మూర్తిమత్వ వికాసం - ప్రభావితం చేసే కారకాలు
మూర్తిమత్వము
→ మూర్తిమత్వం అనగా వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో కూడిన సమగ్ర వ్యక్తిత్వము,నిర్వచనాలు :-
→ వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వమంటారు.- ఐసెంక్
→ మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి ఉపకరించే ప్రత్యేకమయిన, అనువైన, విస్తృతమయిన శారీరక, మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు.
→ ఇవ్వబడిన ఒక సన్నివేశములో వ్యక్తి ఏ విధముగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే మూర్తిమత్వము. కాటిల్
→ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమయిన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు. - డేషియల్
→ దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమయిన, క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం- వాట్సన్
→ వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తనా తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక, మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వం - కింబాల్యంగ్
→ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశముల గుణాత్మక నమూనా - జె.ఎఫ్. బ్రౌన్
→ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం
→ మూర్తిమత్వం వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం ఇ. డబ్ల్యు బడ్జెస్
మూర్తిమత్వ లక్షణాలు :
→ మూర్తిమత్వం ప్రత్యేకమైంది. ప్రతి వ్యక్తి మూర్తిమత్వం అద్వితీయమైనది.
→ మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్య అంశం.
→ మనిషికి సంబంధించిన అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం.
→ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. కాని స్తబ్ధంగా ఉండదు.
→ వ్యక్తి మూర్తిమత్వం ప్రధానంగా అతనిలో ఏర్పడే వైఖరుల వలన ప్రభావితం అవుతుంది.
→ మూర్తిమత్వాన్ని వ్యక్తి లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు.
→ ప్రతి ఒక్కరి మూర్తిమత్వ వికాసం వంశపారంపర్య లక్షణాలు, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
→ మూర్తిమత్వాన్ని వివరించవచ్చు. అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవలేము.
మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు:-
→ వయస్సు, అనుభవము పెరిగే కొలది శారీరక, మానసిక లక్షణాలతో కూడిన ప్రవర్తనలో అభివృద్ధి కన్పించటమే మూర్తిమత్వ వికాసముగా చెప్పుకోవచ్చు.
→ మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ప్రధానంగా 2 రకాలు అవి:
1. వంశపారంపర్య కారకాలు
2. పరిసర కారకాలు
1. వంశపారంపర్య కారకాలు :-
1. బాహ్యరూపం,
2. నాడీ వ్యవస్థ,
3. గ్రంథి వ్యవస్థలు
→ గ్రంథులు : దేహంలో రసాలను ఉత్పాదించే అవయవాలే గ్రంథులు. ఇవి అంతఃస్రావీ గ్రంథులు. ఈ గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లు, నేరుగా రక్తంలో కలుస్తాయి. ఇవి మనిషి చిత్రాలను ప్రభావితం చేస్తాయి. ఇవి జీవక్రియల వేగం పెంచుతాయి లేదా తగ్గిస్తాయి.
→ పీయూష గ్రంథి : మెదడు కింద భాగాన ఉండి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. మామూలుగా స్రవిస్తే చురుకుగా, చతురతతోను ఉంటారు. తక్కువగా పనిచేస్తే మంద బుద్ధితోను, నిరాశతోను ఉంటారు. ఇది విడుదల చేసే హార్మోనులలో గ్రోత్ హార్మోను మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. గ్రోత్ హార్మోన్ ఎక్కువయితే జైగాంటిజం, తక్కువయితే డ్వార్భిజం కలుగుతుంది. జైగాంటిజం అనగా అతిదీర్ఘకాయత్వం మరియు ద్వార్భిజం అనగా మరగుజ్జుతనం, మానసిక వికాసంపై పనిచేస్తుంది.
→ థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి :- ఇది విడుదల చేసే హార్మోను థైరాక్సిన్, గొంతులో ఉండే ఈ గ్రంథి ఎక్కువగా పనిచేస్తే ప్రభావశాలిగాను, అత్యాశాపరుడుగాను, తక్కువైప్పుడు ప్రజ్ఞాహీనులుగాను, మంద బుద్ధులుగాను ఉంటారు. థైరాక్సిన్ కొమారదశలో తక్కువైతే క్రెటినిజం, వయోజన దశలో తక్కువైతే మిక్సోడిమా పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది.
→ పారా థైరాయిడ్ (లేదా) పార్శ్వ అవటు గ్రంథి : ఇది విడుదల చేసే హార్మోను పారాథార్మోస్, థైరాయిడ్ గ్రంథిపైన ఉండి రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది. సరళంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది లోపించినప్పుడు చికాకు, నరాల బలహీనత ఒత్తిడి కలుగుతుంది. రక్తంలో ఇది ఎక్కువైతే టిటాని, తక్కువైతే ఆస్టియోపొరాసిస్ పరిస్థితి ఏర్పడుతుంది.
→ అడ్రినల్ గ్రంథి (లేదా) అధివృక్క గ్రంథి : ఇది విడుదల చేసే హార్మోను అడ్రినలిన్. ఈ గ్రంథులు మూత్రపిండాలపై బోర్లించిన టోఫిలా ఉంటాయి. ఇవి ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకొనే వేగం ఎక్కువై రక్తపోటు హెచ్చవుతుంది. పనిచేయకపోతే సోమరితనానికి దారి తీస్తుంది. దీనిని ఉద్వేగాల ప్రభావ గ్రంథి అనికూడా అంటారు. ఇది విడుదల చేసే హార్మోనును fight or flight హార్మోన్ అంటారు. ఇది ఉద్వేగ వికాసంపై పనిచేస్తుంది. ఈ హార్మోన్ వ్యక్తి యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది.
→ బీజ గ్రంథులు : ఇవి సంతానోత్పత్తికి, జీవితం సంతోషంగా గడపడానికి సహకరిస్తాయి. ఈ గ్రంథుల పని తీరుపై ఆలోచనా సరళి, దేహదారుఢ్యం ఆధారపడి ఉంటాయి. వీటి పని తీరులో కొద్ది తేడా అదుర్గాకు, బలహీనతకు దారితీస్తుంది.
2. పరిసర కారకాలు:
1. కుటుంబం,
2. పాఠశాల,
3. సమాజం,
4. ప్రసార మాధ్యమాలు.
1. కుటుంబం : వ్యక్తిని మొట్టమొదటగా ప్రభావితం చేసేది కుటుంబం. సాంఘిక వికాసానికి పునాది మెట్టులాంటిది.
2. పాఠశాల వ్యక్తి యొక్క బౌద్ధిక, మానసిక, నైతిక వికాసాన్ని ప్రభావితం చేసేది పాఠశాల.
3. సమాజం : వ్యక్తి యొక్క సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసేది సమాజం.
4. ప్రసార మాధ్యమాలు: వ్యక్తి యొక్క అన్ని రకాల వికాసాలను ప్రభావితం చేసేవి ప్రసార మాధ్యమాలు.
కుటుంబం :-
→ తల్లి పాలతో పెరిగినవారు ఆరోగ్యంగాను, భద్రతా భావనతో పెరుగుతారు. తల్లి దగ్గర పాలు లేకపోయినా, పాలు ఉన్నప్పటికీ ఇవ్వటానికి ఇష్టపడకపోయినా పిల్లల్లో భద్రతా రాహిత్య భావం పెరిగే అవకాశం ఉన్నది. పాలు పట్టే విధానం మీద, మలమూత్రాల విసర్జన శిక్షణ మీద పిల్లల మూర్తిమత్వం ఆధారపడి ఉంటుంది. సమయపాలనపై ఇది ప్రభావం చూపిస్తుంది.
→ తల్లిదండ్రుల పెంపకం పిల్లవాని మూర్తిమత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబానికి ఒక విధానం ఉంటుందని పిల్లలు. గ్రహించేటట్లు చేయాలి. పిల్లలకు, తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు మధ్య ఒకరి మీద ఒకరికి గౌరవం, సహకార భావము, నమ్మకము ఉండాలి.
→ కుటుంబ వ్యవస్థ రూపాలు, కుటుంబ పరిమాణం, శిశు జన్మక్రమం, ఇంటి దగ్గర మాట్లాడే భాష, సాంఘిక, ఆర్థికస్థాయి మొదలైనవి పిల్లల మూర్తిమత్వముపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి.
→ తోబుట్టువుల సంఖ్య, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు పిల్లవాని మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి,
→ షాక్టర్, కోచ్, వైల్ & డేవిస్ నిర్వహించిన పరిశోధనలో పిల్లల జన్మక్రమానికి వారి మూర్తిమత్వానికి దగ్గర సంబంధము ఉన్నదని తేలింది.
