అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు
అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు:-
1) వ్యక్తిగత కారకాలు
2) పాఠశాల కారకాలు
3) కుటుంబ కారకాలు
4) సామాజిక కారకాలు
వ్యక్తిగత కారకాలు మరల 2 రకాలు
i) శారీరక సంబంధ కారకాలు
ii) మానసిక సంబంధ కారకాలు
1. వయస్సు : -
→ అభ్యసనంపై వయస్సు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగేకొలది అభ్యసన సామర్థ్యం తగ్గుతుంది. వివిధ వయస్సుల పిల్లల మానసిక స్థాయిలను బట్టి అభ్యసనానుభవాలను విభజించి విద్య ఎడల ఆసక్తిని పెంపొందించాలి.
2. పరిణతి/పరిపక్వత: -
→ వ్యక్తిలో పరిపక్వత లేకుంటే అభ్యసనం సక్రమంగా జరుగదు. శారీరక సన్నద్ధతను శారీరక పరిణతి అంటారు. విద్యార్థుల పరిణతి స్థాయికి తగినట్లు కృత్యాలను ఏర్పాటు చేయాలి.
3. అలసట :-
→ శక్తిని వినియోగించటం వలన తగ్గిన సామర్ధ్యస్థితిని అలసట అంటారు. విశ్రాంతి లేకుండా పనిచేయటం వలన అలసట కలిగి అభ్యసనాశక్తి సన్నగిల్లుతుంది. కావున అభ్యసనం మధ్యలో విరామం కల్పిస్తూ నేర్పించాలి.
4. లింగభేదం:-
→ డెర్మన్ మరియు ట్రైలర్ చేసిన పరిశోధనల్లో స్త్రీ, పురుషుల సామర్థ్యాలలో తేడాలున్నట్లు నిరూపించబడింది. భాష, రాతపని, కళలయందు బాలికలలో అధిక సామర్థ్యమున్నట్లుగా, గణితము, చరిత్ర, సైన్సులందు బాలురలో అధిక సామర్ధ్యమున్నట్లు గుర్తించారు. కావున లింగభేదాన్ని అనుసరించి వారి అభిరుచులు, వైఖరులు, శక్తిసామర్థ్యాలను బట్టి వివిధ రకాలయిన అభ్యసనా కృత్యాలను ఏర్పాటు చేయాలి.
మానసిక సంబంధ కారకాలు :-
1. ప్రేరణ:-
→ అభ్యసనకు అవసరమయిన మానసిక సంసిద్ధతనే ప్రేరణ అంటారు. ఒక నిర్దిష్టమయిన కృత్యమును అభ్యసించుటకు తగిన ప్రేరణ ఉంటేనే త్వరితంగా అభ్యసించగలుగుతారు. ప్రేరణ అభ్యసనానికి రాచబాట. ప్రేరణ అవసరాలతో ముడిపడి ఉంటుంది. ప్రేరేపించబడ్డ వ్యక్తి గమ్య నిర్దేశక ప్రవర్తనను కనపరుస్తాడు.
2. ప్రజ్ఞ :-
→ అభ్యసించగలిగే, గ్రహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ ప్రజ్ఞావంతులు వేగంగా అభ్యసించగలుగుతారు. ప్రజ్ఞ తక్కువగా గలవారు. నిదానంగా అభ్యసిస్తారు. ప్రజ్ఞకు తగిన విధంగా అభ్యసనా కృత్యాలు ఏర్పాటు చేయాలి.
3. అభిరుచి :-
→విద్యార్ధిని ఏకాగ్రతతో ఒక కృత్యములో నిమగ్నమయ్యేట్లు చేసేది అభిరుచి. ఇది వ్యక్తిలోని అంతర్గత శక్తి, విద్యార్థుల అభిరుచులకు అనుగుణమయిన కృత్యాలను ప్రవేశపెట్టి బోధించాలి.
4. స్మృతి :-
→ మంచి జ్ఞాపకశక్తి గలిగిన అభ్యాసకుడు ఎంత కఠినమైన విషయాన్నైనా సులువుగా అభ్యసిస్తాడు. కావున ఉపాధ్యాయుడు స్మృతిని పెంపొందించు పద్ధతులను అనుసరించాలి.
5. అవధానం :-
→ జ్ఞానేంద్రియాలతోపాటు మనస్సును లగ్నంచేసి నేర్చుకోవటమే అవధానం. అవధానంతో చేసే అభ్యసనం ద్వారా త్వరగా విద్యాలబ్ధిని పొందవచ్చు.
6. సహజ సామర్థ్యం :-
→ ఇది ఏదో ఒక రంగంలో / సబ్జెక్టులో ఉండే ప్రత్యేకమయిన / సహజసిద్ధమయిన సామర్థ్యం, విద్యార్థులలో ఉండే సహజ సామర్థ్యాలను గుర్తించి తదనుగుణమయిన రంగంలో తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ సామర్ధ్యాలు అభ్యసనను సులభతరం చేస్తాయి.
7. సంవేదనలు మరియు ప్రత్యక్షము :-
→ జ్ఞానాత్మక అభ్యసనానికి సంవేదనలు (sertsations) మరియు ప్రత్యక్షము (preception) ప్రాతిపదికలు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగునట్లు బోధనా విధానాన్ని రూపొందించుకోవాలి.
పాఠశాల కారకాలు :-
→ మార్గదర్శకత్వంతో కూడిన అభ్యసనం.
→ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు.
→ ఆకర్షణీయమైన మరియు ఉపయుక్తమైన పాఠ్యప్రణాళిక.
→ అవసరమయిన గ్రంథాలయాలు, ప్రయోగశాలలు పాఠశాలల్లో ఏర్పాటు చేయటం.
→ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగిన విధంగా ఉంచుకొనుట.
→ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల మధ్య సరి అయిన సంబంధాలను నిర్వహించుట.
→ కాలక్రమపట్టికను తగిన విధంగా రూపొందించుకొనుట.
→ అభ్యసనా సామాగ్రిని అందుబాటులో ఉంచుట.
→ సహపాఠ్య కార్యక్రమాలు అమలు చేయుట,
→ ఉపాధ్యాయులు ఉపయోగించే నూతన బోధనా పద్ధతులు మొదలగునవి అభ్యసనంపై అనుకూల ప్రభావం చూపే పాఠశాల కారకాలు అగును.
కుటుంబ కారకాలు :-
→ ఇంటి వద్ద శిశువుకు కల్పించు అధ్యయన వసతులు.
→ చదువుపట్ల ఉండే తల్లిదండ్రుల వైఖరులు,
→ తల్లిదండ్రుల విద్యార్హతలు మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితి..
→ పిల్లలను పెంచే తీరు.
→ ఇంటిలో తల్లిదండ్రులు విద్యాపరంగా పిల్లలకు అందించు సహకారం.
→ ఇంటిలో పిల్లలకందించు పౌష్టికాహారం.
→ ఇంటిలో కల్పించు సాంకేతిక వనరులు మొ॥వి అభ్యసనపై ప్రభావం చూపు కుటుంబ కారకాలు అగును.
సామాజిక కారకాలు:
→ ఇరుగు పొరుగు కుటుంబాలు వ్యవహరించే తీరు.
→ సమాజం పాటించే ఆచార, సంప్రదాయాలు
→ సమాజం అందించే విద్యా వనరులు
→ కులము, మతము, రేడియో T.V. వంటి ప్రసార మాధ్యమాలు, వివిధ సాహిత్య గ్రంథాలు మొ||వి. అభ్యసనపై ప్రభావం చూపు సామాజిక కారకాలు.