సర్వేలు

అవినీతి రహిత దేశాల్లో భారత్‌కు 85వ ర్యాంకు

గత దశాబ్ద కాలంగా ప్రపంచంలో అనేక దేశాల్లో అవినీతి నిర్మూలనలో పెద్దగా పురోగతి లేదని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ స్వచ్ఛంద సంస్థ తేల్చింది. రెండేళ్లుగా కొవిడ్‌ కట్టడి చర్యల కారణంగానూ అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలిగినట్లు పేర్కొంది. ఈమేరకు ప్రపంచ దేశాల్లో ‘అవినీతి అంచనా సూచి - 2021’ జాబితాను విడుదల చేసింది. అత్యంత అవినీతి (సున్నా) స్థాయి నుంచి అవినీతి రహిత పరిస్థితికి (100) పాయింట్లు కేటాయించి ర్యాంకులను రూపొందించింది. ఈ జాబితాలో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్‌లు అత్యధికంగా 88 చొప్పున పాయింట్లు సాధించి సంయుక్తంగా ఒకటో ర్యాంకులో నిలిచాయి. 40 పాయింట్లతో భారత్‌ 85వ ర్యాంకు సాధించింది.

‣ 1995 నుంచి ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ 13 వేర్వేరు డేటాల ఆధారంగా వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతిని అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక వంటివాటితో పాటు నిపుణుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు మొత్తం 180 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించింది.

‣ తొలి 10 ర్యాంకులు సాధించిన దేశాల్లో వరుసగా నార్వే (85), సింగపూర్‌ (85), స్వీడన్‌ (85), స్విట్జర్లాండ్‌ (84), నెదర్లాండ్స్‌ (82), లగ్జెంబర్గ్‌ (81), జర్మనీ (80)లు ఉన్నాయి.

‣ 78 పాయింట్లతో బ్రిటన్‌ 11వ స్థానంలో నిలవగా.. అమెరికా 67 పాయింట్లతో 27వ ర్యాంకు సాధించింది. 74 పాయింట్లతో కెనడా 13వ స్థానంలో నిలిచింది. కేవలం 11 పాయింట్లు సాధించిన దక్షిణ సూడాన్‌ అవినీతి రహిత దేశాల జాబితాలో అట్టడుగు స్థానం (180)లో నిలిచింది. సోమాలియా, సిరియాలు చెరో 13 పాయింట్లతో దిగువ నుంచి రెండో స్థానం (178)లో ఉన్నాయి.

‣ గత దశాబ్ద కాలంలో 86% దేశాల్లో అవినీతి నిర్మూలన ప్రక్రియ స్తంభించిపోవడం లేదా దిగజారిపోవడం జరిగినట్లు ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ పేర్కొంది. అమెరికా, కెనడా, హంగేరీ, పోలండ్‌ సహా 23 దేశాలు సూచిలో దిగువకు తగ్గినట్లు వెల్లడించింది. ఆర్మేనియా, సీచెలెస్, ఈస్టానియా వంటి 25 దేశాలు మాత్రం పురోగతిని సాధించాయి.

‣ అవినీతి అంచనా సూచిలో 28 పాయింట్లు సాధించిన పాకిస్థాన్‌ 16 స్థానాలు దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. స్వచ్ఛమైన పాలన అందిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బగా పలువురు విశ్లేషిస్తున్నారు. 2020 సూచిలో పాక్‌ 31 పాయింట్లతో 124వ ర్యాంకులో నిలిచింది.


విశాఖ, హైదరాబాద్‌లలో భారీగా కాలుష్యం

దిల్లీ కాలుష్యం గురించి చర్చించుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఏ నగరమూ లేకపోగా కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశించిన ప్రమాణాలకంటే ఎక్కువ కాలుష్యం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఉంది. పది దక్షిణాది నగరాల్లోని సీపీసీబీ డేటాను బెంగళూరుకు చెందిన గ్రీన్‌ పీస్‌ ఇండియా సొసైటీ నివేదికను విడుదల చేసింది. 2020 నవంబరు 20 నుంచి గత ఏడాది నవంబరు 20 వరకు డేటాను సొసైటీ విశ్లేషించింది. దేశంలో వాయు కాలుష్యంతో సక్రమించే వ్యాధులు, వాటి ప్రభావంతో ఏటా సుమారు 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొంది.

