలో వినటం, జ్ఞప్తికి తెచ్చుకోవటంకు ప్రాధాన్యత ఇస్తాడు.
→ అభ్యాసకుల ప్రజ్ఞను, సామర్థ్యాలను, నైపుణ్యాలను ఏ మాత్రం పట్టించుకోడు.

బోధనా ప్రక్రియలో సంధానకర్తగా, సౌకర్యకర్తగా ఉపాధ్యాయుని శైలి :-
→ విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడుట.
→ విద్యార్థులతో స్నేహపూర్వకంగా, ఉత్సుకతతో ఉండి వారిని జాగ్రత్తగా చూచుకొనుట.
→ ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా పట్టించుకొనుట, అనుచిత ప్రవర్తనలను పట్టించుకోకుండా మంచి ప్రవర్తనను పొగుడుట.
→ పొందికయిన ప్రవర్తనకు తగిన మార్గదర్శకత్వం అందించుట.
→ విద్యార్ధుల జ్ఞానమును, నేపథ్యంగా తీసుకొని వైయక్తిక బేధములకు తగిన ప్రాధాన్యత ఇచ్చుట.
→ విద్యార్థుల స్థాయికి తగిన కృత్యములను కల్పించుట.
→ విద్యార్థులందరికి ఒకే సాధారణ బోధనా పద్ధతిలో కాకుండా వైయక్తిక భేదాలకు అనుగుణంగా తగిన బోధనా పద్ధతులను ఎంపిక చేసుకొని అభ్యసన కృత్యాలు ఏర్పాటు చేయుట.
→ విద్యార్థులలోని అన్వేషణా నైపుణ్యాలను వెలికితీయుట,
→ విద్యార్థుల క్రియాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుట.
→ చర్చించటం, అన్వేషించటం, ప్రాజెక్టులు ఇవ్వటం, కృత్యాలు కల్పించటం ద్వారా విద్యార్థులలో స్వయం అభ్యసనం జరిగేట్లు చూచుట.
→ విద్యార్థులలో ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, పనిపై గౌరవము, స్వీయ సంతృప్తి, స్వయం పరిశోధన, స్వీయ జ్ఞానమును పెంపొందించుట.
→ పరస్పర బోధనకు, సహకార బోధనకు ప్రాధాన్యత ఇచ్చుట.
→ తరగతి గదిలోనే కాకుండా ఇతర పరిసరాలలో కూడా అభ్యసనా అనుభవాలు కల్పించుట.
→ స్వీయ అనుభవాల ద్వారా విద్యార్థులే స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకొనేట్లు చూచుట.
→ కావలసిన సమాచారమునకు సంబంధించి ప్రశ్నలు అడిగేట్లుగా విద్యార్థులను ప్రోత్సహించుట.
→ బోధనా అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు ఉపాయాలు, అంతర్దృష్టి, సృజనాత్మకతకు తగిన అవకాశాలు కల్పించుట
→ ఈ విధంగా ఉపాధ్యాయుడు ఒక సౌకర్యకర్తగా ఉండి విద్యార్థులందరిని అభ్యసనా ప్రక్రియలో పాల్గొనేటట్లు చేసి అభ్యసనకు అవసరమయిన అన్ని సౌకర్యాలను కల్పించటం ద్వారా ప్రభావవంతమయిన బోధన అభ్యసనకు దోహదం చేయాలి.

ఉపాధ్యాయుని సాధారణ మరియు విషయ సంబంధ నైపుణ్యాలు

1. వ్యక్తిగత నైపుణ్యాలు:-
సంక్లిష్ట ఆలోచన, సృజనాత్మక ఆలోచన, భావ ప్రసారము, సహజ సామర్థ్యము, బోధనాభిరుచి, సమస్యా పరిష్కార శక్తి, తార్కిక వివేచన, అవధానం, కల్పనాశక్తి, నాయకత్వము, సరియైన వైఖరులు, అమూర్త ప్రజ్ఞ మొదలగునవి వ్యక్తిగత నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు.

ప్రణాళికా నైపుణ్యాలు :
బోధన అనేది ఒక ప్రణాళికాబద్ధమయిన కృత్యము కనుక
→ కాలక్రమ పట్టిక తయారుచేసుకొనుట,
→ వార్షిక పథకములను తయారుచేసుకొనుట
→ పాఠ్య పథకములను ముందే తయారుచేసుకొనుట
→ తగిన బోధనోపకరణములను ఎంపిక చేసుకొని వాటిని స్వయంగా రూపొందించుకొనుట
→ తరగతిగది నిర్వహణలో భాగంగా సమయమును పూర్తిగా సద్వినియోగం చేసుకొనుటకు ప్రణాళికలు రచించుట.
→ సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణకు మరియు పరీక్షల నిర్వహణకు తగిన షెడ్యూల్స్ను నిర్ణయించుట మరియు వాటిని ఖచ్చితంగా అమలుచేయుట మొదలగునవి ప్రణాళికా నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు.

