అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అభ్యసనా నిర్వహణ యొక్క రూప భేదములు


→ అభ్యసనా నిర్వహణ అనేది ప్రధానంగా మూడు కేంద్రములుగా జరుగుతూ ఉంటుంది. అవి:
1) విషయ కేంద్రిత అభ్యసన
2) ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం
3) అభ్యాసక కేంద్రిత అభ్యసన
→ ప్రాథమిక, సెకండరీ విద్యా స్థాయిల్లో అభ్యాస కేంద్రీకృత అభ్యసనా నిర్వహణా విధానాలను ఉపయోగిస్తుంటే, ఉన్నతస్థాయి అభ్యసనము మాత్రము విషయ కేంద్రిత అభ్యసనముగా కొనసాగుతుంది. మనోవిజ్ఞానం ప్రకారం పై మూడింటిలోను అభ్యాసక కేంద్రీకృత (శిశు కేంద్రీకృతం)గా జరిగే అభ్యసనంను ఉత్తమమైన అభ్యసనంగా చెప్పుకోవచ్చు.

విషయ కేంద్రీకృత అభ్యసనం:
→ దీనికి మరియొక పేరు పాఠ్య ప్రణాళికా కేంద్రీకృత బోధన.
→ ఇది బోధించవలసిన / అభ్యసించవలసిన విషయానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.
→ అభ్యాసకుడు తనకవసరమయిన విషయమును సంపూర్తిగా నేర్చుకోగలడు.
→ ఉపాధ్యాయ శిక్షణ పొందనివారికి కూడా ఈ కరిక్యులంను బోధించటం సులభం.
→ వివిధ విషయములకు సంబంధించి సంపూర్తి సమాచారమును అందిస్తుంది.
→ పై స్థాయి కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు, పోటీ పరీక్షలకు ఉద్దేశించి తయారుచేసిన పాఠ్యగ్రంథములు విషయ కేంద్రీకృత అభ్యసనకు అనువుగా ఉంటాయి. ఉదా : LAW, MBBS, M.Ed. మొ॥వి.
→ అభ్యసనలో బోధకుడికి, అభ్యాసకుడికి అంతగా ప్రాధాన్యం ఇవ్వదు.
→ బోధకుడు, అభ్యాసకుడు ఇద్దరూ కూడ అంత క్రియాత్మకంగా ఉండలేరు.
→ విద్యార్థుల్లోని వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకోదు. అందరికీ ఒకే విషయాన్ని అందిస్తుంది.
→ అవగాహనకు, అన్వయంకు ప్రాధాన్యత లేకుండా జ్ఞానానికి, జ్ఞాపకశక్తికి ప్రాధాన్యతనిస్తుంది. అనగా ఇక్కడ జ్ఞాన కుమ్మరింపు (knowledge dumping) జరుగుతుంది.

విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం విషయ కేంద్రీకృత ప్రణాళిక ఎందుకు ప్రధానమైనదంటే:-
1) సాధారణంగా పాఠ్యగ్రంథములు, ఇతర బోధనా సామాగ్రి విషయాధారంగానే రూపొందించబడి ఉండుట.
2) ఉపాధ్యాయులు కూడా విషయ నిపుణులుగానే శిక్షణ పొందుతుండుట.
3) అభ్యసనా నిర్వహణకు, విశ్లేషణకు అనువుగా విషయములన్నీ ఒక క్రమ పద్ధతిలో, తార్కిక పద్ధతిలో పాఠ్యగ్రంథములో అమరియుండుట,
4) విధమైన విషయ నిర్వహణ అభ్యాసకులకు భవిష్యత్తులో సమాచారమును ఉపయోగించుకొనుటకు సులభంగా ఉండుట.

ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనము:-
→ ఇది పూర్వకాలం నుండి వస్తూ ఉన్న సాంప్రదాయ విధానం.
→ ఈ అభ్యసనా నిర్వహణ అంతా ఉపాధ్యాయుని కనుసన్నలలో జరుగుతూ ఉపాధ్యాయునికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఉపాధ్యాయుడు ఒక నిర్దేశకుడిలా వ్యవహరిస్తుంటాడు.
→ ఉపాధ్యాయుడు మాట్లాడుతుంటాడు. ప్రదర్శిస్తూ ఉంటాడు. బోర్డుపై రాస్తూ ఉంటాడు. విద్యార్థులు వింటూ, చూస్తూ, నోట్స్ రాసుకుంటూ ఉంటారు.
→ ఉపాధ్యాయుడే క్రియాశీలకంగా ఉంటాడు. అభ్యాసకులు నిష్క్రియాత్మకంగా ఉంటూ ఉపాధ్యాయుడు నిర్దేశించిన, కృత్యములను మాత్రమే చేస్తూ ఉంటారు.
→ విషయాల ఎంపిక, వివరణ అంతా ఉపాధ్యాయుని ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉంటుంది.
→ ఈ విధానంలో పిల్లల్లోని జ్ఞానమును వెలికితీయటం కాకుండా జ్ఞానంను నింపటం జరుగుతుంది.
→ భాగస్వామ్య అభ్యసనము, సమూహ అభ్యసనమునకు ప్రాధాన్యత ఉండదు. దానివలన ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య అలాగే విద్యార్థి, విద్యార్థి మధ్య సహకార అభ్యసనం జరుగదు.
→ స్వీయ మూల్యాంకనమునకు అవకాశం ఉండక కేవలం ఉపాధ్యాయుని మూల్యాంకనం మాత్రమే ఉంటుంది.
→ ఇది కూడా వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వదు. అందరికీ నిర్దేశించిన ఒకే బోధనా పద్ధతి, ఒకే అభ్యసనా అనుభవాలు కల్పించబడతాయి.
→ ఉపన్యాస బోధన, ఉపన్యాస ప్రదర్శనా బోధనలు ఉపాధ్యాయకేంద్రిత బోధన / అభ్యసనమునకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

విద్యార్థి కేంద్రీకృత / అభ్యాసక కేంద్రీకృత అభ్యసనము :-
→ ప్రస్తుత ప్రాథమిక, సెకండరీ విద్యా విధానము అంతా శిశు కేంద్రీకృతమైనది. పాఠ్య ప్రణాళికలో విద్యార్థి జ్ఞానంను ఆర్జించుటకు, అవగాహన చేసుకొనుటకు, నిత్య జీవితములో నేర్చుకున్న జ్ఞానమును అన్వయించుటకు, అభ్యాసకుడే స్వయముగా కృత్యములు చేసి స్వీయ జ్ఞానం పొందుటకు అనేక అభ్యసనా అనుభవాలను అందించేదే శిశుకేంద్రీకృత అభ్యసనం.
→ ఈ విధానంలో అభ్యాసకుడు క్రియాత్మక పాత్రను పోషిస్తాడు.
→ ఉపాధ్యాయుడు సాంప్రదాయక బోధకుడుగాకాక సంధానకర్తగా, సౌకర్యకర్తగా వ్యవహరిస్తాడు. ఉపాధ్యాయుని యొక్క ప్రతిచర్యలో అభ్యాసకుని సంబద్ధత ఉంటుంది.
→ ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య పరస్పర చర్యల ద్వారా, అలాగే విద్యార్థులు, విద్యార్థుల మధ్య సహకారము ద్వారా అభ్యసనము జరుగుతుంది.
→ వైయక్తిక భేదాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది.
→ విషయములను, కృత్యములను ఎన్నుకొని అభ్యసించుటకు అభ్యాసకునికి స్వేచ్ఛ ఉంటుంది.
→ ఉపాధ్యాయ మూల్యాంకనము మరియు స్వీయ మూల్యాంకనము రెండూ ఉంటాయి.
→ ఈ విధానము విద్యార్థిని ఉత్సాహంగా ఉంచుతూ విద్యార్థిలోని జ్ఞానమును వెలికితీస్తూ అతడిని ఒక అన్వేషకుడిగా, సమస్యా పరిష్కారకర్తగా ప్రయోగ నిర్వాహకుడిగా, స్వయం అభ్యాసకుడిగా తీర్చిదిద్దుతుంది.

