జాతీయం

హైదరాబాద్‌ ఆర్‌సీఐ నుంచి 5 సరికొత్త అస్త్రాలు

నగరంలో డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ), డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన 5 సరికొత్త అస్త్రాలను రాజ్‌పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో తొలిసారి ప్రదర్శించారు. యుద్ధ విమానం నుంచి ప్రయోగించే వీటికి అస్త్ర, రుద్రం, సా, గౌరవ్, తారా అనే పేర్లు పెట్టారు. శత్రువుల గుండెల్లో మోగే పాంచ్‌ పటాకాలుగా వీటిని అభివర్ణిస్తున్నారు. అస్త్ర, రుద్రం క్షిపణుల రూపకల్పనలో హైదరాబాద్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లోని డీఆర్‌డీఎల్‌ కీలక పాత్ర పోషించగా సా, గౌరవ్, తారా అభివృద్ధిలో ఆర్‌సీఐ పాలుపంచుకుంది. వీటితో పాటు తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అధునాతన ఎలక్ట్రానిక్‌ స్కాన్డ్‌ అర్రే (ఏఈఎస్‌ఏ) రాడార్, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ జామర్‌ను డీఆర్‌డీవో శకటంలో ప్రదర్శించారు.

అస్త్ర: గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. తేజస్‌ యుద్ధ విమానం నుంచి ఇప్పటికే పలుమార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

రుద్రం: కొత్తతరం యాంటీ రేడియేషన్‌ క్షిపణి. శత్రు రాడార్లను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. 250 కి.మీ. పరిధి వరకు పనిచేస్తుంది. 5.5 మీటర్ల పొడవు ఉంటుంది. 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళుతుంది. 2020లో దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సా: స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ ఫీల్డ్‌ వెపన్‌. 100 కి.మీ. పరిధిలో శత్రువుల బంకర్లు, వైమానిక స్థావరాలను కూల్చేస్తుంది. 80 కిలోల బరువు ఉంటుంది. హక్‌-ఐ విమానం, సుఖోయ్‌ నుంచి గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు. భారత వైమానిక దళానికి అందజేశారు.

గౌరవ్‌: లాంగ్‌ రేంజ్‌ గైడెడ్‌ గ్లైడ్‌ బాంబ్‌. వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. 4 మీటర్ల పొడవు, వెయ్యి కిలోల బరువు ఉంటుంది. సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు.

తారా: బంకర్ల వంటి లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు టాక్టికల్‌ అడ్వాన్స్‌ రేంజ్‌ అగ్మెంటేషన్‌ (తారా) ఆయుధాన్ని ఆర్‌సీఐ అభివృద్ధి చేస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.


ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరిందని చెప్పడానికి గుర్తుగా అందులో పాల్గొన్న ముఖ్యమైన సిబ్బందికి ఏటా అందించే హల్వాకు బదులుగా ఈసారి మిఠాయిలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. బడ్జెట్‌ను గోప్యంగా ఉంచడం కోసం కొందరు ముఖ్యమైన సిబ్బందిని ఆర్థికశాఖ కార్యాలయంలోని బడ్జెట్‌ ప్రెస్‌లో ఉంచి తాళం వేస్తారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకూ వారు అక్కడే ఉంటారు. 2021 - 22 బడ్జెట్‌ను తొలిసారి కాగిత రహిత రూపంలో అందించారు. ప్రజలు, ఎంపీలకు బడ్జెట్‌ వివరాలు అందుబాటులో ఉంచేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చారు. 2022 - 23 బడ్జెట్‌ కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది.

బ్రహ్మోస్‌ క్షిపణికి తొలి ఆర్డర్‌

రష్యాతో కలిసి భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన తిరుగులేని అస్త్రం ‘బ్రహ్మోస్‌’ క్రూయిజ్‌ క్షిపణులకు తొలిసారిగా ఎగుమతి ఆర్డర్‌ లభించింది.

