అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




అసమ సమూహాల తరగతి గది అభ్యసనా నిర్వహణ




→ ఒక తరగతిలోని పిల్లలందరి యొక్క రూపురేఖలలో తేడాలున్నట్లే వారి వారి సామర్థ్యాలలో, అభిరుచులలో, ప్రేరణలో, అభ్యసనములో, ప్రజ్ఞలో, ఆలోచనలో అనేక తేడాలుంటాయి. అనగా ప్రతి విద్యార్థి అన్ని అంశాలలో తన తరగతిలోని ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు ఎంతోకొంత విభేదిస్తాడు అనేది సత్యం. దీనినే వైయుక్తిక భేదం అంటారు. ఇలా భిన్న అభిరుచులు, భిన్న ఆలోచనలు, భిన్నమైన ప్రజ్ఞ, భిన్నమైన అభ్యసనా స్థాయిలు కలిగిన ఈ విద్యార్థుల సమూహమును కలిగి ఉండే తరగతిని అసమ సమూహాల/విజాతి సమూహాల తరగతి గదిగా చెప్పుకోవచ్చు. అనగా అసమ సమూహాల తరగతి గదిలో ఒకరికొకరు భిన్నమయిన అభ్యాసకులు ఉంటారు.
→ ఒకే అభిరుచులు, ఒకే సామర్థ్యాలు, ఒకే ప్రజ్ఞ, ఒకే అభ్యసనాస్థాయిలు కల అభ్యాసకుల సమూహాలను సజాతి సమూహాలు / సమ సమూహాలు (homogeneous groups) అంటారు.
→ భిన్న అభిరుచులు, భిన్న సామర్థ్యాలు, భిన్న ప్రజ్ఞ, భిన్న అభ్యసనా స్థాయిలు కల అభ్యాసకుల సమూహాలను విజాతి సమూహాలు/అసమ సమూహాలు (heterogeneous groups) అంటారు.
→ అభ్యాసకులలో ఈ భిన్నమైన సామర్థ్యాలు, అభిరుచులు ఉండటానికి ప్రధాన కారణం వారి అనువంశికత మరియు సామాజిక, ఆర్థిక స్థితిగతులను కారణంగా చెప్పవచ్చు. కుల, మత, జాతి, భాష, ప్రాంత భేదాలను బట్టి కూడా ఈ వైయక్తిక భేదాలు ఏర్పడతాయి. విద్యార్ధులను మరింత బాగా అర్ధం చేసుకోవటానికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవలసిన అవసరం. ఉంది. ఎందుకంటే సామాజిక, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న విద్యార్థులలో ఆత్మన్యూనత, సర్దుబాటు సమస్యలు, గృహ సమస్యలు పఠన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు తరగతి గదిలో అభ్యసనా అనుభవాలను ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతమైన తరగతి గది నిర్వహణ, అభ్యసనా నిర్వహణ చేపట్టగలగాలి.

అసమ సమూహాల తరగతి గదిలో అభ్యసనకు ఉపాధ్యాయుడు అనుసరించవలసిన వ్యూహాలు :-
→ ప్రతి అభ్యాసకుని యొక్క ప్రొఫైల్ను తయారుచేసుకోవాలి. ఇది ప్రతి అభ్యాసకుడికి సంబంధించి గత, ప్రస్తుత సమాచారమును ఉపాధ్యాయునికి తెలియచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థి బలాలు, బలహీనతలు, సామర్థ్యాలు, అభిరుచులు, ప్రజ్ఞాస్థాయిల గురించి వివరంగా ఈ ప్రొఫైల్లో నిక్షిప్తం చేయాలి.
→ ప్రతి అభ్యాసకుడు ఒక్కొక్క అభ్యసనా వేగములలో అభివృద్ధి చెందుతుంటాడు. ఒకే కృత్యము కొందరికి సులభంగా, కొందరికి కష్టంగా ఉంటుంది. కారణం వారిరువురు రెండు రకాల కుటుంబాల నుండి రెండు రకాల పరిసరాల నుండి రావటమే అని అర్ధం చేసుకోవాలి. దానిలో భాగంగా సామర్థ్యాలు దగ్గరి దగ్గరిగా ఉన్న అభ్యాసకులను కొన్ని సమూహాలుగా ఎంపిక చేయాలి. ఒక్కొక్క సమూహ సామర్ధ్యములకు తగిన కృత్యములను కల్పించి ప్రతి సమూహాము, ప్రతి సభ్యుడు) ఆ కృత్యములలో పాల్గొనేట్లు చూడాలి. ఆ కృత్యములు వారిలో ఛాలెంజ్న పెంచేవిగా ఉండాలి. వారిలో సహకారము, భాగస్వామ్యము, ఒకరినొకరు గౌరవించుకోవటం, వ్యక్తి స్వేచ్ఛ అభివృద్ధి చెందేట్లు కృత్యాలను రూపొందించాలి. సహకార భావమే కాని పోటీతత్వంలేని విద్యార్థి కృత్యాలను ఉద్ఘాటించాలి.
→ అందరికీ ఒకే పాఠ్య పుస్తకం, ఒకే పాఠ్యప్రణాళిక, ఒకే బోధన అనే భావనను తొలగించాలి. ఎందుకనగా వైయక్తిక భేదాలుండే తరగతి గదిలో ఒకే టెస్ట్ బుక్ లోని అంశాలు కొందరికి సులభంగా, కొందరికి కష్టంగా, కొందరికి ఆసక్తిగా, కొందరికి అనాసక్తిగా ఉండవచ్చు. అందువలన విద్యార్థులకు లోప నిదాన పరీక్షలు పెట్టి తద్వారా వారిని వారి ప్రొగ్రెస్ ఆధారంగా నిమ్న, సాధారణ, ఉన్నత సమూహాలుగా ఎంపికచేసి భిన్నమయిన పాఠ్యపుస్తకాలను, మెటీరియల్స్న, భిన్నమైన కృత్యాలను ప్రవేశపెట్టాలి.
నోట్ : NCF-2005 రూడ వైవిధ్యభరితమైన బహుళ పాఠ్యప్రణాళికా పుస్తకాలను ప్రవేశపెట్టాలని సూచించింది.
→ సామాజిక, ఆర్థిక నేపథ్యంలో అభ్యాసకులలో భిన్న వైఖరులు, భిన్న అభిరుచులు, భిన్న సామర్థ్యాలు, భిన్న అభ్యసనా వేగాలు ఉంటాయి. కనుక వారి వైఖరులకు, అభిరుచులకు, సామర్థ్యాలకు, వేగాలకు అనుగుణమైన భిన్న కృత్యాలను కల్పించటం ద్వారా స్వీయ అభ్యసనను ప్రోత్సహించాలి. స్వీయ అభ్యసనా గమనం కోసం అసమజాతి సమూహ విద్యార్థులకు తగిన అభ్యసనా పద్ధతిగా కార్యక్రమయుత అభ్యసనమును ప్రవేశపెట్టవచ్చు.
→ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో, గ్రామీణ ప్రాంతమునకు చెందిన అభ్యాసకులలో ఆత్మన్యూనత, సర్దుబాటు సమస్యలు, భాషా సంబంధ సమస్యలు ఉంటాయి. కనుక వీరిని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతశ్రేణి పట్టణ ప్రాంతం వారితో కలిపి చిన్న చిన్న సమూహాలను ఏర్పాటుచేసి అభ్యసనా కృత్యాలను ప్రవేశపెట్టాలి. వారిలో సామూహిక/సహకార అభ్యసనాన్ని ప్రోత్సహించాలి.
→ మానిటోరియల్ సిస్టంను ప్రవేశపెట్టటం ద్వారా అసమ సమూహాల తరగతి గది నిర్వహణలో అభ్యసనను ప్రభావవంతం చేయవచ్చు. మానిటోరియల్ సిస్టం అనగా ప్రతిభ గల విద్యార్థులతో ప్రజ్ఞ తక్కువగా ఉండే విద్యార్థులకు బోధింపజేయటం.
→ అసమ సమూహాలు గల తరగతి అభ్యసనంలో ప్రధానంగా క్రమశిక్షణను పెంపొందించటం అనేది ఒక ఛాలెంజింగ్ సమస్యగా ఉంటుంది. ఇచ్చిన కృత్యములను తెలివి గలవారు త్వరగా పూర్తిచేస్తే, అభ్యసనలో వెనుకబడి ఉండేవారు కృత్యములను పూర్తిచేయలేక ఆత్మవిశ్వాసమును కోల్పోయి క్రమశిక్షణా రహిత ప్రవర్తనను కనపరుస్తూ వివిధ కుంటుసాకులతో అభ్యసనలో వెనుకబడిపోతారు. అలాంటి తరగతులలో విద్యార్థులలో తెలివి గలవారికి ఛాలెంజింగ్ కృత్యములను కల్పిస్తూ తెలివి తక్కువ వారికి వారి స్థాయికి అనుగుణమైన కృత్యములను కల్పిస్తూ ఇద్దరు తమ కృత్యములను ఒకే సమయానికి పూర్తిచేసేటట్లుగా చూడాలి. ఎవరినీ ఖాళీగా కూర్చోకుండా చూడాలి.
→ ప్రతి విద్యార్ధిని ఒక ప్రత్యేక వ్యక్తిగా అనుకొని వారిలో అవధానము, స్వీయ మూల్యాంకనము, అంతశ్చర్యలు, స్మృతి పెరుగుదలకు, అవసరమయిన ప్రత్యేక విధానాలను ప్రవేశపెట్టి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపటం ద్వారా చక్కని అభ్యసనము జరిగేట్లు చూడాలి.