భారత్ - మధ్య ఆసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ
→ప్రాంతీయ భద్రతకు భారత్ - మధ్య ఆసియా దేశాల మధ్య సహకారం అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
→అఫ్గానిస్థాన్‌లోని పరిణామాల నేపథ్యంలో దీని ఆవశ్యకత ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందన్నారు.
→భారత్ - కజక్‌స్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ (మధ్య ఆసియా దేశాల) తొలి సదస్సు వీడియో విధానంలో జరిగింది.
→దీనికి నేతృత్వం వహిస్తూ మోదీ కీలక ప్రసంగం చేశారు. సమీకృత, స్థిరమైన పొరుగు దేశంగా ఉండాలనే భారత దార్శనికతకు మధ్య ఆసియా కేంద్ర బిందువుగా ఉందన్నారు.
→అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆ దేశంలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడం, అక్కడి ప్రజలకు నిరంతరాయంగా సాయం అందించడం వంటి అంశాలను చర్చించాలన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోదీ
→మరింత వ్యాపారానుకూల దేశంగా మారేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
→ఇందుకోసం అవసరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
→శుద్ధ ఇంధనాలతో, హరిత వాతావరణంలో.. రానున్న పాతికేళ్లు దేశం సుస్థిర వృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
→అందుకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యుత్తమ తరుణమని వ్యాఖ్యానించారు.
→ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆన్‌లైన్ దావోస్ ఎజెండా - 2022 సదస్సును ఉద్దేశించి మోదీ ఈ మేరకు ప్రసంగించారు.
→ఒకప్పుడు దేశం ‘లైసెన్స్ రాజ్’గా ఉండేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావించారు.
→వ్యాపారాల్లో పాలక వర్గాల జోక్యాన్ని తగ్గించేందుకు, వివిధ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చేసిన కృషిని తెలియజేశారు.
భారత్, చైనా 14వ విడత చర్చలు
→సరిహద్దు వివాదాలపై భారత్, చైనా సైనికాధికారులు జరిపిన 14వ విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి.
→సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించి వీలైనంత త్వరగా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి చేరుకోవాలంటూ ఇరుపక్షాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
→చైనా పరిధిలోని చుశుల్ - మాల్డో సరిహద్దులో దళ కమాండర్ల స్థాయిలో ఈ చర్చలు జరిగాయి.
→తూర్పు లద్దాఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 15 (హాట్ స్ప్రింగ్స్) నుంచి చైనా సేనల విరమణ సహా పలు అంశాలు ఈ చర్చల్లో పరిష్కారమవుతాయని భావించామని భారత సైన్యాధిపతి జనరల్ నరవణె తెలిపారు.
24వ జాతీయ ఈ - పరిపాలన సదస్సు
→‘కరోనా అనంతరం ప్రపంచంలో డిజిటల్ పాలన - భారతదేశం పాత్ర’ పేరిట హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 24వ జాతీయ ఈ - పరిపాలన సదస్సును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర శాస్త్ర, సాంకేతికాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.
→ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. దేశంలో డిజిటల్ విప్లవం ప్రజల జీవనశైలిలో అంతర్భాగం అయిందని అన్నారు.
→ప్రజలు సులభతరంగా జీవించేలా చేయడమే ఈ - పరిపాలన ముఖ్య ఉద్దేశమన్నారు.
→అంతర్జాతీయ సూచికల స్థాయిలో తెలంగాణలో ఈ - పరిపాలన ప్రాజెక్టుల అమలుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘ఆపీ’ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
→కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న క్రమంలో అలసత్వం వీడి అంతా అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
→హైదరాబాద్‌లో ప్రారంభమైన భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఆపీ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వెంకయ్యనాయుడు తన సందేశాన్ని అందించారు.
→ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా ప్రత్యేకంగా నిలుస్తూ ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో సేవలందిస్తున్నారన్నారు.
→అమెరికా ఆధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని పేర్కొన్నారు.