అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వికాస నియమాలు


→ ప్రతి శిశువు యొక్క వికాసం కొన్ని నియమాలకు లోబడి జరుగుతూ ఉంటుంది. ఆ వికాస నియమాలను క్రింద గమనించవచ్చు.
→ వికాసము అవిచ్ఛిన్నమయినది / నిరంతరమయినది (Principle of Continuous)
→ వికాసము క్రమానుగతమయినది / ఖచ్చిత నమూనాను అవలంభిస్తుంది (Principle of Sequential)
→ అన్ని దశలలో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు / అసమాన వికాస సూత్రం (Principle of non uniform)
→ వికాసము ఒక ఖచ్చితమైన దిశను అనుసరిస్తుంది. వికాసము రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది (Principle of direction)
→ వికాసము సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుంది (Principle of general to particular)
→ వికాసము సంచితమయినది (Principle of cumulative development)
→ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి (Principle of Individual Differences)
→ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు (Principle of Prediction)
→ వికాసము ఒక ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది / వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి (Principle of Development as unified whole)

1. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి:- పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధిలో వైరుధ్యాలుంటాయి.
ఉదా : కొందరు పిల్లలు 9 నెలలకు నడవటం ప్రారంభిస్తే కొందరు 12 నెలలకు నడక ప్రారంభిస్తారు. కొందరిలో మాటలు తొందరగా వస్తే మరికొందరికి ఆలస్యం అవుతూ ఉంటుంది.

2. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది :- వికాసం గర్భస్త శిశువు దశనుండి జీవితపర్యంతం కొనసాగుతూ ఉంటుంది. మొదట ఒక సూక్ష్మకణంతో ప్రారంభమైన మనిషి జీవితం తనిపోయేంతవరకు కూడ అనేక మార్పులు జరిగి కొత్తకణాలు ఏర్పడుతూనే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది.

3. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంభిస్తుంది / వికాసం క్రమానుగతమైనది : వికాసం క్రమానుగతమయినది. వివిధ జాతుల వ్యక్తుల వికాస వేగంలో తేడాలున్నప్పటికి అన్నింటిలో అవి ఒక ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది.
ఉదా: పిల్లల్లో ఎవరిలోనైనా ముందు ప్రాకుట, తరువాత కూర్చొనుట, ఆ తరువాత నిల్చొనుట, నడచుట జరుగును.

4. వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు :-
వికాసం జీవిత పర్యంతం జరిగినా అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. మిగిలిన అన్ని దశల కంటే యవ్వనారంభ దశలో మానసిక పరిణతి. భావోద్వేగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.
ఉదా:- శైశవదశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువగా జరుగుతుంది.

5. వికాసం రెండు నిర్దేశ పోకడలలో ఉంటుంది / వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది:-
వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. దీనినే శిర: పాదాభిముఖ సూత్రం అంటారు.
ఉదా:-శిశువు మొదట తలను నిలిపిన తరువాతనే కూర్చోగలుగుట ఆ తరువాత నిలబడగలుగుట చేస్తాడు. వికాసం దేహమధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. దీనినే సమీప దూరస్థ నియమం అంటారు. ఉదాహరణకు శిశువు ఏదయినా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తరువాతనే మణికట్టును, చేతివేళ్ళను ఉపయోగిస్తాడు.

6. వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది / వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి:-
శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, వికాస లక్షణాలు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి సమైక్యంగా పనిచేస్తుంటాయి. సంఘంలో మనిషి ఉన్నతంగా ఉండాలంటే సరైన ప్రజ్ఞతో సమస్యలను పరిష్కరించుకుంటూ ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని అందరిని కలుపుకొనిపోయే విధంగా ప్రవర్తించుటలో అన్నీ సమైక్యంగా పనిచేస్తుంటాయి.
ఉదా: శారీరక వికాసం మీద చలన వికాసం సామాజిక వికాసం మీద ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటాయి.

7. వికాసం సాధారణ దిశనుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది:-
ఏ వికాసం అయినా సాధారణం నుండి ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశములను నేర్చుకొనుటలో భాగంగా జరుగుతుంది.

