అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




బోధనాశాస్త్ర పద్దతుల అవగాహన




→ సుశిక్షుతుడయిన, వృత్తిపట్ల అంకితభావం కలిగి ఉండే ఉపాధ్యాయుడు చక్కని lesson plan ముందే రాసుకొని దానిని ఏ బోధనా పద్ధతిలో చెప్పాలనుకుంటున్నాడో ముందే నిర్ణయించుకుంటాడు. అలాగే ఏ పాఠమును ఏ బోధనా పద్ధతిలో చెప్పితే విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకోగలుగుతారో కూడా తెలుసుకొని ఉంటాడు. సరి అయిన బోధనా పద్ధతుల ద్వారా అందించబడిన జ్ఞానము సరి అయిన అభ్యసనకు దారి తీస్తుంది. బోధనకు, అభ్యసనకు విడదీయరాని సంబంధము ఉంది. అయితే సులభమయిన బోధన, అభ్యసనం కొరకు విద్యార్థుల స్థాయి ఆధారంగా అనేక బోధనా పద్ధతులను, దాని ఆధారంగా జరిగే అభ్యసనములను మనోవిజ్ఞానం వివరిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.
1) ఆవిష్కరణ / అన్వేషణాధారిత బోధన / అభ్యసనము
2) కెక్ట్ / ప్రకల్పనాధారిత బోధన / అభ్యసనము
3) పరిశీలనాధారిత బోధన/ అభ్యసనము
4) సర్వే ఆధారిత బోధన / అభ్యసనము
5) కృత్యాధారిత బోధన / అభ్యసనము

ఆవిష్కరణ / అన్వేషణ / పరిశోధనాథారిత అభ్యసనము

→ ఆవిష్కరణ బోధనకు ఆధ్యుడు ఇంగ్లండ్ కు చెందిన H.E.ఆర్మ్ స్ట్రాంగ్. గ్రీకుభాషలో హ్యురిస్కో అనగా నేను కనుగొన్నాను' అని అర్ధము. ఈ అభ్యసనంలో విద్యార్థులు తమ స్వంత అనుభవాల ద్వారా ప్రయత్నాల ద్వారా సమస్యా పరిష్కారాలను స్వయంగా వారే కనుగొంటారు. ఇందులో ఉపాధ్యాయుడు మార్గదర్శి పాత్రను పోషిస్తాడు. కొన్ని ప్రాధాన్యత కలిగిన సమస్యలను విద్యార్థులకు ఇచ్చి పరిష్కారమార్గములను వారే కనుగొనేట్లు ప్రోత్సహిస్తాడు అందుకు అవసరమైన మార్గదర్శకత్వంను అందిస్తాడు. విద్యార్థులను అన్వేషకులుగా రూపొందిస్తాడు. సమస్యకు పరిష్కారం స్వయంగా కనుగొన్న ఆనందమును విద్యార్థికి కలిగేట్టు చూస్తాడు.

ఆవిష్కరణ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు :-
→ సరి అయిన వినూత్న సమస్యలను రూపొందిస్తాడు.
→ వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఒక్కొక్క విద్యార్థి స్థాయికి తగిన ప్రశ్నలను ఇస్తాడు. అవసరమయితే ఒక సమూహానికి మొత్తానికి కూడా ఒకే సమస్య ఇవ్వవచ్చు.
→ విద్యార్థులకు ఆ సమస్యా పరిష్కరణలో మార్గదర్శిగా, సహాయకుడిగా పనిచేస్తాడు.
→ విద్యార్ధే స్వయంగా సమస్యా పరిష్కారం కనుగొనుటను ప్రోత్సహిస్తాడు.
→ వారిలో అన్వేషణా నైపుణ్యాలను పెంపొందించుటకు కృషి చేస్తాడు.

ఆవిష్కరణాధారిత అభ్యసనలో విద్యార్థి:-
→ ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రశ్నను ఛాలెంజ్ గా స్వీకరిస్తాడు.
→ సమస్యా పరిష్కరణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, స్వీయ పరిష్కారం దిశగా అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అవసరమయిన సందర్భంలో ఉపాధ్యాయుని సహాయం తీసుకుంటాడు.
→ కార్కిక ఆలోచనలు, శాస్త్రీయ ఆలోచనలు వృద్ధి చెందుతాయి.
→ స్వీయ అభ్యసనం కొనసాగుతుంది.
→ ఆచరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది.
→ సమస్యా పరిష్కారం లభించిన తరువాత 'ఆహా' అనే అనుభవం 'నేను కనుగొన్నాను' అనే భావన కలుగుతుంది.
→ ఫలితాలను సరిచూసుకొని సంతృప్తి చెందుతాడు.

ఆవిష్కరణాధారిత అభ్యసనం :-
→ విద్యార్థి కేంద్రీకృతమయినది.
→ విద్యార్థికి ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది.
→ సామర్థ్యాలను స్వయంగా తెలుసుకొనేట్లు చేస్తుంది.
→ విద్యార్థిని క్రియాశీలకంగా ఉంచుతూ, స్వయం అభ్యసనను ప్రోత్సహిస్తుంది.
→ విద్యార్థులలో అంతర్గత ప్రేరణలను పెంపొందిస్తుంది.

ఆవిష్కరణ అభ్యసనం - పరిమితులు: -
1) తక్కువ ప్రజ్ఞ కలవారు ఈ అభ్యసనా పద్ధతి ద్వారా అభ్యసించలేరు. క్లిష్టమయిన సమస్యలకు పరిష్కారం ప్రయత్నాల తరువాత తెలివైన విద్యార్థి కూడా నిరుత్సాహపడే ప్రమాదముంది.
2) అన్వేషణా పద్ధతికి అనుగుణంగా పాఠ్యగ్రంథాలు లేవు.

ప్రాజెక్ట్ / ప్రకల్పనాధారిత బోధన / అభ్యసనము

→ ప్రాజెక్ట్ పద్ధతికి మూలాధారము జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదము. దీని ఆధారంగా రూపొందించబడిన ఈ పద్ధతిని బోధనలో మొదటగా అమెరికాకు చెందిన విలియం హార్ట్ కిల్పెట్రిక్ ప్రవేశపెట్టినారు. కిల్పాట్రిక్ ప్రకారము ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో హృదయపూర్వకముగా పూర్తిచేసే కార్యకలాపము, అనగా విద్యార్థులకు పాఠశాలలో సహజసిద్ధమయిన వాతావరణాన్ని కల్పించి విద్యకు, జీవితానికి మధ్యగల అవినాభావ సంబంధం చూపబడుతుంది. వీరు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనకు
మూల సూత్రములు :-
1) విద్యార్థి కేంద్రీకృతము,
2) క్రమానుగత విద్యాభివృద్ధి,
3) అభ్యాస నియమము.

→ ప్రాజెక్ట్ అనగా ఒక practical problem ను ఒకరు లేదా ఒక సమూహము కలసి పరిష్కరించగలిగినది అని అర్ధము.
→ ప్రాజెక్ట్ పద్ధతి అనగా ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు కలసి ఒక వాడిక సమస్య (practical pmoblem) ను కొద్దిరోజులలో / కొద్ది చారాలలో పరిష్కరించుట. ప్రాజెక్ట్ పద్ధతిలో సమస్య ఎక్కడ ఉందో ఆ సహజ పరిసరాలలోకి వెళ్ళి, దాని సహజ వాతావరణంలో అధ్యయనం చేసి పరిష్కరించటం జరుగుతుంది. అందుకే దీనిని learning by living అనే దానిపై ఆధారపడిన పద్ధతిగా చెప్పుకోవచ్చు..

ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం యొక్క సోపానాలు :-
1) పరిస్థితులు కల్పించుట,
2) లక్ష్యాలను వివరించుట,
3) ప్రణాళికా రచన,
4) ప్రణాళికలను అమలుపరుచుట,
5) మూల్యాంకనము,
6) నివేదికను సమర్పించుట అను ఆరు అంశములు వరుసక్రమంలో ఉండును.
→ ప్రాజెక్ట్ పనులకు ఉదాహరణలు : పాఠశాల న్యూస్పేపర్ను పబ్లిష్ చేయుట, పాఠశాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుట, బడి తోటను పెంచుట మొ॥వి. ప్రాజెక్ట్ పనులకు ఉదాహరణలు.
ప్రాజెక్టులు రకాలు ఉదాహరణలు:-
→ మేధాసంబంధ ప్రాజెక్టు - క్లిష్టసమస్యలకు తార్కిక ప్రయోగాలు.
→ భౌతిక సంబంధ ప్రాజెక్టు తోటను పెంచటం.
→ ఉత్పత్తి ప్రాజెక్ట్ - ఇంకు తయారుచేయటం.
→ వినియోగ ప్రాజెక్ట్ ఉపకరణాలను వాడుకోవటం.
→ సమస్యా ప్రాజెక్ట్ - ఇంద్రధనస్సు ఎందుకు ఏర్పడుతుంది.
→ శిక్షణా ప్రాజెక్ట్ చిత్రాలు వేయడం,
ప్రాజెక్ట్ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు :-
→ పాఠ్యాంశాలకనుగుణమయిన ప్రాజెక్టుల రూపకల్పన చేస్తాడు. అయితే ఉపాధ్యాయుడు ఎంపిక చేసే ప్రాజెక్టులు ప్రయోజనతా సూత్రం, వాస్తవిక సూత్రం, స్వేచ్ఛాసూత్రం సమస్యాపరిష్కార సూత్రంపై ఆధారపడి నిర్మితమవుతాయి.
→ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాజెక్ట్ గాని ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒకే ప్రాజెక్ట్ గాని ఇస్తాడు.
→ ప్రాజెక్ట్ పరిష్కారములో అవసరమయిన మార్గదర్శకత్వాన్ని అందజేస్తాడు..

ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనంలో విద్యార్థి:-
→ జ్ఞానేంద్రియాలకు అన్నింటికీ పని కల్పించటం వల్ల చురుకుగా, ఉత్సాహంగా పాల్గొంటాడు.
→ సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యసనం జరుగుతుంది.
→ సహజ వాతావరణంలో పాఠశాల బయట స్వయంగా లేదా టీం సభ్యుల సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేస్తాడు.
→ పని - అనుభవ ఆధారిత విద్యను పొందుతాడు.
→ సహకార భావన, ప్రజాస్వామిక లక్షణాలు, శ్రమపై గౌరవము ఏర్పడతాయి.
→ విద్యార్థి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమయిన అభ్యసనం దీని ద్వారా సాధ్యమవుతుంది.

ప్రాజెక్ట్ అభ్యసనము - పరిమితులు :-
1) పాఠ్యాంశములోని అన్ని విషయములను ప్రాజెక్టుల రూపంలోకి మార్చలేరు.
2) ఎక్కువ సమయం తీసుకుంటాయి కనుక పాఠ్యాంశములను సకాలంలో పూర్తి చేయలేరు.
3) ప్రాజెక్టుల కనుగుణంగా పాఠ్యగ్రంథాల రూపకల్పన లేదు.

పరిశీలనాధారిత బోధన / అభ్యసనము

→ ఏదయినా ఒక దృగ్విషయాన్ని జాగ్రత్తగా, నిశితంగా గమనించి ఉన్నది ఉన్నట్లు (యదార్థంగా) గా నమోదు చేసుకోవటమే పరిశీలన. పరిశీలించిన విషయమును విశ్లేషించటం ద్వారా పొందే జ్ఞానము, అవగాహనను పరిశీలనాధార అభ్యసనము అందురు.
→ విద్యార్థి స్వయంగా పరిసరాలలో జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తూ సాంప్రదాయ బోధనకు భిన్నంగా స్వీయ పరిశీలనలో పొందిన జ్ఞానము, అవగాహనతో శాశ్వతమైన ప్రవర్తనా మార్పును పొందటమే పరిశీలనా అభ్యసనము అందురు.
→ ఈ విధానంలో విద్యార్థి వాస్తవ విషయాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి నేర్చుకుంటాడు.
→ ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞానం పొందేటప్పుడు ఈ పరిశీలన అనేది ఎంతో ఉపయోగపడుతుంది.
ఉదా : 1) మిరపతోట పెంపకం, తెగులులాంటి వాటిని సాంప్రదాయ పద్ధతిలో వినటం కంటే పంట పొలానికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకొనుట ఉత్తమమైన అభ్యసనం.
2) పోస్టాఫీసు పాఠం, సాంప్రదాయ పద్ధతిలో వినటం కంటే గ్రామస్థాయిలో / పట్టణస్థాయిలో పోస్టాఫీసుకు వెళ్ళి క్షేత్రస్థాయిలో అన్నింటిని పరిశీలించి నేర్చుకొనుట ఉత్తమమైనది.

పరిశీలనాధారిత అభ్యసనలో సోపానాలు:-
→ పరిశీలనాంశములను మొదట నిర్ధారించుకోవాలి.
→ నిర్ధారించుకున్న అంశములను నిశితంగా పరిశీలించాలి.
→ పరిశీలనాంశాలను వెంటనే నమోదు చేసుకోవాలి.
→ నమోదు చేసుకున్న అంశములను శాస్త్రీయంగా విశ్లేషించాలి.
→ విశ్లేషణ ఫలితాలను వ్యాఖ్యానించి సాధారణీకరించాలి.

పరిశీలనాధారిత అభ్యసనంలో ఉపాధ్యాయుడు :-
→ సరి అయిన పరిశీలనాంశములను కల్పించాలి. కల్పించిన పరిశీలనాంశముల ద్వారా విద్యార్థి జ్ఞాన సముపార్జన చేయగలగాలి.
→ క్షేత్ర పర్యటనలకు, శాస్త్రీయ పరిశీలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
→ కొన్ని పరిశీలనలకు సహజ పరిస్థితులతోపాటు అవసరమయిన కృత్రిమ పరిస్థితులు కల్పించాలి. (ఉదా: ప్రయోగశాలలు).

పరిశీలనాధారిత అభ్యసనంలో విద్యార్థి:-
→ అభ్యసించవలసిన అంశమును నిశితంగా పరిశీలించాలి.
→ పరిశీలనలోని అన్ని రకాలను వినియోగించుకోవాలి.
→ క్షేత్ర స్థాయి అంశములను స్వయంగా దర్శించి పరిశీలించాలి.
→ పరిశీలనాంశములు తప్పిపోకుండా ఉండాలంటే అవధానంతో క్రియాశీలకంగా ఉండాలి.
→ పరిశీలించిన అంశములను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి.
→ పరిశీలించి నమోదు చేసుకున్న విషయములను అవగాహనతో విశ్లేషించి సామాన్యీకరణ చేసుకోవాలి.

సర్వే ఆధారిత బోధన అభ్యసనము

→ ఏదయినా ఒక అంశం మీద వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలను వివిధ రూపాలలో (ప్రశ్నావళి, శోధికలు.... ) సేకరించటమే సర్వే పధ్ధతి. సర్వే ద్వారా సేకరించిన సమాచారమును విశ్లేషించి దాని ద్వారా పొందే జ్ఞానము, అవగాహననే సర్వే ఆధారిత అభ్యసనము అంటారు. దీనిలో స్వీయ సర్వేల ద్వారా, ఇతరులు చేసిన సర్వేల ద్వారా కూడా అభ్యసనం జరుగుతుంది. అనగా ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది.
→కొన్ని సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను జనాభాలోని ఆ అంశమునకు సంబంధించిన నిపుణులను కలిసి వారి ద్వారా సమాచారాన్ని సర్వే రూపంలో సేకరించటం జరుగుతుంది. అందువలన దీనిని ప్రతిచయన (sample) పద్ధతి అని కూడా అంటారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి వాని ద్వారా సమాచార పరిష్కార జ్ఞానాన్ని, అవగాహనను పొందటం జరుగుతుంది.
→ సమాజంలోని ముఖ్యమైన సమస్యల పట్ల వ్యక్తుల వైఖరులు ఎలా ఉంటాయి అనే జ్ఞానము విద్యార్థికి సర్వే అభ్యసనం ద్వారా లభిస్తుంది.
ఉదా : గవర్నమెంట్ పాఠశాల వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యమౌతున్నది కారణము ఏమై ఉండవచ్చు ?
→ సర్వే ద్వారా విషయ సేకరణకు ప్రశ్నావళులు కాని, శోధికలు కాని నిర్ధారణ మాపనులు కాని ఉపయోగిస్తారు. వీటిని ఒక క్రమబద్ధంగా ఆయా అంశాలలో నిపుణులయిన వ్యక్తులకు అందించి వారు పూరించిన సమాధానాల ఆధారంగా వాస్తవ పరిష్కారాన్ని తెలుసుకుంటారు. " సర్వే ఆధారిత అభ్యసనంలో భాగంగా సమాచారమును సేకరించుటకు రెండు రకముల ఆధారాలు కలవు. అవి 1) ప్రాథమిక ఆధారాలు / ప్రత్యక్ష ఆధారాలు, 2) గౌణ ఆధారాలు / పరోక్ష ఆధారాలు.

→ సమస్యతో నేరుగా సంబంధముండే వ్యక్తులతో, వస్తువులతో ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకొనే ఆధారాలను ప్రాథమిక ఆధారాలు అంటారు.
ఉదా : పరిశీలకుల వ్యక్తిగత అనుభవాలు, ఇంటర్వ్యూల ద్వారా సంబంధిత వ్యక్తుల నుండి సేకరించిన సమాధానాలు మొ||వి.
→ పరోక్ష వనరుల ద్వారా సేకరించే సమాచారాన్ని గౌణ ఆధారాలు అంటారు.
ఉదా:- వివిధ రచయితలు రచించిన గ్రంథాలు, న్యూస్ పేపర్లో వచ్చిన వార్తా కథనాలు మొ||వి.
→ ఈ రెండు ఆధారాలు సర్వేకు ఉపయోగపడతాయి. ఆ సర్వేల ద్వారా సేకరించిన సమాచారము జ్ఞాన సముపార్జనకు, సమాజంలో ఉన్న సమస్యల అవగాహనకు వివిధ వ్యక్తుల వైఖరులను తెలుసుకొనుటకు, సమస్యా పరిష్కారములో మెజార్టీ ప్రజల మనోగతాలకు అర్ధం పడుతుంది.

సర్వే అభ్యసనలో సోపానాలు :-
→ సర్వే చేయదలచుకొన్న అంశమును స్పష్టముగా నిర్ణయించుకొనుట.
→ దానికి అనువైన ప్రశ్నావళి లేదా శోధికను రూపొందించుకొనుట.
→ సరైన ప్రతీచయనమును ఎంపిక చేసుకొనుట.
→ ప్రతీచయన అభిప్రాయములను విశ్లేషించి వ్యాఖ్యానించుట.

సర్వే అభ్యసనం విద్యార్థికి :-
→ సామాజిక సమస్యలను తెలుసుకొనుటకు, పరిష్కారాల అవగాహనకు తోడ్పడుతుంది.
→ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించుటకు ఉపయోగపడుతుంది.
→ వివిధ వ్యక్తుల వైఖరులను, అభిరుచులను సులభంగా సేకరించుటకు ఉపయోగపడుతుంది.
పరిమితి :-
→ ప్రశ్నావళి లేదా శోధిక తయారుచేయటం అందరు విద్యార్థులకు సాధ్యం కాదు.
→ ప్రశ్నావళి ఖచ్చితంగా లేకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం వుంది.

కృత్యాధారిత బోధన

→ విద్యార్థులు రకరకాల కృత్యాలలో చురుకుగా పాల్గొని, ఆ కృత్యాలను వారే స్వయంగా పూర్తి చేసి, వానినుండి పొందిన అనుభవాలను స్థిరీకరణ చేసుకొని పొందే జ్ఞానమును, అవగాహననే కృత్యాధార అభ్యసనము అంటారు. ఇది పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతమయినది. ఆచరణ ద్వారా అభ్యసనం (learning by doing) అనే సూత్రం ఆధారంగా రూపొందించబడింది.
→ కృత్య అనుభవాలను విద్యార్థికి పాఠశాలలో, తరగతి గదిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, సమాజంలో, గృహంలో ఎక్కడయినా పొండేటట్లు ఏర్పాటు చేయవచ్చు.
→ కృత్యాధార పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యం - పిల్లలకు నేరుగా సమాచారంను అందించకుండా తమ తోటివారితో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, సమాజ సభ్యులతో చర్చించేలా చేసి జ్ఞానమును, అవగాహనను సొంతంగా గ్రహించేటట్లు చేయటం. ఇది నిర్మాణాత్మక వాదమును పూర్తిగా సమర్థించే బోధన / అభ్యసనా పద్ధతిగా చెప్పుకోవచ్చు.
→ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణము అనేది వారు స్వయంగా కృత్యాలలో పాల్గొని, స్వీయ అనుభవాల నుండి ఏర్పాటు చేసుకోవాలి, పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానరాశిని అన్వయించాలి అని NCF-2005 సూచించిన సూత్రాలను ఈ కృత్యాధార పద్ధతి పూర్తిగా సమర్థిస్తుంది.
→ కృత్యాధార అభ్యసనను మొదటగా ఇండియాలో రిషీవ్యాలీ పాఠశాలలో డేవిడ్ హోర్స్బర్గ్ అనే బ్రిటన్కు చెందిన ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టినాడు.

కృత్యాలు - రకాలు :-
→ ప్రస్తుత పాఠ్యపుస్తకాలన్నీ కూడా కృత్యాధార అభ్యసనకు అనువుగా రూపొందించబడ్డాయి.
→ ఈ కృత్యాలను నిర్వహణ దృష్ట్యా మూడు రకాలుగా వర్గీకరించినారు. అవి :
1) పూర్తి తరగతి కృత్యాలు తరగతిలోని అందరిచే ఒకే కృత్యము నిర్వహించబడుతుంది.
ఉదా : ఒక పాఠంలోని 4 అక్షరాల పదములను అన్నింటిని విద్యార్థులందరిని రాసుకొని రమ్మనుట.

2) జట్టు కృత్యాలు ఒక్క జట్టులో 1/5 గురు విద్యార్థులుండాలి. జట్టుకొక కృత్యం ఇవ్వబడుతుంది.
ఉదా : కథను చూచి ఒక జట్టు 2 అక్షరాల పదాలు, మరో జట్టు 3 అక్షరాల పదాలు ఇంకొక జట్టుకు 4 అక్షరాల పదాలు తయారు చేయమని పని అప్పగించుట.

3) వ్యక్తిగత కృత్యాలు :
ఒక్కొక్క విద్యార్థికి విడి విడిగా ఒక్కో కృత్యము ఇవ్వబడుతుంది.
ఉదా : విడి విడిగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అక్షరము ఇచ్చి, కథలోని వారికిచ్చిన అక్షరం ఉన్న పదములన్నింటిని రాసుకొని రమ్మనుట

→ ఇలా రకరకాల కృత్యాల నిర్వహణ ద్వారా విద్యార్థులు స్వీయ అభ్యసనం చేయగలుగుతారు. కృత్యాధార అభ్యసనంలో భాగంగా పాఠ్యాంశాల వెనుక సమాచార సేకరణ, ప్రయోగాలు, పటములు గీయుట, రంగులు వేయుట, వస్తువులు, పటములు, జీవిత చరిత్రల సేకరణ, నమూనాలు తయారుచేయుట లాంటి అనేక కృత్యములను చేర్చినారు. అయితే ఆశించిన సామర్థ్యాలను సాధించాలంటే ఉపాధ్యాయుడు ఈ కృత్యాలను సమర్ధవంతంగా నిర్వహించాలి.

కృత్యాధార బోధనలో ఉపాధ్యాయుడు

→ తరగతి గది వాతావరణమును కృత్యాధార బోధనకు అనుగుణంగా తయారుచేసుకోవాలి.
→ ప్రతి పాఠ్యాంశములో ఇచ్చిన లేదా సొంతంగా తయారుచేసిన కృత్యాలన్నింటిని పూర్తి తరగతి కృత్యాలుగా / జట్టు కృత్యాలుగా విడి విడి కృత్యాలుగా విద్యార్థులందరికి ఇవ్వాలి.
→ కృత్య నిర్వహణకు అవసరమయిన మార్గదర్శకత్వాన్ని అందించాలి. 1. కృత్యంలో ప్రతి ఒక్కరినీ పాల్గొనేట్లు చేసి అందరికి భాగస్వామ్యాన్ని కల్పించాలి.
→ పిల్లలు ఇంటి భాషను ఆమోదించాలి.
→ ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలి.
→ పిల్లల అనుభవాలను, భావ వ్యక్తీకరణను ప్రోత్సహించాలి.

కృత్యాధార అభ్యసన ద్వారా విద్యార్థి:-
→ స్వీయ అభ్యసనం చేస్తాడు. స్వీయ అనుభవాలను పొందుట ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు..
→ చురుకుగా, క్రియాత్మకంగా కృత్యాలలో పాల్గొంటాడు.
→ జ్ఞానేంద్రియాలన్నీ వినియోగించటం ద్వారా అభ్యసనం సమర్ధవంతంగా జరుగుతుంది.
→ జట్టు కృత్యాలద్వారా సాంఘీకరణ, ఐకమత్యము, సేవాభావము, సహకారము లాంటి లక్షణములను అలవరచుకుంటాడు. వ్యక్తిగత కృత్యముల ద్వారా ఆత్మ విశ్వాసము, ఆత్మ సంతృప్తి, స్వీయ సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి.
→ సొంత ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటాడు. తన సామర్థ్యాలను సొంతంగా అంచనా వేసుకోగలుగుతాడు.
→ సమాజంలో, పరిసరాల్లోని విభిన్నత్వాన్ని ఒక సహజమైన అంశంగా గుర్తించి దానిని ప్రశంసించగలుగుతాడు.

సహకార అభ్యసనము మరియు భాగస్వామ్య అభ్యసనము

→ సహకార అభ్యసనం అనగా జట్టులో లేదా సమూహంలోనైనా అభ్యసించుట ఇది ఒక ఉత్తమ అభ్యసన వ్యూహంగా చెప్పబడింది.
→ ఇద్దరు వ్యక్తులు తమంత తామే అభ్యసనాంశంపై వివరంగా చర్చచేసి విషయాన్ని అవగాహన చేసుకోవడం సులభమవుతుంది. ఒకరి పరిజ్ఞానాన్ని ఇంకొకరు తెలుసుకొని ఇద్దరూ చర్చలో పాల్గొనటం వలన అభ్యసనం సులభమవుతుంది.
→ పరస్పర చర్చలు జట్టుపనిగా భావించవచ్చు. అభ్యసన ప్రక్రియలో ఒకరి కన్న ఎక్కువమంది ఉన్న ఎడల అభ్యసనం ఆనందదాయకంగా ఉంటుంది.
→ సహకార అభ్యసనం విద్యార్థుల ప్రవర్తనల్లో మార్పుతెస్తుంది.
→ సహకార అభ్యసనం ద్వారా నైపుణ్యాలను సమర్థవంతంగా అభివృద్ధి పరచుకోవచ్చు.
→ సహకార అభ్యసనం కేవలం చిన్నపిల్లల సంభాషణ కాదు. డేవిడ్ మరియు రోజర్ జాన్సన్ అనువారు వ్రాసిన "లెర్నింగ్ టుగెదర్ అండ్ అలోన్" అనే పుస్తకంలో తెలిపిన మాదిరిగా ఈ విధమైన అభ్యసనం శ్రద్ధాపూర్వకంగా ఉండాలి.
→ చిన్న సమూహాలుగా విభజించాలి. ప్రతి సమూహంలో నలుగురు విద్యార్థులుండాలి.
→ ప్రతి విద్యార్ధి అభ్యసనాంశాల్లో నాల్గవ వంతు చదవాలి.
→ తదుపరి ప్రతి విద్యార్థి తన సమూహంలో ఉన్న ఇతర ముగ్గురు జట్టు సభ్యులకు తాను చదివింది వివరించాలి. ఇతర విద్యార్థులు ఆ విషయాన్ని తెల్సుకొని తాము చదివిన విషయాలను కూడా వివరిస్తారు. అప్పుడు అందరు విద్యార్థులు తమకు తెల్సిన విషయాలను పరీక్షించుకోవాలి.
→ నిపుణులైన సమవయస్కులు ఇతర పిల్లల వికాసానికి తోడ్పడగలరు. భాగస్వామ్య అభ్యసనంలో పిల్లలు చిన్నచిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్యసాధనకు పాటుపడతారు. తోటివారితో చర్చించడం, మాట్లాడటం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, నిర్భయంగా తమ భావాలను వ్యక్తపరచడం ద్వారా, ఇతరులతో కలిసి వారితో ప్రతిచర్చలు జరపడం వల్ల తమచుట్టూ ఉన్న సమాజం పట్ల తమకంటూ ఆలోచనలు - దృక్పథాలు ఏర్పరచుకుంటారు. సామర్థ్యాలను పెంచుకొంటారు.
→ భాగస్వామ్య అభ్యసనలో 4 నైపుణ్యాలను సాధించడం జరుగుతుంది. అవి
1. సారాంశము
2. ప్రశ్నించటం
3. సందేహ నివృత్తి

→ ఆ తదుపరి ఉపాధ్యాయుడు ప్రతి సమూహానికి ఒక ప్రకల్పన ఇస్తాడు. ఈ ప్రకల్పనను ఒక సహకార కార్యక్రమం వలె విద్యార్థులు పూర్తిచేస్తారు. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని పరీక్షించి మార్కులిస్తాడు.
సహకార మరియు భాగస్వామ్య అభ్యసనం వల్ల లాభాలు:-
→ సహకార అధ్యసన భావన సమూహ సంలగ్నత అను భావనను అభివృద్ధి చేస్తుంది. దీనిలో అభ్యసనం, వ్యక్తిగతంగా, సమూహంగా మరియు పోటా పోటీగా జరుగుతుంది.
→ విద్యార్థులు ఈ విధానంలో నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు.
→ అందరికొరకు పనిచేయుట నేర్చుకొంటారు. ఇతరుల అభిప్రాయాలను మన్నిస్తారు.
→ విద్యార్థులు ఇతరుల సలహాలను పాటిస్తారు.
→ సమూహంలో ఐక్యతను ఉపాధ్యాయుడు స్థాపిస్తాడు.
→ విద్యార్థులకు సంపూర్ణ అనుభవాలు కలుగుతాయి.