జనవరి మరణాలు

‘సూపర్‌ మామ్‌’ పులి మృతి

→మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్‌ వాలీ అనే ఆడపులి మృతిచెందింది.
→ పదిహేడేళ్ల వయసు కలిగిన ఈ పులి ‘సూపర్‌ మామ్‌’గా పేరుగాంచింది.
→ 2008 - 2018 మధ్యకాలంలో 8 ప్రసవాల్లో 29 పిల్లలకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పింది. మొదటిసారి మూడు పిల్లలకు జన్మనివ్వగా అవి బతకలేదు.
→ చివరిసారిగా 2018లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తంగా 29 పిల్లల్లో 25 బతికాయి. వృద్ధాప్యం కారణంగా ఈ పులి చనిపోయింది అని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ అధికారులు తెలిపారు.

‘పురాణ’ పురుషుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం

→ఆధ్యాత్మిక స్రష్ట, పౌరాణిక సార్వభౌముడు, సుప్రసిద్ధ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) మరణించారు.
→గుంటూరు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్‌లో ఆదిలక్ష్మమ్మ, దక్షిణామూర్తి శాస్త్రి దంపతులకు 1925 ఆగస్టులో జన్మించారు.
→ చంద్రశేఖర శాస్త్రి తెలుగు, సంస్కృతం, వేదం, వేదాంతం, తర్కం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, రామాయణం, భారతం, పురాణాలు, ఇతిహాసాల్లో నిష్ణాతులు.
→ పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస, బ్రహ్మశ్రీ, మహా మహోపాధ్యాయ బిరుదులు పొందారు.
→ శృంగేరి పీఠాధిపతుల నుంచి సవ్యసాచి బిరుదును, సద్గురు శివానందమూర్తి నెలకొల్పిన సనాతన ధర్మట్రస్ట్‌ ద్వారా ఎమినెంట్‌ సిటిజన్‌ అవార్డును అందుకున్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో సత్కారం అందుకున్నారు.
→ తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఆస్థాన పండితునిగా సేవలందించారు.
→ 2005లో ప్రతిష్ఠాత్మక రాజా-లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన రూ.లక్ష నగదును సనాతన ధర్మట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మరణం

→ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కిన సటుర్నినో డెలా ఫ్యుయెంటె మరణించారు. ఆయన వయసు 112 ఏళ్లు.
→1909లో ఆయన లియోన్‌ శివార్లలో జన్మించారు. 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు.

కథక్‌ ప్రముఖ నృత్యకారుడు బిర్జూ మహారాజ్‌ మరణం

→ భారతీయ శాస్త్రీయనృత్యం కథక్‌ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ నృత్యకారుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బిర్జూ మహారాజ్‌ (84) మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ సమీప హండియాలో జన్మించారు.
→ కథక్‌ నృత్యకారుల మహారాజ్‌ కుటుంబంలో పుట్టిన బిర్జూ తన తండ్రి, గురువు అయిన అచ్చన్‌ మహారాజ్‌తో పాటు సమీప బంధువులైన శంభు మహారాజ్, లచ్చు మహారాజ్‌ల వద్ద శిక్షణ పొందారు.
→ దేశంలోని పలు ప్రముఖ నృత్య కళాశాలల్లో ఎంతోమంది శిష్యులను కథక్‌ రీతుల్లో తీర్చిదిద్దిన ఆయన 1990ల చివర్లో ‘కళాశ్రమ్‌’ పేరుతో దేశ రాజధాని దిల్లీలో నృత్య కళాశాల ప్రారంభించారు.
→ సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన ‘షత్రంజ్‌ కే ఖిలాడీ’తో పాటు ‘ఉమ్రావ్‌జాన్‌’ (రేఖ), ‘దేవదాస్‌’ (షారుక్‌ఖాన్‌), ‘విశ్వరూపం’ (కమల్‌హాసన్‌), ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి పలు కళాత్మక చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు.

