అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




బోధన ఒక ప్రణాళికాబద్ధమైన కృత్యము -బోధన ప్రణాళిక యొక్క మూలకాలు


→ బోధన ప్రణాళిక అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకము. - LB. స్టాండ్
→ ఉపాధ్యాయుల అందరికోసం బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి.
→ ఎంత విషయ పరిజ్ఞానం వున్న ఉపాధ్యాయుడైన సరైన బోధనా ప్రణాళిక లేకపోతే విజయవంతం కాలేడు. బోధన ఫలప్రదం కావాలంటే చక్కని ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకం ఆధారంగా, ప్రణాళికాబద్ధంగా, బోధనా అభ్యసన ప్రక్రియలను అనుసరించినప్పుడే ఆశించిన ఫలితాలను ఉపాధ్యాయుడు సాధించగలడు. ఇందుకోసం ప్రతి పాఠ్యాంశానికి బోధనా ప్రణాళికను సిద్ధం చేసుకొని పాఠ్యబోధన జరపాలి.
→ ప్రతి సబ్జెక్టులో ఒక విద్యా సంవత్సర కాలంలో ఒక తరగతికి బోధించాల్సిన విషయాన్ని (సబ్జెక్ట్), సాధించాల్సిన లక్ష్యాలను దృష్టిలో వుంచుకొని రూపొందించే పథకమే వార్షిక పథకము. దీనిని సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభములో తయారు చేసుకుంటాడు. ప్రణాళికీకృత బోధనలో ఇది మొదటిమెట్టుగా చెప్పుకోవచ్చు. రెండవ మెట్టుగా యూనిట్ ప్రణాళికను చెప్పుకోవచ్చు. యూనిట్ అనగా దగ్గర సంబంధం కలిగిన కొన్ని పాఠ్యాంశాల సమ్మేళనం ఒక యూనిట్ అనేది వరుసగా వారం, పది రోజులలో బోధించబడేదిగా ఉంటుంది. ఇక మూడవ మెట్టు పాఠ్య ప్రణాళిక (Lesson Plan)గా చెప్పుకోవచ్చు. ఇది ఏ పీరియడ్ ఏమి బోధించాలి ? ఎలా బోధించాలి ? అనే ఉపాధ్యాయ బోధనా ప్రణాళికను తెలియజేస్తుంది.
→ సమీప భవిష్యత్ ఉపాధ్యాయుడు జరుపబోయే చర్య కొరకు రూపొందించబడ్డ పథకాన్ని పాఠ్యపథకం అంటారు. పాఠ్యపథకం అనేది బోధనా ప్రణాళిక యొక్క కార్యాచరణ ప్రణాళిక.
→ పాఠ్యపథకమును కొన్ని లక్ష్యాలను సాధించే దిశగా ఉపాధ్యాయుడు తయారుచేసుకోవాలి.
→ లక్ష్యాల ఆధారంగా విద్యార్థులకు కల్పించే అభ్యసనా అనుభవాల ద్వారా వారిలో కోరుకున్న ప్రవర్తనా మార్పులు తీసుకురావటమే పాఠ్య ప్రణాళిక యొక్క ముఖ్యమైన విధిగా చెప్పుకోవచ్చు.

బోధనా ప్రణాళిక ప్రధానంగా :-
→ ఉపాధ్యాయుని యొక్క తాత్విక దృక్పథం, అంకితభావం మీద
→ బోధించాల్సిన విషయం గురించి ఉపాధ్యాయునకున్న పరిజ్ఞానం మీద
→తరగతిలోని వివిధ స్థాయి విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి ఉపాధ్యాయునికున్న అవగాహన మీద.
→ అన్నింటికన్నా వృత్తిపూర్వక శిక్షణ ద్వారా పొందిన బోధనా పద్ధతుల వినియోగం మీద ఆధారపడి ఉంటుంది.

మంచి బోధనా ప్రణాళికకు ఉండవలసిన లక్షణములు :-
→ బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు స్పష్టంగా నిర్దేశించబడి ఉంటాయి.
→ పాఠ్యాంశములోని అంశములన్నీ సరళమైన ఉదాహరణలతో క్రమబద్ధంగా అమర్చబడి ఉంటాయి.
→ పూర్వజ్ఞానంను ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానించగలిగేట్లు ఉంటుంది.
→ అందుబాటులో లభించే బోధనోపకరణములను మాత్రమే ఉపయోగించుకోగలిగేట్లు ఉంటుంది.
→ బోధనాంశములకు సంబంధించిన తగిన కృత్యాలను, సామాగ్రిని స్పష్టంగా సూచిస్తుంది.
→ ఏఏ అంశములను నల్లబల్లపై రాయాలో నిర్దేశించబడి ఉంటుంది.
→ తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని ఉంటుంది.
→ ఈ ఆశించిన లక్ష్యాలను సాధించారో లేదో తెలుసుకొనుటకు తగిన మూల్యాంకనా సాధనములను కలిగి ఉంటుంది.

బోధనా ప్రణాళిక తయారుచేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశములు :-
→ పాఠ్యాంశము ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు,
→ పాఠ్యాంశములోని బోధనాంశాలు, కృత్యాలు,
→ పిల్లల స్థాయి.
→ తరగతిలోని పిల్లల సంఖ్య
→ బోధనాసమయం - ఉపాధ్యాయుడు ఆ తరగతికి కేటాయించగలిగిన సమయం.
→ అందుబాటులో ఉన్న అభ్యసనా సామాగ్రి.
→ అదనంగా రూపొందించుకున్న కృత్యాలు, వాటికి అవసరమైన సామాగ్రి సేకరణ.
→ అందుబాటులో ఉన్న తరగతి గది స్థలం, వాతావరణం.
→ పిల్లలు సొంతంగా నేర్చుకోవటానికి అనుకూలంగా ఉండటం.
→ పిల్లల స్థాయిని సామర్థ్యాల ఆధారంగా మూల్యాంకనం చేయటం.

బోధనా ప్రణాళికా మూలకాలు:-
→ బోధనా ప్రక్రియ నిర్మాణాత్మకం నిర్వహణలో పాలుపంచుకొనే వాటినే బోధనా మూలకాలు అంటారు. అవి:
1) బోధకుడు / ఉపాధ్యాయుడు
2) అభ్యాసకుడు / విద్యార్థి
3) పాఠ్యగ్రంథము
4) పాఠ్య పథకము / ప్రణాళిక
5) బోధనోపకరణములు
6) ఇతర అనుబంధ సామాగ్రి
7) మూల్యాంకనా సాధనములు

ప్రణాళికాబద్ధమయిన పాఠ్యపథకం (బోధన) వలన ఉపాధ్యాయుడు:-
→ ప్రణాళికాబద్ధమైన బోధన యొక్క కార్యాచరణ ప్రణాళిక, 'పాఠ్యపథకము'గా చెప్పుకోవచ్చు.
పాఠ్యపథకం వలన ఉపాధ్యాయునకు కలుగు ప్రయోజనాలు :
→ మూడు రంగాలకు చెందిన లక్ష్యములను నిర్దేశించుకోగలడు.
→ లక్ష్యములకు చెందిన స్పష్టీకరణములను ముందుగానే నిర్ధారించుకోగలడు. వీని ద్వారా చెప్పదలచుకున్న నుండి ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులను చేరుకొనుటకు వీలు కలుగుతుంది.
→ సమయమును చక్కగా, పూర్తిగా బోధనకే సద్వినియోగం చేసుకోగలడు.

పాఠము ద్వారా విద్యార్థి :-
→ తగిన విధముగా, తగిన సమయంలో బోధనా సామాగ్రిని ఉపయోగిస్తూ బోధన చేస్తూ విద్యార్థులందరిని చక్కగా ఆకర్షించగలడు.
→ విద్యార్థుల నుండి ఆశించిన ప్రవర్తనా మార్పుల (మూల్యాంకనం) ద్వారా తన బోధనకు సంబంధించి స్వీయ మూల్యాంకన చేసుకోగలడు.
→ సరి అయిన ప్రణాళిక ద్వారా బహుళ తరగతి బోధనకు పరిష్కారం లభిస్తుంది.
→ పిల్లల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, దానికనుగుణంగా అభ్యసనా అనుభవాలు కల్పించటానికి వీలు కలుగుతుంది.
→ పిల్లల పాఠశాల సమయాన్నంతా బోధనాభ్యసన కార్యక్రమంలో నిమగ్నం చేయడానికి అవసరమయిన కృత్యాలను పొందుపరుచుకోవటానికి వీలు కలుగుతుంది.
→ పిల్లలు వ్యక్తిగత జట్లుగా పనిచేయటానికి వీలు కలుగుతుంది.
→ పాఠశాల గ్రంథాలయం, లేబరేటరీ మొదలగు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
→ అంతిమంగా పాఠ్యపథకం రూపొందించుకొనుట ద్వారా విద్యార్థుల నుండి సకాలంలో సరి అయిన సామర్ధ్యాలు సులభంగా సాధించటానికి వీలు కలుగుతుంది. కోరుకున్న ప్రవర్తనా మార్పులను సాధించటం సులభతరం అవుతుంది.