వీటిని ఫిలిప్పీన్స్‌ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖకు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థకు మధ్య 37.4 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) విలువైన ఒప్పందం కుదిరింది. దీనికింద ఫిలిప్పీన్స్‌ నేవీకి నౌకా విధ్వంసక బ్రహ్మోస్‌ వెర్షన్‌ క్షిపణులు సరఫరా అవుతాయి. వీటిని ఫిలిప్పీన్స్‌ తీర ప్రాంతంలో మోహరిస్తారు.

‣ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈఓ అతుల్‌ డి.రాణె, డిప్యూటీ సీఈఓ సంజీవ్‌ జోషీ, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఆర్‌ నేగి, ప్రవీణ్‌ పాఠక్‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.


సైనిక ధీశక్తిని చాటిన గణతంత్ర వేడుకలు

భారత 73వ గణతంత్ర వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. దేశ సైనిక ధీశక్తిని, శక్తిమంతమైన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్‌ వద్ద కవాతు సాగింది. శకటాల ప్రదర్శన, యుద్ధ విమానాల విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ విజయ్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలో కవాతు ఆరంభమైంది. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలిటరీ దళాలు, డీఆర్‌డీవో, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు ఇందులో పాల్గొన్నాయి. సైన్యం తరఫున అశ్వికదళం, 14 మెకనైజ్డ్‌ విభాగాలు, 6 మార్చింగ్‌ కంటింజెంట్లు భాగమయ్యాయి. ధ్రువ్‌ హెలికాప్టర్లు, 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పీటీ-76, సెంచూరియన్‌ ట్యాంకులు, 75, 24 ప్యాక్‌ హోవిట్జర్, ఎంబీటీ అర్జున్‌ ఎంకే ట్యాంకులు, ఓటీ-62 శతఘ్నులతో పాటు పలు ఆయుధ వ్యవస్థలను, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.

75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని ఈసారి నౌకాదళ శకటాన్ని 1946 నాటి నౌకాదళ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీర్చిదిద్దారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపడుతున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన అద్భుత విన్యాసాలను ప్రదర్శించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి.

జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన ఏఎస్‌ఐ బాబు రామ్‌కు దేశ అత్యున్నత శౌర్య పతాకమైన ‘అశోక్‌ చక్ర’ మరణానంతరం లభించింది. ఆయన భార్య ఈ అవార్డు అందుకున్నారు. శ్రీనగర్‌లో 2020 ఆగస్టు 29న జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో బాబు రామ్‌ కీలక భాగస్వామి. ఆ రోజు తన సహచరుడి వైపు దూసుకువస్తున్న తూటాలకు అడ్డుపడి కాచుకొన్న బాబు రామ్‌ ఉగ్రవాదుల బుల్లెట్లకు మరణించారు.


రాష్ట్రపతి అంగరక్షక దళ అశ్వానికి వీడ్కోలు

రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అంగరక్షక దళంలో ముందు వరుసలో ఉండే అశ్వం ‘విరాట్‌’కు కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు వీడ్కోలు పలికారు. ఈ అశ్వం విధుల నుంచి విరామం పొందింది. హనోవేరియన్‌ జాతికి చెందిన ఈ గుర్రాన్ని 2003లో రాష్ట్రపతి అంగరక్షక దళ కుటుంబంలో చేర్చారు. దీన్ని ప్రెసిడెంట్‌ బాడీగార్డ్‌ ఛార్జర్‌ అని కూడా పిలుస్తారు. గణతంత్ర కవాతులో అత్యంత నమ్మకంగా వ్యవహరించే గుర్రంగా దీనికి పేరుంది.

అమల్లోకి ‘పర్యావరణ ర్యాంకింగ్‌’ విధానం

ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు విషయంలో రాష్ట్రాల పర్యావరణ ప్రభావ మధింపు ప్రాధికార సంస్థ (ఎస్‌ఈఐఏఏ)లకు ర్యాంకింగ్‌ ఇచ్చే కొత్త వ్యవస్థను కేంద్రం ప్రవేశపెట్టింది. నిబంధనలను నీరు గార్చకుండా ఈ సంస్థల్లో సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోది చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2006 నాటి పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్‌లోని అంశాలు, మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ర్యాంకింగ్‌ ప్రక్రియను అందుకోకుంటే నెగెటివ్‌ మార్కులు ఏమీ ఉండవు.

