అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




వైయక్తిక మరియు సామూహిక అభ్యసనం




వ్యక్తిగత, సామూహిక అభ్యసనం - అధ్యయన అలవాట్లు, స్వీయ అభ్యసనం, అభ్యసించే నైపుణ్యాలను నేర్చుకోవటం

→ వ్యక్తిగత అభ్యసనం : "అభ్యసనం అంటే పరిశీలన, పరస్పర ప్రతిచర్యలు, తాను చేసే చర్యలను ప్రతిబింబించడం. - స్కాన్ (1990)
→ వ్యక్తిగత అభ్యసనం అంటే “పరిసరాలతో ప్రతిచర్యనొంది, బాహ్య ఉద్దీపనలు, వనరులు, వ్యక్తిగత అనుభవాలను పునర్వ్యవస్థీకరించి జ్ఞానాన్ని సముపార్జించే సామర్థ్యం" - సినెట్సా (2000)
→ అనుభవాల పరివర్తన ద్వారా జ్ఞానాన్ని పొందడమే వ్యక్తిగత అభ్యసనం - డిక్సన్

లక్షణాలు:-
1. వ్యక్తులే అభ్యసన కోసం చొరవ తీసుకొని బాధ్యత వహిస్తారు.
2. అభ్యాసకులే తమ అభ్యసన కృత్యాలను ఎంచుకొని, నిర్వహించి, మూల్యాంకనం చేసుకొనే అవకాశం ఉంటుంది.
3. స్వీయ ప్రేరణే కీలకాంశం.
4. లక్ష్యాల స్వీయ నిర్ధారణ, సాధనం,
5. సమవయస్కుల భాగస్వామ్యం అభ్యసనకు తోడ్పడుతుంది.

రకాలు:-
1. దూరవిద్య
2. వనరుల ఆధారిత అభ్యసనం
3. కంప్యూటర్ ఆధారిత అభ్యసనం.
4. కార్యక్రమయుత అభ్యసనం

→ వ్యక్తిగత అభ్యసనం అనేది స్వీయ నిర్దేశిత అభ్యసనం. అయితే ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో దశలవారీగా జరిగే ప్రక్రియ. వ్యక్తిగతం అభ్యసనం ఈ కింది ఐదు దశల్లో జరుగుతుంది. అవి:
1. స్పష్టమైన, నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధారించుకోవడం
2. వాస్తవికమైన సవాలుతో కూడిన లక్ష్యాలను నిర్ధారించుకోవడం.
3. సమర్థవంతమైన లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని క్రమం తప్పకుండా సమీక్షించడం.
4. తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం.
5. విద్యార్థులను తమ ప్రగతికి తామే బాధ్యత వహించేటట్లు చేయడం.

→ వ్యక్తిగత అభ్యసనంలో లక్ష్యనిర్ధారణ మొదలుకొని లక్ష్యసాధన, కలిగే ఫలితాలు, తప్పొప్పులన్నింటకి అభ్యాసకులే బాధ్యత వహిస్తారు. ఎన్నుకొన్న లక్ష్యాలు వాస్తవికతకు దగ్గరగా ఉండి సాధించేవిగా ఉండేటట్లు ఉపాధ్యాయులు తగిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి.
ప్రయోజనాలు :-
1. అభ్యాసకులలో ఉన్న వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి దోహదపడుతుంది.
2. అభ్యాసకులు స్వీయవేగంతో, తమకు అనుకూలంగా అభ్యసిస్తారు.
3. వివిధ అభ్యసన శైలులను పరిగణనలోకి తీసుకోవచ్చు.
4. అభ్యాసకులు తమ అభ్యసనంపై అదుపును కలిగి ఉంటారు.
5. ఇది ఒక క్రియాశీల అభ్యసనంగా భావించాలి.
6. అభ్యాసకుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించవచ్చు.
7. అభ్యాసకుల్లో స్వీయ క్రమశిక్షణను పెంపొందించవచ్చు.
8. అభ్యాసకులు ఆత్మ సంతృప్తిని పొందుతారు.

పరిమితులు:
1. అభ్యసన కృత్యాలను తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
2. అభ్యాసకుల్లో ప్రేరణను చివరిదాకా నిలిపి ఉంచడం కష్టమవుతుంది.
3. కొన్ని సందర్భాల్లో స్వీయ ఆసక్తులు ఓటమికి దారితీయవచ్చు.
4. అన్ని వయస్సుల వారికి సరిపోదు.

సామూహిక అభ్యసనం:-
→ సామూహిక అభ్యసనలో కొందరు పిల్లలు జట్లుగా ఏర్పడి ఉపాధ్యాయుడి ద్వారా ఇవ్వబడిన కృత్యాలను, సమస్యలను, ప్రాజెక్టును ఒకరితో ఒకరు చర్చిస్తూ సమిష్టిగా ఇవ్వబడిన కృత్యాలను/సమస్యలను/ప్రాజెక్టును సాధిస్తూ అభ్యసన ప్రక్రియలో పాల్గొంటారు.
సామూహిక అభ్యసనంలో గుర్తించవలసిన ప్రధాన సూత్రాలు రెండు. అవి
1) అభ్యాసకులు జ్ఞానాన్ని నిర్మించుకోవడం.
2) అభ్యసన ప్రధానంగా ఒక సామాజిక ప్రక్రియ, చిన్న చిన్న సమూహాల్లో పనిచేయటం ద్వారా అభ్యాసకులకు వారి ఆలోచనలను ఇతరులతో పంచుకొని, అవసరం ఉన్నచోట సరిదిద్దుకొనే అవకాశం లభిస్తుంది.
→ సామూహిక కృత్యాలు విద్యార్థుల ఆలోచన పరిధిని పెంచి, విషయాల పట్ల లోతైన అవగాహన కల్పించి సమస్య సాధనకు తోడ్పడతాయి.

లక్షణాలు :-
1. సమూహంలోని సభ్యులు అభ్యసన సమయంలో ఒకరితో ఒకరు భావోద్వేగ సంబందం కలిగి ఉండి సహకారం, పోటీతత్వంతో పనిచేస్తారు.
2. సామూహిక అభ్యసనంలో పరస్పర సంబంధాలు, సహకారం, భాగస్వామ్యం మొదలైన లక్షణాలు అలవడతాయి.
3. సభ్యుల అభ్యపన సరళి, లక్ష్యాలు సమూహ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
4. సామూహిక అభ్యసనంలో వ్యక్తుల కంటే సాధించవలసిన లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది.

రకాలు :-
1. ప్రకల్పన పని
2. ఝంకార సమూహాలు
3. చర్చలు
4. మేధోమథనం
5. సెమినార్లు

→ సామూహిక అభ్యసనం అయిదు దశలలో జరుగుతుంది. అవి
1. ప్రేరణ
2. సామాజికీకరణ
3. సమాచార మార్పిడి
4. జ్ఞాన నిర్మాణ
5. వికాసం

→ సమూహంలోని వ్యక్తులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని చర్చించుకోవాలి. చర్చల ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. సమూహంలో అభ్యసించిన విషయాల ఆధారంగా వ్యక్తిగత వికాసాన్ని పొందుతారు.
ప్రయోజనాలు:-
→ వ్యక్తిగత అభ్యసనంతో పోలిస్తే ఉత్పాదకత ఎక్కువ.
→ అభ్యసనానికి ఎక్కువ వనరులు లభ్యమవుతాయి.
→ అభ్యసన సులభతరమవుతుంది.
→ విస్తృతమైన సమాచార మార్పిడి జరుగుతుంది.
→ సామూహిక నిబద్ధత ఏర్పడి, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది.
→ పరస్పర సంబంధాలను పెంపొందించుకోవచ్చు.

పరిమితులు:-
→ సమూహ కృత్యాలలో పాల్గొనడం వల్ల అసమానతలు ఏర్పడవచ్చు.
→ కొన్ని సందర్భాల్లో ఇతరుల కంటే తామే గొప్పవారమని చూపించుకోవటంలో అంతర్గత సంఘర్షణలు సంభవించవచ్చు.
→ వ్యక్తిగతంగా ఆలోచించడం తగ్గిపోయి, ఇతరుల మీద ఆధారపడే తత్త్వం పెరిగే అవకాశం ఉంది.
→ సృజనాత్మకతకు చోటు పరిమితమయ్యే అవకాశం ఉంది.

అధ్యయన అలవాట్లు :-
→ అధ్యయన అలవాట్లు విద్యార్థులు సాధారణంగా నేర్చుకొనే విధానాలను సూచిస్తాయి. అభ్యసనం ఒక నైపుణ్యం, పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో విజయం సాధించాలంటే ఉన్నతస్థాయిలో అభ్యసన నైపుణ్యాలుండాలి. ఈ అధ్యయన అలవాట్లు విద్యార్థుల స్థాయిని బట్టి మారతాయి. అధ్యయన అలవాట్లలో సమయ నిర్వహణ, స్వీయ క్రమశిక్షణ, ఏకాగ్రత కృషి, అనే నైపుణ్యాలు ఇమిడి ఉంటాయి.

అభ్యసన ప్రాధాన్యతలు :-
→ ఏవిధంగా చదవాలో తెలుసుకోవడం అధ్యయన అలవాట్లలో మొదటి మెట్టు. నేర్చుకొనే శైలిని బట్టి వ్యక్తి - దృశ్య, శ్రవణ కృత్వ అభ్యసకులు కావచ్చు.
→ దృశ్య అభ్యాసకుడిగా మెరుగుపరుచుకోవడానికి అభ్యాసకులు తాము అభ్యసించే విషయాలను ఊహించుకోవాలి. చదివే విషయాలను మార్కర్ పెన్నుతో అండర్లైన్ చేయాలి. చిత్రాలను గీయలి. మనోచిత్రీకరణ ఏర్పరచుకోవాలి. వీడియోలను పరిశీలించాలి.
→ శ్రవణ అభ్యాసకుడిగా మెరుగుపరుచుకోవడానికి అభ్యాసకులు రికార్డు చేయబడిన టేపులు, సీడీలను వినాలి. బిగ్గరగా చదవాలి. ఉపాధ్యాయులు బోధించిన విషయాలను తోటి విద్యార్థులతో చర్చించాలి. తరగతి గది చర్చల్లో చురుకుగా పాల్గొనాలి.
→ కృత్య అభ్యాసకుడిగా మెరుగుపరుచుకోవడానికి అభ్యసనాంశానికి సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి. అభ్యసించే అంశాలను నిత్యజీవితంలోని అంశాల్లో వినియోగించి ఫలితాలను పరిశీలించాలి. చదివేటప్పుడు నిలబడాలి. అవసరమైతే అటూ ఇటూ తిరగాలి.

స్వీయ అభ్యసనం :-
→ తరగతిలో నేర్చుకొన్న విషయాలను పునర్బలనం చేసుకోవడానికి విద్యార్థులు తమంతట తాము మళ్ళీ చదువుకోవాలి. అంటే విద్యార్ధి తనకు తాను ఉపాధ్యాయుడి సహాయం లేదా ప్రముయం లేకుండా అభ్యసించడమే స్వీయ అభ్యసనం అవుతుంది.
→ స్వీయ అభ్యసన ప్రక్రియ : స్వీయ అభ్యసనం తరగతి గదిలో అభ్యసించిన విషయాలను పునర్బలనం చేసుకోవడానికి తోడ్పడుతుంది. స్వీయ అభ్యసనం ప్రభావవంతంగా ఉండాలంటే విద్యార్థులు స్వయం ప్రేరేపితులై చదువుపట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. అభ్యసనలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించుకోవాలి. ఒక సమస్యకు అనేక సమాధానాలుంటాయని గుర్తించాలి. ఏ సమయమైనా చదువుకోవడానికి అనువైనదే అని గ్రహించాలి.
→ స్వీయ అభ్యసనం వల్ల విద్యార్ధి స్వతంత్రంగా ఆలోచిస్తాడు. స్వయం ప్రేరేపితుడవుతాడు. స్వయంగా సమస్యలను ఎదుర్కొని సమాధానాలు కనుగొంటాడు. నేర్చుకొన్న విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకుంటాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యం వైపుకు చేరుకుంటాడు. ఉపాధ్యాయుల బోధన కంటే స్వీయ అభ్యసనంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు.