స్వదేశీ జెట్ ట్రైనర్ కీలక విన్యాసాలు
→హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సంస్థ దేశీయంగా రూపొందించిన ఇంటర్మీడియెట్ జెట్ ట్రైనర్ (ఐజేటీ) ‘సిక్స్ స్పిన్ టర్న్స్’ అనే కీలక విన్యాసాల సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. యుద్ధవిమానాలకు ఈ సత్తా చాలా అవసరం.
→భారత వైమానిక దళంలో కాలం చెల్లుతున్న ‘కిరణ్’ శిక్షణ విమానాల స్థానంలో ప్రవేశపెట్టేందుకు ఐజేటీలను రూపొందించారు.
→ఆకాశంలో చేరుకోగలిగే ఎత్తు, మోసుకెళ్లే బరువు, వేగం వంటి అంశాల్లో వాటి సామర్థ్యాన్ని ఇవి రుజువు చేసుకున్నాయని హెచ్‌ఏఎల్ తెలిపింది.
→‘స్పిన్ టెస్ట్’ అనే విన్యాసం ఒక్కటే నిర్వహించాల్సి ఉందని పేర్కొంది.
నౌకాదళం అమ్ములపొదిలో మరో రెండు పి-8ఐ నిఘా విమానాలు
→హిందూ మహాసముద్రంలో భారత నిఘా సామర్థ్యాలు మరింత ఇనుమడించనున్నాయి.
→ప్రత్యర్థుల కదలికలను ఇట్టే పసిగట్టగల మరో రెండు పొసైడన్-8ఐ (పి-8ఐ) నిఘా విమానాలు నౌకాదళం అమ్ములపొదిలో చేరాయి.
→ఇవి జలాంతర్గాములను గుర్తించి, ధ్వంసం చేయగలవు. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన రెండు పీ-8ఐ విమానాలు డిసెంబరు 30న భారత్‌కు చేరుకున్నాయని వాటిని తాజాగా గోవాలోని ఐఎన్‌ఎస్ హన్సపై మోహరించామని నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపారు.
→ భారత నౌకాదళంలో ఇప్పటికే ఎనిమిది పీ-8ఐ విమానాలు ఉన్నాయి.
డ్రోన్‌లతో కూలీల అవసరం లేకుండా సాగు
→వరి విత్తనాలు విత్తేందుకు డ్రోన్‌ను ఉపయోగించడం ద్వారా సాగు వ్యయం తగ్గించవచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించింది. కూలీల అవసరం లేకుండా, నేరుగా డ్రోన్‌తో విత్తనాలు విత్తే విధానంపై పరిశోధనల్లో సత్ఫలితాలు సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక అంకుర సంస్థ చేసిన ప్రయత్నం నచ్చడంతో వర్సిటీకి చెందిన పరిశోధన కేంద్రాల్లో వరి సాగుపై కొత్త ప్రయోగాలు చేస్తోంది. నారు పెంచి, నాట్లు వేయడానికి ఎకరాకు రూ.ఆరేడు వేల వరకు ఖర్చవుతున్నట్లు వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డ్రోన్‌ను ఉపయోగిస్తే ఈ వ్యయాన్ని తగ్గించవచ్చని తద్వారా రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ దిశగా ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు చేపట్టారు.
→ ప్రస్తుతం కొన్ని ప్రాంతాల రైతులు వరి సాగులో నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిని అనుసరిస్తున్నారు. మరికొందరు ‘డ్రమ్‌సీడర్’ యంత్రంతో విత్తనాలు విత్తే పద్ధతి చేపడుతున్నారు. నారు పెంచి నాట్లు వేసేవారూ ఉన్నారు. ఈ పద్ధతుల్లో ఎక్కువ ఖర్చు అవుతోంది. వీటిని తగ్గించడానికి డ్రోన్‌కు అడుగు భాగంలో గొట్టాలను ఏర్పాటుచేసి నేరుగా పొలంలో వరి విత్తనాలు చల్లితే వరసల ప్రకారం మొలకలు వస్తాయని హైదరాబాద్‌కు చెందిన మారుతీ డ్రోన్ల తయారీ అంకుర సంస్థ తన ప్రయోగంతో నిరూపించింది.
→ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివిన ప్రేమ్ అనే యువ ఇంజినీరుకు వచ్చిన ఈ ఆలోచన జయశంకర్ వర్సిటీ ముందు పెట్టడంతో మరిన్ని పరిశోధనలు చేసింది. డ్రోన్‌తో వరి విత్తనాలు విత్తే పరిజ్ఞానంపై జయశంకర్ వర్సిటీ, డ్రోన్ సంస్థ కలసి ‘మేధోపరమైన (పేటెంట్) హక్కు’ కోసం దరఖాస్తు చేశాయి. అనంతరం రైతులకు దీన్ని చేర్చాలని వర్సిటీ నిర్ణయించింది.
వెయ్యి మీటర్లు పయనించిన చైనా రోవర్
→చంద్రుడి ఆవలి భాగాన్ని శోధిస్తున్న చైనా రోవర్ యుతు-2 వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించింది.
→చందమామకు సంబంధించిన ఒక వైపును మాత్రమే భూమి నుంచి వీక్షించడానికి వీలవుతుంది.
→కనిపించని అవతలి భాగం గుట్టుమట్లు విప్పేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా 2019లో చాంగే-4 వ్యోమనౌకను చైనా పంపింది.
→అందులోని యుతు-2 రోవర్ అద్భుతంగా పరిశోధనలు సాగిస్తోంది. చైనా జానపద కథల్లోని ‘పచ్చ కుందేలు’ పేరును దీనికి ఖరారు చేశారు.
→ఈ రోవర్ తాజాగా 1,003.9 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. అనేక చిత్రాలను పంపింది. ఇప్పటికీ అది అద్భుతంగానే పనిచేస్తోంది.
చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చాంగే-5
చందమామపై నీటి ఆనవాళ్లను చైనా ల్యాండర్ చాంగే-5 కనుగొంది. జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి.
ఈ ల్యాండర్ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్లు ల్యాండర్ తేల్చింది. తేలికైన, వెసిక్యులర్ శిలలో 180 పీపీఎం మేర జలం జాడ ఉన్నట్లు వెల్లడైంది.
భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు జాబిల్లిపై నీటి ఉనికిని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు చాంగే-5 ల్యాండర్ శిలలు, ఉపరితలంపై జలం ఆనవాళ్లను కనుగొంది. చంద్రుడి ఉపరితలంపై కనిపించే తేమలో అధిక భాగం సౌర గాలుల ద్వారా వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చైనాలో కొత్త సూర్యోదయం.. ‘ఈస్ట్’
భానుడిలో శక్తిని ఉత్పత్తి చేసే సంక్లిష్ట ప్రక్రియను భూమిపై సాధించడానికి చైనాలో పరిశోధనలు చేస్తున్నారు. ‘కృత్రిమ సూర్యుడి’ని సాకారం చేసి భారీగా, పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని డ్రాగన్ ప్రయోగాలు చేస్తోంది. ఈ దిశగా ఇటీవల కీలక ముందడుగు వేసింది. 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రికార్డు స్థాయిలో 1,056 సెకన్ల పాటు రియాక్టర్‌ను పనిచేయించింది. ఇది సూర్యుడి కోర్ భాగంలోని ఉష్ణోగ్రత కంటే ఐదు రెట్లు అధికం. (భానుడి కోర్ భాగంలో వేడి 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుంది.) ఇంత సుదీర్ఘకాలం పాటు అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్ కొనసాగడం ప్రపంచంలోనేఇది మొదటిసారి.
ఏమిటీ యంత్రం?
ఈ కృత్రిమ సూర్యుడి పేరు ‘ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్’ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. ఇది చైనాలోని హెఫెయ్ నగరంలో ఉంది. కేంద్రక సంలీన చర్యల (న్యూక్లియర్ ఫ్యూజన్) ద్వారా పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం.
కీలక అంచెను పూర్తి చేసుకున్న జేమ్స్ వెబ్ టెలిస్కోపు
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)కి సంబంధించిన దర్పణం రోదసీలో విజయవంతంగా విచ్చుకుంది. దీంతో ఈ టెలిస్కోపును వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా ప్రధాన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ప్రయోగ సమయంలో రాకెట్‌లోని పరిమిత చోటులో పట్టేలా జేడబ్ల్యూఎస్‌టీని ముడివేశారు. రోదసిలోకి చేరాక దీన్ని దశవారీగా విచ్చుకునేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. తాజాగా విచ్చుకున్న ఈ దర్పణం వెడల్పు 6.5 మీటర్లు. పరావర్తన సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ దర్పణానికి బంగారు పూత పూశారు. అందువల్ల దీన్ని ‘బంగారు నేత్రం’గా కూడా పిలుస్తున్నారు. దాదాపు వెయ్యి డాలర్లతో రూపొందిన ఈ టెలిస్కోపు 13.7 బిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన తొలినాటి నక్షత్రాల తీరుతెన్నులను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. వచ్చే రెండు వారాల్లో జేడబ్ల్యూఎస్‌టీ దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్2 ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడే స్థిరంగా ఉంటూ విశ్వాన్ని శోధిస్తుంది.
ఇలలో చైనా సృష్టించిన చందమామ
శాస్త్ర పరిశోధన రంగాల్లో చైనా జోరు పెంచింది. భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ‘కృత్రిమ సూర్యుడి’ సాకారం దిశగా ముందడుగు వేసిన డ్రాగన్ ఇప్పుడు చందమామపై పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి జాబిల్లిని సృష్టించింది. అందులో గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం విశేషం. భవిష్యత్‌లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని సిద్ధం చేసింది. ఇలాంటి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేదు.
పనిచేసేది ఇలా..
‣ చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించడం ఆషామాషీ కాదు. ఇందుకోసం చైనా శాస్త్రవేత్తలు శక్తిమంతమైన అయస్కాంతాలను ఉపయోగించారు. మినీ చందమామ ‘మ్యాగ్నెటిక్ లెవిటేషన్’ ఆధారంగా పనిచేస్తుంది.
‣ ఈ కృత్రిమ చంద్రుడిలో ప్రధానంగా రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, ఒక వాక్యూమ్ చాంబర్ ఉంటాయి. చందమామపై కనిపించే తేలికపాటి శిలలు, ధూళితో ఈ గదిని రూపొందించారు. వాక్యూమ్ చాంబర్‌లో గాలి ఉండదు.
‣ వాక్యూమ్ చాంబర్‌పై గదిని ఉంచారు. శక్తిమంతమైన అయస్కాంతాల సాయంతో చాంబర్‌లో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే.. గది గాల్లోకి లేస్తుంది. ఫలితంగా అందులో చందమామ తరహా పరిస్థితులు ఏర్పడతాయి.
భారత వైద్యుల గుండె శస్త్రచికిత్స అధ్యయనానికి అంతర్జాతీయ గుర్తింపు
→గుండె కొట్టుకుంటుండగానే బైపాస్ ఆపరేషన్ (బీటింగ్ హార్ట్) చేయడం మంచిదా? లేక హార్ట్ లంగ్ మిషన్ సాయంతో చేస్తే మంచిదా? వైద్యలోకంలో ఇదో పెద్ద ప్రశ్న.
→ఈ రెండింటిలో ఎలా చేసినా ఫలితాలు సమానంగానే ఉన్నాయని భారతీయ వైద్య నిపుణులు దేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో బీటింగ్ హార్ట్ సర్జరీలు ఎక్కువగా చేస్తుంటారు.
→ఈ రకమైన సర్జరీల్లో నిపుణుడైన ప్రముఖ కార్డియోథొరాసిస్ సర్జన్ డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు సహా ఏడుగురు వైద్య నిపుణులు అయిదు నగరాల్లో ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
→డాక్టర్ లోకేశ్వరరావు దీన్ని అంతర్జాతీయ వైద్య విజ్ఞాన వేదికలపై ప్రదర్శించగా ప్రశంసలు లభించాయి.
→లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ’ నిపుణుల బృందం ఈ స్టడీ ఫలితాలను ఫిబ్రవరి సంచికలో ప్రచురించింది.
→దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై గుర్తింపు పొందిన 16 అధ్యయనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
అధ్యయనంలో ప్రధానాంశాలివి:-
→పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో గుండె బైపాస్ సర్జరీ పొందే వారి వయసు చాలా తక్కువ. ఇతర దేశాల్లో 60-65 ఏళ్లలో బైపాస్‌లు జరుగుతుండగా భారత్‌లో సగటున 58 ఏళ్లే.
→ఈ సర్జరీ పొందినవారిలో మధుమేహులు 55 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 50 శాతం కంటే పైగా బైపాస్ చేయించుకున్న మధుమేహులు నమోదు కాలేదు.
→సాధారణంగా స్పందించే గుండె మీద బైపాస్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కువగా హార్ట్ లంగ్ మిషన్ మీదకు మార్చుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘క్రాస్ ఓవర్’ అంటారు.
→ఇలా క్రాస్ ఓవర్ తక్కువగా ఉన్న వైద్యులకు నైపుణ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. ఈ అంశంలో భారతీయ వైద్యనిపుణుల క్రాస్ ఓవర్ 0.6 శాతమే.