అంతర్జాతీయంగా రెండో అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా టీసీఎస్‌

అంతర్జాతీయంగా ఐటీ సేవల సంస్థల్లో రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇన్ఫోసిస్‌తో పాటు మరో 4 భారతీయ కంపెనీలు అగ్రశ్రేణి 25 ఐటీ సేవల సంస్థల జాబితాలో చోటు సంపాదించాయని పేర్కొంది. ఇన్ఫోసిస్‌కు మూడో ర్యాంకు లభించగా, విప్రోకు 7, హెచ్‌సీఎల్‌ టెక్‌కు 8, టెక్‌ మహీంద్రాకు 15, ఎల్‌టీఐకు 22వ ర్యాంకు లభించింది. ఈ 6 భారతీయ బ్రాండ్‌లు 2020 - 22లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్‌-10 ఐటీ సేవల బ్రాండ్‌లలో ఉన్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యంత విలువైన, బలమైన ఐటీ సేవల బ్రాండ్‌గా అసెంచర్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. దీని బ్రాండ్‌ విలువ 3,620 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.71 లక్షల కోట్లు)గా ఉంది.


బెస్ట్‌ పాస్‌పోర్ట్‌ దేశాలుగా జపాన్, సింగపూర్‌

‘2022 బెస్ట్‌ పాస్‌పోర్ట్‌ దేశాల జాబితా’ను ఇటీవల హెన్‌లే పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ విడుదల చేసింది. ప్రపంచంలో బెస్ట్‌ పాస్‌పోర్ట్‌ దేశాల జాబితాలో జపాన్, సింగపూర్‌ తొలిస్థానంలో నిలిచాయి. పాకిస్థాన్‌ దేశం 108వ స్థానంలో నిలిచింది. వీసా అవసరం లేకుండా కేవలం పాస్‌పోర్టుతోనే ఎక్కువ దేశాల్లో పర్యటించడానికి వీలు కలిగించే దేశాన్ని బెస్ట్‌ పాస్‌పోర్టు దేశంగా గుర్తిస్తారు. భారత్‌ 83వ ర్యాంకును సొంతం చేసుకుంది. గత ఏడాది 90వ స్థానంలో నిలిచింది. భారతీయ పాస్‌పోర్ట్‌ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా 60 దేశాలను సందర్శించవచ్చు. జాబితాలో అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది.

అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక - 2021

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌ ‘అటవీ సర్వే ద్వైవార్షిక నివేదిక-2021’ విడుదల చేశారు.

దీని ప్రకారం దేశవ్యాప్తంగా అడవులు, చెట్ల ఉనికి విస్తీర్ణం పెరిగింది. 2,261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొత్తగా పచ్చదనాన్ని సంతరించుకుంది.

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌(647 చ.కి.మీ పెరుగుదల), తెలంగాణ (632 చ.కి.మీ), ఒడిశా (537 చ.కి.మీ) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఏపీ, తెలంగాణల్లో 2019 నవంబరు నుంచి 2020 మే వరకు ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నివేదిక రూపొందించారు.

‣ మెట్రో నగరాల జాబితాలో గత పదేళ్లలో హైదరాబాద్‌లో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

2021 నాటికి హైదరాబాద్‌ నగర విస్తీర్ణం (634.18 చ.కి.మీ.)లో అటవీ విస్తీర్ణం 12.90 శాతంగా నమోదైంది. 2011లో 33.15 చ.కి.మీ. పచ్చదనం ఉంటే.. ఇప్పుడు 81.81 చ.కి.మీ.కు పెరిగింది.

‣ ప్రపంచవ్యాప్తంగా పులుల్లో 70 శాతం (3,890) దేశంలో ఉన్నాయి. మూడేళ్ల క్రితం సర్వే ప్రకారం తెలంగాణలో ఏడు పులులు ఉన్నాయి.


ఆసియాలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

2030 కల్లా జపాన్‌ను నెట్టి ఆసియాలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుందని అంచనా. జర్మనీ, బ్రిటన్‌లనూ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ తన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌ల తర్వాత ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉన్నాయి.

