అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




శిశు వికాసమును గూర్చి తెలుపు అధ్యయన పద్ధతులు (పరిశీలన, పరిపృచ్ఛ, వ్యక్తి అధ్యయనం, ప్రయోగ, ప్రశ్నావళి పద్ధతి. లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు)




మనోవిజ్ఞానశాస్త్రం


→ 1879 లో జర్మనీలోని లీగ్ నగరంలో ఊంట్ అనే మనోవిజ్ఞానవేత్త మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించడం ద్వారా మనోవిజ్ఞానశాస్త్రం తత్వశాస్త్రం నుండి వేరుపడి ఒక ప్రత్యేక శాఖగా ఎదిగింది.
→ మనోవిజ్ఞానశాస్త్రాన్ని క్రీ. పూ. 400 సం||లు నాడే గ్రీకు తత్వవేత్తలు పేర్కొన్నారు.
→ మనోవిజ్ఞానశాస్త్రాన్ని ఇంగ్లీష్ సైకాలజి అంటారు..
→ సైకాలజి అనే ఇంగ్లీషు పదం సైకీ మరియు లోగాస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
→ సైకీ అంటే ఆత్మ (లేదా) మనస్సు అని, లోగాస్ అంటే శాస్త్రం (లేదా) అధ్యయనం అని అర్ధము.
→ పురాతన గ్రీకు తత్వశాస్త్రాన్ని పరిశీలిస్తే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలైనవారు ఈ శాస్త్రాన్ని మొదట ఆత్మకు సంబంధించిన శాస్త్రమని భావించారు.
→ కాలక్రమేణా మనోవిజ్ఞానశాస్త్రాన్ని మనసుకు సంబంధించిన శాస్త్రమని నిర్వచింపసాగారు. తరువాత కాలంలో అంటే ఊంటి, టిపర్, విలియం జేమ్స్ మనోవిజ్ఞానశాస్త్రాన్ని చేతనానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించారు.
→ 20వ శతాబ్ది ప్రారంభంలో జాన్. బి. వాట్సన్ అతి ముఖ్యమైన ప్రవర్తనా వాదాన్ని ప్రవేశపెట్టారు. ఇతని సిద్ధాంతం ప్రకారం మానవులను అర్థం చేసుకోవడానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం.
→ ప్రస్తుతం ప్రవర్తనా వాదం ప్రకారం మనోవిజ్ఞానశాస్త్రాన్ని ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించవచ్చు. ఉడ్వర్త్ అనే శాస్త్రవేత్త పై నిర్వచనాలను సమీక్షిస్తూ 'మనోవిజ్ఞాన శాస్త్రం' మొదట తన ఆత్మను, తరువాత తన మనసును పోగొట్టుకుంది.
→ చివరకు తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని, ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రం నిలుపుకుంది' అని చమత్కరించడం జరిగింది.

విద్యా మనోవిజ్ఞానశాస్త్ర అర్థం (Educational Psychology) :
→ విద్యా మనోవిజ్ఞానశాస్త్రం మనోవిజ్ఞానశాస్త్ర అనుప్రయుక్త శాఖలలో ఒక ముఖ్యమైన శాఖ. ఇది విద్య, మనోవిజ్ఞాన శాస్త్రాల కలయిక వల్ల ఏర్పడినటువంటిది.
→ తాజా విద్యా సంస్థలలో చదివే పిల్లల అధ్యయనం చేస్తుంది.
→ పెరుగుదల, వికాసం, అభ్యసనం, మూర్తిమత్వం, వైయక్తిక భేదాలు మొదలైన అంశాలను గురించి
→ ఇది విద్య ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను వివరించదు. పాఠశాలలో ఏమి బోధించాలన్నది నిర్ణయించదు. అయితే విద్యా లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి కృత్యాలను ఎంపిక చేసుకోవాలనేది వివరిస్తుంది.
→ విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అవసరం ఎంతైనా ఉంది.
→ పాఠ్య ప్రణాళిక తయారీలో, పాఠ్య పుస్తకాల రచనలో, కాలక్రమ పట్టిక తయారీలో, విద్యా మనోవిజ్ఞానశాస్త్ర జ్ఞానం తప్పనిసరి.
→ విద్యా మనోవిజ్ఞానశాస్త్రం, లక్ష్యాలను చేరుకొనే మార్గాలను అందిస్తుంది.
→ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అనేక శాస్త్రీయ పద్ధతులు కలవు వాటిలో కొన్ని ముఖ్యమైనవి.