సుభాష్‌ చంద్రబోస్‌ హాలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్‌ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దాని హాలోగ్రామ్‌ విగ్రహాన్ని డిజిటల్‌ రూపంలో ఆవిష్కరించారు.

డిజిటల్‌ దీపాల వెలుగులో రాత్రిళ్లు మాత్రమే దీనిపై విగ్రహం కనిపిస్తుంది. దీని ఎత్తు 28 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు. నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ దగ్గర గతంలో ఐదో కింగ్‌ జార్జ్‌ విగ్రహం ఉన్న కనోపీ (మండపం)లో నేతాజీ హాలోగ్రామ్‌ ప్రతిమను ఆవిష్కరించారు.


ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ రాజకీయరంగ ప్రవేశం

దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేరొందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు ఆయన లఖ్‌నవూలో అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఆయన ఎత్తు 8.1 అడుగులు.

'ఎ' గ్రేడ్‌ కార్పొరేషన్‌గా కాళేశ్వరం

కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ‘ఎ’ కేటగిరీ కార్పొరేషన్‌గా గుర్తిస్తూ, భారత ప్రభుత్వ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీఎల్‌) ఉత్తర్వులిచ్చింది. నిధుల వినియోగం, నిర్మాణం, లక్ష్యం తదితర అంశాల ఆధారంగా ఆ సంస్థ కేటగిరీని నిర్ణయిస్తుంది. భారీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టు అనతికాలంలోనే అందుబాటులోకి రావడం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం విశేషం. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చేందుకు (ఎస్‌పీవీ) 2016లో రాష్ట్ర ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసింది.

మహాత్ముడికి ఇష్టమైన కీర్తన తొలగింపు

గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని జనవరి 29న ఏర్పాటు చేసే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన ‘అబైడ్‌ విత్‌ మీ’ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది. ఈసారి మాత్రం ‘సారే జహా సే అచ్చా’తో కార్యక్రమం సమాప్తమవుతుంది. ‘అబైడ్‌ విత్‌ మీ’ని స్కాటిష్‌ ఆంగ్లికన్‌ కవి హెన్రీ ఫ్రాన్సిస్‌ లైట్‌ 1847లో రచించారు. 1950 నుంచి ఈ కీర్తన బీటింగ్‌ రిట్రీట్‌లో భాగంగా ఉంటోంది.

కర్ణాటకలో ‘మంకీ జ్వరం’

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో తొలి మంకీ జ్వరం కేసు నమోదయ్యింది. 57 ఏళ్ల ఓ మహిళకు ఈ జ్వరం సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇదే తొలి మంకీ జ్వరం కేసు అని అధికారులు తెలిపారు. మంకీ జ్వరం దక్షిణాసియాలోని కోతుల ద్వారా మనుషులకు సోకే వైరల్‌ జబ్బు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.

దేశ రాజధానిలో నేతాజీ భారీ విగ్రహం

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా దేశ రాజధానిలోని ఇండియాగేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్రను ఘనంగా చాటిచెప్పేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ విగ్రహం పూర్తయ్యే వరకు ఇండియా గేట్‌ వద్ద బోస్‌ హోలోగ్రామ్‌ (బీమ్‌ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) ప్రతిమను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీన్ని నేతాజీ జయంతి సందర్భంగా (జనవరి 23) ఆవిష్కరిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులు అందిస్తోంది. ఇందుకు ఎంపికైన సంస్థలకు రూ.51 లక్షల నగదు, ప్రశంసాపత్రం, వ్యక్తులకైతే రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు.

ఈ విగ్రహం 25 అడుగులు ఎత్తు ఉంటుందని.. దీన్ని తెలంగాణ నుంచి తెచ్చే గ్రానైట్‌ రాయితో నిర్మిస్తామని శిల్పి అద్వైత గఢ్‌నాయక్‌ తెలిపారు. ఒడిశాకు చెందిన గఢ్‌నాయక్‌.. దిల్లీలో నేషనల్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.