‣ 2021లో 2.7 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడీపీ 2030 కల్లా 8.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. ఈ వేగవంతమైన వృద్ధి కారణంగా జపాన్‌ జీడీపీని భారత జీడీపీ అధిగమించి ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో రెండో స్థానంలోకి వెళ్లొచ్చు.

‣ 2030 కల్లా అతిపెద్ద పశ్చిమ ఐరోపా ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లను సైతం భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించొచ్చు. మొత్తం మీద వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతుంది.


బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ - సీఐఐ సంయుక్త నివేదిక

భారత ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) పరిశ్రమ వచ్చే దశాబ్ద కాలంలో 22-25 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్‌) 13-15 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.97,500 - 1,12,500 కోట్లు) చేరొచ్చని అంతర్జాతీయ సంస్థ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), పరిశ్రమ సమాఖ్య సీఐఐ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశీయంగా 40కి పైగా సంస్థలు కంటెంట్‌ ఇవ్వడంలో పోటీ పడుతున్నాయని తెలిపింది. అందుబాటు ధరలో అధికవేగం మొబైల్‌ ఇంటర్నెట్‌ లభ్యమవుతుండటంతో వినియోగం బాగా పెరగడం, గత ఆరేళ్లలో ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య రెండింతలు కావడం, డిజిటల్‌ చెల్లింపులకు ప్రజలు బాగా అలవాటు పడటం వంటివి ఓటీటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొంది.

తెలంగాణలో 15 శాతం పెరిగిన భూగర్భజలాలు

తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల వ్యవధిలో 15 శాతం భూగర్భజలాలు పెరిగాయని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో (ఎస్‌జీడబ్ల్యూసీసీ) డైనమిక్‌ భూగర్భ జలవనరుల అంచనా - 2020 నివేదికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్‌ జిల్లాల్లో భూగర్భంలో మృదుశిల ప్రాంతాలు ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ సంస్థలు తమ అధ్యయనంలో గుర్తించాయన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు భూగర్భంలో 83050 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భూమి పొరల మ్యాపింగ్‌ పూర్తయిందన్నారు.

2013లో రాష్ట్రంలో 13390 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంసీఎం) భూగర్భ జలాల లభ్యత ఉండగా 15 శాతం పెరిగి 2020 నాటికి 15128 ఎంసీఎంకు చేరుకుందన్నారు.

గడిచిన ఆరేళ్లలో సగటు భూగర్భ జలమట్టం 4 మీటర్లకుపైగా పెరిగిందని, గత దశాబ్దపు నీటి మట్టాలతో పోల్చితే 93 శాతం మండలాల్లో పెరుగుదల గుర్తించినట్లు తెలిపారు.

దేశంలోనే ఇది అత్యధికమని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం కూడా ప్రశంసించిందని గుర్తుచేశారు.

వాల్టా చట్టం ద్వారా బోరు బావుల తవ్వకానికి సులువుగా అనుమతి పొందే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

భూగర్భ జల వనరుల శాఖ చేస్తున్న కృషిని అభినందించారు.

మిషన్‌ కాకతీయ చెరువుల్లో పూడిక తీత, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కాల్వల ద్వారా చెరువులను క్రమం తప్పకుండా నింపుతుండటం, 1400 చెక్‌డ్యాంల నిర్మాణం, రీఛార్జి షాప్టులతో భూగర్భ జలమట్టం పెరుగుతోందని పేర్కొన్నారు.

సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్, రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ సంచాలకుడు పండిత్‌ మద్నూరే, సంయుక్త డైరెక్టర్లు లక్ష్మా, కేంద్ర వాటర్‌ బోర్డు ప్రాంతీయ సంచాలకుడు సిద్ధార్థనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


‘వాతావరణ మార్పు’పై యూఎన్‌డీపీ నివేదిక

-భారత్‌లో 67 శాతం మంది పిల్లలు (18 ఏళ్లలోపు వారు) వాతావరణ మార్పును ప్రపంచ అత్యవసర అంశంగా భావిస్తున్నట్లు ‘వాతావరణ మార్పు’పై యూఎన్‌డీపీ (ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం) నివేదిక వెల్లడించింది. వయోజనుల్లో మాత్రం 58 శాతం మంది ఈ అభిప్రాయంతో ఉన్నారు.