పాఠశాల :-
→ పిల్లల మూర్తిమత్వము అభివృద్ధి చేయడంలో పాఠశాలలు కీలక పాత్రను పోషిస్తాయి.
→ ప్రజాస్వామిక, ప్రోత్సాహపూరిత వాతావరణంలో పనిచేసే పాఠశాలల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య సంబంధాలు అలాగే. విద్యార్థులకు, విద్యార్థులకు మధ్య సంబంధాలు బాగుంటాయి. వీరియొక్క సహజ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకునే సౌలభ్యం ఉంటుంది.
→ దీనివల్ల విద్యార్థి మూర్తిమత్వములో ప్రజాస్వామ్యము, గౌరవము, ఇచ్చిపుచ్చుకోవడము, సహకార భావన, ఆత్మ విశ్వాసము లాంటి అనేక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
→ నిరంకుశ లేదా అప్రజాస్వామిక వాతావరణములో పనిచేసే పాఠశాలల్లో విద్యార్థులకు సరైన స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ లేకపోవడం వల్ల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసము జరగదు.
సమాజం:-
→ మానవుడు సంఘజీవి. సమాజములో ఉండే అనేక విషయములను పరిశీలిస్తూ అనుకరణ చేస్తూ, అనుసరిస్తూ ఎన్నో రకాల ప్రవర్తనలను అభివృద్ధి చేసుకుంటాడు.
→ సంఘములో ఉండే ఇతర వ్యక్తులతో కలసి ఉండటము, కలసి పనిచేయడము ద్వారా సాంఘిక నైపుణ్యాలకు పదును పెట్టుకుంటాడు.
→ సాంఘికీకరణమనేది వ్యక్తి మూర్తిమత్వములో ప్రధానపాత్ర పోషిస్తున్నది.
→ చుట్టుప్రక్కల వారితో ఉండే సంబంధాలు పిల్లల్లో సహకార భావాన్ని, సేవా భావాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో తోడ్పడతాయి. చుట్టు ప్రక్కల వారు ఉపయోగించే భాష, ఆచార వ్యవహారాలు, పిల్లల మూర్తిమత్వము వికాసంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
→ కుటుంబ పెద్దలు పిల్లలను సంఘములోని ఇరుగుపొరుగు వారితో కలవకుండా చేసినచో వారిలో సాంఘికీకరణము కుంటుపడి సమగ్రమైన మూర్తిమత్వము ఏర్పడదు.
ప్రసార మాధ్యమాలు :
→ ప్రసార మాధ్యమాలు అనేవి రెండు వైపుల పదును వున్న కత్తి లాంటివి. వీటిని ఉపయోగించుకుని మంచిని పొందవచ్చు. మరియు చెడును పొందవచ్చు.
→ ప్రసార మాధ్యమాలైన రేడియో, టి.వి., సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ మొదలగునవి వ్యక్తి జీవన విధానాన్ని, తద్వారా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
→ ఈనాడు వ్యక్తి అలంకరణలు, ఆహారపు అలవాట్లు, వేసుకునే దుస్తులు, ఉపయోగించే భాష, ఏర్పడే అభిరుచులు మొదలగు వాటన్నిటికీ ప్రధాన కారణంగా మీడియాను చెప్పుకోవచ్చు.
→ ప్రసార మాధ్యమాల ప్రభావం వల్ల పిల్లల ప్రవర్తన అనుకూలంగా గాని, ప్రతికూలంగా గాని ఉండవచ్చు. కావున ప్రసార మాధ్యమాలను పిల్లలు ఉపయోగిస్తున్నప్పుడు వారు చూస్తున్న కార్యక్రమాలు చూడదగినవా, కాదా ? అని తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలి.
→ ఈ విధముగా వ్యక్తి మూర్తిమత్వముపై కుటుంబము, పాఠశాల, సమాజం, ప్రసారమాధ్యమాలు ఏదో ఒక కోణములో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
పిల్లల పెంపకం పద్ధతులు (Child rearing practics) :-
→ పిల్లల సాంఘికీకరణపై ప్రభావం చూపించే ముఖ్యమైన అంశాలలో ఒకటి పిల్లలను పెంచే పద్ధతులు, పిల్లలను పెంచే పద్ధతులను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించినారు.
1. ప్రజాస్వామిక/అనుగుణ్య పెంపకం
2. ఆధిపత్య/నిరంకుశ పెంపకం
3. జోక్యరహిత/సైజెఫేర్ పెంపకం
4. అతిగారాబ పెంపకం
1. ప్రజాస్వామిక/బాధ్యతాయుత పెంపకం:-
→ ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల్ల అభిప్రాయాలకు విలువను ఇస్తారు. ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు, పిల్లలు ఒకరితోనొకరు కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏ పనిపైనా పిల్లలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపూర్వకంగా పాల్గొంటారు.
→ కాబట్టి వారు చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలో కుటుంబసభ్యుల మధ్య సత్సంబంధాలుంటాయి. అలాగే ఒకరినొకరు సంపూర్ణంగా అవగాహన చేసుకునే వీలుంటుంది. కుటుంబ సభ్యులు ఒకరితోనొకరు చక్కటి సర్దుబాటునుర చేసుకోగలుగుతారు.
→ ఈపద్ధతిలో పెరిగిన పిల్లలు తదుపరి జీవితంలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకొనుటకు సమయం చాలా పడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం కావచ్చు లేదా కొన్నిసార్లు నిర్ణయమే తీసుకోకపోవచ్చు.
2. నిరంకుశ పెంపకం:-
→ ఈ పద్ధతిలో తల్లిదండ్రులు ఏది చెపితే పిల్లలు దానిని మాత్రమే చేయవలసి ఉంటుంది. పిల్లల అభిప్రాయాలకు తల్లిదండ్రులు ఎలాంటి విలువను ఇవ్వరు.
→ తల్లిదండ్రులు వారి పిల్లలకు అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం కూడా ఇవ్వరు. తల్లిదండ్రులు వారికి చాలా అనుభవం ఉన్నది. కాబట్టి పిల్లలకు ఏది మంచిదో, ఏది చెడ్డదో సరైన నిర్ణయం తీసుకోగలమనే విశ్వాసంతో వారు చెప్పినట్లు చేయమంటారు. పిల్లలకు అనుభవం ఉండదు కాబట్టి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇస్తే చెడిపోతారనే భావనతో తల్లిదండ్రులు వారికి ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వరు.
→ తల్లిదండ్రులు ఆదేశించిన ప్రకారం పిల్లలు నడుచుకోవాలంటారు. వారు ఆదేశించిన ప్రకారం నడుచుకుంటే పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు.
→ కాబట్టి తల్లిదండ్రులు ఆదేశించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకపోవచ్చు. ఈ పద్ధతిని పాటించే తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు. కాబట్టి పిల్లలకు వారికి మధ్య సత్సంబంధాలు ఉండే అవకాశం తక్కువ.
→ కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదేశాలను పాటించలేక పిల్లలు వారిపై తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. ఇటు తిరగబడే ధైర్యం లేక అటు ఆదేశాలను పాటించలేక పిల్లలు ఆత్మహత్యలకు పాలుపడడం కాని లేదా చెడు అలవాట్లకు బానిసవటం కాని జరుగవచ్చు.
3. జోక్య రహిత (లెసైజ్ఫెర్) పెంపకం:-
→ పిల్లలు ఏమి చేయవలెనో, ఏమి చేయరాదో వారికి వారే నిర్ణయించుకొని చేసుకుంటారని తల్లిదండ్రులు ఏమి పట్టించుకోకుండా ఉండే జోకరహిత పెంపకం అంటారు. ఇందులో తల్లిదండ్రులు పిల్లలు వేసుకునే దుస్తుల గురించి గాని, వారి సమయపాలన గురించి గాని, చదువవలసిన పద్ధతుల గురించిగాని, కోర్సుల గురించిగాని పట్టించుకోరు. ఈ పద్ధతిలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ లోపించవచ్చు. అలాగే అభివృద్ధి చెందటంలో వెనుకబడే అవకాశం ఉంటుంది.