జనవరి 25 నుంచి ఏఆర్‌టీ చట్టం అమలు

సంతానోత్పత్తి సాంకేతిక నియంత్రణ చట్టం (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2021) జనవరి 25 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సంతాన సాఫల్య వైద్య ఆరోగ్య కేంద్రాల పనితీరును నియంత్రించేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ క్లినిక్‌లు అందించే అన్ని రకాల సేవలు, ట్రీట్‌మెంట్స్, ప్రొసీజర్స్, పునరుత్పత్తి కణాలను నిల్వచేసి సరఫరా చేసే బ్యాంకులు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.

నిబంధనలు ఉల్లంఘించిన సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులకు 5 నుంచి పదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోంది.

ఈ చట్టం ప్రకారం 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 23 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళల నుంచి మాత్రమే పునరుత్పత్తి కణాలను స్వీకరించడానికి వీలుంటుంది. మాతృకణం దానం చేసే మహిళ వివాహితురాలై, కనీసం మూడేళ్లలోపు బిడ్డ ఉన్న వారై ఉండాలి. ఒక మహిళ జీవితంలో ఒక్కసారి మాత్రమే మాతృకణం దానం చేయడానికి వీలుంటుంది. అలాగే ఆమె నుంచి ఏడుకు మించి కణాలు స్వీకరించడానికి వీల్లేదు.


జాతీయ వినియోగదారుల కమిషన్‌కు పునర్విచారణ పరిధి పరిమితం: సుప్రీం కోర్టు

వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌21(బి) ప్రకారం జాతీయ వినియోగదారుల కమిషన్‌కు ఉన్న పునర్విచారణ న్యాయ పరిధి చాలా పరిమితమని, రాష్ట్ర స్థాయి పరిష్కార వేదికల తీర్పుల్లో లోపాలు ఉంటేనే దానిని చెలాయించగలదని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పీలు దశలో పిటిషనర్‌ అదనపు సాక్ష్యాలు సమర్పించగలిగినప్పటికీ చట్ట నిబంధనల పరిధికి లోబడే అవి ఉండాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఎం.త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. ‣ భారతీయ స్టేట్‌ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి తనకు కలిగిన సేవాలోపంపై చేసిన ఫిర్యాదును పశ్చిమబెంగాల్‌లోని పుర్బ మేదినీపుర్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక స్వీకరించింది. అక్కడి తీర్పుపై బ్యాంకు అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించినప్పటికీ వారికి వ్యతిరేకమైన నిర్ణయమే వెలువడింది. దీనిపై జాతీయ కమిషన్‌లో రివిజన్‌ పిటిషన్‌ దాఖలైంది. బ్యాంకు నుంచి నివేదికను తెప్పించుకున్న జాతీయ కమిషన్‌ దాని ఆధారంగానే తీర్పు వెలువరించింది.

యూరోప్‌లో వలసలు, రవాణాపై హ్యాండ్‌బుక్‌

ఐరోపా వలసదారులు, రవాణాపై అంతర్జాతీయ కార్మిక సంస్థ, భారతీయ ప్రవాస కేంద్రం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ విడుదలైంది. ఐఎల్‌వో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రవాస విభాగాల అధికారులు, తెరాస ప్రవాస విభాగాల కన్వీనర్‌ మహేశ్‌ బిగాల, యూరోప్‌లోని ప్రవాసులు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంస్థలు, పౌర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రాలకు ‘పర్యావరణ క్లియరెన్సు’ ర్యాంకులు

‘పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం’ ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీలో చూపిన చొరవ ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ఇవ్వనుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతేడాది నవంబరు 13న కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి, ర్యాంకుల నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. దేశంలో అవసరమైనచోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రాలకు స్టార్‌ రేటింగు విధానం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి ముగ్గురు, జ్యుడీషియల్‌ అధికారుల నుంచి ముగ్గుర్ని న్యాయమూర్తులుగా నియమించాలనీ కొలీజియం ప్రతిపాదించింది. ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ మునీశ్వర్‌ భండారీకి పదోన్నతి కల్పించి అక్కడే శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జనవరి 29న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీ హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల నియామకానికి గతేడాది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపింది. వీరిలో న్యాయవాదులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. ఒకేసారి ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకాలకు పచ్చజెండా ఊపింది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. తాజా సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆ సంఖ్య 27కి చేరుతుంది.