- యూఎన్‌డీపీ, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు ‘జీ20 పీపుల్స్‌ క్లైమేట్‌ ఓట్‌ 2021’ కోసం భారత్‌లో 34,749 మంది వయోజనులు, 31,390 మంది 18 ఏళ్ల లోపు వారితో ఈ అధ్యయనం నిర్వహించాయి.

- భారత్‌లో 18-35 ఏళ్ల వయసువారిలో 61%, 36-59 ఏళ్లవారిలో 59%, 60 ఏళ్లకు పైబడినవారిలో 49% మంది వాతావరణ మార్పును అత్యవసర అంశంగా భావిస్తున్నారు.


ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఎకోసిస్టం రిపోర్ట్‌

నాస్‌కామ్‌-జిన్నోవ్‌ ‘ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఎకోసిస్టం’ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక 2021లో టెక్‌ అంకురాలు దాదాపు రూ.1.80 లక్షల కోట్ల (24.1 బిలియన్‌ డాలర్ల)ను పెట్టుబడుల రూపంలో ఆకర్షించాయి.కొవిడ్‌ ముందుతో పోలిస్తే.. పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయి.

ముఖ్యాంశాలు :-
‣ 2020తో పోలిస్తే 100 మిలియన్‌ డాలర్లు.. అంతకు మించిన లావాదేవీలు మూడు రెట్లు పెరిగాయి. 2,400 మందికి పైగా ఏంజెల్‌ ఇన్వెస్టర్లు అంకురాల్లో పెట్టుబడులకు సిద్ధమయ్యారు.

‣ 11 అంకురాలు ఐపీఓల ద్వారా దాదాపు రూ.45 వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) సమీకరించాయి.

‣ ఉద్యోగాల మార్కెట్లోనూ అంకురాలు కీలక భూమిక పోషించాయి. దశాబ్ద కాలంలో స్టార్టప్‌లు 6.6 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 34.1 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలను కల్పించాయి.


‘ఎడెల్మన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌’ నివేదిక

కొవిడ్‌ ఉద్ధృతి వేళ గత ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఓ సర్వే తేల్చింది. అదే సమయంలో బూటకపు వార్తల పట్ల ఆందోళనలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ ఎజెండా సదస్సులో విడుదలైన ‘ఎడెల్మన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌’ నివేదికతో ఈ మేరకు పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

‣ తప్పుడు సమాచారం, బూటకపు వార్తలను ఇతరులు తమ ఆయుధాలుగా ఉపయోగించుకునే ముప్పుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 76% మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో 82% మంది ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల్లో ప్రజలు బూటకపు వార్తలపై పెద్దగా ఆందోళన వెలిబుచ్చలేదు.

‣ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో సగటు విశ్వాస శాతం పరంగా చూస్తే.. ఆ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా అట్టడుగున ఉంది.

‣ ఆర్థిక ఆశావాదం విషయంలో భారత్‌ టాప్‌-5లో చోటు దక్కించుకుంది. భారత్‌లో వ్యాపారాలు, ప్రభుత్వం, మీడియాపై విశ్వాసం తగ్గగా.. స్వచ్ఛంద సంస్థల విషయంలో అది స్థిరంగా ఉంది. మొత్తం 28 దేశాల్లో సర్వే నిర్వహించగా 23 దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలతో పోలిస్తే వ్యాపారాల మీదే ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేశారు.


2021లో మరణ శిక్షలు పడిన ఖైదీలు 144

దేశవ్యాప్తంగా వివిధ కోర్టులు 2021లో మొత్తంగా 144 మందికి మరణశిక్ష విధించాయి. 2016కు ముందు నుంచి ఇప్పటివరకు మరణ శిక్షలు పడి అమలు కావాల్సిన వారి సంఖ్య 488. ఈ సంఖ్య 2016 తర్వాత ఇప్పుడే అత్యధికం. జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం (ఎన్‌ఎల్‌యూ)లోని ప్రాజెక్టు 39ఏ సంస్థ ‘డెత్‌ పెనాల్టీ ఇన్‌ ఇండియా: స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌’ను విడుదల చేసింది.