→అంటే భారతీయ కార్డియోథొరాసిక్ సర్జన్ల నైపుణ్యం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుస్తున్నట్లుగా తాజా అధ్యయనంలో స్పష్టం చేశారు.
చంద్రుడిపైకి టయోటా కారు
→చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక వాహనాన్ని రూపొందించేందుకు టయోటా సంస్థ సిద్ధమవుతోంది.
→ఇందుకోసం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి రూపొందించనుంది. 2040 నాటికి జాబిల్లిపైన ఆ తర్వాత అంగారకుడిపైన ప్రజలు నివసించడానికి తోడ్పడటం దీని ఉద్దేశం.
→ఈ వాహనానికి ‘లూనార్ క్రూజర్’ అని పేరు పెట్టారు.
→ చంద్రుడిపై పరిశోధనలకు జపాన్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఐస్పేస్ అనే ప్రైవేటు సంస్థ రోవర్‌లు, ల్యాండర్‌లు, ఆర్బిటర్‌లపై పనిచేస్తోంది.
→ఈ ఏడాది చివర్లో చంద్రుడిపై ల్యాండింగ్ నిర్వహణకు ప్రయత్నిస్తోంది. జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త యుసాకు మేజవా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్)కి వెళ్లొచ్చారు.
→స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందిస్తున్న స్టార్‌షిప్‌లో చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రావడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు.
స్మార్ట్‌ఫోన్ యాప్‌తో వేగంగా కొవిడ్ నిర్ధారణ
→కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ యాప్, పరీక్ష కిట్ ఉంటాయి.
→దీని సాయంతో కరోనాలోని ఇతర వేరియంట్లతోపాటు ఫ్లూ వైరస్‌ను కూడా గుర్తించొచ్చు. ఈ విధానం ద్వారా ఇళ్ల వద్దే కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించొచ్చు.
→ఈ యాప్.. 25 నిమిషాల్లోనే పరీక్షను పూర్తి చేస్తుంది. దీనికి ‘స్మార్ట్-ల్యాంప్’ అని పేరు పెట్టారు.
→ఇందులో స్వల్ప మోతాదులో రోగి నుంచి లాలాజలాన్ని సేకరించి, స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా, డయాగ్నోస్టిక్ కిట్ సాయంతో విశ్లేషణ చేపట్టవచ్చు. మైఖేల్ మాహన్ పరిశోధనకు నేతృత్వం వహించారు.
కొవిడ్ తర్వాత ఊపిరితిత్తుల్లో లోపాలు
→కొవిడ్-19 నుంచి కోలుకున్నాక కూడా శ్వాస ఇబ్బందులు వీడని వారి ఊపిరితిత్తుల్లో లోపాలను గుర్తించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.
→దీన్నిబట్టి కరోనా వైరస్ వల్ల ఈ అవయవానికి అంతర్గతంగా నష్టం జరుగుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశోధకులు తెలిపారు.
→సాధారణ పరీక్షల్లో ఇవి బయటపడకపోవచ్చని వివరించారు. కొవిడ్ అనంతర సమస్యలు (లాంగ్ కొవిడ్) ఎదుర్కొంటున్న వారిలో శ్వాస ఇబ్బంది సాధారణంగా కనిపిస్తోంది.
→అయితే కరోనా వల్ల శ్వాస పోకడలో జరిగిన మార్పులు, అలసట లేక మరేదైనా ప్రాథమిక అంశం కారణంగా ఇలా జరుగుతోందా అన్నదానిపై స్పష్టత లేదు.
→దీని నిగ్గు తేల్చేందుకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి చెందిన ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
→ కరోనా నుంచి కోలుకున్న సంవత్సరం తర్వాత కూడా వీరిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.
→వీరి ఊపిరితిత్తుల్లో లోపాలను పరిశీలించడానికి వినూత్న జెనాన్ గ్యాస్ స్కాన్ విధానాన్ని ప్రయోగించారు.
→అసలు లోపాన్ని ఇది బయటపెట్టింది. వీరి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి సాఫీగా సాగడంలేదని వెల్లడైంది.
→ఇలాంటి లక్షణాలకు నిర్దిష్ట కారణాలను గుర్తిస్తే మరింత సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
న్యూట్రినోలతో వీడనున్న కృష్ణ పదార్థం గుట్టు!
→విశ్వంలోని అంతుచిక్కని కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) మిస్టరీని ఛేదించే దిశగా గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు ముందడుగు వేశారు.
→దీనికి న్యూట్రినో అనే రేణువులతో సారూప్యతలు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణ పదార్థ మూలం, ఉత్పత్తికి న్యూట్రినో ద్రవ్యరాశి మూలంతో సంబంధం ఉన్నట్లు తేల్చారు.
→ఐఐటీలోని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అరుణన్షు సిల్, పరిశోధన విద్యార్థులు అర్ఘ్యజిత్ దత్తా, రిషవ్ రోషన్‌లు ఈ ఘనత సాధించారు.
→విశ్వంలో కృష్ణ పదార్థం ఉన్నట్లు కొన్ని దశాబ్దాలుగా భౌతికశాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు.
→దీని ఉనికిపై స్పష్టమైన ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. దీనితో ఇది మిస్టరీ పదార్థంగానే ఉండిపోయింది.
→అదే సమయంలో ప్రకృతిలో కనిపించే రేణువులన్నింటిలోకి న్యూట్రినోలు అంతుచిక్కనివిగా మిగిలిపోయాయి. వీటికి ద్రవ్యరాశి లేదని ప్రామాణిక నమూనా సూచిస్తోంది.
జాతీయ జెండా కోసం ప్రత్యేక వస్త్రం
→జాతీయ పతాకాల కోసం భారత్‌లోని భిన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు సరిపోయే అనేక అధునాతన వస్త్రాలను దిల్లీలోని ఐఐటీకి సంబంధించిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేస్తోంది.
→జెండా కోసం ఉపయోగించే వస్త్ర మన్నికను 100 శాతం మేర మెరుగుపరచింది.
→ ఈ అంకుర సంస్థ పేరు స్వాత్రిక్. జెండా కోసం నాణ్యమైన వస్త్రాన్ని తయారుచేసేందుకు ‘ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’తో చేతులు కలిపింది.
→ఈ వస్త్రంతో రూపొందించిన జాతీయ జెండాలను ఇప్పటికే దిల్లీ, లద్దాఖ్‌లలో ఏర్పాటు చేశారు.
→ఎక్కువ బరువు లేకుండానే తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎక్కువ కాలం మన్నేలా వీటిని రూపొందించినట్లు ఐఐటీ పరిశోధకులు తెలిపారు.
