ఓడీఎఫ్‌లో తెలంగాణ నం.1
బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ నం.1గా నిలిచిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
రాష్ట్రంలో 96.74 శాతం గ్రామాలు బహిరంగ విసర్జన రహిత జాబితాలో చేరాయని పేర్కొన్నారు. తెలంగాణ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలున్నాయని వివరించారు.
స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
తెలంగాణలో 3.03 కోట్ల మంది ఓటర్లు
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894గా తేలింది. గడిచిన ఏడాదితో పోలిస్తే 1,91,325 మంది అదనంగా నమోదయ్యారు.
18 - 19 సంవత్సరాల వయసు వారు 1,36,496 మంది తొలిసారిగా ఓటు హక్కు పొందారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 3,236 మంది యువత నమోదవగా, 3,162 మందితో హుజూరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
అతి తక్కువగా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో 237 మందే జాబితాలో చేరారు. వివిధ కారణాలతో ఓటర్ల జాబితా నుంచి రెండు దఫాలుగా 3,19,931 మంది పేర్లను తొలగించారు. కొత్తగా 5,11,256 మందిని చేర్చారు.
ఏటా జనవరి 5వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ఖరారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు సిద్ధమైన జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ విడుదల చేశారు.
వ్యాక్సినేషన్‌లో హనుమకొండ ఘనత
టీనేజర్లకు వ్యాక్సినేషన్‌లో హనుమకొండ జిల్లా రికార్డు సృష్టించింది. 15-17 ఏళ్ల వారికి 100 శాతం టీకాలను పూర్తి చేసింది.
జిల్లాలో 55,694 మందికి టీకాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు 56,299 డోసులు (101 శాతం) పంపిణీ చేశారు.
తిరోగమనంలో తెలంగాణ సేవా రంగం వృద్ధి రేటు
హైదరాబాద్‌లో గృహ నిర్మాణ రంగం వేగంగా పరుగులు తీస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021 - 22 ఆర్థిక సర్వే వెల్లడించింది.
అత్యధిక గృహ లావాదేవీలు జరుగుతున్న టాప్-8 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కానీ తెలంగాణలో సేవారంగం వృద్ధి రేటు గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తున్నట్లు సర్వే తెలిపింది.
2018 - 19లో 7.91% మేర ఉన్న ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2019 - 20లో 5.69%కి తగ్గిపోయింది. 2020 - 21 నాటికల్లా అది మైనస్ 3.94%కి పడిపోయిందని పేర్కొంది.
మరోవైపు కొవిడ్ ముందునాటి పరిస్థితులతో పోలిస్తే దాని రెండో దశలో భాగ్యనగరంలో ఇళ్ల ధరలు, లావాదేవీలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది.
ఈ విషయంలో ముంబయి, థానే, పుణె, నోయిడా, బెంగళూరుల సరసన హైదరాబాద్ నిలిచినట్లు తెలిపింది. ఇదే సమయంలో గాంధీనగర్, అహ్మదాబాద్, చెన్నై, రాంచీ, దిల్లీ, కోల్‌కతాల్లో మాత్రం లావాదేవీలు తగ్గినట్లు పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం :-
‣ హైదరాబాద్‌లో అటవీ విస్తరణ 2011తో పోలిస్తే 2021 నాటికి 146.8% వృద్ధి చెందింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయితో పోలిస్తే పెరుగుదల హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదైంది.
‣ గ్రామీణ ప్రాంతాల్లో 100% కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.
‣ మెరుగైన పారిశుద్ధ్య వసతులతో కూడిన ఇళ్లలో జీవించే జనం సంఖ్య 2015 - 16 నాటి కుటుంబ ఆరోగ్య సర్వే - 4 ప్రకారం తెలంగాణలో 76.2% ఉండగా, 2019 - 21 నాటి సర్వే - 5 నాటికి ఆ సంఖ్య 52.3%కి పడిపోయింది.
‣ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 ప్రకారం రాష్ట్రంలో శిశుమరణాల రేటు 27.7 ఉండగా, సర్వే-5 నాటికి అది 26.4కి తగ్గింది. అయిదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఇదే సమయంలో 46.5 నుంచి 45.6కి తగ్గింది.
‣ రాష్ట్రంలో సంతాన సాఫల్యరేటు (ఒక్కో మహిళకు జన్మించే సగటు పిల్లల సంఖ్య)లో మార్పు లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4, 5ల్లో ఇది 1.8కి పరిమితమైంది.
‣ నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020 - 21లో తెలంగాణ 69 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.