2021లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సెషన్స్‌ కోర్టులు 34 మరణ శిక్షలు విధించగా పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్‌ కోర్టులు ఒక్క మరణ శిక్ష కూడా విధించలేదు. ఆంధ్రప్రదేశ్‌ కోర్టులు 13 మందికి మరణశిక్ష విధించగా తెలంగాణ కోర్టులు ఒక్క మరణశిక్షనే విధించాయి. సుప్రీంకోర్టు 2021లో ఒక్క మరణ శిక్షను కూడా విధించలేదు. ప్రాజెక్టు 39ఏ 2016 నుంచి ఏటా దేశంలో పడిన మరణ శిక్షలు ఇప్పటివరకు మరణ శిక్షలు పడిన వారి సంఖ్యతో నివేదిక విడుదల చేస్తోంది. మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య మొత్తంగా గత పదిహేడేళ్లలో ఇప్పుడే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

హైకోర్టులు విధించిన మరణ శిక్షలను సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటారు. కేసుల తీవ్రత.. సాక్ష్యాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆ కేసులను ఖరారు చేయడం, శిక్ష తీవ్రతను తగ్గించడం, నిందితులను కేసు నుంచి విముక్తి చేయడం, కేసు పునఃపరిశీలనకు పంపడం చేస్తుంది.


దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానం

దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించిన వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక విడుదల చేసింది. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కించగా రూ.9,117.95 కోట్లు ఉండగా ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%). బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఇతర ఆస్తులు, రుణాల రూపంలో తీసుకున్న నగదు, టీడీఎస్, టీఏసీఎస్‌లు కలుపుకొని లెక్కించగా ఏడు జాతీయ పార్టీల ఆస్తులు రూ.6,988.57 కోట్లుగా తేలింది. ఇందులో సింహభాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కిందే ఉన్నాయి. జాతీయ పార్టీల్లో అతి తక్కువగా రూ.8.20 కోట్లతో ఎన్సీపీ ఏడో స్థానంలో నిలిచింది.

ఆస్తులపరంగా దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న బీఎస్పీకి అప్పు మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. ఆస్తుల్లో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అప్పుల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులు ఉండగా, రూ.30.342 కోట్ల అప్పులతో తెదేపా రెండో స్థానంలో ఉంది. తెరాసకు రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా వైకాపా అప్పులను నివేదికలో పొందుపర్చలేదు. ఏడు జాతీయ పార్టీల అప్పులు రూ.74.27 కోట్లు, 44 ప్రాంతీయ పార్టీల అప్పులు రూ.60.66 కోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కలిపి రూ.134.93 కోట్ల అప్పులు ఈ పార్టీలకు ఉన్నాయి.


కొవిడ్‌ వేళ 151% పెరిగిన సైబర్‌ దాడులు: డబ్ల్యూఈఎఫ్‌

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్‌ నేరాలు, రాన్సమ్‌వేర్‌ దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో 151 శాతం పెరిగింది. ‘అంతర్జాతీయ సైబర్‌ భద్రత రూపురేఖలు - 2022’ పేరుతో దావోస్‌ ఎజెండా సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసిన నివేదిక ఈ మేరకు కీలక అంశాలను బయటపెట్టింది. ‣ కొవిడ్‌ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలీకరణం చెందింది. అయితే అదే సమయంలో సైబర్‌ నేరాలూ పెరిగాయి. ఆ దాడులను గుర్తించి, వాటిపై స్పందించేందుకు ఒక్కో కంపెనీకి సగటున 280 రోజుల సమయం పడుతోంది. ‣ రాన్సమ్‌వేర్‌లు ప్రజా భద్రతకు ప్రమాదకరమన్నది దాదాపు 80% సైబర్‌ నిపుణుల అభిప్రాయం. గత ఏడాది సైబర్‌ దాడి కారణంగా ఒక్కో పెద్ద కంపెనీకి సగటున రూ.27 కోట్ల నష్టం వాటిల్లింది. సైబర్‌ దాడికి గురయ్యాక ఆరు నెలల వరకూ ఒక్కో కంపెనీ షేర్‌ ధర దాదాపు 3% తగ్గింది.