కొవిడ్‌ను 20 నిమిషాల్లో పట్టేయవచ్చు
→కొవిడ్-19ను పసిగట్టే చౌకైన, స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ఇందులో యాంటిజెన్ పరీక్షల్లో ఉండే వేగం, పీసీఆర్ పరీక్షల్లో కనిపించే కచ్చితత్వం ఉంటాయి.
→ఈ సాధనానికి ‘ద హార్మనీ కొవిడ్-19’ పరీక్ష అని పేరు పెట్టారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు.
→హార్మనీ కిట్ ద్వారా 20 నిమిషాల్లోపే కొవిడ్ పరీక్షను పూర్తి చేయవచ్చు. ‘‘తక్కువ ఖర్చుతో ఎక్కడైనా చేయగలిగేలా ఈ పరీక్షను రూపొందించాం.
→అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తృతంగా అందుబాటులోకి రావడానికి వీలవుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న బారీ లట్జ్ తెలిపారు.
నిర్మాణ వ్యర్థాలతో ఫర్నీచర్ ముద్రణ
→నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలతో ఫర్నీచర్‌ను రూపొందించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక త్రీడీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు.
→ఈ ఫర్నీచర్ కోసం పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన ప్రింటబుల్ కాంక్రీట్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. త్రీడీ ముద్రణ వల్ల 75 శాతం తక్కువ కాంక్రీటు అవసరమవుతుంది.
→నిర్మాణ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సాంకేతికత అద్భుత పరిష్కారమవుతుందని ఐఐటీ గువాహటి డైరెక్టర్ టి.జి.సీతారామ్ తెలిపారు.
→ధ్రుతిమాన్ డే, దొడ్డ శ్రీనివాస్, భవేష్ చౌదరిలు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌లో కొత్త సాంకేతికత
దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్‌బోర్డ్ ఛార్జర్ సాంకేతికత వ్యయాన్ని సగానికి పైగా తగ్గించనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలకూ కళ్లెం పడే అవకాశం ఉంది. ఈ సాంకేతికతను ఐఐటీ గువాహటి, ఐఐటీ భువనేశ్వర్‌లతో కలిసి వారణాసిలోని ఐఐటీ - బీహెచ్‌యూ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దేశంలోని ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ సాంకేతికతపై ఆసక్తి చూపిందని, వాణిజ్యపరమైన ఉత్పత్తికీ సుముఖత వ్యక్తం చేసిందని బృందం సభ్యులు తెలిపారు.
నాడీ వ్యాధి జన్యుమూలాలను పసిగట్టే ఏఐ సాధనం
నాడీ వ్యవస్థకు సంబంధించిన మోటార్ న్యూరాన్ వ్యాధి (ఎంఎన్‌డీ) వంటి రుగ్మతలకు దారితీసే జన్యుపరమైన ముప్పులను కనుగొనడానికి ఒక కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని సాయంతో వ్యాధి ముప్పును పెంచే 690 జన్యువులను వారు గుర్తించారు. వీటిలో అనేకం ఇప్పటివరకూ వెలుగు చూడలేదు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సాధనానికి రెఫ్‌మ్యాప్ అని పేరు పెట్టారు. దీని ద్వారా కనుగొన్న ‘ఏఎన్‌కే1’ జన్యువును కీలకంగా భావిస్తున్నారు.
ఒమిక్రాన్‌పై తొలి పరమాణు స్థాయి విశ్లేషణ
→తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌లోని కొమ్ము ప్రొటీన్‌పై ప్రపంచంలోనే తొలిసారిగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేషణ చేశారు. పరమాణు స్థాయిలో దాని నిర్మాణ తీరుతెన్నులను ఆవిష్కరించారు. ఈ వేరియంట్‌తో కలిగే ఇన్‌ఫెక్షన్లకు సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది.
→ ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన శ్రీరాం సుబ్రమణ్యం కూడా ఉన్నారు. క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు సాయంతో శాస్త్రవేత్తలు విస్పష్టమైన విశ్లేషణ చేశారు. భారీ సంఖ్యలో ఉత్పరివర్తనలతో కూడిన ఒమిక్రాన్ వేరియంట్ మానవ కణాల్లో ఇన్‌ఫెక్షన్ కలిగిస్తున్న తీరును ఇది వెలుగులోకి తెచ్చింది.
అత్యాధునిక మార్పులతో ‘బ్రహ్మోస్’
మరిన్ని అత్యాధునిక సాంకేతికత మార్పులు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దేశీయంగా తయారు చేసిన పరికరాల సంఖ్యను కూడా పెంచినట్లు పేర్కొంది. రష్యాతో కలిసి భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని బాలేశ్వర్‌లో పరీక్షించినట్లు పేర్కొంది. ఐటీఆర్ లాంచ్ ప్యాడ్-3 నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో క్షిపణి ఛేదించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
బూస్టర్ డోసుతో ఒమిక్రాన్ నుంచి సమర్థ రక్షణ: ‘లాన్సెట్’ అధ్యయనం
కొవిడ్ టీకా బూస్టర్ డోసు వల్ల ఒమిక్రాన్ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు వేసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.
క్యాన్సర్‌కు పసుపుతో బయో డ్రగ్
→క్యాన్సర్ చికిత్సలో దుష్ప్రభావాలు లేని ఔషధాల కోసం సీసీఎంబీ చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆర్‌ఎన్‌ఏఐ, నానో టెక్నాలజీ సాయంతో క్యాన్సర్ చికిత్సకు పసుపుతో బయోడ్రగ్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. క్యాన్సర్ సోకితే శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన ఇతర కణాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్ సోకిన కణాలే లక్ష్యంగా ఔషధాలు పనిచేసేలా కేంద్రీకృత చికిత్స కోసం జన్యు సైలెన్సింగ్ (ఆర్‌ఎన్‌ఏఐ) ఒక మంచి సాధనం. ఈ విధానంలో జన్యువులోని నిర్దిష్ట భాగాలను మాత్రమే జత చేయడానికి వీలవుతుంది. ఇప్పటివరకు సురక్షితమైన పద్ధతులు లేకపోవడంతో ఆర్‌ఎన్‌ఏఐ ఆధారిత చికిత్స అందించలేకపోతున్నారు.
→ సీసీఎంబీలోని శాస్త్రవేత్త డాక్టర్ లేఖా దినేష్ కుమార్ బృందం, మరో పరిశోధన సంస్థ ఎన్‌సీఎల్‌లోని పాలిమర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంతో కలిసి ఆర్‌ఎన్‌ఏఐ, ఇతర అణువులను నిక్షిప్తం చేయడానికి నానో కర్కుమిన్ నిర్మాణాలను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ ముప్పును తగ్గించే లక్షణాలున్న పసుపు నుంచి దీన్ని సంగ్రహించి బయో ఔషధాన్ని రూపొందించారు. ఈ ఔషధం నిర్దిష్ట కణజాలాలను లక్ష్యంగా చేసుకుని పనిచేయడాన్ని గుర్తించారు. ఎక్కువ తీసుకున్నా ఎలాంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు. ‘పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఎలుకల్లో బయో ఔషధాన్ని ప్రయోగించాం. ఆరు నెలల వ్యవధిలో ఎలుకల్లోని కణతులు తగ్గడం కనిపించింద’ని డాక్టర్ లేఖా తెలిపారు. ఈ పరిశోధన పత్రం తాజాగా నానో జర్నల్‌లో ప్రచురితమైంది.
కుసుమ పూలతో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం రూపకల్పన
→కుసుమ నుంచి వంటనూనె మాత్రమే కాదు.. ఆ పూల రేకులతో టీ చేసుకుని తాగవచ్చని అంటున్నారు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. ఈ టీ వల్ల అనేక రకాల రుగ్మతలను నివారించవచ్చని చెబుతున్నారు. ‘సాఫో’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చిన వీరు పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో దశాబ్దకాలంగా యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న కుసుమ పూలరేకులను సేకరిస్తున్నారు. వీటితో టీ తయారీపై స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. వారి నుంచి స్పందన బాగుండడంతో ‘సాఫో టీ’ పేరుతో దీన్ని ప్యాక్ చేసి ప్రయోగాత్మకంగా విక్రయిస్తున్నారు. 10 గ్రాముల ప్యాకెట్‌తో 30 కప్పుల వరకు టీ తయారు చేసుకోవచ్చు. టీ పౌడర్‌కు బదులు ఒక కప్పు పాలకు అర చెంచా (సుమారు 0.3 గ్రాములు) కుసుమ పూలరేకులను వేసి మరిగించి తాగితే సరిపోతుంది.
→ కుసుమ పూల టీ తాగితే శరీరానికి అమైనో ఆమ్ల్లాలు, ధాతువులు బి1, బి2, బి12తో పాటు విటమిన్ సి, ఇ విరివిగా లభిస్తాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో హృద్రోగాలు, కీళ్ల నొప్పులు, వాపులు, మహిళల్లో రుతుక్రమ సమస్యలు నివారించవచ్చు. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది, చర్మ వ్యాధులను దూరం చేస్తుంది అని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు.
కొత్త జన్యు కారకాల వల్లే గుండె వైఫల్యాన్ని గుర్తించిన సీఎస్‌ఐఆర్ - సీసీఎంబీ శాస్త్రవేత్తలు
→భారతీయుల్లో గుండె వైఫల్యానికి సంబంధించి కొత్త జన్యు కారకాలను హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డైలేటెడ్ కార్డియోమయోపతికి కారణమయ్యే బీటా మయోసిన్ హెవీ చెయిన్ (బీటాఎంవైహెచ్7) జన్యువులో నూతన ఉత్పరివర్తనాలను డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుక్కుంది. తాజా పరిశోధన జన్యు లోపాన్ని సవరించేందుకు దోహదపడుతుందని, ఫలితంగా భవిష్యత్తులో భారతీయుల్లో గుండె వైఫల్య ముప్పు తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి వెల్లడించారు.
→ అధ్యయనంలో భాగంగా 167 మంది ఆరోగ్యవంతులు, 137 మంది డైలేటెడ్ కార్డియోమయోపతి రోగుల బీటాఎంవైహెచ్ 7 జన్యువును విశ్లేషించి ఉత్పరివర్తనాలను గుర్తించామని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింట్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ కె తంగరాజ్ తెలిపారు. ఈ అధ్యయనంలో మొత్తం 27 ఉత్పరివర్తనాలు వెల్లడయ్యాయి. వీటిలో ఏడు వినూత్నమైనవి. ఈ ఏడింటిని భారత డైలేటెడ్ కార్డియోమయోపతి రోగుల్లోనే గుర్తించాం. బీటాఎంవైహెచ్ 7 హోమాలజీ నమూనాలను ఉపయోగించి నిర్వహించిన మరో అధ్యయనంలో ఈ ఉత్పరివర్తనాలు కీలకమైన గుండె వ్యవస్థను ఎలా దెబ్బతీస్తాయో తొలిసారి నిరూపించామని అధ్యయన శాస్త్రవేత్త డాక్టర్ దీపా సెల్విరాణి తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ‘‘కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ - ఓపెన్’’లో జనవరి 14న ప్రచురితమయ్యాయి.
→ గుండె సంబంధ సమస్యల్లో కార్డియోమయోపతి ఒకటి. దీనివల్ల గుండె అంతర్నిర్మాణంలో మార్పులు వస్తాయి. ఫలితంగా గుండె రక్త ప్రసరణ చేయలేకపోతుంది. ఇది వ్యక్తి మరణానికి దారితీసే ప్రమాదముంది.
హిమాలయన్ మొక్కలో కొవిడ్‌కు ఔషధం
కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్ హిమాలయాల్లోని ఓ మొక్కలో ఉన్నట్లు భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ రసాయనాలు కీలకంగా మారనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ అధ్యయనం వివరాలు ఇటీవల ‘బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అనే ఈ మొక్కలో ఫైటోకెమికల్స్‌ను గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా ‘బురాన్ష్’గా పిలుస్తారు. ఈ ఫైటోకెమికల్స్ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. బురాన్ష్ మొక్కల పూరేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికిత్సల్లో వినియోగిస్తున్నారు.
మధుమేహుల్లో గుండె జబ్బుకు కారణం.. సైక్లోఫిలిన్ ఎ ప్రొటీన్
→మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బు ముప్పును పెంచే ఒక ప్రొటీన్‌ను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔషధాలతో దీని చర్యలను నియంత్రించడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని వారు పేర్కొన్నారు. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ధమనుల గోడలపై పేరుకుపోయే కొలెస్ట్రాల్ పూడికలు చిట్లిపోయినప్పుడు.. మరమ్మతు యంత్రాంగం క్రియాశీలమవుతుంది. దీనివల్ల అక్కడ రక్తం గడ్డలు ఏర్పడతాయి. అయితే అది గుండె కండరానికి రక్త ప్రవాహం చేరకుండా పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంది. ఫలితంగా గుండె పోటు వస్తుంది.