అంతఃపరీక్షణ పద్ధతి


→ ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతులలో ఇది పురాతనమైన పద్ధతి. మనోవిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దశలో ఆత్మపరీక్షణ ద్వారా అంతర పరిశీలన చేయడం ద్వారా ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతిని అంతఃపరీక్షణ అని అంటారు.
→ ఇంట్రో స్పెక్షన్ అనే మాట ఇంట్రో - లోపల లేక లోపలివైపు మరియు స్పియర్ - తొంగిచూచుట అనే రెండు లాటిన్ పదాల నుండి
→ ఇంట్రో స్పెక్షన్ అంటే లోపలికి చూడటం లేక స్వయం పరిశీలన లేక అంతఃపరిశీలన అవుతుంది. అంటే తన మానసిక పరిస్థితులను స్వయంగా తనే పరిశీలించు కోవడమన్నమాట. నామననేం బాగాలేదు. నా బుర్రేం పనిచేయడంలేదని మనం అప్పుడప్పుడూ అంటూ ఉంటాం అంటే దాని అర్థం మనం మన మానసిక పరిస్థితిని తెలుసుకొని బయటకు తెలియజేస్తున్నామన్న మాట.
→ అంతఃపరీక్షణ ద్వారా ఏ వ్యక్తి అయిన తన మానసిక అనుభవాల్ని, అనుభూతుల్ని, ఉద్వేగాల్ని, సంఘర్షణల్ని, వ్యాకులతల్ని ఇంకా అనేక మానసిక స్థితిగతుల్ని తెలుసుకొంటాడు.

అంతఃపరీక్షణ ప్రయోజనాలు :
→ అంతఃపరీక్షణ అనేది చాలా సరళమైన పద్ధతి.
→ ఎప్పుడంటే అప్పుడు వినియోగించుకో గలిగినటువంటిది.
→ వ్యక్తిగత పద్ధతి.
→ ఎలాంటి పరికరాల, ప్రయోగశాలల అవసరం లేకుండా అంతఃపరీక్షణ జరపవచ్చు.
→ అంతర్గత అనుభవాలను తెలుసుకోవచ్చు.
→ అంతఃపరిశీలన జరుపుకొని సమాజం ఆమోదించిన అంశాలనే వ్యక్తీకరించవచ్చు.
→ ప్రేమ, లైంగికానందం, బాధ లాంటి కొన్ని ప్రత్యేక అనుభవాలను వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన జరుపుకోవచ్చు.

అంతఃపరీక్షణ పరిమితులు:-
→ వ్యక్తిగతమైనటువంటిది కనుక తనకిష్టం లేని అంశాలను దాచిపెట్టి తనకనుకూలమైన వానివి వ్యక్తీకరించే అవకాశం ఉంది. కనుక దీనికి విషయనిష్టత లేదనే చెప్పాలి.
→ పరిశీలించేది, పరిశీలింపబడేది ఒకరే కనుక అంతఃపరీక్షణ పద్ధతికి ప్రామాణికత, విశ్వసనీయత లేనని చెప్పవచ్చు.
→ మానసిక ప్రక్రియలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కనుక వాటినన్నింటినీ గుర్తుంచుకొని చెప్పడం కష్టం అవుతుంది. కరిగిపోయిన తర్వాత ఆ మానసిక అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని చెప్పడం అంత తేలిక కాదు. అందుకనే విలియం జేమ్స్ అభిప్రాయంలో దీపం వెలిగించిన తర్వాత చీకటి గురించి వర్ణించమన్నట్లు ఉంటుంది అంతఃపరీక్షణ చేయమంటే.
→ అనుభవాల్ని వర్ణించడానికి భాషా కౌశలాలు అవసరం. భాషా పరిజ్ఞానం లేని పిల్లలు, మందమతులు అంతఃపరీక్షణ చేసుకోగలిగినా ఆ వివరాలను విశదీకరించలేదు.
→ ఊహించి చెప్పడానికి అవకాశం ఉంది.
→ ఇది శాస్త్రీయ ఆధారం లేని పద్ధతి.
→ ఉపాధ్యాయుడు తన బోధన గురించి ఆత్మపరిశీలన చేసికొని విద్యా లక్ష్యాలను సాధించడంలో తనవంతు పాత్రను నిర్వహించవచ్చు.

పరిశీలనా పద్ధతి


→ ప్రవర్తనను ఉన్నదున్నట్లుగా గ్రహించడమే పరిశీలన అని చెప్పవచ్చు. ఇతరులు వ్యక్తపరిచే ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించడం ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నపుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను లేదా ప్రవర్తనాంశాలను పరిశీలించడం జరుగుతుంది. పరిశీలనలు సాధారణంగా 4 రకాలు అవి: పరిశీలనలు రకాలు:-
1. సహజ పరిశీలన,
2. నియంత్రిత పరిశీల,
3. సంచరిత / సహభాగి పరిశీలన,
4. అసంచరిత పరిశీలన / సహభాగేతర పరిశీలన
1. సహజ పరిశీలన: పరిశీలనాంశాలు సహజ పరిస్థితులలో జరుగుతున్నపుడు పరిశీలించడాన్ని 'సహజ పరిశీలన' అంటారు. సహజ పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామని తెలియదు. తెలియకూడదు.
ఉదా : ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించుట.