‣ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద తెలంగాణకు నిధులు తగ్గాయి. రాష్ట్రానికి 2019 - 20లో దీనికింద రూ.11 కోట్లు విడుదల చేయగా, 2020 - 21లో అది రూ.3 కోట్లకు తగ్గిపోయింది.
‣ తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం వీటన్నింటికీ రూ.10 కోట్లు కేటాయించారు.
‣ దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రోడ్డు అనుసంధానత మెరుగుపరిచారు. అందులో తెలంగాణ కూడా ఉంది.
రూ.1,500 కోట్లతో రాష్ట్రంలో రిగ్గుల పరిశ్రమ
రాష్ట్రానికి మరో పరిశ్రమ రానుంది. మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్‌స్పా రూ.1,500 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో అవుటర్ రింగ్ రోడ్డు బయట చమురు డ్రిల్లింగు, రిగ్గులు, వాటి అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించనుంది.
మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, డ్రిల్‌మెక్‌స్పా సీఈవో సిమోన్ ట్రెవిసానిలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
గోదావరి బోర్డు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఎంపీ సింగ్ బాధ్యతలు
కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు.
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా చంద్రశేఖర్ అయ్యర్ ప్రయత్నించారు.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్‌భూషణ్ మరణం
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్టు గుడిమల్ల భరత్‌భూషణ్ (68) అనారోగ్యంతో మరణించారు.
ప్రజల జీవన శైలిని, చారిత్రక ఘట్టాలు, సంస్కృతిని తన ఛాయాచిత్రాల్లో చూపించారు. పల్లెజీవనం, పల్లె దర్వాజా, బొడ్డెమ్మ, బతుకమ్మ, మహిళలు ఫొటోలు సహా తెలంగాణ బతుకు చిత్రాన్ని తన ఫొటోల ద్వారా తెలియజేశారు.
వివిధ కాలాలకు ప్రతీకగా ఉన్న రాష్ట్రంలోని దర్వాజాలు, ముగ్గులు, వంటింటి వస్తువుల సౌందర్యాన్ని కళ్ల ముందుంచారు. చిందు ఎల్లమ్మ, చాకలి ఐలమ్మ, కవి కాళోజీ ఛాయాచిత్రాలు తీసిన ఘనత ఆయనదే.
చిరంజీవి నటుడిగా మారిన తొలి రోజుల్లో ఆయన ఫొటోలను సైతం భరత్ తీశారు. హరిజన్, కాంచన సీత, రంగులకల వంటి చలనచిత్రాలకు ఛాయా చిత్రగ్రాహకునిగా పనిచేశారు.
జానపద కళలపై, కుల వృత్తులపై వ్యాసాలు రాసి సాహిత్యాభిలాషను వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ కింద తొలిసారి అరుదైన సర్జరీలు
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఆయుష్మాన్ భారత్ పథకం కింద అరుదైన సర్జరీలు చేశారు.
ఎక్కువగా కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన మోకీళ్ల, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు.
మహారాష్ట్రకు చెందిన మరో మహిళకు ఇదే పథకం కింద క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. ఆరోగ్య శ్రీ కింద ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకే సేవలు అందించే వీలుంది.
ఆయుష్మాన్ భారత్ అందుబాటులోకి రావడంతో నగరంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉస్మానియాలో చికిత్సలు తీసుకునే వెసులుబాటు ఏర్పడింది.
ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే చాలని వైద్యులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా చికిత్స చేసుకోవచ్చన్నారు.
నూటికి నూరు శాతం టీకా పంపిణీలో కరీంనగర్ ఆదర్శం
కరోనా.. తొలిసారి కలవరపెట్టిన నగరం కరీంనగర్. రెండేళ్ల కిందట ఇండోనేసియన్లతో మొదలైన వైరస్ అలజడితో అట్టుడికిన ప్రాంతమిది.
అలాంటి జిల్లా అర్హులైన పౌరులకు విజయవంతంగా టీకా రెండు డోసులనూ నూటికి నూరు శాతం అందించి నేడు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిచింది.
దక్షిణాదిన బెంగళూరు అర్బన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో జిల్లాగా రికార్డు సృష్టించింది. ఈ ఖ్యాతిని అందుకోవడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్ఫూర్తిదాయక చొరవ చూపించింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన గతేడాది జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారు 7,92,922 మంది ఉన్నట్లు తేల్చారు. అర్హులందరికీ మొదటి డోసు, అనంతరం రెండో డోసూ వేస్తూ వచ్చారు.