బ్రూనర్ బోధన సిద్ధాంతం (లేదా) బ్రూనర్ శిక్షణా సిద్ధాంతము

→ అమెరికాకు చెందిన జెరోమ్ బ్రూనర్ సంజ్ఞానాత్మక గెస్టాల్ట్ వాది. వీరు హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు.
→ ఏ అంశం మూలసూత్రాలైనా, ఏ వయసులో వారికైనా ఏదో ఒకరూపంలో బోధించవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా 'జెరోమ్ బ్రూనర్ అనే మనస్తత్వవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ శిక్షణా సిద్ధాంతం. విషయం అభ్యసించడానికి బ్రూనర్ ప్రకారం పరిపక్వతతో పనిలేదు.
→ బ్రూనర్ బోధనా సిద్ధాంతం' (లేదా) బ్రూనర్ శిక్షణా సిద్ధాంతము ప్రకారము విద్యార్థిలో ఆసక్తి, కుతూహలం ప్రధాన అంశాలు. ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తూ, సలహా పూర్వకమయిన పాత్రను మాత్రమే స్వీకరించాలి. విద్యార్థి స్వయంగా నేర్చుకోవటం జరుగుతుంది. కనుకనే బ్రూనర్ సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనము / అన్వేషణా అభ్యసనం అని కూడా అంటారు.
→ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంపాదించాలంటే ఏ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలో బ్రూనర్ తన సిద్ధాంతములో వివరంగా తెలియజేశాడు.

బ్రూనర్ బోధన సిద్ధాంతంలో ముఖ్యాంశాలు:-
→ అభ్యసన సరళంగా (Simple), అన్వేషణాత్మకంగా ఉండాలి.
→ అభ్యసన అంశం, ప్రాథమిక కీలక భావనలు (Fundmental key concepts) పలురీతిలో విద్యార్థికి పరిచయం కావాలి.
→ ఉపాధ్యాయుని పాత్ర సాధ్యమైనంత తక్కువగా ఉండి, అభ్యాసకునికే అభ్యసన ప్రక్రియలో ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి.
→ శిశువు పెరుగుదల మూడు దశలలో జరుగుతుందని, అతను అభ్యసించవలసిన అంశాలు దశలవారీగా ప్రవేశపెట్టాలని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు.
→ అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని వివిధ దశలలో మూడు క్రమశ్రేణి పద్ధతులలో అందించాలి.
అవి: 1. నటనా పద్ధతి (Enactive Method),
2. చిత్రపట పద్ధతి (Iconic Method),
3. ప్రతీకాత్మక పద్ధతి (Symbolic Method).
→ బోధన జరిపే క్రమంలో ప్రాథమిక స్థాయిలో ఆటపాటలకు ప్రాధాన్యం ఇచ్చి ఏ విషయాన్నైనా నాటకీకరణ, అభినయాలతో కృత్యాధారంగా బోధించాలని బ్రూనర్ అభిప్రాయం. ప్రోబెల్ కిండర్ గార్డెన్ విద్యావిధానాలు, గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్య వీటికి ఉదాహరణలు. తో కొద్ది వయసు వచ్చిన తరువాత బోధనోపకరణాలను అంటే నమూనాలను, గ్లోబ్, మ్యాచ్లను, ఛార్టులను ఉపయోగించి బోధన జరపాలి. దీనినే చిత్రపటాల పద్ధతి అంటారు.
→ పై తరగతులు చదివే వయస్సు వచ్చిన దశలో చిహ్నాలు, సూత్రాలు, నేర్చిన విషయాల ఆధారంగా నూతన సన్నివేశాలలో అన్వయించి అభ్యసన జరపాలి. దానికి తగిన విధంగా బోధన జరగాలి. ఇది భాషాభివృద్ధికి సహకరించే దశ. దీనినే ప్రతికాత్మక పద్ధతి లేదా సంకేత
→ బ్రూనర్ సిద్ధాంతములో నాలుగు అంశములకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అవి: 1. సన్నద్ధత, 2. విషయనిర్మాణం, 3. వరుస క్రమం, 4. పునర్బలనం.
→ విద్యార్థుల పూర్వ అనుభవాలకు ఆసక్తులకు అనుగుణంగా బోధించుట ద్వారా వారిలో సన్నద్ధత / సంసిద్ధతను పెంపొందించవచ్చు.
→ విషయాన్ని సరళము నుండి క్లిష్టతకు అమర్చాలి. అలాగే తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అమర్చి బోధించటాన్నే విషయ నిర్మాణంగా చెప్పుకోవచ్చు.
→ విషయాన్ని క్లిష్టత, తార్కికత ఆధారంగా అమర్చి బోధించాలనేదే వరుసక్రమంగా చెప్పుకోవాలి.
→ విద్యార్థిలో నేర్చుకోవాలి అనే భావన బలంగా ఉండాలంటే అంతర్గత ప్రేరణ / స్వీయ ప్రేరణనే తగిన పునర్బలనంగా ఉపయోగించాలి.
→ బ్రూనర్ అంతర్గత ప్రేరణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఉత్సుకత, పరిణతి, సమస్యా పరిష్కారం వల్ల కలిగిన తృప్తి అంతర్గత ప్రేరణలుగా పనిచేస్తాయని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు.
→ ప్రేరణను కలిగించడం (Creating Motivation), అదే ప్రేరణ కొనసాగేట్లు చేయడం. అధిక ప్రేరణ ఏర్పడేలా చేయడం. ఇవి అభ్యసన ప్రక్రియను సులభతరంగా జరిగేట్లు తోడ్పడతాయి.
→ శక్తికి మించిన పనులను చేయించి పిల్లల్లో క్రియాశీలత శక్తి సన్నగిల్లిపోనియక వారి శక్తి సామర్థ్యాలను తగిన రీతిలో సాధించగలిగిన లక్ష్యాలను మాత్రమే చేరుకునేలా చేయాలి.
→ లక్ష్యశిఖరిపై తన అడుగులు పడినప్పుడే పండుగ' అనే భావన పిల్లలో కలిగేలా చేయాలి.
→ అభ్యసనాంశాలను పరుసక్రమంలో అమర్చి, తన స్వంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయజ్ఞానాన్ని పొందేలా చేసినట్లయితే, తను అభ్యసించిన జ్ఞానం ఎక్కువ కాలం ధారణలో (Retention) ఉంటుంది. దీన్నే బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం (Discovery Learning) అన్నారు.

