ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా
టాటా గ్రూప్ ఈ ఏడాది నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. చైనా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారు వివో స్థానాన్ని టాటా భర్తీ చేయనుంది.
ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ధ్రువీకరించాడు. వివోకు 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ఉంది.
అయితే 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ ఏడాదికి స్పాన్సర్‌గా వైదొలగింది.
దీంతో ఆ సంవత్సరం డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్‌గా ఉండగా తిరిగి 2021లో వివో స్పాన్సర్‌గా తిరిగొచ్చింది.
అయితే ఇంకో సీజన్‌కు స్పాన్సర్‌గా కొనసాగే అవకాశమున్నా వివో వైదొలగాలని నిర్ణయించుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు మోరిస్ వీడ్కోలు
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
దేశవాళీ జట్టు టైటాన్స్‌కు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మోరిస్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మోరిస్ 4 టెస్టుల్లో 12 వికెట్లు, 173 పరుగులు.. 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు.. 23 టీ20 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 133 పరుగులు చేశాడు.
టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు
టీం ఇండియా టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత 2014లో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పట్నుంచి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియాను తొలి స్థానంలో నిలిపాడు. 68 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. 40 విజయాలను అందించాడు. అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా 23వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
విరాట్ రికార్డులు :-
‣ 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం ముగ్గురు మాత్రమే విరాట్ కంటే కెప్టెన్‌గా అధిక విజయాలను నమోదు చేశారు. గ్రేమీ స్మిత్ (దక్షిణాఫ్రికా) 109 మ్యాచుల్లో 53 విజయాలు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 77 మ్యాచుల్లో 48 విజయాలు. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) 57 మ్యాచుల్లో 41 విజయాలు.
‣ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు విజయాలను నమోదు చేసిన అరుదైన ఘనతను కోహ్లీ రెండు సార్లు అందుకున్నాడు. గతేడాది బ్రిస్బేన్, లార్డ్స్, ఓవల్, సెంచూరియన్ స్టేడియాల్లో విజయం సాధించగా.. 2018లో జోహెన్నెస్‌బర్గ్, నాటింగ్‌హామ్, అడిలైడ్, మెల్‌బోర్న్ మైదానాల్లో టీమ్‌ఇండియా గెలిచింది.
‣ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మీద ఎక్కువ విజయాలను నమోదు చేసిన ఆసియా ఖండానికి చెందిన సారథి కూడా విరాట్ కోహ్లీనే. 23 మ్యాచుల్లో ఏడు విజయాలను నమోదు చేయగా.. 13 పరాజయాలు, మూడు డ్రాగా ముగిశాయి.
‣ స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్‌గానూ విరాట్ రికార్డు సృష్టించాడు. మన దేశంలో 24 టెస్టుల్లో, విదేశాల్లో 16 టెస్టు విజయాలతో గత సారథులకు అందనంత ఎత్తులో కోహ్లీ ఉన్నాడు.
‣ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 99 టెస్టుల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్‌లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలు, 28అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. ఇక టెస్టు కెప్టెన్‌గా 5,864 పరుగులు చేయడం విశేషం.
‣ టెస్టుల్లో కెప్టెన్‌గా ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోని తొలి ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే.
రెండోసారి జకోవిచ్ వీసా రద్దు
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన సెర్బియా టెన్నిస్ స్టార్ వీసాను అక్కడి ప్రభుత్వం రెండోసారి రద్దు చేసింది.
దీంతో అక్కడి అధికారులు జకోవిచ్‌ను నిర్బంధంలోకి తీసుకుని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియాకు వెళ్లడమే ఇందుకు కారణం.
ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకోని వారికి దేశంలోకి ప్రవేశం లేదు.
అక్కడి కోర్టును ఆశ్రయించగా ఆ కోర్టు.. జకోవిచ్ వీసాను పునరుద్ధరించింది. అయితే, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి అలెక్స్ హాక్ తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్ వీసాను మరోసారి రద్దు చేశారు.
ఐసీసీ టీ20 జట్లలో స్మృతి మాత్రమే
2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ పురుష, మహిళల టీ20 జట్లలో కలిపి భారత్ నుంచి ఒక్కరికే చోటు దక్కింది.
మహిళల జట్టులో స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు స్థానం లభించింది.
2021లో ఆమె 9 టీ20ల్లో 31.87 సగటు, 131.44 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేసి భారత మహిళల్లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
25 ఏళ్ల మంధాన నిరుడు రెండు అర్ధ శతకాలు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 జట్టుకు ఇంగ్లిష్ క్రికెటర్ నటాలీ సీవర్ కెప్టెన్‌గా ఎంపికైంది.
పురుషుల జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌నే ఐసీసీ జట్టుకు సారథిగా ప్రకటించారు.
అత్యధికంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ముగ్గురికి ఈ జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు.
శ్రీజేశ్‌కు వరల్డ్ గేమ్స్ అథ్లెట్ పురస్కారం
భారత హాకీ స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ వరల్డ్ గేమ్స్ ఈ ఏడాది మేటి అథ్లెట్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
2021 సీజన్లో ప్రదర్శనకు అతడికి ఈ పురస్కారం దక్కింది. స్పోర్ట్ క్లైంబర్ అల్బెర్టో లోపెజ్ (స్పెయిన్), ఉషు ఆటగాడు మైకేల్ గియోర్డానోలను వెనక్కినెట్టి శ్రీజేశ్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
భారత గోల్‌కీపర్‌కు 1,27,647 ఓట్లు రాగా.. లోపెజ్‌కు 67,428 ఓట్లు, గియోర్డానోకు 52046 ఓట్లు వచ్చాయి.
ఈ అవార్డు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా శ్రీజేశ్. 2019లో మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ తొలిసారిగా ఈ పురస్కారాన్ని అందుకుంది.
గతేడాది అంతర్జాతీయ హాకీ సమాఖ్య స్టార్స్ అవార్డుల్లో శ్రీజేశ్ ఉత్తమ గోల్‌కీపర్‌గా నిలిచాడు. ‘‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్‌గా పురస్కారం సాధించినందుకు గర్వంగా ఉంది.
ఈ అవార్డుకు నన్ను ప్రతిపాదించిన ప్రపంచ హాకీ సమాఖ్యకు, నాకు ఓటు వేసిన అభిమానులందరికి కృతజ్ఞతలు’’ అని శ్రీజేశ్ చెప్పాడు.
2006 కొలంబోలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన శ్రీజేశ్.. 2011 పాకిస్థాన్‌తో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్రత్యర్థి రెండు పెనాల్టీ స్ట్రోక్స్ కొట్టకుండా అడ్డుకుని అందరి దృష్టిలో పడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌తో పాటు 2014 ప్రపంచకప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో ఛాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శ్రీజేశ్.. 2016 రియో ఒలింపిక్స్‌లో జట్టును క్వార్టర్స్ వరకు తీసుకెళ్లాడు. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ చరిత్రాత్మక కాంస్య పతకం గెలవడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటిదాకా అతడు 244 మ్యాచ్‌ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు
జ్యోతి సురేఖకు టైటిల్
భారత అగ్రశ్రేణి ఆర్చర్ జ్యోతి సురేఖ మరో టైటిల్ ఖాతాలో వేసుకుంది. లన్‌కాస్టర్ ఆర్చరీ క్లాసిక్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఓపెన్ ప్రో (కాంపౌండ్) ఛాంపియన్‌గా నిలిచిన ఆమె ఇండోర్ ఆర్చరీ టైటిల్ సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది. ఫైనల్లో ఈ విజయవాడ అమ్మాయి జ్యోతి 131 - 129 తేడాతో పియర్స్ (అమెరికా)ను ఓడించింది. అంతకుముందు అర్హత రౌండ్లో ఆమె రెండో స్థానం (653/660)తో ముందంజ వేసింది.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నాదల్ రికార్డు
పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా స్పెయిన్ యోధుడు రఫెల్ నాదల్ రికార్డు సృష్టించాడు. ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమిస్తూ అతడు 21వ టైటిల్‌ను సాధించాడు. నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అతను మెద్వెదెవ్‌ను ఓడించాడు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నాదల్ తొలిసారి ఫెదరర్‌ను అధిగమించి పురుషుల టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఇన్ని రోజులు 20 టైటిళ్లతో ఫెదరర్, జకోవిచ్‌తో సమంగా ఉన్న అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలవడం ద్వారా కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఇది (5 గంటల 24 నిమిషాలు) రెండో సుదీర్ఘ ఫైనల్. 2012లో జకోవిచ్, నాదల్‌ల మధ్య మ్యాచ్ 5 గంటల 53 నిమిషాల పాటు సాగింది. 35 ఏళ్ల నాదల్‌కు ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. 2009లో ఇక్కడ అతడు తొలి టైటిల్ గెలుచుకున్నాడు.
కెన్ రోస్‌వెల్, ఫెదరర్ తర్వాత ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో అతిపెద్ద వయస్కుడిగా నాదల్ ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో జకోవిచ్ తర్వాత ప్రతి గ్రాండ్‌స్లామ్‌నూ కనీసం రెండు సార్లు గెలిచిన పురుష ఆటగాడిగా కూడా నాదల్ నిలిచాడు.
క్రెజికోవ్, సినియాకోవా జోడీకి డబుల్స్ టైటిల్
టాప్ సీడ్ బార్బరా క్రెజికోవా, కేథరినా సినియాకోవా జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ చెక్ జంట 6-7 (3-7), 6-4, 6-4తో అనా డానిలినా (కజకిస్థాన్), బీర్టిజ్ హదద్ మయా (బ్రెజిల్) ద్వయంపై విజయం సాధించింది.
కార్ల్‌సన్‌కు టాటా స్టీల్ చెస్ టైటిల్
ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 12వ రౌండ్లో ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచి టైటిల్‌కు చేరువైన కార్ల్‌సన్ చివరిదైన 13వ రౌండ్లో డానియల్ దుబోవ్ (రష్యా) నుంచి బై లభించడంతో ట్రోఫీ నెగ్గాడు. కార్ల్‌సన్ మొత్తం 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో గెలవడం అతడికి ఎనిమిదోసారి.