ఇటీవల నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడంతో కరీంనగర్ జిల్లా ఇతర జిల్లాల కన్నా మెరుగ్గా స్పందించింది. జనవరి 24 వరకు 7,85,968 మందికి (99 శాతం) టీకా వేశారు.
రెండో డోసును మరింత మందికి ఇవ్వడంతో ఈ డోసుల సంఖ్య 7,93,353కి చేరింది. దీంతో రెండు టీకాల విషయంలో నూరు శాతం కీర్తిని ఈ జిల్లా అందుకుంది.
ఆ తరువాత ఖమ్మం జిల్లా 9,87,883 (93.14 శాతం), యాదాద్రి- భువనగిరి జిల్లా 4,80,526 (91.86 శాతం) ఉన్నాయి.
8వ విడత ‘ఆపరేషన్ స్మైల్’
తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిదో విడత ఆపరేషన్ స్మైల్ కొనసాగుతోంది. బాల కార్మికులను ఇళ్ల నుంచి తప్పిపోయిన చిన్నారులను వెట్టిచాకిరీ, యాచకవృత్తిలో ఉన్న పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఆపరేషన్‌లో జనవరిలో 20 రోజుల వ్యవధిలో 1,801 మందికి విముక్తి కల్పించారు. ఇందులో భాగంగా ఛైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలను గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ‘దర్పణ్’ సేవల్ని వినియోగించడం సత్ఫలితాలనిస్తోంది.
గాలి స్వచ్ఛత కోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో గాలిలో స్వచ్ఛత ఉండేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నగరాల్లో గాలిలో కాలుష్యం లేకుండా చూడాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరో 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ఆర్నెల్లకోసారి సమావేశమై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలుపై చర్చించాలి.
ప్రపంచవ్యాప్తంగా భారత్ నుంచి తొలిసారి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేస్‌కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారి హైదరాబాద్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది నవంబరు 22 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరగనున్నాయి. దీని కోసం నెక్లెస్‌రోడ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హుస్సేన్‌సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పినాకిల్ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పేరిట జరిగే ఫార్ములా ఈ-రేసుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమాఖ్య ఫార్మలా-ఈతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. బీజింగ్‌లో జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన ఫార్ములా జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఫార్ములా వన్ రేసింగ్‌పై ఏడాదిలో 20కు పైగా గ్రాండ్‌ప్రిలు జరుగుతాయి. వాటిల్లో గెలిచిన పాయింట్ల ఆధారంగా చివర్లో అగ్రస్థానంలో నిలిచే రేసర్‌కు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ దక్కుతుంది. మరి ఫార్ములా-ఈ అంటే, అది కూడా ఫార్ములా వన్ లాంటిదే. కానీ అక్కడ ఇంధనంతో నడిచే కార్లు పోటీల్లో పరుగులు పెడితే ఫార్ములా- ఈ రేసుల్లో ఎలక్ట్రిక్ కార్లు ట్రాక్‌పై దూసుకెళ్తాయి. ఫార్ములా-ఈ, ఎఫ్1 మధ్య ఇదే ప్రధాన తేడా. ఎఫ్1 ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ)నే ఫార్ములా-ఈ రేసులనూ నిర్వహిస్తోంది. నగరాల్లోని రోడ్లపై కూడా ఈ రేసులు నిర్వహించడమే దీని ప్రత్యేకత. మన మహీంద్రాతో పాటు మెర్సిడెస్, నిసాన్, జాగ్వర్, పోర్షే లాంటి జట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాయి. ఎఫ్1 కార్లు అత్యధికంగా గంటకు 397 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఫార్ములా-ఈ కార్లలో అది గంటకు 280 కిలోమీటర్లుగా ఉంది. కర్బన ఉద్గారాలు లేని కారు రేసులు నిర్వహించడం, విద్యుత్తు వాహనాలకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో 2014లో ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం కోసం మొదలెట్టిన ఈ ఛాంపియన్‌షిప్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.
ఉన్నత స్థాయి పరిపాలనా సంస్కరణల కమిటీ
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సత్వర భర్తీ, కొత్త జిల్లాల్లో సజావుగా విధుల నిర్వహణకు అవసరమైన పోస్టుల గుర్తింపు తదితర అంశాల అధ్యయానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి అధ్యక్షతన నలుగురు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి పరిపాలనా సంస్కరణల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపరచి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయుల వారికీ భాగస్వామ్యం కల్పించటం వంటి అంశాలపైనా ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లాలు, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్ టీకా పంపిణీలో ప్రథమ స్థానంలో తెలంగాణ
వంద శాతం కొవిడ్ టీకాల పంపిణీ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్యులు, సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు.