4. అతి గారాబ పెంపకం:-
→ పిల్లలకు ఏ కష్టం రావద్దని, వారు చేసుకోవలసిన పనులను వారేస్వయంగా చేసుకొనుటకు అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులు చేసి పెడుతూ సకల సౌకర్యాలను కల్పిస్తూ పెంచడాన్ని అతిగారాబంగా చెప్పవచ్చు. వారు పిల్లల పట్ల అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారు. పిల్లలకు స్వేచ్ఛను, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కాని, సొంతంగా ఏ పనిని చేయుటకు అనుమతించక మొదలే వారి అవసరాలను తీర్చుటకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఈ పెంపకానికి గురి అయిన పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఇబ్బంది పడతారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు సాంఘికీకరణలో వెనుకబడతారు. పిల్లలు స్వయంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటే ఏవో ప్రమాదాలు జరిగి పిల్లలకు ఏమైనా అపాయం జరుగుతుందనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు ఈ పద్ధతిని అవలంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
→ ఆత్మభావన (Self Concept) :-
→ ఆత్మభావన అనగా వ్యక్తికి తన లక్షణాలను గురించి తన వ్యక్తిత్వాన్ని గురించి తన స్వభావాన్ని గురించి తనకే ప్రత్యేకమైన తన ప్రవర్తన గురించిన సంపూర్తిగా తెలిసి ఉండటం.
→ ఒక వ్యక్తి తనను గురించి చేసుకొవూ ఆలోచనల సారాంశమే ఆత్మభావన.
→ తన సొంత స్వభావము, లక్షణాలతో కూడిన ప్రవర్తనల గురించి ఏర్పరచుకొన్న సమ్మకాల సమూహమే ఆత్మభావన.
→ నేను, నాది అనే భావనలకు సంబంధించినదే ఆత్మభావన. మనలోనే సామర్థ్యాలు, ప్రత్యేకతలను గురించి మనకున్న సాక్షాత్కారంగా ఆత్మభావనను చెప్పుకోవచ్చు.
ఉదా ॥ నేను తెలివి కలవాడను, నేను పిరికివాడను, నేను ఇతరులను మెప్పించగలవాడను ...............
→ ఆత్మభావన అభివృద్ధి అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాంశాల మీద, వారి ఆలోచనలు, అనుభూతులు, అభిరుచులు, సృజనాత్మకత, ప్రజ్ఞ ఇతరులతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా స్వీకరించే అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది.
→ ఆత్మభావన రెండు రకాలు అవి :
1) వాస్తవిక ఆత్మభావన
2) ఆదర్శ ఆత్మభావన
→ వాస్తవిక ఆత్మభావన: ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి ఆత్మభావన కలిగి ఉన్నాడు అనగా ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనేది వ్యక్తికి తెలిసి ఉండటమే వాస్తవిక ఆత్మభావన.
ఉదా :- నేను సాహసిని, నేను ప్రజ్ఞావంతుడను.
→ ఆదర్శ ఆత్మభావన:- ఒక వ్యక్తి తను ఎలాంటి ఆత్మభావనను కలిగి ఉండాలి అనగా ఎలాంటి లక్షణాలను పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన.
ఉదా:- నేను నిజాయితీగా ఉండాలి. నేను బాధ్యతలు తెలిసినవాడిగా ప్రవర్తించాలి.
→ వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మభావన వైపు పయనిస్తుంది.
→ వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య ఉండే తేడాని అంతరం అంటారు. ఇది ఎక్కువగా ఉంటే సంఘర్షణలకి, ఒత్తిడికి, వ్యాకులతకు దారితీసి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
→ వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య ఉండే అన్యోన్యనత మీద వ్యక్తి మానసిక ఆరోగ్యం, మూర్తిమత్వ అభివృద్ధి ఆధారపడి ఉంటాయి.
→ వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరమును సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ ద్వారా మాపనం చేయవచ్చు.
→ ఆత్మభావనకు సంబంధించి బ్రాకెన్ ( (1992) ఆరు ప్రత్యేకమైన రంగాలను సూచించాడు. అవి.
1. సాంఘిక పరమైనవి - ఇతరులతో పరస్సర చర్యలలో పాల్గొనే సామర్థ్యం
2. సామర్ధ్యపరమైనవి మూల అవసరాలను తీర్చుకునే సామర్థ్యం.
3. ఉద్వేగపరమైనవి - ఉద్వేగ స్థాయిలపై అవగాహన.
4. భౌతికపరమైనవి చూసే దృక్కోణం, ఆరోగ్యం, భౌతిక స్థితి, పూర్తి ఆకారం. అపజయం.
5. విద్యాపరమైనవి పాఠశాలలో విజయం లేదా 6. కుటుంబపరమైనవి - కుటుంబ విభాగంలో తాను ఎంత బాగా విధుల్లో పాల్గొంటాడు.
సర్దుబాటు / సమయోజనం
→ వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సోమరస్యమైన సంబంధాలను నెలకొల్పటానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్చే సర్దుబాటు -గేట్స్ & జెర్సీల్డ్→ ఒక జీవి తన అవసరాలకు, వాటిని తీర్చుకోవటంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించటమే సర్దుబాటు - లారెన్స్ షాఫర్
→ ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవటానికి, పరిహరించడానికి తగినట్లు మార్పు చెందటమే సర్దుబాటు - -జేమ్స్ డ్రైవర్
→ సర్దుబాటు అంటే వ్యక్తికి, అతని పరిసరానికి మధ్య జరిగే పరస్పర చర్య - అర్కాఫ్
→ జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధము ఏర్పరుచుకోవడమే సర్దుబాటు - సైమండ్స్
→ ఒక జీవి మరొక జీవితో జీవ, సాంఘిక సంబంధిత అవసరాలను తీర్చుకోవడం, పరస్పర సంబంధాలను ఏర్పరుచుకోవటమే సర్దుబాటు- రూచ్
→ సర్దుబాటు నిరంతరం కొనసాగే ప్రక్రియ. వ్యక్తి పుట్టింది మొదలు, తుదిశ్వాస వరకు సర్దుబాటు ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటుంది. అంటే పరిసరాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలోనో లేదా పరిసరాలకు తనే అనుకూలంగా ఉండటంలోనో వ్యక్తి నిమగ్నుడవుతాడు.
→ పరిసరాలు 3 రకాలు. 1. భౌతిక పరిసరాలు, 2. మానసిక పరిసరాలు, 3. సాంఘిక పరిసరాలు, ఈ 3 పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధాలు ఏర్పరుచుకోవటం అంటే వ్యక్తి భౌతిక పరిసరాలన్నింటిని తాను జీవించటంలో చక్కగా ఉపయోగించుకోవటం. మానసిక పరిసరాల ఆధారంగా స్వీయ భావనను పెంపొందించుకోవటం, తన శక్తి సామర్థ్యాలను గుర్తించి, పెంపొందించుకొని వినియోగించుకోవడం. అలాగే సాంఘిక పరిసరాలలోని సమాజపు కట్టుబాట్లను చక్కగా పాటించటం. వ్యక్తుల మధ్య సంబంధాలను, భాందవ్యాలను మంచి రీతిలో పెంచుకోవటం. ఈ విధంగా 3 పరిసరాలతో సర్దుబాటు చేసుకున్నట్లైతే చక్కని మానసిక ఆరోగ్యంతో వ్యక్తి జీవించగలుగుతాడు.
→ జీవితములో సర్దుబాటు నిరంతర ప్రక్రియ అయినందువల్ల వ్యక్తుల సర్దుబాటును మదింపు చేసి సరైన, అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించడం వల్ల వ్యక్తి మూర్తిమత్వము సంపూర్ణమైయ్యే అవకాశం ఉంటుంది.
→ సరిఅయిన సర్దుబాటు ప్రదర్శించు వ్యక్తి లక్షణములు :
→ వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉంటాడు.
→ ఆశలు, ఆశయాలు నేలవిడచి సాముచేయవు.
→ వాస్తవికంగా ఆలోచిస్తాడు.
→ ప్రతిపనిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు.
→ మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు.
→ సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి ఇతర వ్యక్తులతో సత్సంబంధాలుంటాయి.
→ తన శక్తి సామర్థ్యాలు, బలహీనతలు గుర్తెరిగి ఉంటాడు.
→ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తాడు.
→ వాస్తవిక ఆత్మభావన కలిగివుంటాడు.
→ సరళమయిన ఆలోచనా స్వభావాన్ని కలిగిఉంటాడు.
→ మంచి భావోద్వేగ పరిపక్వతను ప్రదర్శిస్తుంటాడు.
గమనిక : సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణములు అన్నియు ధనాత్మక లక్షణములు ఉండును. సర్దుబాటు లేని వ్యక్తి లక్షణము అని అడిగినపుడు ఏది Negative లక్షణము కన్పిస్తుందో అదే జవాబు అవుతుంది.
పాఠశాలలో విద్యార్థుల సర్దుబాటుకు తీసుకోవలసిన చర్యలు :-
→ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా ఉండడం.
→ సరైన సౌకర్యాలు కల్పించటం
→ క్రమశిక్షణ గల స్నేహ వాతావరణం పెంపొందించటం.
→ సమగ్ర మూర్తిమత్వం పెంపొందించుటకు చర్యలు చేపట్టడం
→ ఒత్తిడి లేకుండా చూడటం
→ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని తగిన మార్గదర్శకత్వం, మంత్రణం అందించటం.