ఒడిశా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ
ఒడిశా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్ పుల్లెల - ట్రీసా జాలీ జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. గాయత్రి - ట్రీసా జంట మహిళల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో గాయత్రి - ట్రీసా జోడీ 21-12, 21-10తో సంయోగిత - శ్రుతి జంటపై విజయం సాధించింది. గాయత్రి జంట 28 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీ ఆటకట్టించి విజేతగా నిలిచింది.
మహిళల సింగిల్స్‌లో 14 ఏళ్ల ఉన్నతి హుడా టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో ఉన్నతి 21-18, 21-11తో స్మిత్ తోష్నివాల్‌పై నెగ్గింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిరణ్ జార్జ్ 21-15, 14-21, 21-18తో ప్రియాంషు రజావత్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
పురుషుల డబుల్స్ ఫైనల్లో రవికృష్ణ - శంకర్ ప్రసాద్ జోడీ 21-18, 14-21, 16-21తో అయూబ్ - లిమ్ ఖిమ్ (మలేసియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. - మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అర్జున్ - ట్రీసా జాలీ జంట 16-21, 20-22తో సచిన్ డియాతిలిని హెందహెవా (శ్రీలంక) జోడీ చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీ గెలిచింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత బార్టీ
ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో పరిపూర్ణ క్రీడాకారిణి తానేనని ఆష్లే బార్టీ చాటిచెప్పింది. నిలకడ లేమికి మారుపేరుగా మారిన మహిళల టెన్నిస్‌లో మిగతా ప్లేయర్ల కంటే ఎంతో మెరుగ్గా ఆడుతున్న బార్టీ మూడు రకాల కోర్టుల్లోనూ గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 6-3, 7-6 (7-2)తో కొలిన్స్‌పై విజయం సాధించింది.
సెరెనా (2015లో) తర్వాత మూడు భిన్న కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన క్రీడాకారిణి బార్టీనే. 2019లో మట్టి కోర్టుపై ఫ్రెంచ్ ఓపెన్, నిరుడు పచ్చికలో వింబుల్డన్ గెలిచిన ఆమె.. ఇప్పుడు హార్డ్ కోర్టులో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకుంది.
డబుల్స్ టైటిల్: పురుషుల డబుల్స్ టైటిల్ కూడా కంగారూ ఆటగాళ్ల సొంతమైంది. ఫైనల్లో కిర్గియోస్- కొకినాకిస్ జోడీ 7-5, 6-4తో ఆస్ట్రేలియాకే చెందిన ఎబ్డెన్-పుర్సెల్ జంటను ఓడించింది.
టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్స్ విజేత అర్జున్
టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్స్ విభాగంలో తెలుగుతేజం అర్జున్ ఇరిగైసి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మరో రౌండ్ మిగిలివుండగానే అతడు విజేతగా నిలిచాడు. పన్నెండో రౌండ్లో థాయ్‌వాన్ (చెక్ రిపబ్లిక్)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానం ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో 7 గేమ్‌ల్లో గెలిచిన అతడు అయిదు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. టైటిల్ విజేతగా నిలిచిన అర్జున్ వచ్చే ఏడాది మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి దూసుకెళ్లాడు. మరోవైపు మాస్టర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి.. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను నిలువరించాడు. పదకొండో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఈ మ్యాచ్ డ్రా అయినా కార్ల్‌సన్ (7.5 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. విదిత్ (6) ఆరో స్థానంలో ఉన్నాడు.
హుడా ఫైనల్లో ఉన్నతి
ఒడిషా ఓపెన్లో 14 ఏళ్ల ఉన్నతి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 418వ ర్యాంకర్ ఉన్నతి 24-22, 24-22తో 67వ ర్యాంకర్ మాల్వికపై గెలిచింది. మరో సెమీస్‌లో సమిత్ 21-19, 10-21, 21-17తో అస్మితను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాంశు రజావత్, కిరణ్ జార్జ్ ఫైనల్ చేరారు. పురుషుల డబుల్స్‌లో శంకర్ ప్రసాద్-రవికృష్ణ తుది సమరంలో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జోలీ టైటిల్ ముంగిట నిలిచారు. సెమీస్‌లో గాయత్రి జంట 21-9, 21-6తో అరుల్-నీలాపై గెలిచారు. మరో సెమీస్‌లో సంయోగిత-శ్రుతి 10-21, 21-18, 21-17తో శ్రీవేద్య-ఇషికపై విజయం సాధించగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-త్రిసా ఫైనల్లో అడుగుపెట్టారు.