‘ప్రాణాంతక అసమానతలు’ అనే శీర్షికతో ఆక్స్‌ఫామ్‌ ప్రత్యేక నివేదిక

కొవిడ్‌ 19 విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా 99 శాతం ప్రజల ఆదాయాలు కోసుకుపోయి 16 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోగా ధనవంతులు మాత్రం మహా సంపన్నులయ్యారని ఆక్స్‌ ఫామ్‌ సంస్థ వెల్లడించింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సభ ప్రారంభమైన సందర్భంగా ‘ప్రాణాంతక అసమానతలు’ అనే శీర్షికతో ఆక్స్‌ ఫామ్‌ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కరోనా ముందునాళ్లతో పోలిస్తే, వైరస్‌ విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచంలోని 10 మంది మహా కుబేరుల సంపద రెట్టింపై 111 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. కొవిడ్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక అసమానతల వల్ల ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు చొప్పున, రోజుకు 21,000 మంది చొప్పున మరణిస్తున్నారనే దారుణ సత్యాన్ని బయటపెట్టింది. ‣ భారత్‌లోని 10 మంది శతకోటీశ్వరులు రోజుకు 10 లక్షల డాలర్ల చొప్పున ఖర్చుపెట్టినా వారి దగ్గరున్న ధనరాశులు కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. భారతీయ సంపన్నులందరి మీద 1 శాతం పన్ను విధిస్తే, ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్‌ నిధులను 271 శాతం పెంచవచ్చు. దానివల్ల ఏ ఒక్క భారతీయుడూ వైద్యం కోసం సొంత జేబు నుంచి ఖర్చుచేయాల్సిన అవసరం ఉండదు. 100 మంది శతకోటీశ్వరుల వద్ద ఉన్న మొత్తం సంపదతో రానున్న 365 రోజుల పాటు మహిళా స్వయం సహాయక సంఘాల కోసం జాతీయ గ్రామీణ జీవనాధార పథకాన్ని విజయవంతంగా నిర్వహించవచ్చు. లేదా 17 ఏళ్లపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించవచ్చు.

పీడబ్ల్యూసీ వార్షిక అంతర్జాతీయ సీఈఓ సర్వే

కొవిడ్‌ పరిణామాల ప్రభావం ఉన్నా, అంతర్జాతీయ ఇబ్బందులున్నా భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 12 నెలల్లో పుంజుకుంటుందని పీడబ్ల్యూసీ వార్షిక అంతర్జాతీయ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారుల) సర్వే వెల్లడించింది. 89 దేశాలు, ప్రాంతాల్లోని 4,446 మంది కార్పొరేట్‌ కంపెనీల సీఈఓల నుంచి 2021 అక్టోబరు - నవంబరు మధ్యలో అభిప్రాయాలు సమీకరించిన అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఆ వివరాలతో నివేదికను వెల్లడించింది. ఇందులో భారత్‌ నుంచి 77 మంది సీఈఓలు పాల్గొన్నారు.

‣ రాబోయే సంవత్సర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భారత్‌ నుంచి అభిప్రాయాలు తెలిపిన సీఈఓల్లో 99 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపైనా ఆశావహంగా ఉన్నామని 94% మంది భారతీయ సీఈఓలు వెల్లడించారు. అంతర్జాతీయ సీఈఓల్లో 77% మందే అంతర్జాతీయ వృద్ధిపై సానుకూలంగా ఉన్నారు.

‣ స్వల్ప కాలానికే కాకుండా వచ్చే మూడేళ్లలోనూ కంపెనీల ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని 97% మంది భారతీయ సీఈఓలు వెల్లడించారు.

‣ 2021లో 70 శాతం మంది భారతీయ సీఈఓలు ‘వృద్ధికి కొవిడ్‌ విఘాతం కలిగిస్తుంద’ని పేర్కొన్నారు. 62% మంది సైబర్‌ దాడులు వృద్ధికి ప్రతిబంధకంగా మారతాయని పేర్కొన్నారు.

‣ శూన్య ఉద్గారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని 27% మంది భారతీయ సీఈఓలు చెప్పారు. అంతర్జాతీయంగా ఇది 22 శాతమే.


ద గ్లోబల్‌ రిస్క్స్‌ రిపోర్ట్‌ 2022

మానవాళికి సమీప భవిష్యత్తులో ఎదురుకాబోతున్న సవాళ్లపై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. వచ్చే దశాబ్దకాలంలో వాతావరణ మార్పులే అతిపెద్ద సమస్య కాబోతున్నాయని, వీటిని ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదని ‘ద గ్లోబల్‌ రిస్క్స్‌ రిపోర్ట్‌ 2022’ పేరిట రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు :-
‣ కరోనా పరిణామాల కారణంగా సామాజిక అసమానతలు పెరుగుతాయి.