విషమ యోజనం:-
→ ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమయిన ప్రవర్తనను ఏర్పరచుకోవటమే విషమ యోజనం
→ పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంలో వ్యక్తి కొన్ని ఒత్తిళ్ళకు లోనవుతాడు. ఒత్తిడి లేని స్థితిని వ్యక్తి ఇష్టపడడని ముర్రే చెప్పడం జరిగింది అయితే ఒత్తిడి ఎక్కువైతే సంఘర్షణలు, తన్యతలను ఎదుర్కోలేక విషమయోజనం కలుగుతుంది. అంటే సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవటం జరుగుతుంది. దీనినే విషమయోజనంగా చెప్పుకోవచ్చు.
విషమయోజనకు గల కారణాలు : -
→ వ్యక్తిగత కారణాలు - అనారోగ్యం, అందవిహీనత, అంగవైకల్యం, ప్రజ్ఞాలోపం, చదువులో వెనుకబడటం.
→ గృహ సంబంధ కారణాలు - తల్లితండ్రి మధ్య ఘర్షణ లేదా ఒకరి మరణం, వాత్సల్య లోపం, కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు, వివక్ష, కుటుంబ సభ్యుల ఆనారోగ్యం, తల్లిదండ్రులు ఒత్తిడి.
→ పాఠశాల సంబంధ కారణాలు - క్రమశిక్షణ సరిగాలేని బోధనా పద్ధతులు, పరీక్షల ఒత్తిడి, కఠిన క్రమశిక్షణ, ప్రేరణ లేకపోవడం, అవసరాలు తీర్చలేని పాఠ్యాంశాలు, సరిలేని పాఠశాల వసతులు, నియంతృత్వ ఉపాధ్యాయులు.
→ సమాజ సంబంధ కారణాలు - కఠిన నియమాలు, విచ్చలవిడితనం, రాజకీయాలు, కులమత తేడాలు, నైతిక విలువలు లేకపోవడం, అక్రమాలు.
విషమయోజనం కలిగిన వ్యక్తి లక్షణములు :-
(1) వ్యక్తి పరిసరాలతో సత్సంబంధాలు కలిగి ఉండదు..
(2) ఉద్వేగ పరిపక్వత లోపిస్తుంది.
(3) వాస్తవ దృక్పథం ఉండదు.
(4) మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
(5) ఆత్మభావన సరిగా ఉండదు.
(6) సమస్యలను పరిష్కరించుకోలేక తీవ్ర ఒత్తిడికి, కుంఠనాలకు గురి అవుతాడు.
(7) ఏ లక్ష్యాలు ఉండవు.
(8) దేనిలో ఆనందాన్ని చూడలేదు.
(9) ఆలోచనలకు, చేతలకు మధ్య పొంతన ఉండదు.
(10) దేనికి సర్దుబాటు కాలేదు.
→ విషమయోజనమునకు గురి అయిన వ్యక్తికి అన్నియు ఋణాత్మక లక్షణములు ఉండును.
కుంఠనం
→ వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు. సరైన లక్ష్యం లేనపుడు కుంఠనానికి దారితీస్తుంది. - కోల్ మన్→ కుంఠనం అంటే వ్యక్తిలోని (ప్రేరకం తృప్తిచెందక పోవటం - కరోల్
→ మానవుని ఆశయంగానీ, అవసరంగానీ తృప్తిపరచటంలో అవరోధం ఏర్పడినపుడు ఉద్భవించే బాధనే కుంఠనం అంటారు. -గుడ్
కుంఠనానికి దారితీసే పరిస్థితులు:-
→ తగిన ప్రోత్సాహం లేకపోవడం
→ ప్రజ్ఞాస్థాయి తక్కువగా ఉండటం.
→ తల్లిదండ్రుల ఆంక్షలు.
→ కాంక్షాస్థాయి ఎక్కువగా ఉండటం.
→ సరైన మూర్తిమత్వం లేకపోవడం.
→ దేనికీ సంతృప్తి లేకపోవడం.
→ సరైన లక్ష్యాలు ఏర్పరచుకోలేకపోవడం.
కుంఠనం పర్యవసానాలు:-
→ వ్యక్తి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని విరమించుకోవచ్చు.
→ శారీరక, మానసిక అనారోగ్యానికి గురికావచ్చు.
→ కుంఠనం స్థాయి ఎక్కువగా ఉంటే ఆత్మహత్య చేసుకోవచ్చు.
→ దౌర్జన్యానికి పాల్పడవచ్చు.
→ స్వైరకల్పనలు చేయవచ్చు.
→ చెప్పిందే చెప్పడం లేదా చేసిందే మళ్ళీ చేస్తుండవచ్చు.
సంఘర్షణ
→ రెండు విరుద్ధ కోర్కెలలో ఏదో ఒకటి మాత్రమే తీర్చుకోవలసి వచ్చినపుడు ఏర్పడే బాధాకర ఉద్వేగస్థితే సంఘర్షణ.→ వ్యక్తి తన కోరికలతో / లక్ష్యాలతో రాజీపడలేకపోతే ఏర్పడే మానసిక ఉద్వేగ స్థితియే సంఘర్షణ.
→ రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ - డగ్లస్ & పోలెండ్
సంఘర్షణలు రకాలు:
→ సంఘర్షణలు 4 రకములు. అవి:
1. ఉపగమ - ఉపగమ సంఘర్షణ :-
రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి అనే ఎంపికలో జరిగే ఘర్షణ.
ఉదా :
1) అవ్వ కావాలి, బువ్వ కావాలి.
2) తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ సెలక్షన్ అదే సందర్భంలో బ్యాంక్ ఆఫీసర్ గా ఎంపిక.
2. పరిహార పరిహార సంఘర్షణ:
రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య తప్పనిసరి అయిన ఒక ఎంపికలో జరిగే ఘర్షణ.
ఉదా : 1) ముందు నుయ్యి వెనుక గొయ్యి.
2) విద్యార్థికి హోమ్వర్క్ చేయడం ఇష్టం లేదు - మాష్టారుచే శిక్షించబడటం ఇష్టం లేదు.
3. ఉపగమ - పరిహార సంఘర్షణ : ఒక ఆకర్షణీయమైన, ఇంకొక ఆకర్షణీయంకాని లక్ష్యాల మధ్య ఎంపికలో జరిగే ఘర్షణ.
ఉదా : 1) ఇష్టమైన రేగిపండు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి.
2) స్టేజిపైకి ఎక్కి ఉపన్యాసం ఇవ్వాలనే ఇష్టమైన కోరిక - ఉపన్యాసం సరిగా ఇవ్వలేకపోతే అవమానం.
4. ద్విఉపగమ - పరిహార సంఘర్షణ :
రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలున్నప్పుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకొనేటప్పుడు కలిగే సంఘర్షణ.
ఉదా:
1) కోటీశ్వరుడయిన వరుడు - ఉద్యోగం లేదు.
2) డబ్బులేని వరుడు - గవర్నమెంట్ ఉద్యోగం ఉంది.
రక్షక తంత్రాలు
→ వ్యాకులతను ఒత్తిడిని, సంఘర్షణను తగ్గించుకోవటానికి అనేక రకాలైన పద్ధతులను మానవులు ఉపయోగిస్తారు. వీటినే సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అన్నారు. ఇవి ఒక రకంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయని మనోవిశ్లేషకుల నమ్మకం ఇవి వ్యక్తి అహాన్ని గౌరవం నుండి, అపరాధ భావననుండి తాత్కాలికంగా కాపాడుతాయి కాని వాస్తవాన్ని మార్చలేవు.1. ధమనం:-
విచారకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతనావస్థకు పంపి ఉపశమనం పొందటం.
ఉదా :- స్నేహితుల మరణం బలవంతంగా మరచిపోవటం,
2. ప్రతిగమనం:-
కుంఠనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్న పిల్లలలాగా ప్రవర్తిస్తారు. గారంగా మాట్లాడతారు. ఇంకా చిన్నవాడినే అని, తప్పుచేసినా పరవాలేదనే ఉద్దేశ్యంతో అలా చేస్తారు.
ఉదా: ఉద్యోగం పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడ్వటం.
3. పరిహారం :-
ఒక అంశంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ అంశాన్ని ఎంచుకొని తన బలహీనతను, బలంతో సమతుల్యం చేయటం జరుగుతుంది.
ఉదా : టీచర్ గా మంచి పేరు తెచ్చుకోలేని వ్యక్తి సంఘసేవ చేసి మంచిపేరు తెచ్చుకోవటం.