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ భారత జట్లకు లక్ష్యసేన్, మాల్విక సారథ్యం
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లకు లక్ష్యసేన్, మాల్విక బన్సోద్ సారథ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 15న మలేసియాలోని షా ఆలమ్‌లో ఆరంభమయ్యే ఈ ఛాంపియన్‌షిప్‌లో పురుషులు, మహిళల వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. గత నెల హైదరాబాద్, చెన్నైలో జరిగిన అఖిల భారత టోర్నీల్లో ప్రదర్శనతో పాటు ర్యాంకింగ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుని బాయ్ ఈ జట్లను ఎంపిక చేసింది. మనీలాలో జరిగిన గత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచింది.
భారత జట్లు
పురుషుల సింగిల్స్: లక్ష్యసేన్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, ఎం.రఘు; పురుషుల డబుల్స్: రవికృష్ణ-ఉదయ్‌కుమార్, హరిహరన్-రుబన్ కుమార్, డింకుసింగ్-మంజిత్‌సింగ్; మహిళల సింగిల్స్: మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అస్మిత, తారా షా
మహిళల డబుల్స్: సిమ్రన్ సింగ్-ఖుషి గుప్తా, నీలా-అరుబాలా, ఆర్తి-రిజా.
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్ సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జట్టు కాంస్యం గెలిచింది. టైటిల్‌ను జపాన్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 4-2తో కొరియాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 2-0 గోల్స్‌తో చైనాను ఓడించింది
మ్లెదనోవిచ్ - డోడిగ్ జోడీకి మిక్స్‌డ్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను మ్లెదనోవిచ్ - ఇవాన్ డోడిగ్ జోడీ గెలుచుకుంది. ఫైనల్లో ఫ్రాన్స్ - క్రొయేషియా ద్వయం 6-3, 6-4తో జైమీ ఫోర్లిస్ - జేసన్ కుబ్లర్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది.
మేటి మహిళా క్రికెటర్ స్మృతి మంధాన
భారత అమ్మాయిల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపికైంది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ అవార్డు రేసులో టామీ బీమాంట్ (ఇంగ్లండ్), లిజెల్లె లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్)ను మంధాన వెనక్కినెట్టింది. లిజెల్లె ఉత్తమ వన్డే క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ టీ20 మహిళల జట్టులోనూ ఆమె చోటు దక్కించుకుంది. 2018లోనూ తను ఈ అవార్డు అందుకుంది. అప్పుడు వన్డేల్లోనూ మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. జులన్ గోస్వామి (2007లో) మాత్రమే మంధాన కంటే ముందు ఓవరాల్‌గా మేటి మహిళా క్రికెటర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది మేటి పురుష క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 21 ఏళ్ల అతను.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయసు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతేడాది మూడు ఫార్మాట్లలో కలిపి 36 మ్యాచ్‌ల్లో 78 వికెట్లు పడగొట్టాడు.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ అవార్డును అందుకుంటాడు. 27 ఏళ్ల అతను నిరుడు ఆరు వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అమోఘంగా రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ టెస్టు క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. నిరుడు 15 టెస్టుల్లో 61 సగటుతో 1708 పరుగులు సాధించాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాస్మస్ మూడో సారి మేటి అంపైర్‌గా నిలిచాడు.
సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీ ఛాంపియన్ సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-13, 21-16తో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం సింధుకిది రెండోసారి. 2017లోనూ సింధు టైటిల్ గెలుచుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్ - తనిషా క్రాస్టో జోడీ 21-16, 21-12తో హేమ నాగేంద్రబాబు - శ్రీవేద్య గురజాడ జంటపై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ పుల్లెల - ట్రీసా జాలీ జోడీ 12-21, 13-21తో చింగ్ చియాంగ్ - తియో షింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్ - విష్ణువర్ధన్‌గౌడ్ జోడీ 18-21, 15-21తో మాన్ చాంగ్ - వున్ తీ (మలేసియా) జంట చేతిలో ఓడి రజత పతకం సాధించింది.
ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్, లూకాస్ క్లేర్‌బౌట్‌లలో ఒకరు పాజిటివ్‌గా తేలడంతో వీరిద్దరి మధ్య జరగాల్సిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రద్దయింది.
ఐసీసీ 2021 ఉత్తమ టీ20 క్రికెటర్‌గా రిజ్వాన్
పాకిస్థాన్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ 2021 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ టీ20 ఆటగాడిగా ఎంపికయ్యాడు. రిజ్వాన్ గత ఏడాదిలో 29 టీ20ల్లో 73.66 సగటు, 134.89 స్ట్రైక్ రేట్‌తో 1326 పరుగులు చేశాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 55 బంతుల్లో 79 పరుగులు చేసి తమ జట్టు చారిత్రక విజయాన్నందుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్‌కు చెందిన టామీ బీమౌంట్ మహిళల్లో 2021 ఉత్తమ టీ20 క్రీడాకారిణిగా ఎంపికైంది.