→ మధుమేహం ఉన్న రోగులకు కొలెస్ట్రాల్ ఛిద్రమయ్యే ముప్పు ఎక్కువ. వారిలో ఈ ఇబ్బందిని అధికం చేయడంలో సైక్లోఫిలిన్ ఎ అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఆర్‌జీసీబీ శాస్త్రవేత్త సూర్య రామచంద్రన్ తెలిపారు. గుండె జబ్బులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో జరిగే పరిణామాల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.
చంద్రుడిని పోలిన ఉపగ్రహం
→ సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉపగ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. గురుగ్రహ పరిమాణంలో ఉన్న 1708 బి అనే గ్రహం చుట్టూ ఇది తిరుగుతుంది.
→ ఈ గ్రహం భూమికి 5,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నాసా పంపించిన కెప్లర్ టెలిస్కోపు అందించిన సమాచారం సాయంతో దీన్ని గుర్తించారు.
కార్డియా మొబైల్‌కు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అనుమతులు
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇకపై ఇంట్లోనే ఈసీజీని తీసుకునే విధంగా కార్డియా మొబైల్ అనే పరికరాన్ని అలివ్‌కోర్ కంపెనీ తయారు చేసింది. దీని సాయంతో గుండెకు సంబంధించి వచ్చిన రిపోర్టును డాక్టర్లకు పంపి సలహాలు అడగొచ్చు. స్మార్ట్‌ఫోన్ సాయంతో పనిచేస్తుంది. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఈ డివైజ్‌కు అనుమతులు కూడా ఇచ్చింది.
21 ఏళ్ల తర్వాత కనిపించిన బ్లాంకెట్ అక్టోపస్
గ్రేట్ బ్యారియర్ రీఫ్‌లోని లేడీ ఇలియట్ దీవుల్లో అత్యంత అరుదైన జాతికి చెందిన బ్లాంకెట్ అక్టోపస్‌ను సముద్ర జీవ శాస్త్రవేత్త జసింటా షెకిల్‌టాన్ గుర్తించారు. ఈ అక్టోపస్ ఇక్కడ 21 సంవత్సరాల కిందట కనిపించింది. ఇది సముద్రం అడుగుభాగంలోనే ఎక్కువగా ఉంటుంది.
‘గగన్‌యాన్’ క్రయోజెనిక్ ఇంజిన్ అర్హత పరీక్ష విజయవంతం
ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్’ ప్రాజెక్టు కోసం క్రయోజెనిక్ ఇంజిన్ అర్హత పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ సముదాయం (ఐపీఆర్‌సీ) వద్ద 720 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించింది. ఈ దీర్ఘకాలిక పరీక్షకు సంబంధించిన అన్ని పరామితులను ఇంజిన్ అందుకున్నట్లు ఇస్రో తెలిపింది. మున్ముందు దానికి మరో నాలుగు పరీక్షలు (మొత్తంగా 1,810 సెకన్ల పాటు మండిస్తారు) నిర్వహించనున్నారు. అనంతరం మరో ఇంజిన్‌కు.. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఒక దీర్ఘకాలిక, రెండు స్వల్పకాలిక అర్హత పరీక్షలను నిర్వహించనున్నారు.
ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం
ధ్వని కంటే అయిదు రెట్ల వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ క్షిపణిని ఉత్తరకొరియా విజయవంతంగా ప్రయోగించింది. సముద్రంలో వెయ్యి కిమీ దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి చేధించినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. వారం వ్యవధిలో ఉత్తరకొరియా పరీక్షించిన రెండో హైపర్ సోనిక్ క్షిపణి ఇది.
నౌకాదళ బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించిన నౌకాదళ వెర్షన్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. నేవీకి చెందిన స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి ఈ అస్త్ర ప్రయోగం జరిగింది. లక్ష్యంగా నిర్దేశించిన ఒక నౌకను ఇది విజయవంతంగా ఢీ కొట్టిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది. నౌకాదళ పోరాట సన్నద్ధతను ఈ అస్త్ర పరీక్ష మరోసారి తేటతెల్లం చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి.
ట్యాంక్ విధ్వంసక క్షిపణిని పరీక్షించిన భారత్
భుజంపై నుంచి పేల్చే ట్యాంక్ విధ్వంసక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ (ఎంపీఏటీజీఎం) బరువు చాలా తక్కువని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రయోగానంతరం ఈ క్షిపణి స్వీయ మార్గనిర్దేశం చేసుకుంటుందని వివరించింది. తాజా పరీక్షలో ఈ అస్త్రం నిర్దేశిత లక్ష్యాన్ని నాశనం చేసిందని పేర్కొంది. 2.5 కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులను ఇది ఛేదించగలదని తెలిపింది. ఈ అస్త్రంలోని చిన్నపాటి ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్, అధునాతన ఏవియానిక్స్ వంటివి లక్ష్యం దిశగా మార్గనిర్దేశం చేస్తాయి. మునపటి ప్రయోగాల్లో అది గరిష్ఠ పరిధి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగా.. తాజా పరీక్షలో కనిష్ఠ పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తాను పరిశీలించారు.
3డీ ప్రింటింగ్‌తో కృత్రిమ పాదాన్ని రూపొందించిన ఐఐటీ మద్రాస్
→దివ్యాంగుల కాళ్లకు సరిగ్గా సరిపోయేలా, నిజమైన పాదాల మాదిరిగా కన్పించేలా 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ పాదాన్ని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు రూపొందించారు. సహజ రూపంలో కృత్రిమ పాదం సాలిడ్ యాంకిల్ కుషన్డ్ హీల్ (ఎస్‌ఏసీహెచ్-సచ్)గా పిలుస్తున్న ఈ ఉపకరణం తయారీలో వాడిన ఇంజినీరింగ్, గణిత సూత్రాలపై ఇటీవలే అంతర్జాతీయ జర్నల్స్‌లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
→ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలోని సెంటర్ ఫర్ రీహాబిలిటేషన్ రీసెర్చి అండ్ డివైజ్ డెవలప్‌మెంట్‌కు చెందిన డాక్టర్ టి.ఎం.బాలకృష్ణన్, డాక్టర్ సుందరరాజన్ నటరాజన్, ప్రొఫెసర్ సుజాతా శ్రీనివాసన్ ఈ వినూత్న పాదాలకు రూపకల్పన చేశారు. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ (ఎఫ్‌ఎఫ్‌ఏ) విధానంలో జీవయాంత్రిక ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నారు. ఇవి నడిచేటప్పుడు పాదాలపై పడే ఒత్తిడి, చీలమండల కదలికలకు వీలుగా, వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా, సహజత్వానికి దగ్గరగా 3డీ ప్రింటింగ్‌తో ఉన్నట్లు తెలిపారు.