4. హేతుబద్ధీకరణ:-
లక్ష్యసాధనలో విఫలం అయినపుడు దానిని ఇతర కారణాలతో తన లోపాన్ని సమర్థించుకొంటూ తన మనసును సర్దిపుచ్చుకోవటం.
ఉదా : అందని ద్రాక్ష పళ్ళు పుల్లన.
5. ప్రక్షేపణం:-
వ్యక్తి తనలోని ప్రేరకాలను, తప్పులను ఇతరులకు ఆపాదించటం జరుగుతుంది. తన తప్పిదాలను ఇతరుల మీదకు నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరిస్తారు. అందరూ ఇలాగే చేస్తారని కూడా చెప్పుతారు.
ఉదా: ఆడలేక మద్దెల ఓటి.
6. విజ్ఞాపనం :
వ్యక్తి తన కోపాన్ని, అసహనాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీదగాని, వస్తువులమీదగాని చూపిస్తాడు.
ఉదా : అత్తమీద కోపం దుత్త మీద చూపటం.
7. తాదాత్మీకరణం:
తానుగా సాధించినదేమీ లేనప్పుడు తను పనిచేసే సంస్థ సాధించింది. తన కుటుంబం ఉన్నతమైన విలువలు కలది. అని తృప్తిపడటం. తనలో తీర్చుకోలేని కోరికలు, ఆశయాలను తన వారిచే పూర్తిచేయించి వారిలో తనను చూసుకొని తృప్తి పడిపోవడం.
ఉదా : RMP తన కూతురిని MBBS చదివించి తనే డాక్టర్ అయినంతగా సంబరపడిపోవడం.
8. స్వైరకల్పన:- వ్యక్తి తన జీవితంలో సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ, ఊహాలోకాలలో విహరిస్తూ ఉపశమనం పొందుతాడు. స్వైర కల్పన ద్వారా వాస్తవంలో సాధించలేని విషయాలను సాధించినట్లుగా సంతృప్తి చెందుతాడు..
ఉదా : గాలిలో మేడలు కట్టడం, పరీక్ష ఫెయిలయిన విద్యార్థి మరోసారి రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చినట్లు, అందరూ అభినందిస్తున్నట్లు ఊహించుకోవటం.
9. ఉపసంహరణ : వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవటం జరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోలేనపుడు ఉపసంహరించుకోవడం.
ఉదా :- పరీక్షల్లో ఉత్తీర్ణుడనుకాలేను అనుకున్నప్పుడు పరీక్షకు హాజరు కాకుండా ఉండటం.
10. ప్రతిచర్యా నిర్మితి: ఇందులో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి.
ఉదా : వ్యక్తిపై కోపం ఉన్నా కూడా ప్రేమ ఉన్నదని చెప్పటం.
11. నిరాకరణం : అంగీకరించడానికి ఇష్టంలేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించటం, ఇష్టంలేని దృశ్యాలను చూడకుండా ఉండటం, ఇష్టంలేని విషయాలను మాట్లాడకుండా ఉండటం.
ఉదా:- సినిమాలలో భయంకరమయిన దృశ్యాలను చూడకుండా కళ్ళు మూసుకోవటం.
12. బౌద్ధికీకరణం : బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరమవటం.
ఉదా : చచ్చిపోయినా కూడా హాయిగా స్వర్గంలో ఉండవచ్చు అనుకోవటం.
13. అంతర్లీనం: సంఘర్షణకు లోను చేసిన విషయంలో గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోయే ధోరణి వలన కలిగే సర్దుబాటు.
ఉదా: అత్తగారింట్లో విధి లేక మాంసాహారం అలవాటు చేసుకొనే శాఖాహారి కోడలు.
మానసిక ఆరోగ్యము
→ మానసిక ఆరోగ్యం అంటే వ్యక్తి తన మానసిక శక్తులను అర్థం చేసుకొని సామాన్య ఒత్తిడులను తగ్గించుకొంటూ, ఫలవంతంగా, ఉత్పాదకంగా పనులు చేసుకొంటూ సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవటం.→ మానసిక ఆరోగ్యమంటే నాడీ రుగ్మతలు, మనో విక్షిప్తులు కలిగి ఉండక సరి అయిన సర్దుబాటు కలిగి, తన గురించి మంచి సానుకూల దృక్పథంతో జీవన అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం..
→ వ్యక్తి తన సామాన్య జీవితావసరాలతో, సామాజిక అవసరాలతో సంతృప్తికరంగా సర్దుబాటు చేసుకోగల మానసిక పరిస్థితినే వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యంగా చెప్పవచ్చు.
→ ఒక వ్యక్తి సమర్థవంతంగా, సంతృప్తికరంగా తన సహజ శక్తులను ఉపయోగించుకొనే మానసిక స్థితియే మానసిక ఆరోగ్యం - స్ట్రోమ్
→ వ్యక్తులు తమకు తాము బాహ్య పరిసరాలతో సర్దుబాటు చేసుకొని, తృప్తిని, సంతోషాన్ని పొందుతూ, సాంఘిక పరిణతితో నిజ జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతయే మానసిక ఆరోగ్యము - బెర్నార్డ్
→ వ్యక్తి ఉద్వేగ – మానసిక సంతులనంతో తన సంజ్ఞానాత్మక సామర్థ్యాలను వినియోగించుకొంటూ తన, వ్యక్తిగత, సాంఘిక అవసరాలను తీర్చుకొనే సామర్థ్యమే మానసిక ఆరోగ్యం" - అమెరికన్ హెరిటేజ్ పదకోశం.
→ మంచి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యమునకు అలాగే మంచి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యమునకు తోడ్పదును. అనగా శారీరక మానసిక ఆరోగ్యములు రెండు పరస్పరము సంబంధమైనవి. అనగా రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.
→ వ్యక్తిలో ఆలోచించటం, ప్రత్యక్షము, ఉద్వేగము, ప్రవర్తన, సంస్థీకరణ అనే 5 ప్రాథమిక రంగాలు పనిచేయటంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే అవి వారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి వారికి మానసిక అపవ్యవస్థలు ఏర్పడతాయి.
→ మానసిక అపవ్యవస్థలు రెండు రకాలు -
1) నాడీ రుగ్మతలు,
2) మనో విక్షిప్తులు
నాడీ రుగ్మతలు :-
→ ఇవి మనో విక్షిప్తుల కంటే స్వల్పమైన అస్వస్థతలు, ఇవి మానసిక, సాంఘికపరమైన కారణాల వల్ల వస్తాయి. నాడీ రుగ్మతలను 7 రకాలుగా పేర్కొన్నారు.
అవి -
1) సామాన్య వ్యాకులత
2) భీతి
3) అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత
4) హిస్టీరియా
5) స్వశరీర
6) దౌర్బల్య ప్రతిచర్యలు
7) అవపాదం.
1. సామాన్య వ్యాకులత (Common Anxiety): మానసిక విఘాతాలు ఏర్పడినప్పుడు వ్యక్తి మానసిక తీవ్రతకు గురవుతారు. నీరు చూపే ప్రతిచర్యల వల్ల శారీరకోత్తేజానికి లోనుకావడమే వ్యాకులత.
2. భీతి (Fobia) : భీతి అంటే నిరంతరం కలిగే సహేతుకంగాని భయం. భీతి అనేది వస్తువుల పట్లగాని, జంతువుల పట్లగానీ, వ్యక్తుల పట్లగాని, స్థలాల పట్లగాని ఏర్పడవచ్చు. ఇవి నిబంధన ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి.
ఉదా : ఎత్తైన ప్రదేశాన్నుండి క్రిందకు చూస్తే భయం.
→ Acrophobia - ఉన్నత స్థల
→ Claustrophobia ఇరుకు ప్రదేశాల భీతి
→ Haemotophobia - రక్తభీతి
→ Monophobia -ఒంటరిగా ఉండటం వల్ల భీతి
→ Hydrophobia - జలభీతి
3. అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత (Obsesslve Compulsive Neuroses): వ్యక్తి మనస్సులో సరైన కారణం లేకుండానే నిరంతరంగా కలిగే ఆలోచనలను అనియంత్రిత భావాలు అంటారు. నిర్బంధక ప్రతిచర్యలతో వ్యక్తి కొన్ని చర్యలను అప్రయత్నంగా చేస్తుంటాడు. ఉదా : చేతులను అనేకసార్లు కడుక్కోవటం.
4. హిస్టీరియా (Hysteria): మనోవ్యాకులత లేదా ఒత్తిడి ఎక్కువయినప్పుడు శారీరక రోగ లక్షణాల ద్వారా, పూనకం, మూర్ఛల ద్వారా వెలిబుచ్చే రూపాంతర వ్యాకులతో ప్రతిచర్య ఈ రుగ్మతకు గురి అయినవారు ఉద్రేకం చెందడం, ఉగ్వేగ అస్థిరతకు లోనుకావటం జరుగుతుంది. ఉదా : శారీరక అవయవాలలో చలనం కోల్పోయినట్లు బాధపడుట.