ఫుట్‌బాల్‌ దిగ్గజం భౌమిక్‌ మరణం

→ క్రీడాకారుడిగా, కోచ్‌గా భారత ఫుట్‌బాల్‌ రంగంలో 1970 దశకంలో తనదైన ముద్ర వేసిన సుభాష్‌ భౌమిక్‌ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 72 ఏళ్లు. బెంగాల్‌ నుంచి వచ్చిన ఆయన 19 ఏళ్ల వయసులో రాజస్థాన్‌ క్లబ్‌ తరపున అరంగేట్రం చేశారు. దశాబ్దానికి పైగా ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఏలారు. భారత జట్టులో అడుగుపెట్టి సత్తాచాటారు.
→ 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం అందుకున్న జట్టులో ఆయన ఉన్నారు. దేశం తరపున 24 మ్యాచ్‌లాడి 9 గోల్స్‌ చేశారు. మెర్డెకా కప్‌లో ఫిలిప్పీన్స్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేశారు. ఇక క్లబ్‌ ఫుట్‌బాల్‌లో ఆయనకు తిరుగులేదు. ఈస్ట్‌ బెంగాల్, మోహన్‌ బగాన్‌ తరపున అమోఘమైన ప్రదర్శనను ఇచ్చారు. 1969 నుంచి 1979 మధ్య ఈస్ట్‌ బెంగాల్‌ తరపున 82, మోహన్‌ బగాన్‌కు ఆడి 83 గోల్స్‌ చేశారు.
→ 29 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పిన ఆయన.. ఆ తర్వాత మోహన్‌ బగాన్, ఈస్ట్‌ బెంగాల్‌తో పాటు భారత జట్టుకూ కోచ్‌గా పనిచేశారు. ఆటగాడిగా తన కెరీర్‌లో ఐఎఫ్‌ఏ షీల్డ్, రోవర్స్‌ కప్, డీసీఎం ట్రోఫీ, ఫెడరేషన్‌ కప్‌ ఇలా దాదాపు అన్ని ట్రోఫీలను దక్కించుకున్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు మరణం

→ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సింహులు (103) హైదరాబాద్‌ అంబర్‌పేటలో గుండెపోటుతో మరణించారు.
→ రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నాయకుల స్ఫూర్తితో ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చేరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
→ భువనగిరి, రామాయంపేట, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు చేపడుతూ పేదలకు భూములు పంపిణీ చేశారు. సాయుధ పోరులో భాగంగా నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన బండ్రు 1977లో భువనగిరి నుంచి, 1982లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
→1984లో మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.

హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ మరణం

→భారత జట్టు మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ సింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వగృహంలో మరణించారు.
→1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారథ్యం వహించారు.
→1964 ఒలింపిక్‌ ఛాంపియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మిడ్‌ ఫీల్డర్‌ చరణ్‌జిత్, 1960 విశ్వ క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు.
→1962 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన భారత జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మరణం

→తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ముదిరెడ్డి లింగారెడ్డి (102) మరణించారు.
→మాడ్గులపల్లి మండలం ఇందుగులకు చెందిన ఈయన రజాకార్లపై పోరాడారు.
→ నర్రా రాఘవరెడ్డి సలహాల మేరకు కమ్యూనిస్టు పార్టీని విస్తరింపజేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు.

తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మరణం

→తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్షుపల్లికి చెందిన కాకులవరం శేఖర్‌రెడ్డి (70) గుండెపోటుతో మరణించారు.
→ ఈయన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు.
→ తెలంగాణ సాధనకు కవితలు, పాటలు రాసేవారు. ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

మాజీ మిస్‌ అమెరికా చెస్లీ క్రిస్ట్‌ ఆత్మహత్య

→మిస్‌ యూఎస్‌ఏ 2019 చెస్లీ క్రిస్ట్‌ (30) అనుమానాస్పద రీతిలో న్యూయార్క్‌ సిటీలో 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి మరణించారు.
→చెస్లీ క్రిస్ట్‌ 1991లో మిషిగాన్‌ జాక్సన్‌లో జన్మించారు. సౌత్‌ కరోలినాలో పెరిగారు. విద్యాబ్యాసం అనంతరం లాయర్‌గా పనిచేశారు.
→ 2019 మిస్‌ యూఎస్‌ఏ టైటిల్‌ గెలుచుకున్నారు.

హిందీ సాహితీవేత్త వర్మ మరణం

→విజయనగరానికి చెందిన హిందీ సాహితీవేత్త సాగి సూర్యనారాయణ వర్మ(66) విశాఖలో మరణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాలుగు దశాబ్దాలు యూజీసీ పరిశోధక శాస్త్రవేత్తగా సేవలందించారు.
→ హిందీ భాషా సాహిత్యానికి వర్మ ఎనలేని సేవలందించారు. 200కు పైగా మౌలిక గ్రంథాలు, 400కు పైగా పరిశోధనా వ్యాసాలను రచించారు.
→ ఆయన కృషికి గుర్తింపుగా 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గంగాశరణ్‌ సింహ్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు.

