ఇస్రో కొత్త ఛైర్మన్‌గా రాకెట్ శాస్త్రవేత్త సోమనాథ్
→భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.సోమనాథ్ నియామకానికి కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
→ఈయన ఇస్రో ఛైర్మన్ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఇప్పటిదాకా సోమనాథ్.. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సంచాలకునిగా వ్యవహరించారు.
→ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ శివన్ పదవీకాలం జనవరి 14న పూర్తి కానుండటం వల్ల ఈ నియామకం జరిగింది.
→ఈ ప్రతిష్ఠాత్మక అతరిక్ష సంస్థకు పదో ఛైర్మన్ సోమనాథ్. శివన్ 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా నియమితులై.. ఏడాది పొడిగింపుతో కలిపి నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వహించారు.
→కేరళ రాష్ట్రానికి చెందిన సోమనాథ్ కొల్లంలోని టీకేఎం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేశారు.
→1985లో ఇస్రోలోని ప్రధాన కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు మేనేజరుగా ఉంటూ మెకానిజమ్స్, ఫైరో సిస్టమ్స్, ఇంటిగ్రేషన్, శాటిలైట్ లాంచ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ విభాగాలను నిర్వహించారు.
→2003లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డిప్యూటీ ప్రాజెక్టు డెరెక్టరుగా నియమితులయ్యారు. అనంతరం 2010 నుంచి 2014 వరకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్3 ప్రాజెక్టు డైరెక్టరుగా పనిచేశారు.
→సోమనాథ్ నాయకత్వాన కేర్ మిషన్ మొట్టమొదటి ప్రయోగాన్ని 2014 డిసెంబరు 18న ప్రయోగాత్మకంగా చేపట్టి, విజయవంతం చేశారు.
ద.మ. రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా సంజీవ్ కిశోర్
→దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ బాధ్యతలు చేపట్టారు.
→ఇప్పటివరకు జీఎంగా ఉన్న గజానన్ మల్య పదవీ విరమణ పొందారు.
→దీంతో సంజీవ్ కిశోర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఉర్జిత్ పటేల్
→ఆర్‌బీఐ మాజీ గవర్నరు ఉర్జిత్ పటేల్ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
→బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐఐబీలో చైనా తర్వాత అత్యధిక ఓటింగ్ హక్కులను భారత్ కలిగి ఉంది.
→చైనా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జిన్ లిక్వన్ ఏఐఐబీకి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏఐఐబీలో మొత్తం ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు.
→ఇందులో ఒకరిగా ఉర్జిత్ పటేల్ మూడేళ్ల పదవీకాలానికి నియమితులయ్యారు.
ఎయిరిండియా సీఎండీగా విక్రమ్ దేవ్ దత్
→ఎయిరిండియా కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్‌ను కేంద్రం నియమించింది.
→త్వరలోనే ఈ సంస్థను టాటా సన్స్‌కు అప్పగించాల్సి ఉన్నా, సీనియర్ అధికారుల బదిలీల్లో భాగంగా దత్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.
→ఈయన 1993 బ్యాచ్‌కు చెందిన ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం) ఐఏఎస్ అధికారి.
→ఈయన ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వంలో పర్యాటక (టూరిజమ్) శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా శశాంక్ గోయల్
→కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా 1990 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు.
→ప్రస్తుతం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న ఆయనను కేంద్ర సర్వీసులకు బదిలీచేస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
→అలాగే మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన వీఎల్ కాంతారావు టెలీ కమ్యూనికేషన్స్ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
కేంద్ర జలసంఘం సభ్యుడిగా చంద్రశేఖర్ అయ్యర్
→గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జె.చంద్రశేఖర్ అయ్యర్‌ను కేంద్ర జలసంఘం సభ్యుడిగా నియమించారు.
→సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ సర్వీసు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్‌గా ఉన్న అయ్యర్‌ను ఈ పోస్టులో నియమించారు.
→హైదరాబాద్ నుంచి దిల్లీ బదిలీ చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఎం.పి.సింగ్‌కు అదనపు బాధ్యతలు
→ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఉన్న ఎం.పి.సింగ్‌కు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎయిరిండియా ఛైర్మన్‌గా చంద్రశేఖరన్
→ఎయిరిండియా కొత్త బోర్డుకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నేతృత్వం వహించనున్నారు. టాటా సన్స్‌కు మెజార్టీ వాటా ఉన్న విస్తారా, ఎయిరేసియా ఇండియా బోర్డుల్లో ఆయన సభ్యుడు మాత్రమే.
→అత్యున్నత కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలతో ఎయిరిండియాను నిర్వహించేందుకు ఆయన్ను బోర్డు ఛైర్మన్‌గా నియమించాలని సంస్థ భావిస్తోంది.
→ఎనిమిది మంది సభ్యులుండే ఎయిరిండియా బోర్డులో హిందుస్థాన్ యునిలీవర్ సీఎండీ సంజీవ్ మెహ్తా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాజీ సీఎండీ అలిస్ వైద్యన్‌లు నాన్ ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యే అవకాశముంది.
→ఎయిరిండియా కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.10,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.5000 కోట్ల రుణాలను టాటా సన్స్ పొందిందని సమాచారం.
ముఖ్య ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్
→కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారని ఆర్థిక శాఖ వెల్లడించింది.
→ఇదివరకు ఈ స్థానంలో ఉన్న కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మూడేళ్ల కాల పరిమితి ముగిశాక, గత డిసెంబరులో తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ స్థానాన్ని నాగేశ్వరన్ భర్తీ చేయనున్నారు.
→2021-22 ఆర్థిక సర్వేను జనవరి 31న, 2022-23 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈయన నియామకం జరిగింది.
→నాగేశ్వరన్ గతంలో వివిధ బిజినెస్ స్కూళ్లతో పాటు, భారత్, సింగపూర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లలో బోధన చేశారు.
→ఐఎఫ్‌ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ డీన్‌గా పనిచేశారు. శ్రీసిటీలోని క్రియా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా ఆర్‌కేగుప్తా
→కేంద్ర జలసంఘం ఛైర్మన్‌గా డాక్టర్ ఆర్‌కే గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖఉత్తర్వులు జారీ చేసింది.
→సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ గ్రూప్-ఏ సర్వీసెస్‌కు చెందిన ఈయన్ను పదోన్నతిపై సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది.
→ఫిబ్రవరి 1 నుంచి లేదా ఆర్‌కే గుప్తా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
హెచ్‌పీసీఎల్ కొత్త ఛైర్మన్ పుష్ప్ కుమార్ జోషి
→ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పుష్ప్ కుమార్ జోషి ఎంపికయ్యారు.
→ ప్రస్తుతం ఆయన హెచ్‌పీసీఎల్ డైరెక్టర్ (మానవ వనరులు)గా వ్యవహరిస్తున్నారు.
→ జనవరి 24న 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత పుష్ప్ కుమార్ జోషిని ఎంపిక చేసినట్లు పీఈఎస్‌బీ పేర్కొంది.
→ పీఈఎస్‌బీ సిఫారసు మేôకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ముందుకు వెళ్లనుంది.
జాతీయ స్మారకాల ప్రాధికార సంస్థ సభ్యుడిగా కైలాసరావు
→జాతీయ స్మారకాల ప్రాధికార సంస్థ (నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ) తాత్కాలిక సభ్యుడిగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ ఎం.కైలాసరావు నియమితులయ్యారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీగా అనూప్ బాగ్చి పునర్నియామకం
→ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనూప్ బాగ్చి పునర్నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది.
→ఈయన మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2022 ఫిబ్రవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.
→గత ఏడాది ఆగస్టులో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బాగ్చి పునర్నియామకానికి వాటాదార్లు ఆమోదం తెలుపగా, తాజాగా ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
→ఈయనతో పాటు సందీప్ బాత్రా, విశాఖ ముల్యే ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
ఉత్తరాఖండ్ ప్రధాన సమాచార కమిషనర్‌గా పునేఠా
→ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు.
→పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు.
జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా కెప్టెన్ పీపీ సింగ్ నియామకం
→జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలిక సీఈఓ సుధీర్ గౌర్ రాజీనామా చేశారు. జనవరి 5 నుంచే ఇది అమల్లోకి వచ్చింది.
→ఆయన స్థానంలో జెట్‌లైట్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ పీపీ సింగ్ నియమితులుకానున్నారు.
→దిల్లీ నుంచి ముంబయికి వెళ్లే విమానంతో తిరిగి సేవలను ప్రారంభిస్తామని జెట్ ఎయిర్‌వేస్‌ను స్వాధీనం చేసుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం పేర్కొంది.
→కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీ నుంచి ముంబయికి మారుస్తామని తెలిపింది.
ఓఎన్‌జీసీ సీఎండీగా అల్కా మిత్తల్
→ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) అల్కా మిత్తల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఓఎన్‌జీసీ మానవ వనరుల డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓఎన్‌జీసీ సీఎండీగా ఒక మహిళ పనిచేయనుండటం ఇదే ప్రథమం. ఆమె ఈ పదవిలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. 2021 మార్చి 31న శశి శంకర్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఓఎన్‌జీసీకి శాశ్వత సీఎండీని నియమించలేదు. కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేస్తున్న సుభాష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
గ్రాన్యూల్స్ సీఈఓగా డాక్టర్ కేవీఎస్ రామ్‌రావు
→గ్రాన్యూల్స్ ఇండియా జాయింట్ ఎండీ, సీఈఓగా డాక్టర్ కేవీఎస్ రామ్‌రావు నియమితులయ్యారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన ఆయనకు ఫార్మా రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది.
→ఆయన గతంలో పీఐ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, గుజరాత్ హెవీ కెమికల్స్‌లో ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించినట్లు పేర్కొంది.
ఎన్‌సీఎల్ సీఎండీగా భోళా సింగ్
→కోల్ ఇండియా అనుబంధ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎన్‌సీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా భోళా సింగ్ బాధ్యతలు స్వీకరించారు.