5. స్వశరీర దుశ్చింత (Hypo Chondriasis): శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానం ఉండటం. వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవటం.
6. దౌర్బల్య ప్రతిచర్యలు (Neurasthemla): దైనందిన సాంఘిక అవసరాలపై, తలనొప్పి, నడుమునొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతుండటం.
7. అవపాదం (Depression): విషాద అనుభవాలను నెమరువేసుకోవటం, పనికిమాలిన వాడిని అనుకోవడం, నిరాశ, భయం మొదలగు లక్షణాలుండే ఉద్వేగ స్థితి. విషాదంతో కుంగిపోవటం దీని లక్షణం.
మనో విక్షిప్తులు :-
→ ఇందులో మనో వికారాలతోపాటు వాస్తవికతలతో సంబంధాలుపోయి, విభ్రమలు, భ్రాంతులు కలుగుతుంటాయి. దీనినే పిచ్చి, మతిభ్రంశము అంటారు. ఇది సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఉదా: సైకేస్తీనియా, స్కీజోఫ్రీనియా.
→ మానసిక ఆరోగ్యవంతుని లక్షణములు:
→ సరిఅయిన శారీరక ఆరోగ్యాన్ని కలిగి వుంటాడు.
→ తన శక్తిసామర్థ్యాలపై సరి అయిన అవగాహన కలిగి ఉండి శక్తికి మించిన పనులు చెయ్యడు.
→ ఉద్వేగ స్థిరత్వమును ఉద్వేగ పరిపక్వతను కలిగివుంటాడు.
→ చక్కని సాంఘిక సంబంధములు కలిగివుంటాడు.
→ సరియైన సర్దుబాటు ప్రదర్శిస్తాడు.
→ స్వీయ క్రమశిక్షణ ఉంటుంది.
→ వాస్తవిక దృక్పథాన్ని కలిగివుంటాడు.
→ ఆలోచనలలో, నిర్ణయాలలో పరిపక్వతను ప్రదర్శిస్తుంటాడు.
→ సంఘర్షణలకు, ఒత్తిడిలకు లోనుకాడు.
→ జయాపజయాలను సమానంగా స్వీకరిస్తాడు.
గమనిక : ఇలా అన్ని ధనాత్మక లక్షణాలు కలిగివుంటాడు. మానసిక ఆరోగ్యవంతుని లక్షణము కానిది అని ప్రశ్న అడగవచ్చు. ఏదయితే Negative గా అనిపిస్తుందో అది సరియైన జవాబుగా గుర్తించవలెను.
విద్యార్థుల మానసిక ఆరోగ్యము :
→ సరైన అభ్యసనాన్ని పొందాలంటే పిల్లలకు శారీరక ఆరోగ్యంతోపాటు మంచి మానసిక ఆరోగ్యము అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యములు రెండు పరస్పర సంబంధమయినవి. అనగా ఏ ఒక్క ఆరోగ్యం చెడిపోయినా అది రెండవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
→ తల్లిదండ్రుల మధ్య సంబంధాలు, వ్యసనాలు, తగాదాలు, వారు విడిపోవటాలు, పిల్లలపై వారు అధికమైన ఆశలు పెట్టుకోవటం, విపరీతమైన కోరికలు, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
→ కుటుంబం, పాఠశాల, సమాజం పిల్లలను ఇవి చేయవద్దు. ఇలాగే చెయ్యాలిలాంటి తీవ్ర ఆంక్షలు విధించినట్లయితే వారు సమాజీకరణం చెందేటప్పుడు స్వల్పంగా ఏర్పడే శారీరక మార్పులు, ఆలోచనలు కలతకు దారితీయవచ్చు. కుటుంబం, పాఠశాల, సమాజం తగిన జాగ్రత్తతో పిల్లలను పరిశీలిస్తూ, స్వేచ్ఛనిస్తూ పరోక్ష నియంత్రణాన్ని, తగిన పరిస్థితులను కల్పించి వ్యవహరించాల్సి ఉంటుంది.
→ తమకు ఏర్పడే సంఘర్షణలను ముందస్తుగా అర్థం చేసుకొని అవి అభివృద్ధిలో భాగమని, వాటిని అధిగమించే, అతిక్రమించే వ్యూహాలపై, పద్ధతులపై అవగాహన కల్గించాలి.
→ తప్పులు, వైఫల్యాలు జీవితంలో, అభ్యసనంలో భాగమని, ఎదురయ్యే ప్రతి పోటురాయిని మెట్టుగా చేసుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. నైతిక విలువలు, లైంగిక విద్య, జీవన నైపుణ్యాలు, ఆధ్యాత్మిక విద్యను అందించాలి. మానసిక ఆరోగ్యానికి యోగా విద్యను ప్రవేశపెట్టాలి.
→ ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. దీనివల్ల ఇద్దరి మానసిక ఆరోగ్యాలు మెరుగుపడగలవు.
→ బాలికలకు మహిళా ఉపాధ్యాయుల సహకారం, ప్రేమ, సహానుభూతి అవసరం ఉంటుంది. వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం, కౌమారదశలో వచ్చు మార్పులు, జాగ్రత్తలు చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కౌమారదశలో వచ్చు మార్పులు వారిలో అందోళనను కల్గిస్తాయి.
→ అలాగే ఉపాధ్యాయుడికి అభివృద్ధి పథంలో నడిపించే ఓపిక, సహనం, వ్యూహం, పద్ధతి, వైజ్ఞానపరంగా ఉన్నప్పుడు పాఠశాల వాతావరణం. బాగా ఉంటుంది. తద్వారా మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
→ సరిఅయిన మార్గదర్శకత్వం మరియు మంత్రణం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఉపాధ్యాయుడు కాపాడుతుండాలి.
ప్రవర్తన సమస్యల నిర్వహణ :-
→ మానవుని ప్రవర్తన కొన్ని విలువలకు, ప్రమాణాలకు లోబడి ఉంటుంది. ఈ ప్రమాణాలకు భిన్నంగా వ్యవహరించటమే సమస్యాత్మక ప్రవర్తనగా చెప్పవచ్చు.
→ తనకుగాని, ఇతరులకుగాని, పరిసరాలకుగాని సమస్యను సృష్టించే ప్రవర్తనే - సమస్యాత్మక ప్రవర్తన..
→ పాఠశాలలో విద్యార్థి ప్రవర్తనలో భాగంగా పాఠశాల విధించిన నియమ నిబంధనలు ఎవరయితే తరచుగా అతిక్రమిస్తుంటారో, ప్రమాణాలను తగిన విధంగా ఎవరయితే పాటించరో వారిని సమస్యాత్మక ప్రవర్తన కలిగిన పిల్లలుగా గుర్తిస్తారు.
కొన్ని సమస్యాత్మక ప్రవర్తనలు / ప్రవర్తనా అపవ్యవస్థలు :
→ ఉపాధ్యాయుల పట్ల అవిధేయత,
→ ఇతర పిల్లలపట్ల దౌర్జన్యంగా వ్యవహరించుట.
→ ఇతర పిల్లల వస్తువులను దొంగిలించుట.
→ పాఠశాలకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేయుట,
→ తరచుగా ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో అబద్ధాలు చెప్పుట.
→ వ్యతిరేక లింగ వర్గాలను ఇబ్బందులకు గురి చేయుట.
→ ఉపాధ్యాయులను, ఇతర విద్యార్థులను ఎగతాళి చేయుట.
→ క్రమశిక్షణ లేకపోవుట మొదలగు అనైతిక చర్యలు.
→ సంఘ వ్యతిరేక ప్రవర్తన, దెబ్బలు తగిలించుకొనే ప్రవర్తన, ధ్వంసం చేయుట, నిరాకరణ మొదలగునవి ప్రదర్శించుట.
→ సమస్యాత్మక ప్రవర్తనకు కారకాలు:
→ ఇంటి వద్ద తల్లిదండ్రుల పెంపకం.
→ తల్లిదండ్రులు పిల్లలపట్ల చూపించే అతిప్రేమ / అశ్రద్ధ.
→ పిల్లలపట్ల తల్లిదండ్రుల వైఖరులు.
→ చెడు ప్రవర్తన కలిగిన సమవయస్కుల బృందాలు.
→ ప్రతికూల ప్రవర్తనను కలిగించే పరిసరాలు.
→ పాఠశాలలలోని అతి క్రమశిక్షణ.
→ ఉపాధ్యాయుల వైఖరులు, విద్యార్థులతో ప్రవర్తించే తీరు,
→ ఒత్తిడి కలిగించే పాఠశాల పరిసరాలు మొ||వి.
సమస్యాత్మక ప్రవర్తన నిర్వహణ:-
→ సంబంధాల అభివృద్ధి:-
పిల్లలతో చక్కని కమ్యునికేషన్ కలిగి ఉండే వారిపట్ల ధనాత్మక వైఖరి ప్రదర్శిస్తూ అనుబంధలను పెంచుకోవాలి.
→ అధికారాలను దురుసుగా ఉపయోగించరాదు :
విద్యార్థులపట్ల దురుసుగా ప్రవర్తించుట, అందరి ఎదుట నిందించుట చేయరాదు. ఇది విద్యార్థుల అనైతిక ప్రవర్తన సమస్యలకు మూలకారణం అవుతుంది. తప్పుచేసినపుడు అది ఎందుకు చేయవలసి వచ్చిందో (ప్రేమగా విచారించాలి. ఇంకెప్పుడూ అలా చేయకూడదని సూచించాలి.
→ ధనాత్మక పునర్చలనములను ఉపయోగించుట :-
మంచి ప్రవర్తనను కనపరచినప్పుడు, తగిన బహుమతి / పొగడ్తను అందించాలి. వీలుంటే అందరిముందు పొగడాలి.
→ మార్గదర్శకత్వం / మంత్రణం అందించుట :
ఏ సమస్యలతో బాధపడుతున్నాడో తగిన విధానాల ద్వారా గ్రహించి ప్రవర్తనా సమస్యలకు కారణమైన వానిని తగిన మార్గదర్శకత్వం / మంత్రణంతో తొలగించాలి.
→ ఉద్వేగాల నిర్వహణ :-
సమస్యాత్మక ప్రవర్తనలకు మూలకారణం ఉద్వేగ పరిపక్వత లేకపోవటం కనుక ఉద్వేగ నియంత్రణ నిర్వహణ విద్యార్థులకు తెలియజేయాలి. తగిన శిక్షణ ఇవ్వాలి.
→ సాంఘిక సంబంధాల పెంపు:-
ఇతరులతో సంబంధాలు ఎందుకు అవసరమో తెలియచేస్తూ, సమాజంలో సంబంధాలు కొనసాగించలేకపోతే మనము ఎలా నష్టపోతామో తెలియజేయాలి. సాంఘికీకరణలో ప్రవర్తన పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తూ తమ ప్రవర్తన ద్వారా ఇతరులను బాధపెట్టే విద్యార్థులలో మార్పులు తీసుకురావాలి. ఇతరులందరు వీరిని స్వీకరించే విధంగా చేయాలి.
→ ఆత్మభావన తెలియచేయుట: తాము ఎలా ఉన్నాము. ఎలా ఉంచాలి అనే దానికి మధ్య తేడాను తెలియచేసి వారిలో మంచి ప్రవర్తనకై తరగతి గదులలో నీతి కథలను చెప్పాలి.
→ తరగతి గది వాతావరణం ఒత్తిడి లేకుండా ఆహ్లాదంగా ఉండేట్లు చూడాలి. ఉపాధ్యాయులు అందరికి అర్థమయ్యే రీతిలో బోధన కొనసాగించి ఒత్తిడి లేని తరగతి గది పరిసరాలను కల్పించాలి. విద్యార్థులపై ఎప్పుడు కూడా ప్రేమను చూపించాలే కాని ఎట్టి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా శిక్షించకూడదు.
→ కేస్ స్టడీ ద్వారా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువుల ప్రవర్తనకు కారణాలను అన్వేషించి తగిన విధంగా ఆ విద్యార్థులలో మార్పులు తీసుకురావాలి.
→ సర్దుబాటు కాని కొన్ని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించేలా చేయటమే చికిత్సా పద్ధతిలో (కేస్ స్టడీ) ప్రవర్తనా మార్పునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మూర్తిమత్వమును అంచనా వేసే పద్ధతులు :-
→ వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పని చేసినప్పుడు సమగ్ర మూర్తిమత్వమంటారు.
→ ఆలోచన, విశ్లేషణ, సమస్యా పరిష్కారం, అనుభూతులు, ఊహలు, చేతల మధ్య సామరస్యం ఉంటే మూర్తిమత్వంలో సమగ్రత ఉంటుంది.
→ మూర్తిమత్వాన్ని అంచనా వేసే విధానాలు పద్ధతులు: మూర్తిమత్వాన్ని అంచనావేసే పద్ధతులను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించారు.
1. అప్రక్షేపక పద్ధతులు
2. ప్రక్షేపక పద్ధతులు
1. ప్రక్షేపక పద్ధతులు:-
→ అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనావేసే పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు, అనగా అందులో బొమ్మలు, సన్నివేశాలు వంటి వాటి ద్వారా వారి ఆలోచనలు బహిర్గతం చేసి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.
→ ఈ పద్ధతులు వ్యక్తినుంచి ప్రత్యక్షంగా సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే ప్రయోజ్యులు ఊహాత్మకంగా స్పందిస్తారు. కనుక ఇవి ప్రత్యక్షాత్మకమైనవి మరియు ఊహాత్మకమైనవి.
→ ఉదా : రోషాక్ సిరామరకల పరీక్ష, థీమాటిక్ ఎప్పరిసెప్షన్ పరీక్ష, చిల్డ్రన్ ఎప్పర్సెప్షన్ పరీక్ష, పద సంసర్గ పరీక్ష వాక్య పూరణ పరీక్ష,మనో ప్రక్షేపక నాటిక, క్రీడా పద్ధతి
2. అప్రక్షేపక పద్ధతులు:-
వ్యక్తి అధ్యయనం, పరిషృచ్ఛ, స్వీయ చరిత్ర, ప్రశ్నావళి. మూర్తిమత్వ శోధికలు, నిర్ధారణ మాపనులు, శోధన సూచికలు, జీవిత చరిత్ర, సన్నివేశ పరీక్ష, పరిశీలన, సంఘటన రచన పద్ధతి. సాంఘికమితి మొ॥వి స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వంను అంచనా వేస్తాయి. అనగా ఈ పరీక్షలలో స్పష్టమైన జవాబు ఇచ్చే విధంగా ప్రశ్నలు లేదా ప్రవచనాలు ఉంటాయి.
ప్రక్షేపక పద్ధతులు
→ వ్యక్తి తనలోని అవసరాలను, ఘర్షణలను, ఆశలను, ఆశయాలను, అచేతన మనస్సులోకి పంపటం జరుగుతుంది.→ అచేతనంలోకి పంపబడ్డ విషయాలు, ఇతరులకు తెలియని విషయాలు, అప్రక్షేపక పద్ధతుల ద్వారా తెలియని విషయాలను, ఊహాత్మకంగా ఇచ్చిన జవాబుల ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని ఈ ప్రక్షేపక పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా చిత్త వృత్తులను బహిర్గతపరిచే పరీక్షలే ప్రక్షేపక పరీక్షలు.
రోషాక్ సిరామరకల పరీక్ష (RIBT) :-
→ ఈ పరీక్షను స్విట్జర్లాండ్కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు హెర్మన్ రోషాక్ అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షను వెలుగులోనికి తెచ్చినవారు 'బెక్'
→ ఇందులో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. వీటిమీద సిరామరకలు ఉంటాయి.
→ ఐదింటి మీద నలుపు, తెలుపు మరకలు, రెండింటిపై నలుపు, తెలుపు మరియు ఎరుపు మిగిలిన మూడింటి మీద పంచరంగుల సిరామరకలుంటాయి. కార్డులలో మరకలను కొన్ని ఆకారాలుగా ప్రయోజ్యుడు గుర్తించటం ద్వారా వాటిని ఆంగ్ల అక్షరములతో గుర్తించి తదుపరి వాటిని విశ్లేషించి అతని మూర్తిమత్వాన్ని నిపుణులు అంచనా వేస్తారు.
→ మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు :
1, స్థానం,
2. విషయం,
3. నిర్ణాయకాలు,
4. మౌలికాలు,
→ స్థానం అనేది ప్రయోజ్యుడు బొమ్మలో ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలియజేస్తుంది.
→ విషయం అనేది ప్రయోజ్యుడు సిరా మరకలో ఏమి చూసాడు అనే విషయం తెలుపుతుంది.
→ నిర్ణాయకం అనేది ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలిపేది.
→ మౌలికత అనేది సమాధానం చాలామంది చెప్పిందా లేదా స్వంత అభిప్రాయం అనేది తెలుపుతుంది.
→ పై విషయాలకు సంబంధించిన ప్రయోజ్యని ప్రతిస్పందనలను ప్రయోక్త ఆంగ్ల అక్షరములలో గుర్తుంచుకొని వాటివన్నింటిని విశ్లేషించి వ్యక్తి మూర్తిమత్వంపై ఒక అంచనాకు రావటం జరుగుతుంది. ఈ పరీక్షను నిపుణులైన వ్యక్తులు మాత్రమే నిర్వహించగలరు.
ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష / థీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ (TAT) :-
→ దీనిని అమెరికాకు చెందిన ముర్రే & మోర్గాన్ రూపొందించటం జరిగింది.
→ 'థీమా' అంటే కథ, 'ఎప్పర్ సెప్షన్' అంటే సూక్ష్మంగా గ్రహించడం.
→ ఈ పరీక్షలో 30 + 1 దీర్ఘచతురస్రాకార కార్డులుంటాయి. దీనిలో 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు, మిగిలిన 10 ఇద్దరికి. ఇస్తారు మరియు ఒక బొమ్మలేని ఖాళీ కార్డును కూడా ఇస్తారు.
→ పురుషులు, స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి 20+1 కార్డులను చూసి దానిలో ఉన్న బొమ్మలపై కథ చెప్పవలసి
1. ప్రస్తుత సన్నివేశానికి దారితీసిన పరిస్థితులు
2. ప్రస్తుత సన్నివేశంలో ఏం జరుగుతుంది.
3. దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు అడగటం ద్వారా చెప్పిన జవాబులను 6 కోణాలలో విశ్లేషించి వ్యక్తి అంచనా వేస్తారు. ఆ 6 కోణాలు.
1. కథానాయకుడు,
2. కథానాయకుడిపై పనిచేసే పరిసర శక్తులు,
3. కథానాయకుడ ప్రేరణ
4. సెంటిమెంట్లు
5. థీం
6. పరిణామాలు,
చిల్డ్రన్స్ ఎప్పర్ సెప్షన్ పరీక్ష (CAT) :-
→ ఈ పరీక్షను అమెరికాకు చెందిన L. బెల్లాక్, S. బెల్లాక్ రూపొందించడం జరిగింది. ఇది 3 నుండి 10 సం॥ల పిల్లల మూర్తిమత్వమును తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
→ చిన్న పిల్లలకు సంబంధించిన ఈ పరీక్షలో జంతువులు, పక్షుల బొమ్మలు కలిగిన దీర్ఘచతురస్రాకారంగా 10 కార్డులు ఉంటాయి. బొమ్మను చూసి చిన్న కథ అల్లి చెప్పవలసి ఉంటుంది. దాని ద్వారా పిల్లల అభిరుచులు, వైఖరుల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.
పదసంసర్గ పరీక్ష (Word Association Test) :-
→ కెంట్ మరియు రొసనాఫ్ దీనిని తయారుచేయడం జరిగింది. దీనిలో దాని తరువాత మాటను చెప్పటం జరుగుతుంది. మాట విన్న వెంటనే వ్యక్తి మనసులో మెదిలే మొదటి భావం చెప్పవలసి ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు.
వాక్య పూరణ పరీక్ష (Sentence completion Test):-
→ దీనిలో అసంపూర్ణంగా ఉన్న వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వ్యక్తి పూరించాలి.
→ పూరించిన పదాలను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది.
మనో ప్రక్షేపక నాటిక(Psycho drama) :-
→ దీనిలో వ్యక్తికి ఇష్టమైన పాత్రతో నాటకం వేయమనడం జరుగుతుంది. ఆ పాత్ర ద్వారా మూర్తిమత్వం అంచనా వేస్తారు.
→ ఇది సాధారణంగా సమతూకం కోల్పోయిన, మానసిక వైకల్యం గల వ్యక్తుల మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది.
క్రీడా పద్ధతి (Play way method):-
→ ఇది పిల్లలకు ఉపయోగించే పద్ధతి. బొమ్మలను ఇచ్చి, వారు ఆడుకొనే పద్ధతిని గమనించి మూర్తిమత్వం అంచనా వేయడం జరుగుతుంది.
అవక్షేపక పరీక్షలు
ప్రశ్నావళి (Questionnaire):-→ ఒక విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్నకు ఎదురుగా ఉండే అవును/ కాదు / సందిగ్ధం అనే ఐచ్ఛికాలను ఎంపిక చేసి ప్రయోజ్యుడు జవాబుగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన సమాధానాల ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వంను అంచనా వేయటం జరుగుతుంది.
ఉదా: R.B కాటిల్ అభివృద్ధిపరచిన 16 P.F. (Personality Factors) ప్రశ్నావళి,
→ ప్రశ్నావళులు 2 రకాలు. అవి :
→ నిర్ధారిత ప్రశ్నావళి : ఈ ప్రశ్నావళిలో అవును / కాదు / సందిగ్ధం అనే మూడింటిలో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేయాలి.
→స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి: దీనిలో ప్రతి ప్రశ్నకు వ్యక్తి స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు.
ఉపయోగాలు :
→ ఒకేసారి ఒక పెద్ద సమూహానికి కూడా ఉపయోగించవచ్చు.
→ దూరాన ఉన్నవారి నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు.
పరిమితులు:-
→ విశ్వసనీయత తక్కువ.
→ సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు.
మూర్తిమత్వ శోధికలు (Personality Inventories):
→యథాతథమైన విషయాలు ప్రవచనాల రూపంలో ఉన్నవి ఉన్నట్లు ప్రకటించడం జరుగుతుంది. ప్రవచనాల ఎదురుగా ఉన్న అవును /కాదు / సందిగ్ధం అనే వాటిని గుర్తించటం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే సాధనాలు. కొన్ని వాడుకలో ఉన్న మూర్తిమత్వ శోధికలు.
→ ది బెల్ అడ్జస్ట్ మెంట్ ఇన్వెంటరీ:
దీనిలో జీవితానికి సంబంధించిన అంశాలు గృహ సర్దుబాటు, ఆరోగ్యం, సాంఘిక సర్దుబాటు, భావోద్వేగ సర్దుబాటు, వృత్తి సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి.
→ మిన్సెసోటా మల్టిఫిసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) :
ఈ శోధికలో 550 అంశాలు ఉంటాయి. దీనిని హతావె & మెకన్లీ రూపొందించారు. ఇది అతిపెద్ద మూర్తిమత్వ శోధిక. ఇది అత్యంత ప్రామాణికమైన మూర్తిమత్వ శోధిక
వాడుకలోని నిర్ధారణ మాపనులు :
→ ది విన్నీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ (30 సం॥లలోపు వారి సర్దుబాటు, సాంఘికీకరణను అంచనా వేస్తారు)
→ ది పెల్స్ పేరెంట్ బిహేవియరల్ 'స్కేల్ (30 అంశాలుంటాయి. పిల్లలపట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను అంచనా వేస్తారు).
→ విటెన్బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ (మానసిక రోగుల ప్రవర్తనను తెలుసుకొనుటలో ఉపయోగిస్తారు)
→ హగెర్టి అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్
శోధన సూచికలు (Checklists):
→ ఒక విషయానికి చెందిన ప్రవచనాలను వరుసగా రాయటం జరుగుతుంది.
→ తరగతిలోని ఏ విద్యార్థికి ఏ ప్రవచనం సరిపోతుందో ఉపాధ్యాయుడు గుర్తించడం జరుగుతుంది.
→ గుర్తించిన ప్రవచనాల ద్వారా విద్యార్ధి మూర్తిమత్వాన్ని అంచనా వేయటం జరుగుతుంది.
సాంఘిక మితి (Soclometry):
→ ఈ పదాన్ని మొదటిసారి ఉపయోగించింది అమెరికాకు చెందిన జాకట్ ఎల్. మొరెనో
→ ఇది ఒక సమూహంలో ఆకర్షక - వికర్షక, సాంఘిక సంబంధాలను చూపే పద్ధతి.
→ ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యునికి అనుకూల, వ్యతిరేక వర్ణనలను చేస్తాడు.
→ ఈ వర్ణన ఫలితాలను సోషియోగ్రామ్ ద్వారా ఎక్కువ అనుకూల వర్ణనలు గల వ్యక్తిని లోపలి వలయాకారంలో చూపుతారు. ఎక్కువ వ్యతిరేక వర్ణనలు గల వ్యక్తిని బయటి వలయాకారంలో చూపుతారు.
→ సభ్యుల మధ్య అనుకూల, వ్యతిరేకతలను అడ్డువరుసలు మరియు నిలువు వరుసల ద్వారా చూపించిన దానిని సాంఘిక మాత్రిక అందురు.
→ ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని 'తార' అంటారు. ఎక్కువ మంది వ్యతిరేకతను చూపే వ్యక్తిని 'ఏకాకి' అంటారు.