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సింధు
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు ‘సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీ’ ఫైనల్లో చేరింది. సెమీస్‌లో ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) మధ్యలోనే తప్పుకోవడంతో టాప్ సీడ్ సింధు విజయాన్ని అందుకుంది. తొలి గేమ్‌ను 21-11తో గెలుచుకున్న తర్వాత.. అయిదో సీడ్ ఎవ్‌గెనియా పోరు నుంచి వైదొలిగింది. ఫైనల్‌లో సింధు భారత్‌కే చెందిన మాళవికతో తలపడుతుంది. మరో సెమీస్‌లో మాళవిక 19-21, 21-19, 21-7తో సహచర షట్లర్ అనుపమపై నెగ్గింది.
మహిళల డబుల్స్‌లో గాయత్రి పుల్లెల- ట్రీసా జాలీ జోడీ 17-21, 21-8, 21-16తో యువాన్- వెలెరీ (మలేసియా)పై నెగ్గి ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో వీరు చింగ్- జింగ్ (మలేసియా)ను ఢీకొంటారు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో కృష్ణ ప్రసాద్- విష్ణువర్ధన్ జంట 21-10, 21-9తో ప్రేమ్ సింగ్- రాజేశ్‌పై పైచేయి సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్- తనీషా, నాగేంద్ర- శ్రీవేద్య జోడీలు తుదిపోరుకు సిద్ధమయ్యాయి.
కొవిడ్ ప్రత్యామ్నాయ ఆటగాడిగా వత్స్
అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డ నేపథ్యంలో ఆల్‌రౌండర్ వసు వత్స్‌ను ప్రతమ్నాయ ఆటగాడిగా యువ భారత్ ఎంచుకుంది. అతను మానవ్ పరాఖ్ స్థానంలో జట్టులో చేరాడు. ఈ మార్పునకు ఐసీసీ టోర్నీ టెక్నికల్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్: ఉమ్మడిగా ఆధిక్యంలో విదిత్
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అయిదు రౌండ్ల అనంతరం 3.5 పాయింట్లతో షఖ్రియార్ మెమెద్యరోవ్ (అజర్‌బైజాన్), రిచర్డ్ రాపోర్ట్ (హంగేరీ)లతో కలిసి విదిత్ ఉమ్మడిగా ఆధిక్యం సంపాదించాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన అయిదో రౌండ్ గేమ్‌ను విదిత్ డ్రా చేసుకున్నాడు.
ఐసీసీ టెస్టు జట్టులో రోహిత్, పంత్, అశ్విన్
2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టెస్టు జట్టులో భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌ను ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిపిన విలియమ్స్ ఐసీసీ 2021 టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో పాకిస్థాన్ నుంచి ముగ్గురు (ఫవాద్ ఆలమ్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ) అవకాశం దక్కించుకున్నారు. లబుషేన్ (ఆస్ట్రేలియా), రూట్ (ఇంగ్లాండ్), కరుణరత్నె (శ్రీలంక), జేమీసన్ (న్యూజిలాండ్) జట్టులో మిగతా సభ్యులు.
ఐసీసీ 2021 వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సారథిగా ఎంపికైన ఈ జట్టులో ఫకార్ జమాన్ (పాకిస్థాన్), జానెమన్ మలన్, వాండర్‌డసెన్ (దక్షిణాఫ్రికా), షకిబ్, ముస్తాఫిజుర్, ముష్ఫికర్ (బంగ్లాదేశ్), హసరంగ, చమీర (శ్రీలంక), స్టిర్లింగ్, సిమిసింగ్ (ఐర్లాండ్) ఇతర సభ్యులు. టీ20 జట్టులోనూ భారత ఆటగాళ్లెవ్వరికీ చోటు దక్కలేదు.
మహిళల ఐసీసీ వన్డే జట్టులో మిథాలి, జులన్: ఐసీసీ 2021 ఉత్తమ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి సీనియర్ క్రికెటర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ హెదర్ నైట్ ఈ జట్టుకు కెప్టెన్. ఐసీసీ 2021 టీ20 జట్టుకు భారత్ నుంచి స్మృతి మంధాన మాత్రమే ఎంపికైంది.
‘టాప్స్’ నుంచి దీపిక, అతాను తొలగింపు
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) నుంచి భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్‌లను తప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో ఆకట్టుకోలేకపోయిన భార్యభర్తల జోడీని ‘టాప్స్’ నుంచి తొలగించారు. ఈ టోర్నీలో దీపిక, అతానుల వైఫల్యం నేపథ్యంలో మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) వీరిద్దరికి అందిస్తున్న సహకారాన్ని సమీక్షించింది. ‘‘ర్యాంకింగ్ టోర్నీలో తక్కువ ప్రదర్శన కారణంగా టాప్స్ జాబితాలో వీరిద్దరిని చేర్చకూడదని ఎంఓసీ నిర్ణయించింది’’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే చివరి సీజన్: సానియా
భారత టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న హైదరాబాదీ తార సానియా మీర్జా త్వరలోనే ఆట నుంచి వైదొలగబోతున్నారు. 2022 సీజన్ అనంతరం తాను టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు సానియా వెల్లడించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఓటమి పాలైన అనంతరం సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై టెన్నిస్ ఆడేందుకు తన దేహం సహకరించడం లేదని తేల్చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఓటమి అనంతరం ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది. 35 ఏళ్ల సానియా, రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో ఉంది.
ఆరేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టి 15 ఏళ్లకు (2003లో) ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన సానియా మరే భారత క్రీడాకారిణికి సాధ్యం కాని ఎన్నో ఘనతల్ని అందుకుంది. 2003 నుంచి 2013లో సింగిల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించే వరకు భారత్ తరఫున నంబర్ వన్ డబ్ల్యూటీఏ క్రీడాకారిణి సానియానే. సింగిల్స్ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది. 2013 తర్వాత పూర్తిగా డబుల్స్‌పైనే దృష్టిసారించిన సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కైవసం చేసుకుంది. వాటిలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడేసి టైటిళ్లు ఉన్నాయి. 2015లో మార్టినా హింగిస్‌తో జట్టుకట్టిన సానియా వరుసగా 44 మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించింది. 2015 ఏప్రిల్ 13న మహిళల డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. రికార్డు స్థాయిలో 91 వారాల పాటు నంబర్ వన్‌గా కొనసాగింది. 2018 అక్టోబరులో కుమారుడికి జన్మనిచ్చిన సానియా రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉంది. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగిన ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సానియా తన కెరీర్‌లో 43 డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిళ్లు సాధించింది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ సర్క్యుట్‌లో ఆడుతున్న క్రీడాకారిణుల్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్ సానియానే.
ఐపీఎల్ లఖ్‌నవూ కొత్త ఫ్రాంచైజీ సారథిగా కేఎల్ రాహుల్
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. ఫిబ్రవరిలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లఖ్‌నవూ ఎంపిక చేసుకున్న ముగ్గురిలో రాహుల్ ఒకడని తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయ్‌నిస్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఉండే అవకాశం ఉంది. రాహుల్‌కు రూ.15 కోట్లు, స్టాయ్‌నిస్‌కు రూ.11 కోట్లు, బిష్ణోయ్‌కు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్‌లలో పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పంజాబ్‌కు బిష్ణోయ్, దిల్లీ క్యాపిటల్స్‌కు స్టాయ్‌నిస్ ప్రాతినిధ్యం వహించారు.
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్‌పై చరిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో రెండు వికెట్ల తేడాతో నెగ్గడం ద్వారా ఐర్లాండ్ 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.
ఓ ఐసీసీ శాశ్వత సభ్య దేశంపై విదేశంలో సిరీస్ గెలవడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి.
ఆండీ మెక్‌బ్రైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (4/28, 59 పరుగులు)తో మూడో వన్డేలో ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మెక్‌బ్రైన్‌తో పాటు క్రెయిగ్ యంగ్ (3/43) విజృంభించడంతో మొదట వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
హోప్ (53), జేసన్ హోల్డర్ (44) రాణించారు. బ్రైన్, టెక్టర్ (52) రాణించడంతో లక్ష్యాన్ని ఐర్లాండ్ 44.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐర్లాండ్ 43వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి 208/8తో నిలిచింది.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత.. లక్ష్యసేన్
భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ ప్రపంచ ఛాంపియన్ కీన్ యూ (సింగపూర్)ను చిత్తుచేసి ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ లక్ష్యసేన్ 24-22, 21-17తో కీన్ యూపై విజయం సాధించాడు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీన్ యూ స్వర్ణం గెలవగా.. లక్ష్యసేన్ కాంస్యం నెగ్గాడు.
భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు - చిరాగ్ శెట్టి మరో టైటిల్ సాధించారు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్స్, రెండో ర్యాంకర్ ఎహసాన్- సెతియవన్ (ఇండోనేసియా) జోడీని ఓడించి విజేతగా నిలిచింది. ఫైనల్లో సాత్విక్ - చిరాగ్ జోడీ 21-16, 26-24తో నెగ్గింది.
మహిళల సింగిల్స్ ఫైనల్లో బుసానన్ (థాయ్‌లాండ్) 22-20, 19-21, 21-13తో సుపనిద (థాయ్‌లాండ్)పై గెలిచింది. సెమీఫైనల్లో పి.వి.సింధు 14-21, 21-13, 10-21తో సుపనిద చేతిలో ఓడింది.
ఆసియాకప్ మహిళల హాకీ భారత కెప్టెన్‌గా సవిత
ఆసియాకప్ మహిళల హాకీ టోర్నీలో పోటీపడే భారత జట్టుకు గోల్‌కీపర్ సవిత కెప్టెన్‌గా నియమితురాలైంది. 18 మంది సభ్యుల జట్టులో టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన క్రీడాకారిణులు 16 మంది ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయంతో దూరమైన నేపథ్యంలో జట్టుకు సవిత నాయకత్వం వహించనుంది. తెలుగమ్మాయి రజని ఎతిమరుపు కూడా ఈ జట్టులో ఉంది. ఆసియాకప్ 2022 జనవరి 21 నుంచి 28 వరకు మస్కట్‌లో జరగనుంది. జపాన్, మలేసియా, సింగపూర్‌లతో భారత జట్టు పూల్-ఎ లో ఉంది. గత ఆసియాకప్ (2017) ఫైనల్లో భారత్ షూటౌట్లో 5-4తో చైనాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
భారత మహిళల హాకీ జట్టు: సవిత, రజని, డీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మౌనిక, నేహా, సలీమా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్‌సియామి, వందన, మరియానా, శర్మిల దేవి.