‘గ్లుటాథియోన్ రెడక్టేజ్’ ప్రొటీన్‌లో మార్పు
→పరిణామక్రమంలో ఆధునిక మానవుడికి ప్రకృతిసిద్ధంగా ఒక రక్షణ లభించింది. వానర జాతి, ఒకప్పుడు భూమిపై సంచరించిన నియాండర్తల్ మానవులతో పోలిస్తే మనలోని ఒక ప్రొటీన్ మార్పు చెందింది. ఫలితంగా ఆధునిక మానవుడికి తీవ్ర వ్యాధుల నుంచి మెరుగైన రక్షణ లభిస్తోందని జర్మన్, స్వీడన్ శాస్త్రవేత్తలు తేల్చారు.
→ ఆధునిక మానవులను ప్రత్యేకంగా నిలిపిన అంశాలేంటన్న ప్రశ్నపై చాలాకాలంగా శాస్త్రవేత్తలు ప్రొటీన్లపై పరిశోధన చేస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు ‘గ్లుటాథియోన్ రెడక్టేజ్’ అనే ప్రొటీన్‌లో మార్పును గుర్తించారు.
→5 లక్షల ఏళ్ల కిందట ‘హోమో హైడెల్‌బెర్గెనిసిస్’ అనే మానవ జాతి ఉండేది. వీరి నుంచి రెండు జాతులు చీలిపోయాయి. ఒక వర్గం ఐరోపా, పశ్చిమాసియాకు వలస వెళ్లింది. వారు క్రమంగా నియాండర్తల్ మానవజాతిగా రూపాంతరం చెందారు. రెండో వర్గం మాత్రం మరో 4లక్షల ఏళ్ల పాటు ఆఫ్రికాలోనే ఉండిపోయింది. వారు ఆధునిక మానవులుగా రూపాంతరం చెందారు.
→ ఈ చీలికతో రెండు జాతుల శరీర తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 100 ప్రొటీన్లలో ఈ పరివర్తన జరిగింది. వీటిలో గ్లుటాథియోన్ రెడక్టేజ్ కూడా ఉంది. ‘ఆక్సిడేటివ్ ఒత్తిడి’ నుంచి శరీరాన్ని రక్షించే వ్యవస్థలో ఇది భాగం. ఆధునిక మానవుడిలో, నియాండర్తల్ జాతిలో ఇది భిన్న రూపాల్లో ఉంది.
→ పరిణామక్రమంలో జరిగిన మార్పు వల్ల ఆధునిక మానవుడిలోని గ్లుటాథియోన్ రెడక్టేజ్ ప్రొటీన్ మెరుగ్గా తయారైంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి సమర్థ రక్షణ కల్పించేలా రూపాంతరం చెందింది.
→ శరీరంలో ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమతూకం ఉండాలి. అది లోపించినప్పుడు ‘ఆక్సిడేటివ్ ఒత్తిడి’ ఉత్పన్నమవుతుంది.
→ ఆక్సిడేటివ్ ఒత్తిడితో తీవ్ర ఇన్‌ఫ్లమేషన్‌కు తలెత్తవచ్చు. అంతిమంగా అది క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వ్యాధి, మధుమేహం, ఆస్థమా వంటి రుగ్మతలకు దారితీయవచ్చు.
ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది గుండెను అమర్చిన అమెరికా వైద్యులు
→వైద్యశాస్త్రంలో కీలక మైలురాయి చోటుచేసుకుంది. వైద్యులు మొట్టమొదటిసారిగా పంది గుండెను 57 ఏళ్ల డేవిడ్ బెనెట్‌కు అమర్చారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు ఈ ఘనత సాధించారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా వారు ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స నిర్వహించారు.
→ ఇది విజయవంతమైతే అవయవ మార్పిళ్లను విస్తృతంగా చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
→ బార్ట్‌లీ గ్రిఫిత్ నేతృత్వంలోని వైద్యులు ఏడు గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. బాల్టిమోర్ ఆసుపత్రి ఇందుకు వేదికైంది.
→తాజా ప్రయోగంలో ఉపయోగించిన గుండెను జన్యు మార్పిడి పంది నుంచి సేకరించారు. ఫలితంగా ఆ అవయవాన్ని రోగి శరీరం తక్షణం తిరస్కరించబోదని వైద్యులు తెలిపారు. ఆ గుండె సాధారణంగానే పనిచేస్తుందన్నారు. తొలుత.. అవయవాన్ని వేగంగా తిరస్కరించడానికి కారణమయ్యే మూడు జన్యువులను శాస్త్రవేత్తలు తొలగించారు. అలాగే వరాహ గుండె కణజాలం మితిమీరి వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఒక జన్యువును నిర్వీర్యం చేశారు. కొత్త అవయవాన్ని రోగి సాఫీగా స్వీకరించడానికి వీలు కల్పించే ఆరు మానవ జన్యువులనూ ఆ పందిలోకి చొప్పించారు.
ప్రారంభంలోనే క్యాన్సర్‌ను పట్టుకోవచ్చు
వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్‌ను గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి నిర్ధారణను సులువు చేస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను గుర్తిస్తుంది. శరీరంలో భాగాలకు వ్యాప్తి చెందిందా అన్నది కూడా తెలియజేస్తుంది. ఈ విధానాన్ని 300 మంది రోగులపై పరీక్షించారు. వీరిలో క్యాన్సర్‌కు నిర్దిష్ట లక్షణాలేమీ లేవు. అలసట, బరువు తగ్గడం వంటివి మాత్రమే కనిపించాయి. ప్రతి 20 మంది క్యాన్సర్ రోగుల్లో 19 మందిని ఇది కచ్చితత్వంతో గుర్తించింది. ఇతర అవయవాలకు ఈ వ్యాధి పాకడాన్ని 94% కచ్చితత్వంతో పసిగట్టింది. సాధారణ రక్తపరీక్షతో క్యాన్సర్ విస్తృతిని గుర్తించే సామర్థ్యమున్న మొట్టమొదటి పరిజ్ఞానం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త ప్రక్రియలో ఎన్‌ఎంఆర్ మెటాబోలోమిక్స్ అనే విధానాన్ని ఉపయోగించారు. ఇందులో.. రక్తంలోని సహజసిద్ధ రసాయనాల (మెటబోలైట్స్) తీరుతెన్నులను అధికస్థాయి అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాల సాయంతో పరిశీలిస్తారు. ఆరోగ్యవంతులు, క్యాన్సర్ ఒక భాగానికే పరిమితమైనవారు, ఈ వ్యాధి విస్తరించినవారికి రక్తంలోని మెటబోలైట్ల తీరు వేర్వేరుగా ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన అల్గోరిథమ్‌లు వాటిని విశ్లేషించి, గుర్తిస్తాయి.
సెల్‌ఫోను సాయంతో గొంతు క్యాన్సర్ నిర్ధారణ
దేశంలో తొలిసారిగా సెల్‌ఫోను సాయంతో గొంతు క్యాన్సర్‌ను ప్రాథమికంగా నిర్ధారించే సరికొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం వర్సిటీ, గ్రేస్ క్యాన్సర్, బెంగళూరుకు చెందిన బయోకాన్ ఫౌండేషన్ జతకట్టాయి.
ప్రాజెక్టులో భాగంగా భాగస్వాముల సహకారంతో వర్సిటీలోని ఐహబ్ డాటా సెంటర్ ప్రొడక్టు ల్యాబ్ సాయంతో ప్రత్యేకంగా ‘ట్రిపుల్‌ఐటీహెచ్-హెచ్‌సీపీ’ యాప్ తయారు చేసింది. ఇందులో గతంలో నిర్ధారణ అయిన చిత్రాలను పొందుపరిచారు. వాటి సాయంతో కృత్రిమమేధ ఆధారంగా రోగి గొంతు చిత్రాలను విశ్లేషించి నివేదిక రూపొందించి క్యాన్సర్ ఉందో.. లేదో యాప్ తెలియజేస్తుంది. ఇందుకోసం తొలుత గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సేకరించిన నమూనాలు, ఎక్స్‌రే చిత్రాలను విశ్లేషించారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తయారు చేసిన ప్రాథమిక మోడల్‌ను పరిశీలించారు.
డూమ్స్‌డే హిమానీనదానికి శాస్త్రవేత్తల బృందం
→పుడమికి సెగలు పుట్టిస్తున్న భూతాపం, దానివల్ల అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, ఫలితంగా పెరుగుతున్న సముద్ర మట్టాల గురించి నిగ్గు తేల్చడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికా పయనమైంది. ఈ ప్రదేశం థ్వెయిట్స్ హిమానీనదం. థ్వెయిట్స్.. అంటార్కిటికాలోని పశ్చిమ అర్ధభాగంలో చాలా మారుమూల ప్రదేశంలో ఉంది. ఇప్పటివరకూ ఎవరూ ఇక్కడికి వెళ్లలేదు. 2019లో స్వీడన్‌కు చెందిన అన్నా వాహ్లిన్ నేతృత్వంలోని పరిశోధక బృందం దూరంగా ఒక నౌక నుంచి ఈ హిమానీనదాన్ని శోధించింది. ఇందుకోసం ఒక రోబోటిక్ షిప్‌ను ఉపయోగించింది.
→ చిలీలోని పుంటా ఎరినాస్ రేవు నుంచి నథానియేల్ బి పామర్ అనే ఐస్ బ్రేకర్ నౌకలో 32 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం థ్వెయిట్స్‌కు వెళ్లింది. 2019లో అక్కడికి సమీపంలోకి వెళ్లొచ్చిన వాహ్లిన్ కూడా వీరిలో ఉన్నారు. నాడు ఆమె ఉపయోగించిన ‘రాన్’ అనే రోబోటిక్ షిప్‌ను ఈసారీ తీసుకెళుతున్నారు. దీనికితోడు మరింత ఆధునికమైన ‘బోటీ మెక్ బోట్‌ఫేస్’ను కూడా ఉపయోగిస్తారు. ఈ బుల్లి జలాంతర్గాములు.. మంచు ఫలకాల కింద సముద్ర జలాలను శోధిస్తాయి. 65 రోజుల పాటు సాగే ఈ యాత్రలో అమెరికా, బ్రిటన్, స్వీడన్ పరిశోధకులు పాల్గొంటున్నారు.
పరిశోధనాంశాలు:-
→ ఈ హిమానీనదంలో ఏటా 50 బిలియన్ టన్నుల మేర ఐస్.. నీరుగా మారుతోంది. సముద్ర మట్టాల పెరుగుదలకు ఇది 4% మేర కారణమవుతోంది. మరింత ఎక్కువగా హిమం కరిగే పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటిని శోధించనున్నారు. అక్కడ నీటి ఉష్ణోగ్రతను కొలుస్తారు. సముద్ర గర్భాన్ని శోధిస్తారు. హిమం ఎంత మందంలో ఉందన్నది లెక్కలు కడతారు. మంచులో పగుళ్లను పరిశీలిస్తారు. హిమానీనదానికి చేరువలో ఉన్న దీవుల్లోని సీల్స్‌కు ట్యాగ్ వేస్తారు. తద్వారా వచ్చే 9 నెలల్లో అంటార్కిటిక్ ప్రాంతంలో నెలకొనే శీతాకాలంలో సముద్ర ఉష్ణోగ్రత, లవణీయతను పరిశీలిస్తారు.
కవలలపై పరిశోధనలతో వెలుగులోకి కీలక విషయాలు
→మానవ ఆరోగ్యం, వ్యవహారశైలి గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో పరిశోధకులు కవలలపై ఆధారపడుతుంటారు. వారిలోని వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. వ్యాధులకు కారణమవుతున్న జన్యువులు, పర్యావరణ అంశాలను గుర్తించే ప్రక్రియను ఇలాంటి పరిశోధనలు విస్తృతం చేశాయి. తద్వారా కొత్త చికిత్సలు, నివారణ చర్యలపై అవగాహన ఏర్పడుతోంది. ఇప్పటివరకూ ఇలాంటి పరిశోధనల్లో వెల్లడైన కీలకాంశాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల విశ్లేషణ కింది విధంగా ఉంది.
→ ఫలదీకరణం చెందిన ఒకే అండం.. కొద్దిరోజుల తర్వాత విడిపోవడం వల్ల ఏకరూప కవలలు ఏర్పడుతుంటారు. వీరిద్దరి డీఎన్‌ఏ దాదాపుగా ఒకేలా ఉంటుంది. చాలావరకూ ఈ జంటలో ఇద్దరూ ఆడ లేదా మగ శిశువులై ఉంటారు.
→ రెండు అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల సాధారణ కవలలు ఏర్పడుతుంటారు. వీరు జన్యుపరంగా భిన్నంగా ఉంటారు. ఇలాంటి ఒక కవల జంటలో ఒక్కోసారి ఆడ, మగ ఇద్దరూ ఉండొచ్చు.
→ తాము సాధారణ కవలలమా.. ఏకరూప కవలలమా అన్న విషయం చాలామందికి తెలియదని 2012లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కొందరు కవలలకు వైద్యులే ఈ విషయంపై అస్పష్ట సమాచారం ఇచ్చినట్లు వెల్లడి కావడం గమనార్హం.