తెలంగాణ 33 జిల్లాల మ్యాప్ ఆవిష్కరణ
తెలంగాణలోని 33 జిల్లాలతో రూపొందించిన సమగ్ర మ్యాప్ అట్లాస్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విడుదల చేశారు. సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించగా, విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ రూపొందించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల తాజా సమాచారంతో ఉన్న ఏకైక మ్యాప్ ఇదేనన్నారు.
బీటీపీఎస్ నాలుగో యూనిట్లో వాణిజ్య విద్యుదుత్పత్తి ప్రారంభం
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్)లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. నాలుగో యూనిట్‌లో జనవరి 6 నుంచి 72 గంటల పాటు 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగటంతో ‘వాణిజ్య ప్రాతిపదికన విద్యుదుత్పత్తి తేదీ’ (కమర్షియల్ ఆపరేషన్ డే- సీవోడీ)ని నిర్వహించారు. నాలుగో యూనిట్ నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కి అనుసంధానించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత భూమి సేకరించి నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్ విద్యుత్ కేంద్రం భద్రాద్రి. 2015 మార్చి 21న నిర్మాణ పనులను ప్రారంభించారు. ఒక్కోటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్ల నిర్మాణాన్ని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) చేపట్టింది.
పట్టణ అటవీ పార్కులకు ప్రత్యేక యాప్ ఆవిష్కరణ
నగర, పట్టణ అటవీ పార్కుల సమగ్ర సమాచారంతో రూపొందించిన ప్రత్యేక యాప్‌ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని 39 అటవీ అర్బన్ పార్కుల సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.
రెండోదశలో హెచ్‌ఎండీఏ వెలుపల పార్కుల సమాచారాన్ని చేర్చనున్నారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంకవర్గీస్ చొరవతో ఈ యాప్‌ను తీసుకువచ్చారు.
హరితహారంలో భాగంగా ఒక్కో థీమ్‌తో ఒక్కో అర్బన్ అటవీ పార్కును తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇ-పాలన 24వ జాతీయ సదస్సు
జాతీయ ఇ-గవర్నెన్స్ 24వ జాతీయ సదస్సు-2022 జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది.
కేంద్ర పరిపాలనా సంస్కరణలు, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, ఐటీ శాఖలు, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహించే ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, నిపుణులు హాజరవుతారు.
సదస్సులో కరోనా అనంతర పరిస్థితుల్లో ఇ-పాలన, ఆత్మనిర్భర్ భారత్, ప్రజాసేవల విస్తరణ, ఆవిష్కరణలు, నవీన సాంకేతికతలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలపై చర్చిస్తారు. జాతీయ ఇ-పాలన పురస్కారాలను ప్రదానం చేస్తారు.
‘ఉపాధిహామీ’కి రూ.477.61 కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.477.61 కోట్ల నిధులు విడుదల చేసింది. ఉపాధిహామీ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.546.91 కోట్లు కేటాయించింది.
వాటిలో గతంలోనే రూ.69.29 కోట్లు విడుదల చేయగా, తాజాగా రూ.477.61 కోట్లు ఇచ్చింది. అలాగే 2021-22 ఏడాదికి స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ కింద రూ.133.33 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణలో వన్‌మోటో పరిశ్రమ
బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్‌మోటో తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
15 ఎకరాలలో 2022 నవంబరులో ఈ పరిశ్రమను ప్రారంభించి, తొలి ఏడాది 40 వేలు, రెండో ఏడాది నుంచి లక్ష చొప్పున వాహనాలను ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.
హైదరాబాద్‌లో వన్‌మోటో బ్రిటన్‌లో ఉత్పత్తి చేసిన ఇ-స్కూటర్లు, బైకా, ఎలక్ట్రా, కమ్యూటాలను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లాలో పెద్ద రాతియుగం ఆనవాళ్లు
సూర్యాపేట-కోదాడ మార్గం మునగాల మండలం మాదారం గ్రామ పొలాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం పెద్ద రాతియుగం ఆనవాళ్లను గుర్తించింది.
చెదిరిపోయిన కైరన్(కుప్ప రాళ్ల) సమాధి, సమాధిలోపలి రాతి చలవలు, బంతిరాళ్లకు వాడిన రాతిగుండ్లు అక్కడ కనిపించాయని బృందం తెలిపారు.
దాదాపు 15 అడుగుల ఎత్తున్న మెన్హర్(నిలువురాయి) కూడా అక్కడ కనిపించింది. ఇది క్రీ.శ. 1 - 3 శతాబ్దాల మధ్యలో నిలిపిన రాయి అని సభ్యులు చెప్పారు.