అక్షయకు డబ్ల్యూఐఎం టైటిల్
తెలుగు తేజం బొమ్మిన మౌనిక అక్షయ ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎం) టైటిల్‌ను కైవసం చేసుకుంది. స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చదరంగ టోర్నీలో అక్షయ తొమ్మిది రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు సాధించింది. ఆ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే డబ్ల్యూఐఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ను ఆమె సొంతం చేసుకుంది. 2019 జనవరిలో దిల్లీలో జరిగిన అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ టోర్నీలో తొలి నార్మ్ సాధించిన అక్షయ 2021 సెప్టెంబరులో హంగేరీలో టోర్నీ సందర్భంగా రెండో నార్మ్‌ను కైవసం చేసుకుంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్‌కు 5వ స్థానం
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి స్థానాల్లో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ అయిదో ర్యాంకులో, కోహ్లి తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రూట్, స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. మయాంక్ అగర్వాల్ ఒక స్థానం కోల్పోయి 13వ ర్యాంకు సాధించాడు. బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్-10లో ఉన్న భారత బౌలర్ అతడొక్కడే. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. జేమీసన్‌కు రెండో ర్యాంకు దక్కింది. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్‌లో నంబర్‌వన్‌గా తస్నిమ్
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో భారత షట్లర్ తస్నిమ్ మీర్ (గుజరాత్) నంబర్‌వన్‌గా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన అండర్-19 బాలికల సింగిల్స్ జాబితాలో తస్నిమ్ నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 16 ఏళ్ల తస్నిమ్ రికార్డు సృష్టించింది. గత ఏడాది బీడబ్ల్యూఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న సామియా ఇమాద్ ఫారూఖీ (తెలంగాణ) నంబర్‌వన్ ర్యాంకు సాధించలేకపోయింది. 2021లో అండర్-19 విభాగంలో టాప్-10లో ఉన్న తస్నిమ్ అద్వితీయ ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
బోపన్న - రామ్ జోడీకి ఏటీపీ టైటిల్
భారత టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న - రామ్‌కుమార్ రామనాథన్ జంట ఏటీపీ అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో టైటిల్ కైవసం చేసుకుంది. కెరీర్‌లో తొలిసారి జోడీ కట్టిన బోపన్న, రామ్‌కుమార్ ఫైనల్‌లో 7-6 (6), 6-1తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) - మార్సెలో మెలో (బ్రెజిల్) జంటపై విజయం సాధించారు. బోపన్నకు ఇది కెరీర్‌లో 20వ డబుల్స్ టైటిల్ కాగా రామ్‌కుమార్‌కు ఏటీపీ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.
వెర్గాని చెస్ టోర్నమెంట్లో లలిత్‌కు టైటిల్
భారత గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్‌బాబు ఇటలీలో జరిగిన వెర్గాని చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లలో ఓటమి ఎరుగకుండా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టిమో (ఫిన్లాండ్), మేరీ గోమ్స్ (భారత్), మాక్స్ హెస్ (జర్మనీ), లొరెంజో (ఇటలీ), అమిన్ (ఇరాన్)లపై విజయాలు సాధించాడు.
‣ లలిత్ మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచినా ఉత్తమ టైబ్రేక్ స్కోరు ఆధారంగా అతడిని విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలోనే 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన 14 ఏళ్ల భరత్ సుబ్రమణ్యం చివరి గ్రాండ్‌మాస్టర్ నార్మ్ సాధించి జీఎం హోదా సంపాదించాడు. భరత్ 73వ భారత గ్రాండ్‌మాస్టర్.
ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీ
ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టైటిల్ సాధించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ ఆర్చర్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీనియర్ కాంపౌండ్ మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. పీఎస్‌పీబీ తరపున పోటీ పడిన ఆమె 146 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదితి (మహారాష్ట్ర- 145), ప్రియ (రాజస్థాన్- 142) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.
పురుషుల విభాగంలో రజత్ (రాజస్థాన్), సమాధాన్, బాల్‌చంద్ర (మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ రికర్వ్ పురుషుల విభాగంలో ఏపీ కుర్రాడు ధీరజ్ తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సుఖ్‌చైన్ సింగ్, రాహుల్ (ఎస్‌ఎస్‌సీబీ) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మహిళల్లో అంకిత (జార్ఖండ్) టైటిల్ ఖాతాలో వేసుకోగా సిమ్రన్‌జీత్ (ఏఏఐ), రిధి (హరియాణా) వరుసగా ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.
అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో బోపన్న జోడీ
ఏటీపీ టూర్‌లో తొలిసారి జట్టు కట్టిన రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు వెళ్లింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న-రామ్‌కుమార్ 6-2, 6-4తో నాలుగో సీడ్ జంట టామ్‌స్లావ్ (బోస్నియా)-సాంటియాగో (మెక్సికో)ను ఓడించారు. జనవరి 9న జరిగే టైటిల్ పోరులో టాప్‌సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)తో బోపన్న జంట తలపడనుంది.
డబ్ల్యూటీఏ సెమీస్‌లో సానియా జోడీ
డబ్ల్యూటీఏ 500 అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియామీర్జా జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సానియా-నడియా కిచెనోక్ (ఉక్రెయిన్) 6-0, 1-6, 10-5తో షెల్బీ రోజర్స్ (అమెరికా)-హెథర్ వాట్సన్ (బ్రిటన్)పై పోరాడి గెలిచారు. ఫైనల్లో స్థానం కోసం బార్టీ-స్టార్మ్ సాండర్స్ (ఆస్ట్రేలియా)తో సానియా ద్వయం తలపడనుంది. జనవరి 17న ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అడిలైడ్ టోర్నీని సన్నాహకంగా నిర్వహిస్తున్నారు.
టీటీలో స్నేహిత్, శ్రీజకు కాంస్యాలు
జాతీయ ర్యాంకింగ్ సెంట్రల్ జోన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యువ ప్లేయర్లు ఫిదెల్ ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజలకు చెరో కాంస్యం దక్కింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో తొమ్మిదో సీడ్ స్నేహిత్ 1-4 (11-8, 8-11, 8-11, 7-11, 8-11) తేడాతో మూడో సీడ్ హర్మీత్ దేశాయ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఆర్చరీ టోర్నీలో ధీరజ్‌కు రజతం
ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ రజతం సాధించాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో జూనియర్ రికర్వ్ పురుషుల విభాగంలో అతను ఈ గణత సాధించాడు. సుశాంత్ (మహారాష్ట్ర), రాహుల్ (ఎస్‌ఎస్‌సీబీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల్లో రిధి (హరియాణా), లక్ష్మీ (జార్ఖండ్), త్రిష (హరియాణా) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
కాంపౌండ్ జూనియర్ పురుషుల్లో రిషబ్ (హరియాణా), ప్రథమేశ్ (మహారాష్ట్ర), ప్రియాన్ష్ (దిల్లీ).. మహిళల్లో ప్రగతి (దిల్లీ), సాక్షి (ఉత్తర ప్రదేశ్), పర్ణీత్ కౌర్ (ఏఏఐ) వరుసగా పసిడి, రజత, కాంస్య పతకాలు సాధించారు.
100 క్యాచ్‌లు అందుకున్న నాలుగో భారత వికెట్‌కీపర్
టెస్టు క్రికెట్లో 100 క్యాచ్‌లు అందుకున్న నాలుగో భారత వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ ఘనత సాధించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఎంగిడి క్యాచ్ అందుకున్నప్పుడు అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్‌కీపర్ల జాబితాలో ధోని (256), కిర్మాణి (160), కిరణ్ మోరె (110) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు .
అంతర్జాతీయ క్రికెట్‌కు హఫీజ్ వీడ్కోలు
పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలు అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగిన 41 ఏళ్ల హఫీజ్ ఇక బరిలో దిగనని ప్రకటించాడు. 2003లో జింబాబ్వేతో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హఫీజ్‌కు గతేడాది నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన సెమీఫైనలే కెరీర్‌లో చివరిది. 2018లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఈ ఆల్‌రౌండర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగాడు. పాక్ తరఫున 392 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 12789 పరుగులు చేయడమే కాక 253 వికెట్లు పడగొట్టాడు. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్‌గా పాక్‌కు సేవలందించాడు. హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లు, ఆరు టీ20 ప్రపంచకప్పుల్లోనూ అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హఫీజ్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగనున్నాడు.
డోప్ పరీక్షలో తరన్‌జీత్ విఫలం
ప్రస్తుతం అండర్-23 స్థాయిలో భారత్‌లో వేగవంతమైన స్ప్రింటర్ తరన్‌జీత్ కౌర్ డోప్ పరీక్షల్లో విఫలమైంది. పోటీల సందర్భంగా జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల కౌర్... 2021లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. సెప్టెంబరు 27 నుంచి 29 వరకు జరిగిన జాతీయ అండర్-23 ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె 100 మీ., 200 మీ. స్వర్ణాలు గెలుచుకుంది. 100 మీ. రేసును 11.54 సెకన్లలో, 200 మీ. రేసును 23.57 సెకన్లలో పూర్తి చేసింది. ఆమె అంతకు వారం ముందు జాతీయ ఓపెన్ ఛాంపియన్‌షిప్ 100మీ పరుగులో స్వర్ణం, 200మీ పరుగులో రజతం చేజిక్కించుకుంది. నాడా క్రమశిక్షణ సంఘం కౌర్‌ను దోషిగా తేల్చితే.. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం పడే అవకాశముంది.