ఉదా: పిల్లవాడు నడవటం అనే సాధారణ లేదా తేలిక అంశం నుండి పరిగెత్తటం, ఆ తరువాత సైకిల్ తొక్కటం లాంటి కఠినమైన అంశాలను చేయటం జరుగుతుంది. శిశువు మొదట వస్తువును పట్టుకోవటానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు. తరువాత చేతివేళ్ళు మాత్రమే ఉపయోగిస్తాడు. శిశువు సాధారణ కృత్యాలు నేర్చుకోవటం నుండి నిర్దిష్టమైన కృత్యములను చేయగలుగుతాడు.

8. వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు:- శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగంను, అభివృద్ధిని అంచనా వేయవచ్చు.
ఉదా: 3 సం.ల వయస్సులో ఉండే ఎత్తునుబట్టి 18 సం.ల వయస్సుకు అతను ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అంచనా వేయవచ్చు.

9. వికాసం సంచితమైనది:-
శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికి అవి అన్నియు గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు, చేర్పులతో జరుగుతుంది.
ఉదా : శిశువు అమ్మ అని పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు మనకనిపించినప్పటికీ దానికవసరమయిన గొంతుకు సంబంధించిన, నాలుకకు సంబంధించిన శారీరక వికాసం అంతర్గతంగా జరుగుతుంది.

వికాస సూత్రాల విద్యా అనువర్తనాలు:

→ వికాసం కచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న నియమం ఆధారంగా భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం (LSRW) అనేవి క్రమంగా నేర్పడం జరుగుతుంది.
→ వికాసంలో వ్యక్తిగత భేదాలు సహజం కాబట్టి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి తగురీతిలో గ్రేడెడ్ . అసైన్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించటం జరుగుతుంది.
→ సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుందన్న నియమంపైనే అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుంది.
ఉదా : ఆంగ్ల భాషా బోధనలో 3వ తరగతిలో పదాలను ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులకు బాగా పరిచయమైన జంతువుల పేర్లు వస్తువుల పేర్లు (Cat. Dog etc.), నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం 2లో శరీరంలోని భాగాల గురించి చెప్పడాన్ని గమనించవచ్చు. పైతరగతులలో జటిల అంశాల బోధన జరుగుతుంది.
|Z*C → యవ్వనావిర్భావ దశలో ఉన్న విద్యార్థులలో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారిపట్ల సున్నితంగా ప్రవర్తించాలి. వారిని విమర్శించకుండా వారికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించటం జరుగుతుంది.
→ వికాసం అవిచ్ఛిన్నంగా జీవితాంతం జరిగే ప్రక్రియ కనుక వివిధ దశలలో, వివిధ రంగాలలో వికాసాభివృద్ధి జరిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దవచ్చు.
→ విద్యార్థులలోని వైయక్తిక భేదాలను తెలిసికొని వారి వారి పెరుగుదల, అభివృద్ధిల కనుగుణంగా తగిన బోధనా కార్యక్రమాలను, మార్గదర్శకత్వాన్ని మంత్రణాన్ని అందించవచ్చు.
→ పెరుగుదల వికాసాల వివిధ దశలను తెలుసుకొని వానికనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించుకొని తగిన బోధనా పద్ధతులను ఉపయోగించి నిర్దేశించబడిన విద్యా లక్ష్యాలను సాధించవచ్చు.
→ సామాన్య అంశాల నుండి ప్రత్యేక అంశాల వరకు తగిన అనుభవాలనందించవచ్చు.
→ వివిధ అంశాల కలయిక గల అనుభవాలను ఇవ్వడం ద్వారా విద్యాభివృద్ధి, సమగ్ర మూర్తినష్వాభివృద్ధిలను సమపాళ్ళలో సాధించవచ్చు. → మానసిక, సామాజిక, భావోద్రేక అవసరాలను తెలుసుకొని తగిన శిక్షణ నివ్వవచ్చు.
→ అనువంశికత, పరిసరాల ప్రభావాలను తెలుసుకొని వానికనుగుణంగా తగిన అభ్యసనానుభవాలను కలిగించవచ్చు.