‣ ప్రజలు డిజిటల్‌ వ్యవస్థలపై ఆధారపడటం పెరుగుతోంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ భద్రత సవాలుగా మారుతోంది.

‣ డిజిటల్‌ అంతరం ఇంకా విస్తృతమవుతుంది. ప్రపంచ జనాభాలో 300 కోట్ల మంది డిజిటల్‌ వ్యవస్థలకు దూరంగా ‘ఆఫ్‌లైన్‌’లో ఉండిపోతున్నారు.

‣ 2070కి శూన్య ఉద్గారాలకు, 2030కి 50 శాతం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి చేరాలన్న భారత్‌ లక్ష్యాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎక్కువ దేశాలు శూన్య ఉద్గారాల లక్ష్యసాధనకు ముందుకు వస్తున్నట్లు పేర్కొంది.


ది ఇండియన్‌ టెక్‌ యూనికార్న్‌ రిపోర్ట్‌ 2021

-భారత అంకుర సంస్థలు 2021లో 42 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.15 లక్షల కోట్లు) సమీకరించాయని ఒరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ నివేదిక పేర్కొంది. 2020లో ఇలా సమీకరించిన మొత్తం 11.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.85,000 కోట్లు) మాత్రమే. 2021లో భారత్‌లో కొత్తగా 46 యూనికార్న్‌లు (100 కోట్ల డాలర్ల/సుమారు రూ.7500 కోట్ల విలువ కలిగిన కంపెనీలు) అవతరించాయని, దీంతో మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరిందని వెల్లడించింది. ‘ది ఇండియన్‌ టెక్‌ యూనికార్న్‌ రిపోర్ట్‌ 2021’ పేరిట ఈ నివేదికను సంస్థ వెలువరించింది. అత్యధిక యూనికార్న్‌లతో అమెరికా (487), చైనా (301) ముందుండగా, బ్రిటన్‌ను (39)ను భారత్‌ అధిగమించినట్లు తెలిపింది.

- అంతర్జాతీయంగా ఉన్న ప్రతి 13 యూనికార్న్‌ల్లో ఒకటి భారత్‌లో పుట్టిందే. దేశంలో అత్యధిక యూనికార్న్‌లు కలిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. ఫిన్‌టెక్, ఇ-కామర్స్‌ సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (సాస్‌) విభాగాల్లో అత్యధిక యూనికార్న్‌లు ఉన్నాయి. హెల్త్‌-టెక్, ఎడ్‌టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- 13 మంది మహిళా యూనికార్న్‌ వ్యవస్థాపకులు వార్తల్లో నిలిచారు. ఫల్గుణీ నాయర్‌ (నైకా), గజల్‌ కల్రా (రివిగో), రుచి కల్రా (ఆఫ్‌బిజినెస్‌), దివ్యా గోకుల్‌నాథ్‌ (బైజూస్‌), గజల్‌ అలఘ్‌ (మామాఎర్త్‌), సరితా కటికనేని (జెనోటీ) వంటివారు ఇందులో ఉన్నారు.


‘బినాన్స్‌’ అధిపతి చాంగ్‌పెంగ్‌కు ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానం

-ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ‘బినాన్స్‌’ అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. చైనా మూలాలున్న కెనడా జాతీయుడైన జావో నికర సంపద విలువను 96 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7.2 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బర్గ్‌ లెక్కకట్టింది. ఫలితంగా ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (107 బిలియన్‌ డాలర్లు - 10వ స్థానం), రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (93 బిలియన్‌ డాలర్లు - 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు.

- టెక్‌ సంపన్నులు ఎలాన్‌ మస్క్, జెఫ్‌ బెజోస్, బిల్‌ గేట్స్, మార్క్‌ జుకర్‌బర్గ్‌ల సరసన జావో చేరడానికి, క్రిప్టో కరెన్సీల జోరు దోహదపడింది. క్రిప్టో వర్గాలు జావోను ‘సీజడ్‌’గా వ్యవహరిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్‌ కూడా జావోనే.