బోధనా నైపుణ్యాలు :
→ బోధనా లక్ష్యములను నిర్ణయించుకొనుట
→ సరి అయిన బోధనా పద్ధతిని ఎంచుకొనుట
→ విద్యార్థులలో సబ్జెక్టుపట్ల ధనాత్మక వైఖరిని, తగిన ప్రేరణను కల్గించుట
→ వైయక్తిక భేదాలకు అనుగుణంగా సరికొత్త బోధనా వ్యూహాలు అమలు చేయుట
→ నల్లబల్లను, బోధనోపకరణములను తగిన సమయంలో, తగిన విధంగా ఉపయోగించుట.
→ తరగతి గది ఉదాహరణలతో పాఠ్యాంశమును బోధించుట
→ సరళమైన పదజాలంను ఉపయోగిస్తూ అందరికీ అర్థమయ్యేట్లు విషయమును వివరించుట.
→ అభ్యాసకులు క్రియాత్మకంగా ఉండే విధంగా అభ్యసనా కృత్యాలు, అభ్యసనా అనుభవాలు ప్రవేశపెట్టుట.
→ మూల్యాంకనా సాధనములను తగిన విధంగా ఉపయోగించుట
→ వైయక్తిక, సామూహిక అభ్యసనములు రెండింటికి తగిన ప్రాధాన్యమిచ్చుట.
→ తన సబ్జక్టు పట్ల విద్యార్థులందరికి అభిరుచి కలిగే విధంగా బోధించుట మొ॥వి బోధనా నైపుణ్యాలుగా పేర్కొంటారు.

కమ్యూనికేషన్ నైపుణ్యాలు / నాయకత్వ నైపుణ్యాలు / భాగస్వామ్య నైపుణ్యాలు:-
→ ఓర్పు, సహకారం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, సందేహాలు తీర్చటం, ప్రజాస్వామ్య వైఖరి, సంభాషణా నైపుణ్యాలు, హాస్య చతురత మొదలగునవి కలిగి ఉండుట
→ విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తూ సరి అయిన సమాచారమును వారికి అందించుట. పాఠశాలకు, గృహానికి మధ్య సామరస్యపూరిత సంబంధములను ఏర్పాటు చేయుట.
→ సామూహిక కృత్యాల ద్వారా, భాగస్వామ్య కృత్యాల ద్వారా విద్యార్థులలో సామూహిక భావనను, సాంఘిక నైపుణ్యాలను అభివృద్ధి
→ సెమినార్లు, వక్తృత్వ పోటీలు, క్విజలు నిర్వహించుట.
→ సమాజ సేవలో స్వయంగా తాను పాల్గొని, విద్యార్థులను అందులో భాగస్వామ్యులను చేయుట,
→ తన అనుభవాలను, జ్ఞానమును సమకాలికులతో పంచుకొనుట, చర్చల్లో పాల్గొనుట, వారితో మంచి సంబంధాలు కలిగి ఉండుట.
→ విద్యార్థులందరికి తగిన మార్గదర్శకత్వం అందిస్తూ వారి సమస్యలను తీర్చుట. మొ॥వి కమ్యూనికేషన్ నైపుణ్యాలుగా పేర్కొంటారు.

2. విషయ సంబంధ నైపుణ్యాలు :-
→ ఉపాధ్యాయుడు మంచి విషయ పరిజ్ఞానమును కలిగి ఉండాలి. subject కు సంబంధించిన పరిజ్ఞానంతోపాటు ప్రస్తుత ప్రాపంచిక జ్ఞానమును కూడా కలిగి ఉండటం
→ విషయ సమాచార ప్రసారం విద్యార్థులలో ఆసక్తి కలిగించేదిగా, అన్వేషణను సూచించేదిగా ఉండటం.
→ ఆధునిక బోధన- అభ్యసన పద్ధతులు పరిజ్ఞానం నిత్యము పొందుతున్నవాడై ఉండటం.
→ తన పరిధిని ఎప్పటికప్పుడు నిరంతర అభ్యాసకుడిలా ఉండట
→ సబ్జెక్టుకు సంబంధించిన కాలానుగుణమైన మార్పులను, ఇతర సమాచారమును స్వయం పరిశోధనల ద్వారా, పత్రికల ద్వారా, జర్నల్స్ ద్వారా ఇతర అనుబంధ గ్రంథాల ద్వారా టీచర్స్ ట్రైనింగ్స్ ద్వారా సెమినార్లు, చర్చలు, వర్క్షాప్లో పాల్గొనటం ద్వారా అప్డేట్ చేసుకుంటూ ఉండటం.
→ అవసరమైన సాంకేతిక సహాయ నైపుణ్యములను నేర్చుకొని ఉపయోగిస్తూ ఉండటం. (ఉదా : అవసరమైనచోట ఇంటర్నెట్ను ఉపయోగించుట) మొ||వి విషయ సంబంధ నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు.