అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




శిక్షణా బదలాయింపు / అభ్యసనా బదలాయింపు




→ గతంలో ఒక రంగంలో పొందిన శిక్షణ, దాని పరిజ్ఞానం మరో విషయ అభ్యసనలో కాని, నైపుణ్య సాధనలో కాని మనలను ప్రభావితం చేస్తాయన్న నిజమే శిక్షణా బదలాయింపు. దీనినే అభ్యసన బదలాయింపు అనికూడా అంటారు.
→ ఒక ప్రక్రియలో గడించిన అనుభూతులు, అనుభవాలు తరువాతి కాలంలో అలాంటి ప్రక్రియ యొక్క సాధనపై తమ ప్రభావాన్ని చూపించటమే అభ్యసనా బదలాయింపు అంటారు. - ఎలీస్
→ ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగాకాని, పాక్షికంగా గాని ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావటమే అభ్యసనా బదలాయింపు అంటారు.- గారెట్
→ ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానము, శిక్షణ, అలవాట్లు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించటమే 'అభ్యసనా బదలాయింపు' - సోరన్ సేన్
→ ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచనా విధానం, అనుభూతులు, జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లను వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్ళటమే అభ్యసనా బదలాయింపు -క్రో & క్రో

→ అభ్యసన బదలాయింపు 4 రకాలుగా ఉంటుంది.
అవి :
1. అనుకూల బదలాయింపు / ధనాత్మక బదలాయింపు
2. ప్రతికూల బదలాయింపు / వ్యతిరేక బదలాయింపు
3. శూన్య బదలాయింపు
4. ద్విపార్శ్వ బదలాయింపు.

1. అనుకూల బదలాయింపు:-
→ ఒక అంశం నేర్చుకొనుటలో పొందిన, జ్ఞానం, నైపుణ్యం మరియొక అంశం నేర్చుకొనుటకు దోహదపడినట్లయితే దానిని 'అనుకూల బదలాయింపు' అంటారు.
ఉదా : cd player రిపేర్ నేర్చుకున్న అనుభవంతో dvd player రిపేర్ సులభంగా నేర్చుకోగలగటం.

2. ప్రతికూల బదలాయింపు:-
→ ఒక కృత్యములో పొందిన జ్ఞానం, నైపుణ్యం మరియొక కృత్యము నేర్చుకొనుటలో ఆటంకం కలిగించినట్లయితే దానిని ప్రతికూల బదలాయింపు' అంటారు.
ఉదా : Book కు బహువచనం Books అని నేర్చుకున్న పరిజ్ఞానంతో Foot కు బహువచనం Foots అని చెప్పుట,

3. శూన్య బదలాయింపు:-
→ ఒక కృత్యములో వ్యక్తి పొందిన అనుభవము మరియొక కృత్యము నేర్చుకొనుటలో ఏ విధమయిన ప్రభావము చూపకపోవటమే శూన్య బదలాయింపు.
ఉదా: కంప్యూటర్ పరిజ్ఞానముతో ఈత నేర్చుకొనుట.

4. ద్విపార్శ్వబదలాయింపు:-
→ కుడిచేయి కుడికాలుతో చేయగల నైపుణ్యాలు ఎడమచేయి ఎడమకాలితో చేయగలిగితే అది ద్విపార్శ్య బదలాయింపు.
ఉదా: కుడికాలితో ఫుట్బాలు బాగా కిక్ కొట్టగల నైపుణ్యం గల క్రీడాకారుడు ఎడమ కాలితో కూడా అంతే నైపుణ్యముగా కిక్ కొట్టగలుగుట.
→ వ్యక్తిలో అలవాట్లు, వైఖరులు, ఆదర్శాలు, ఖచ్చితత్వం, చురుకుదనం, విజ్ఞానం, నైపుణ్యాలు, ఆలోచన, అభిప్రాయాలు, సామర్థ్యాలు, అనుభూతులు ఇవన్నీ 'అభ్యసన బదలాయింపు' వల్ల ప్రభావితం అయ్యే అంశాలు.


అభ్యసనా బదలాయింపు సిద్ధాంతములు

సిద్ధాంతము పేరు:- సమరూప మూలకాల సిద్ధాంతం
ప్రతిపాదించినవారు:- థారన్ డైక్
బదలాయింపుకు కారణముగా చూపిన అంశం :- రెండు అంశముల మధ్య సామ్యము లేక సారూప్యత


సిద్ధాంతము పేరు:- సామాన్యీకరణ సిద్ధాంతం (లేదా) సాధారణీకరణ సిద్ధాంతం
ప్రతిపాదించినవారు:- ఛార్లెస్ జూద్ (Judd)
బదలాయింపుకు కారణముగా చూపిన అంశం :- రెండు అంశముల మధ్య సూత్రము లేదా నియమము అర్ధం చేసుకొనుట


సిద్ధాంతము పేరు:- -గెస్టాల్ట్ (లేదా) సమగ్రకృతి (లేదా) ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం
ప్రతిపాదించినవారు:- వెర్టిమర్, కొయిలర్, కోఫ్ కా
బదలాయింపుకు కారణముగా చూపిన అంశం :- రెండు అంశముల మధ్య సంబంధలను గ్రహించటం


సిద్ధాంతము పేరు:- ఆదర్శాల సిద్ధాంతం
ప్రతిపాదించినవారు:- W.C. బాగ్లే
బదలాయింపుకు కారణముగా చూపిన అంశం :- ఆదర్శాలు, విలువలు, వైఖరులు బదలాయించబడతాయి


→ కీబోర్డులలోని సారూప్యత వల్ల టైపు మిషన్ వాడటం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డును చాలా సులభంగా 'ఆపరేట్ చేయగలుగుతాడు'. దీనిని వివరించే అభ్యసనా బదలాయింపు సిద్ధాంతము -సమరూప మూలకాల సిద్ధాంతం.
→ అక్షర సారూప్యత వల్లే హిందీ చదవటం వచ్చిన వ్యక్తి సంస్కృతంను చదవటం సులభంగా నేర్చుకోగలిగాడు. దీనిని వివరించే అభ్యసనా బదలాయింపు సిద్ధాంతం -సమరూప మూలకాల సిద్ధాంతం.
→ వక్రీభవన సూత్రం నేర్చుకున్న విద్యార్థి నీటిలోని గమ్యాన్ని గురిచూసి కొట్టగలగటంలో జరిగిన అభ్యసనా బదలాయింపును వివరించు సిద్ధాంతం. - సాధారణీకరణ సిద్ధాంతం.
→ మోటారు ఇంజన్ ను రిపేరు చేయగలవ్యక్తి ఆ సూత్రంపై పనిచేసే ఇతర వాహనాల ఇంజన్లు కూడా రిపేరు చేయటం చాలా సులభంగా నేర్చుకోగలడు. దీనిని వివరించే అభ్యసనా బదలాయింప సిద్ధాంతం - సాధారణీకరణ సిద్ధాంతం,
→ జ్యామెట్రీలో అనేక సిద్ధాంతములు నేర్చుకున్న జ్ఞానముతో వానితో సంబంధముండే రైడర్స్న సులువుగా సాధించగలుగుటను వివరించు అభ్యసనా బదలాయింపు సిద్ధాంతం. - గెస్టాల్ట్ సిద్ధాంతం.
→ కాలమునకు, రేఖాంశములకు మధ్య సంబంధమును గ్రహించుట ద్వారా స్థానిక సమయములను లెక్కించు అభ్యసనం సులువుగా చేయగలుగుటను వివరించు బదలాయింపు సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం,
→ ఇంట్లో పరిశుభ్రతను పాటించు వ్యక్తి ఆఫీస్, తను ఉండే ఇతర ప్రదేశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత (పరిశుభ్రత అనే ఆదర్శం బదలాయించబడటం) ఇస్తాడు అని తెలియచెప్పే బదలాయింపు సిద్ధాంతం- ఆదర్శాల సిద్ధాంతము.
→ కుటుంబ సభ్యులతో నిజాయితీ పాటించు వ్యక్తి తను చేసే ఉద్యోగంలో కూడా నిజాయితీ గానే (నిజాయితీ అనే ఆదర్శం) ఉండటంను. వివరించు బదలాయింపు సిద్ధాంతం. - ఆదర్శాల సిద్ధాంతం,

→ పిల్లల్లో అభ్యసనా బదలాయింపును పెంపొందించుటకు ఉపాధ్యాయుడిగా నీవు చేయవలసినది -
i) పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించుట.
ii) అంశముల మధ్య సంబంధములను గుర్తింపచేయుట.
iii) ఒకే సూత్రము / నియమముపై పనిచేయు అంశములను గుర్తించేట్లు చేయుట.