2. నియంత్రిత పరిశీలన: సహజ పరిస్థితులలో పరిశీలించటం అనేది అన్ని అంశాలకు సాధ్యం కాదు. అలాంటప్పుడు కృత్రిమంగా పరిశీలనా సన్నివేశాలు కల్పించి, ఆయా సన్నివేశాలలో జీవి ప్రవర్తనను గమనించడం జరుగుతుంది. దీనినే నియంత్రిత పరిశీలన అంటారు. ఈ పరిశీలనలో తాము పరిశీలింపబడుతున్నాము అనే విషయం ప్రయోజ్యుడికి తెలిసే ఉంటుంది.
ఉదా: స్కిన్నర్ ఎలుకలపై చేసిన ప్రయోగంలో స్కిన్నర్ యొక్క పరిశీలన నియంత్రిత పరిశీలన అగును.

3. సంచరిత పరిశీలన / సహభాగి పరిశీలన: ఈ రకమైన పరిశీలనలో పరిశీలకుడు సన్నివేశంలో తాను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నటితో నిశితంగా చూడటాన్ని సంచరిత పరిశీలన అంటారు.
ఉదా: ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలతోపాటు ఆడుకుంటూ ఎంపిక చేసిన విద్యార్ధి ప్రవర్తనను పరిశీలించుట

4. సంచరిత పరిశీలన / సహ భాగేతర పరిశీలన:- పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి, తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను వారికి తెలియకుండా పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. ముఖ్యంగా పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.
ఉదా : ప్లే గ్రౌండ్లో ఆడుకునే విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయుడు చాటుగా దూరంగా ఉండి పరిశీలించుట

పరిశీలనా పద్ధతి విద్యా ఉపయోగాలు :-
→ అసాధారణ ప్రవర్తనకు కారణాలు అన్వేషించవచ్చు. అసాధారణ శిశువులను, ప్రజ్ఞావంతులను, వెనుకబడిన వారిని, మందబుద్ధులను పరిశీలించి తగిన చర్యలను చేపట్టవచ్చు. శా విద్యార్థుల ప్రవర్తనను నేరుగా అధ్యయనం చేయవచ్చు.
→ సహజ ప్రవర్తననే కాకుండా కృత్రిమంగా కల్పించిన సన్నివేశాలలో కూడ ప్రవర్తనను తెలుసుకోవచ్చు.
→ జంతువులు, భాషాభివృద్ధి చెందని పిల్లలు, మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చును.

పరిశీలనా పద్దతి పరిమితులు:
→ నియంత్రిత పరిశీలనను ఉపయోగించినపుడు జీవి సహజత్వాన్ని కోల్పోయే అవకాశం వుంటుంది.
→ బయట ప్రవర్తనను మాత్రమే అంచనా వేయగలగుతాము. మనస్సులో వున్నది తెలుసుకోలేము..
→ పరిశీలకుల స్వభావము, వైఖరి, వస్తు నిష్టత లేకపోవటం వల్ల పరిశీలన ఫలితాలలో మార్పు రావచ్చు.
→ పరిమాణాత్మకంగా నివేదించలేము.

ఇంటర్వ్యూ పద్ధతి / పరిపృచ్చా పద్ధతి


→ ఏదో ఒక సమాచార సేకరణా ఉద్దేశ్యంతో ఒక అంశానికి సంబంధించి వ్యక్తుల వైఖరులను / అభిప్రాయాలను తెలుసుకొనుటకు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ముఖాముఖి, మౌళిక సంభాషణనే పరిషృచ్ఛ అంటారు.
→ ఒక నిర్దిష్ట అంశముపై ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబట్టి వాటిని విశ్లేషించి, వానిపై వ్యాఖ్యానించే పద్ధతినే పరిష్పచ్చా పద్ధతి అంటారు.
→ పరిషృచ్ఛ పద్ధతిని అధ్యయన పద్ధతి అనేకంటే అభిప్రాయ సేకరణా పద్ధతిగా చెప్పుకోవచ్చు.
→ ఇంటర్వ్యూ అనేది ఒక రకంగా మౌలిక ప్రశ్నావళి వంటిది.
→ ఇంటర్వ్యూలో ప్రశ్నలడిగే వ్యక్తిని పరిపృచ్ఛకుడు అని, జవాబులు ఇచ్చే వ్యక్తిని పరిష్కృచ్ఛితుడు
→ ఇంటర్వ్యూ 2 రకాలు :-
1. సంరచిత ఇంటర్వ్యూ
2. అసంరచిత ఇంటర్వ్యూ అని అంటారు.


→ సంరచిత ఇంటర్వ్యూలో ప్రయోక్త ముందుగానే తాను అడగదలుచుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలకు రూపొందించుకొని, వాటిని వరుసక్రమంలో అడుగుతూ వాటి మీద జవాబులు రాబట్టి నమోదుచేయడం జరుగుతుంది.
ఉదా : ఒక వ్యక్తిలోని ప్రత్యేక మూర్తిమత్వ లక్షణాలను తెలుసుకొనుటకు చేయు ఇంటర్వ్యూ.

→ అసంరచిత ఇంటర్వ్యూలో సమయానుకూలంగా ప్రశ్నలు చేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది.
ఉదా : 10వ తరగతి స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థితో టి.వీ వారు చేసే ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ పద్ధతి వల్ల ఉపయోగాలు:-

→ కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించి వ్యక్తుల అభిప్రాయాలను సేకరించవచ్చు.
→ సమాచారం ప్రత్యక్షంగా అదే వ్యక్తి నుంచి రాబట్టడం జరుగుతుంది కాబట్టి, అధ్యయనం చేసే వ్యక్తి పక్షపాత వైఖరి సమాచారంపై పడదు

పరిమితులు:-
→ దీనిని చిన్న పిల్లలు, మానసిక మాంధ్యులు, మూగవారు, జంతువుల ప్రవర్తనను తెలుసుకొనుటకు ఉపయోగించలేము.
→ దీనిలో తనకు అనువైన ప్రశ్నలు లేనపుడు నిజాలు దాచి పెట్టు అవకాశం కలదు.
→ అధ్యయనంపై అపోహలు వుంటే తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం వుంది.

ప్రయోగాత్మక పద్ధతి


→ ప్రర్తనను అధ్యయనం చేయడంలో ప్రయోగపద్ధతిని అత్యంత వస్తు నిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు.
→ ఎవరి ప్రవర్తనా లక్షణాలను అధ్యయనం చేయదలచామో వారిని లేదా వాటిని శాస్త్రీయంగా పరీక్షించడానికి చేసే ప్రయత్నమే ప్రయోగం అని చెప్పవచ్చు. లేదా ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగ పద్ధతి అనవచ్చు. దీని ద్వారా కార్యకారక సంబంధాలు గుర్తించవచ్చు.

ప్రయోగ పద్ధతిలో కొన్ని పదాలు :-

→ ఉద్దీపన ప్రవర్తనా మార్పుకు దోహదం చేసేది.
→ ప్రతిస్పందన ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్య.
ఉదా : ఉపాధ్యాయుని చూసినంతనే విద్యార్థులు లేచి నిలబడుటలో ఉద్దీపన ఉపాధ్యాయుడు కాగా ప్రతిస్పందన లేచి నిలబడుట

→ ప్రయోక్త / పరిశోధకుడు ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో వారిని ప్రయోక్త లేదా పరిశోధకుడు అంటారు.
→ ప్రయోజ్యుడు ఎవరి మీద అయితే ప్రయోగం నిర్వహిస్తున్నామో వారిని ప్రయోజ్యుడు అంటారు.
→ చరాలు చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తాను మారేది అని అర్ధం.
→ చరాలు 3 రకములు. అవి :
1) స్వతంత్ర చరం : ప్రయోక్త స్వతంత్రంగా ప్రయోగ సమూహంపై ఉపయోగించే చరమే స్వతంత్ర చరం. స్వతంత్ర చరాలు ఎప్పుడూ ప్రయోక్త అధీనంలో ఉంటాయి. ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చు. ఇది కారణం పాత్రను పోషిస్తుంది.
2) పరతంత్ర చరం : స్వతంత్ర చర ప్రభావానికి లోనయ్యే చరం. అనగా ఉద్దీపనకు ప్రతిగా జరిగేది ప్రతిస్పందనా చరం. ప్రతిస్పందనలను పరతంత్ర చరం అంటారు. ఇది ఫలితం పాత్రను పోషిస్తుంది.
3) మధ్యస్థ చరం : మధ్యస్థచరం / జోక్యచరం అనేది ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజ్యని పరతంత్రచరంపై ప్రభావాన్ని చూపే విషయాన్ని గాని పరిస్థితినిగాని, మధ్యస్థ చక్రం అంటారు. ఇది ప్రయోక్త ఆధీనంలో ఉండదు, ప్రయోగ సన్నివేశాలలో ప్రయోక్త గమనించలేనిది. ప్రయోజ్యునిలోని అలసట, వ్యక్తిగతమైన మానసిక సమస్యలు, ప్రయోగంపై ప్రయోజ్యుల నిరాసక్తత మొదలైనవి.
ఉదా : విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై యోగా ప్రభావం అనే ప్రయోగంలో
యోగా - స్వతంత్రచరం, శారీరక ఆరోగ్యం పరతంత్ర చరం, విద్యార్థుల వయస్సు మధ్యస్థ చరము

సమూహాలు:-
→ ప్రయోగపద్ధతిలో 2 రకాల సమూహాలు ఉంటాయి. అవి
ఎ) నియంత్రిత సమూహం ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాని పరిస్థితిని నియంత్రిత స్థితి అంటారు. నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు. స్వతంత్ర చరాల ప్రభావానికి గురికాని సమూహం.
బి) ప్రయోగాత్మక సమూహం : ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు. స్వతంత్ర చరాలను ప్రయోగించే సమూహం.
ఉదా : X మరియు y అను రెండు సమూహాలలో బహుమతుల పాత్ర తెలుసుకొనుటకు ఒక కృత్యము పూర్తి చేసినప్పుడు y పై బహుమతులు ప్రకటించి X పై ఏ బహుమతి ప్రకటించనట్లయితే ఇందులో నియంత్రిత సమూహముx ప్రయోగ సమూహము - Y * సమూహాలను ఎంచుకొనేటప్పుడు జోక్య చరాలను అదుపులో పెట్టుటకు రెండు పద్ధతులు ఉపయోగిస్తారు.
1) నివారణ పద్ధతి,
2) నియంత్రణ సమూహ పద్ధతి.
అవి :

→ ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితులను నివారించటమే నివారణ పద్ధతి. దీనిలో భాగంగా రెండు సమూహాలకు ఒకే తరగతి గది వాతావరణము, ఒకే విశ్రాంతి కల్పిస్తారు.
→ రెండు సమూహాలలో ఎంచుకొనే వ్యక్తుల ప్రజ్ఞ, స్మృతి, సాధన, సామర్థ్యం ఒకే విధంగా ఉండేటట్లు ప్రామాణిక పరీక్షల ద్వారా చూడటమే నియంత్రణ సమూహ పద్ధతి.
→ సమూహాలను 3 పద్ధతుల్లో ఎంపిక చేస్తారు. అవి
1) సమజోడి పద్దతి
2) సమసమూహ పద్ధతి
3) యాదృచ్ఛిక సమూహ పద్ధతి.

→ సమజోడి పద్ధతి:- ప్రామాణికమైన పరీక్షలను పెట్టి సమాన మార్కులు వచ్చిన ఇద్దరిద్దరిని చెరొక సమూహములోకి ఎంపిక చేయు పద్ధతి
→ సమసమూహ పద్ధతి : ప్రామాణికమైన పరీక్షలు నిర్వహించి సగటు మార్కు ఆధారంగా రెండు సమూహాలను ఎంపిక చేయు పద్ధతి.
→ యాదృచ్ఛిక సమూహ పద్ధతి : సంబంధిత జోక్య చరాలను గుర్తించటంలోకాని, నియంత్రించుటలోగాని చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా వ్యక్తులను రెండు సమూహాలకు ఎంపిక చేయు పద్ధతి,
→ ప్రయోగ నమూనాలను ఫెదరర్ రెండు రకాలుగా పేర్కొన్నాడు. అవి:
1) క్రమబద్ధమయిన నమూనా
2) యాదృచ్ఛిక నమూనా

→ మరల క్రమబద్ధమైన నమూనాలో 3 రకాల నమూనాలు కలవు. అవి:
1) ఏకసమూహ నమూనా
2) సమాంతర సమూహ నమూనా
3) భ్రమణ సమూహ నమూనా
ప్రయోగ పద్ధతిలోని నమునాలు :-
1. ఏకసమూహ నమూనా:- ఒకే సమూహమును నియంత్రిత సమూహముగా ఒకసారి, ప్రయోగ సమూహముగా మరొకసారి ఎంపికచేసి ఫలితము యొక్క తేడాను తెలుసుకొనే నమూనా.
2. సమాంతర రెండు సమూహాల నమూనా:- రెండు సమూహాలను తీసుకొని ఒక సమూహమును నియంత్రిత సమూహముగా మరో సమూహమును ప్రయోగ సమూహముగా ఎంపిక చేసి ఆ ఫలితము యొక్క తేడాను తెలుసుకొనే నమూనా.
3. భ్రమణ సమూహ నమూనా:- రెండు సమూహాలను ఎంచుకొని నియంత్రిత సమూహముగా మరియు ప్రయోగ సమూహముగా రెండింటిని మార్చి మార్చి ప్రయోగం చేసి ఫలితము యొక్క తేడాను తెలుసుకొనే నమూనా
ప్రయోగ పద్దతి ఉపయోగాలు:-
→ అత్యంత శాస్త్రీయమైనది, క్రమబద్ధమైనది, వస్తు నిష్టత కలిగినది. కారణానికి ఫలితానికి మధ్య వుండే సంబంధం (కార్యకారక సంబంధం) కనుక్కోవటానికి ఖచ్చితమైన పద్ధతి.
→ ప్రయోగ ఫలితాలను మరల మరల నిరూపించవచ్చును.
→ తరగతిగది ఉపాధ్యాయులు నూతన ఆవిష్కరణలు చేయుటకు, తక్షణ తరగతి గది సమస్యలు పరిష్కరించుకొనుటకు ఉపయోగించదగినది.
ప్రయోగ పద్ధతి పరిమితులు:-
→ జీవుల అన్ని రకాల ప్రవర్తలను మనం ప్రయోగశాలలో ప్రవేశపెట్టి పరిశీలించలేం.
ఉదా: సమ్మెలు, యుద్ధాలు, దొమ్మీలలో పాల్గొనప్పుడు వ్యక్తి ఉద్వేగాలను అలాగే ప్రయోగశాలలో పరిశీలించలేము.


→ జోక్యం చేసుకొనే చరాలను అదుపుచేయడం కష్టతరమైన విషయం.

నిర్ధారణా మాపనులు (Rating Scales)


→ ఒక వ్యక్తి గురించి తను మరియు ఇతరులు నిర్ధారణ చేసే అంచనా సాధనాలు ఇవి. అతని గురించి ఇతరులు ఏర్పరచుకొనే అభిప్రాయాలను తెలియజేస్తాయి. వ్యక్తిలో ఒక మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో నిర్ణయించవచ్చు.
ఇవి 2 రకాలు.
1. స్వీయ నిర్ధారణ మాపని,
2. పర నిర్ధారణ మాపని.

→ వ్యక్తే స్వయంగా గుర్తించేవి - స్వీయ నిర్ధారణ మాపనులు.
→వ్యక్తిని గురించి తెలిసిన ఇతరులు గుర్తించేవి - పరనిర్ధారణ మాపనులు. ఉపయోగాలు :-
→ వ్యక్తికి తెలిసిన ఎక్కువ మందికి ఇచ్చి మాపనం చేయిస్తారు. కాబట్టి విశ్వసనీయత ఉంటుంది.

పరిమితులు:-
→ స్వీయ నిర్ధారణ మాపనులను చిన్న పిల్లలు, నిరక్షరాస్యులు, మూధులపై ఉపయోగించలేము.
→ మానసం చేసే వ్యక్తి అధికంగా సగటు మార్కు గుర్తించడం జరుగుతుంది. దీన్ని కేంద్రీయ ప్రవృత్తి దోషం అంటారు.
→ ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించడం జరుగుతుంది. దీన్ని ఔదార్య దోషం అంటారు.
→ వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేసినట్లయితే పరివేష ప్రభావం అంటారు..

వ్యక్తి అధ్యయన పద్ధతి


→ వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ పద్ధతి అని కేస్ స్టడీ పద్ధతి అని కూడా అంటారు.
→ ఒక వ్యక్తి సమస్యను డయాగ్నోసిస్ చేసి నివారణోపాయాలను సూచించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
→ సమస్యాత్మక శిశువు గురించి కూలంకుషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.
→ సమస్యాత్మక ప్రవర్తన కిందకు వచ్చే ప్రవర్తనలు పాఠశాలకు హాజరు కాకపోవడం, దొంగతనం, దౌర్జన్యం, వ్యాకులత, సిగ్గుపడటం, హఠం చేయడం, అబద్ధాలు చెప్పడం, రోజూ పాఠశాలకు ఆలస్యంగా రావటం మొ॥వి.
→ కేస్ స్టడీ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయబడే వారు ప్రతిభావంతులైన శిశువులు, సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువులు, ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు, బాగా సఫలత / విఫలత చెందిన వ్యక్తులు లేదా సంస్థలు
→ కేస్ స్టడీలో భాగంగా శిశువు యొక్క వ్యక్తిగత వివరాలతో పాటు అతని సమగ్ర విద్యా రికార్డు, అతనిపై తల్లిదండ్రుల, స్నేహితులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు మరియు అతనిపై ప్రయోగించిన వివిధ శోధికలను మూల్యాంకనం చేయటం ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి సమగ్ర రిపోర్టును తయారుచేస్తారు. అతనికున్న సమస్యలను నివారించటానికి తగిన ఉద్దీపనలు ప్రవేశపెట్టి సమస్యలను నివారిస్తారు.

కేస్ స్టడీలో దశలు :-
సమస్యా నిర్ధారణ దశ :-
1. సమస్యను గుర్తించుట
2. ప్రాక్కల్చనలు చేయుట
3. దత్తాంతాలు సేకరించుట
4. విశ్లేషణ చేసి ప్రాక్కల్పనలను సరిచూసుకొని నిర్ధారణకు వచ్చుట

సమస్య నివారణ దశ :-
1. తగిన సూచనలు, సలహాలు ప్రవేశపెట్టుట
2. వ్యక్తిలో వచ్చు మార్పులను గమనించుట
3. అంతిమ అభిప్రాయాలను వ్యక్తపరచుట
4 సమగ్ర రిపోర్ట్ కేస్ స్టడీ తయారుచేయుట

కేస్ స్టడీ ఉపయోగాలు :-
→ ఈ పద్ధతి సమస్యకు గల కారణాన్ని సమగ్రంగా తెలుసుకొని పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. వ్యక్తి లేదా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తుంది.
→ సఫలత సాధించిన వారిపై కూడా అధ్యయనం చేస్తుంది కాబట్టి ఇతరులు కూడా వారిని అనుసరించేలా చేసి సఫలత సాధించటానికి తోడ్పడుతుంది.
→ విద్యార్థి సమస్యలను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. తద్వారా విద్యార్థుల సమస్యలను అదుపులో ఉంచవచ్చు.
→ పాఠశాలకు, గృహానికి సక్రమమైన వారధి నిర్మించి సంబంధాలు సక్రమంగా ఉండేటట్లు చేస్తుంది.

కేస్ స్టడీ పరిమితులు :-
→ ఈ పద్ధతికి చాలా సమయం పడుతుంది.
→ అనేకమంది వ్యక్తులనుంచి సమాచారం సేకరిస్తాం. ఇచ్చిన సమాచారము ఖచ్చితముకాకపోతే సమస్యకు గల నిజమైన కారణం కనుక్కోలేము.
→ సుశిక్షుతుడయిన నిపుణుడు మాత్రమే చేయగల పద్ధతి.
→ సమస్యకు పరిష్కారము కనుక్కున్నప్పటికీ దానిని సాధారణీకరించలేము.

సంఘటన రచన పద్ధతి :-
→ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలో ముఖ్యమైన పద్ధతులలో ఇది కూడా ఒకటి.
→ ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ప్రత్యేక సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా పరిశీలించి నమోదు చేయడాన్ని సంఘటన రచన అంటారు.
→ ఒక్కోసారి ఇతరులు కూడా ఆ సంఘటనను పరిశీలించి నమోదు చేయవచ్చు. యదార్ధ సన్నివేశాలలో వ్యక్తి ప్రవర్తనను పరిశీలించి,నమోదు చేసి మూర్తిమత్వం లేదా ప్రవర్తనను నిర్ధారించడం వలన విషయనిష్టత అధికంగా ఉంటుంది.
→ వ్యక్తి వివిధ సమయాలలో వివిధ సంఘటనలలో ప్రవర్తించిన పద్ధతిని బట్టి అతని మూర్తిమత్వాన్ని లేదా ప్రవర్తనను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.

సంఘటన రచన పధ్ధతి విద్యా ఉపయోగాలు :-
→ మూర్తిమత్వం లేదా ప్రవర్తనకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలించి విద్యార్థి ఎలాంటి మూర్తిమత్వం లేదా ప్రవర్తనను కలిగి ఉన్నాడో, ఉంటాదో చెప్పవచ్చు.
→ అభ్యసనంలోని ఇబ్బందుల్ని తెలుసుకొని తొలగించవచ్చు.
→ వివిధ సామాజిక పరిస్థితులలో విద్యార్ధి ఎలా మెలుగుతాడో తెలుసుకోవచ్చు.
→ సంఘటన రచన తర్వాత సాంఘికీకరణంతోపాటు మూర్తిమత్వ, ప్రవర్తన అభివృద్ధికి తోడ్పాటు నందించవచ్చు.
→ కొత్త ఉపాధ్యాయులకు తన క్లాసులోని విద్యార్థుల వ్యక్తిత్వాల గురించిన అవగాహన పెంపొందించవచ్చు.
→ చికిత్సా పద్ధతికి తనవంతు తోడ్పాటునందిస్తుంది.

సంఘటన రచనా పద్ధతి పరిమితులు:-
→ సంఘటన రచన చేసేది ఇతరులయితే సొంత భావాల ప్రక్షేపణ జరిగి విషయ నిష్టత లోపించవచ్చు.
→ సంఘటనలు వెంటనే నమోదు చేయకపోతే అనేక అంశాలు తొలగింపబడవచ్చు లేదా పొందని అనుభవాలు వచ్చి చేరవచ్చు.
→ విద్యార్థులు తమంతట తాముగా సంఘటన రచన చేయలేకపోవచ్చు.

ప్రశ్నావళి పద్ధతి


→ ఒక విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నకు ఎదురుగా ఉండే అవును / కాదు / సందిగ్ధం అనే ఐచ్ఛికాలను ఎంపిక చేసి ప్రయోజ్యుడు జవాబుగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన సమాధానాల ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వంను అంచనా వేయటం జరుగుతుంది. ఉదా : R.B కాటిల్ అభివృద్ధిపరచిన 16 P.F. (Personality Factors)
→ ప్రశ్నావళులు 2 రకాలు. అవి :
→ నిర్ధారిత ప్రశ్నావళి : ఈ ప్రశ్నావళిలో అవును / కాదు / సందిగ్ధం అనే మూడింటిలో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేయాలి.
→ స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి : దీనిలో ప్రతి ప్రశ్నకు వ్యక్తి స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు.

ఉపయోగాలు :-
→ ఒకేసారి ఒక పెద్ద సమూహానికి కూడా ఉపయోగించవచ్చు. దూరాన ఉన్నవారి నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు.

పరిమితులు:-
→ విశ్వసనీయత తక్కువ.
→ సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు.

లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు


→ ఈ రెండు పద్ధతులను వికాస మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు శిశువులలో జరిగే వివిధ వికాసాత్మక మార్పులను క్రమబద్ధంగా తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు. ఈ రెండు పద్ధతులను శిశువుల సమూహాలను ఎంచుకొని దీర్ఘకాలంపాటు అధ్యయనం చేస్తారు.

లాంగిట్యూడినల్ పధ్ధతి / అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి


→ ఒకే వయసున్న శిశువుల సమూహాన్ని ఎంచుకొని ఒక క్రమపద్ధతిలో దీర్ఘకాలికంగా (అవసరమయితే కాలపరిమితిని పొడిగించుకుంటూ) ఒక వికాసాన్ని వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతే అనుదైర్ఘ్య పరిశీలనా పద్ధతి. (లాంగిట్యూడినల్ మెథడ్)
→ ఉదా : 3 సం||లు వయస్సున్న ముగ్గురు శిశువులను ఎంచుకొని 3వ సం||ము నుండి 20వ సం॥ము వరకు దీర్ఘకాలికంగా వారి యొక్క సంజ్ఞానాత్మక వికాసమును పరిశీలించుట.
దీర్ఘపరిశీలన పద్ధతిలో :-
1. ఒకే వయస్సున్న శిశువులు సమూహంలో వుంటారు.
2. పరిశీలన నియమిత కాల పరిమితి లేకుండా దీర్ఘకాలికంగా వుంటుంది.
3. ప్రతి దశలో జరిగిన మార్పులను క్షుణంగా పరిశీలించవచ్చు.
4. పిల్లలందరు అనుసరించే వికాస నమూనాను గుర్తించవచ్చు.
5. క్రమబద్ధమైన ఖచ్చితమైన పరిశీలన పద్ధతిగా దీనిని చెప్పుకోవచ్చు.

పరిమితులు :-
1. దీర్ఘకాలికమైనది మరియు శ్రమతో కూడుకున్నది.
2. ఒకే పరిశీలకుడు చివరి వరకు పరిశోధన సాగించటం కష్టం.
3. ప్రయోజ్యలు కొద్దికాలం తరువాత అధ్యయనంలో పాల్గొనటానికి నిరాకరించవచ్చు.

క్రాస్ సెక్షనల్ పద్ధతి / సంకీర్ణ విభాగాల పద్ధతి:-

→క్రాస్ సెక్షనల్ అధ్యయనము అనగా 'వివిధ వయస్సులు వున్న శిశువులను ఒక సమూహంగా ఎంచుకొని ఏక కాలంలో (నియమిత కాలపరిమితి) వారిలో జరిగే ఏదైనా వికాసము యొక్క మార్పును అధ్యయనం చేయుట."
→ ఉదా : 1 నుండి 18 సం॥ల వయస్సులున్న వివిధ రకాల బాలలను ఒక సమూహంగా ఎంపిక చేసుకొని ఒక సం॥ము పాటు వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను పరిశీలించి వ్యాఖ్యానించుట.

సంకీర్ణ పరిశీలన పద్ధతిలో :
1. వివిధ వయస్సులు కలిగిన బాలల సమూహాలుంటాయి.
2. నిర్ధిష్ట సమయం వరకు పరిశీలన జరుగుతుంది.
3. వివిధ రకాల వికాసాలను తక్కువ కాలంలో అర్ధం చేసుకోవచ్చు.

పరిమితులు:-
1. ఇది దీర్ఘకాలిక పరిశీలన అంత ఖచ్చితమైనది కాదు.
2. వైయక్తిక భేదాల ప్రభావము ఈ రకమైన పరిశీలనపై ఎక్కువగా వుండును.