పాఠ్య పథకంలో సోపానాలు :-
→ పిల్లలు నేర్చుకొనే సహజమైన విధానానికి కొనసాగింపుగా తరగతి గది అభ్యసనా అనుభవాలు ఉండాలి. ఒక సామర్థ్యాన్ని సాధించాలంటే క్రమబద్ధమయిన ప్రణాళిక అవసరం.
ఉదా : ఒక విద్యార్థి పలక అనుపదమును గుర్తించటం, చదవటం చేయగలిగినంత మాత్రాన సామర్థ్యం సాధించినట్లు కాదు. 'పలక' అనే పదంలోని ప్రతి అక్షరాన్ని విభిన్న సందర్భాలలో గుర్తించటం వాటి ఆధారంగా నూతన పదాల నిర్మాణం చేయగలగటం వాటిని చదవగలిగి, రాయగలిగినపుడు మాత్రమే సామర్ధ్యం సాధించినట్లు అవుతుంది. దీనినిబట్టి నైపుణ్యం కలిగిన జ్ఞానాన్ని సామర్థ్యంగా గుర్తించాలి. దీనిని సాధించటం కోసం పాఠ్య ప్రణాళికలోని సోపానాలను తెలుసుకోవటం అవసరం.

→ పాఠ్యపథక రచనలో ఆరు రకాలయిన వివిధ దశలను జర్మనీ దేశానికి చెందిన విద్యావేత్త హెర్బార్డ్స్పన్సర్ వివరించారు. అవి వరుసగా
1) సన్నాహము (Preparation)
2) ప్రదర్శించటం (Presentation)
3) సంసర్గము (Association)
4) సాధారణీకరణము (Generalisation)
5) అన్వయము (Application)
6) పునర్విమర్శ (Recaptulation)

సన్నాహము : విద్యార్థులను కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధపరచాలి. ఇది విద్యార్థుల పూర్వజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ప్రేరణ కలిగించే ప్రశ్నలు అడగటం ద్వారా విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవటానికి సిద్ధపడతారు.

ప్రదర్శించటం : తగిన బోధనా పద్ధతులనుపయోగించి, తగిన బోధనోపకరణములతో పాఠ్యాంశాన్ని బోధించటం జరుగుతుంది. రాయతగిన అంశాలు బోర్డుపై రాయటం జరుగుతుంది.

సంసర్గము : ఉపాధ్యాయుడు బోధించిన పాఠంలోని కొత్త భావనలను దాని పాత భావనలనతో పోల్చుతారు. ఈ దశలో విద్యార్థులు పాత, కొత్త భావనల కలయికతో ఒక కొత్త జ్ఞానాన్ని పొందుతాడు.

సాధారణీకరణం : కొత్తగా ఏర్పడిన భావనల ద్వారా పాఠానికి సంబంధించి సామాన్య సూత్రాలు ఏర్పరచబడతాయి. ఈ సూత్రాలు భావనలు విద్యార్థులు వినియోగించుకోవటానికి వీలుగా ఉంటాయి.

అన్వయం: విద్యార్థులు సాధారణీకరించిన సూత్రములను కొత్త పరిస్థితులలో వినియోగించి చూస్తారు. ఇలా చేయటం వలన రూపొందించబడిన సూత్రాల యొక్క నిబద్దత తేలిపోతుంది.

పునర్విమర్శ:ఈ చివరి దశలో విద్యార్థులు ఏం నేర్చుకున్నారనే విషయం పరీక్షించబడుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఎంటే నేర్చుకున్నారు అనే దానితోపాటు బోధన సఫలమయ్యిందా లేదా అనేది తేలిపోతుంది.