బ్రూనర్ శిక్షణా సిద్ధాంతం లక్షణాలు

→ కొత్త సమాచారంలోని మౌలిక అంశాలను పటిష్టంగా వ్యవస్థీకరించడం.
→ బోధించే విషయానికి ఎన్నో ఉదాహరణలను ఇవ్వటం.
→ కోడ్ విధానాన్ని తయారుచేసుకోవడానికి సహాయపడటం.
→ వివిధ సన్నివేశాలలో, రకరకాల సమస్యలకు నూతనంగా నేర్చుకున్న వాటిని అన్వయించడం.
→ పిల్లలకు సమస్యలనిచ్చి వారినే పరిష్కరించమనడం.
→ వారికి ఏమి స్ఫురించుతుందో ఊహించమని ప్రోత్సాహించడం.

బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం విద్యా అన్వయం

→ ఈ సిద్ధాంతం విద్యను ఎలా నేర్చుకోవాలో తెల్పుతుంది.
→ విద్యార్జనలో బాహ్యప్రేరణ గాక స్వీయ ప్రేరణ అమితంగా లభిస్తుందని తెలియచేస్తుంది.
→ పిల్లల శక్తి సామర్థ్యాల కనుగుణంగా అభ్యసించుటకు సహకరిస్తుంది.
→ తన సమర్ధత గురించి విద్యార్థికి ఒక అవగాహన కల్గిస్తుంది.
→ పిల్లలు వారి అభ్యసనానికి వారే బాధ్యత వహిస్తారు.
→ ఆవిష్కరణ అభ్యసనం జరుగుతుంది కనుక పిల్లలకు బాగా జ్ఞాపకముంటుంది. సొంతమైన జ్ఞానాన్ని కొత్త చోట్ల అన్వయించుకోవడం సులభమవుతుంది.
→ విషయం ఎడల కల్గిన అవగాహన ఆనందాన్ని కలుగజేస్తుంది.
→ బోధనలో సమయానుకూలంగా విద్యార్థులకు పునర్బలనం కలిగించి వారి అభ్యసనను మెరుగుపరచవచ్చు.
→ క్రొత్త విషయాలు నేర్చుకొనుటలో విద్యార్థులకు ప్రేరణ కలిగించి వారిలో ఉత్సాహాన్ని, కుతూహలాన్ని పెంచవచ్చు.
→ ఈ సిద్ధాంతం సాయంతో విద్యార్థులలో సమస్యా పరిష్కార యోగ్యతా పెంచవచ్చు.
→ పాఠ్యవిషయాన్ని విద్యార్థుల మానసిక వికాస దశలకు అనుగుణంగా రూపొందించవచ్చు.
→ విద్యార్థుల్లో అంతర్ దృష్టికి అవకాశమివ్వవచ్చు.
→ విద్యార్థులలో స్వయంకృషిని ప్రోత్సహించవచ్చు.