ప్రముఖ కవి, రచయిత ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మరణం

→ప్రముఖ కవి, రచయిత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌రావు (63) గుండెపోటుతో దోమల్‌గూడలో మరణించారు.
→ ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో తెలుగు విభాగం ఆచార్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు.
→ సుధాకర్‌ 1959 జనవరి 21న నిజామాబాద్‌ జిల్లా పాములబస్తీలో జన్మించారు. తల్లిదండ్రులు శాంతాబాయి, దేవయ్య.
→ 1985-1990 మధ్య సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
→ తర్వాత 1990 - 2019 మధ్య పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా సేవలందించారు. ఇందులో సుదీర్ఘకాలం రాజమండ్రి పీఠంలోనే పనిచేశారు.
→ విశ్వవిద్యాలయం ప్రచురించే వాంగ్మయి సాహితీ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. 2019 సెప్టెంబరులో హెచ్‌సీయూ తెలుగు విభాగంలో ఆచార్యుడిగా చేరి లిటరరీ ఛైర్‌ డీన్‌గా వ్యవహరించారు.
→ కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ, తెలుగు సలహా మండలి సభ్యుడిగా సేవలందించారు. ఎన్నో హిందీ, ఉర్దూ కవితలను తెలుగులోకి అనువదించారు.
→ వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, అటజనిగాంచె, కథానాయకుడు జాషువా, తొలి వెన్నెల లాంటి పలు పుస్తకాలను రచించారు.
→ గుర్రం జాషువా రచనలపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. గోసంగి అనే కవిత రచించారు.

సుప్రసిద్ధ కథా రచయిత ‘శ్రీవిరించి’ మరణం

→ప్రముఖ కథా రచయిత, తత్వవేత్త ‘శ్రీవిరించి’గా సుప్రసిద్ధులైన డాక్టర్‌ ఎస్‌.సి.రామానుజాచారి (87) చెన్నైలో మరణించారు.
→ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన తెలుగు పండితులు, ప్రముఖ కవి ఎన్‌.సి.ఎస్‌.వెంకటేశ్వరాచార్యులు, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 1935లో జన్మించిన రామానుజాచారి ‘శ్రీవిరించి’ కలం పేరుతో అక్షర సేద్యం చేశారు.
→ రాజనీతిశాస్త్రంలో ఎంఏ చేసిన ఆయన పారిశ్రామిక, వాణిజ్య చట్టాల్లో న్యాయ విద్యను అభ్యసించారు.
→ తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. 1951 నుంచి తెలుగు స్వతంత్ర, భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, వివిధ పత్రికల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో కథలు, వ్యాసాలు రాశారు.
→పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా డా.దాశరథి రంగాచార్య, కమలా సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.

తమిళనాడు పరిశోధక శాఖ మొదటి సంచాలకుడు నాగస్వామి మరణం

→పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొదటి సంచాలకుడు ఆర్‌.నాగస్వామి (91) అనారోగ్యంతో చెన్నైలో మరణించారు. ఆయన 1930 ఆగస్టు 10న జన్మించారు.
→మద్రాసు వర్సిటీలో సంస్కృతంలో పీజీ చేశారు. పుణె వర్సిటీలో భారత కళలు, పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలో డాక్టరేట్‌ పొందారు.
→భారత పురావస్తు పరిశోధన శాఖలో శిక్షణ పొందిన నాగస్వామి 1959 నుంచి 1963 వరకు చెన్నై ప్రభుత్వ మ్యూజియం సంరక్షకుడిగా పనిచేశారు.
→తర్వాత తమిళనాడు ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రత్యేక సహాయ అధికారిగా, పురావస్తుశాఖ మొదటి సంచాలకునిగా సేవలందించారు.
→పదవీ విరమణ తర్వాత కేంద్ర ప్రభుత్వ పురావస్తుశాఖ సలహాదారుగా పనిచేశారు. శిలాఫలకాలు, కళలు, సంగీతం, నృత్యం, తమిళ చరిత్ర గురించి తమిళం, ఆంగ్లం, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు.
→ఈయన సేవలను గుర్తించిన కేంద్రం 2018లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

జస్టిస్‌ మంజునాథ్‌ మరణం

→కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, నదీజలాలు, సరిహద్దు వివాద పరిష్కారాల ప్రాధికార అధ్యక్షుడు జస్టిస్‌ కె.ఎల్‌.మంజునాథ్‌ (68) గుండెపోటుతో మరణించారు.
→జస్టిస్‌ మంజునాథ్‌ పలు మానవీయ తీర్పులిచ్చారు. అన్నదమ్ములు, రైతు కుటుంబాలు చిన్న మాట పట్టింపుతో కోర్టు వరకు వస్తే, వారిని తన ఛాంబర్‌కు పిలిపించుకొని కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని విడమర్చి చెప్పేవారు.
→న్యాయవాదులు ఆయనను ‘మంజణ్ణ’ అని పిలుచుకునేవారు. మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.

వియత్నాం బౌద్ధ సన్యాసి టిక్‌ నాట్‌ హాన్‌ మరణం

→వియత్నాంకు చెందిన ప్రఖ్యాత జెన్‌ బౌద్ధ సన్యాసి, రచయిత, శాంతి కార్యకర్త టిక్‌ నాట్‌ హాన్‌ (95) మరణించారు.
→1926లో హుయేలో జన్మించిన టిక్‌ నాట్‌ హాన్‌ పదహారేళ్ల వయసులో బుద్ధిజం దీక్ష స్వీకరించారు.
→వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకించిన ఈయన జీవితంలో ఎక్కువభాగం ప్రవాసంలోనే గడిపారు.
→దక్షిణ ఫ్రాన్సులో తను స్థాపించిన ‘ప్లమ్‌ విలేజ్‌’లో ఉంటూ జెన్‌ బుద్ధిజం విస్తరణకు కృషి చేశారు.
→ఆయన రచించిన పలు పుస్తకాల్లో ‘ది సన్‌ మై హార్ట్‌’ ఒకటి. 2014లో గుండెపోటుకుగురయ్యాక మాట పోయింది.
→జీవిత చరమాంకాన్ని స్వదేశంలో గడిపేందుకు 2018లో వియత్నాంకు తిరిగి వచ్చారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి మరణం

→ పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి (88) మరణించారు.
→ 1934లో ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జన్మించిన శాంతిదేవి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. 1951లో రతన్‌దాస్‌ను వివాహం చేసుకున్నారు.
→ ఆ ఏడాదే అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో తీవ్రమైన కరవు రావడంతో బాధితులకు అండగా నిలవాలని భర్తతో అక్కడికి చేరుకుని సేవలందించారు.
→ ఈ సమయంలోనే వినోబాభావే భూదాన్‌ ఉద్యమంలో భాగమయ్యారు. పెత్తందార్ల చేతిలో ఉన్న భూములను పేదలకు పంచడం, కుష్ఠు రోగులకు సేవ చేయడం, గిరిజన బాలికలకు చదువు చెప్పడం, అనాథ బాలికలను చేరదీసి వసతి కల్పించి ప్రయోజకులను చేయడం చేసేవారు.
→ రాయగడ జిల్లాలోని గుణుపురంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న శాంతిదేవి సేవాసమాజ్‌ పేరిట ఆశ్రమాలు నెలకొల్పి వందలాది అనాథ బాలికలు, మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దారు.
→ శాంతిదేవి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2021 నవంబరులో పద్మశ్రీతో సత్కరించింది.

అనాథల అమ్మ సింధుతాయి మరణం

→అనాథ పిల్లల అమ్మగా పేరొందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయి సప్కాల్‌ (75) మరణించారు.
→ఈమె కేంద్ర ప్రభుత్వం నుంచి గతేడాది ‘పద్మశ్రీ’ అందుకొన్నారు.
→1948లో మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో కడు పేదరికంలో పుట్టిన సింధుతాయి జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురీది అనాథ పిల్లల కోసం పలు సంస్థలను ఏర్పాటు చేశారు.
→1,050 మంది అనాథలను పెంచి పెద్ద చేశారు. ఈమె జీవిత చరిత్ర మరాఠా భాషలో బయోపిక్‌ చిత్రంగా వచ్చింది.