భోపాల్‌లో స్మృతి దివస్‌ నిర్వహణ

బాపూజీ హంతకుడు నాథురామ్‌ గాడ్సే, సహ నిందితుడు నారాయణ్‌ ఆప్టేకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘గాడ్సే - ఆప్టే స్మృతి దివస్‌’’ పాటించి హిందూ మహాసభ నివాళులర్పించింది.

ఈ సందర్భంగా మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆరెస్టయిన ఆధ్యాత్మిక గురువు కాళీ చరణ్‌ మహారాజ్‌కు గాడ్సే - ఆప్టే భారత రత్న అవార్డును ప్రదానం చేసింది.

మరో నలుగురు హిందూ మహాసభ నాయకులను కూడా ఈ పురస్కారంతో సత్కరించింది.

‘‘భారత్‌ను పాకిస్థాన్‌తో ఏకీకృతం చేసి ‘అఖండ భారత్‌’గా మార్చాలనే సంకల్పంతో మేము భారత్‌ మాతకు ‘హారతి’ నిర్వహించాం. గాడ్సే, ఆప్టే అరెస్టును నిరసిస్తూ జనవరి 30ని ‘గాడ్సే ఆప్టే స్మృతి దివస్‌’ దినంగా పాటిస్తున్నాం’’ అని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్‌ భరద్వాజ పేర్కొన్నారు.


హైదరాబాద్‌-బెంగళూరు ఇక సూపర్‌ హైవే

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని సూపర్‌ ఇన్ఫర్మేషన్‌ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మీదుగా బెంగళూరు వెళ్లే ఈ 44వ నంబరు జాతీయ రహదారిని అత్యాధునికంగా మార్చేందుకు రూ.14,400 కోట్లు అవుతుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. సవివర నివేదిక (డీటెయిల్డు ప్రాజెక్టు రిపోర్టు)ను సిద్ధం చేసేందుకు కన్సల్టెంటును సైతం ఎంపిక చేసింది. తాజాగా ఆ సంస్థతో జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం చేసుకుంది.


భారత్‌ బయోటెక్‌ చుక్కల టీకా మూడో దశ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

కొవిడ్‌ వ్యాధికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘బీబీవీ 154’ అనే చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ప్రాథమికంగా ఇచ్చే రెండు డోసులతో పాటు, బూస్టర్‌కు అనువుగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. టీకా ఇవ్వటం, నిల్వ, పంపిణీలో ఉన్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటే చుక్కల మందు టీకా ఎంతో మేలైనది అవుతుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల గతంలో పేర్కొన్నారు. దీనికి సిరంజి, సూదుల అవసరం ఉండదు. త్వర త్వరగా టీకాలు ఇవ్వొచ్చు. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు మూడు నెలల్లో పూర్తవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత దీన్ని వినియోగించడానికి అనుమతి లభిస్తే, కరోనా వ్యాధికి అందుబాటులోకి వచ్చిన చుక్కల మందు టీకా ఇదే అవుతుంది.

ఇక బహిరంగ విపణిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్‌

కొవిడ్‌-19 టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ ఇక బహిరంగ విపణిలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇప్పటివరకు ఈ టీకాలకు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి. బహిరంగ విపణి అనుమతితో దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుత ధరలు కంటే తక్కువకు లభ్యం కానున్నాయి. ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే జాతీయ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) వర్గాలు ఈ టీకాల ఒక్కో డోసు ధర రూ.275 ఉండే అవకాశం ఉందని సర్వీసు ఛార్జీల కింద అదనంగా మరో రూ.150 వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. బహిరంగ విపణి అనుమతి లభించినా, ప్రభుత్వ టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి మాండవీయ పేర్కొన్నారు.

గూగుల్‌ మ్యాప్స్‌లో పక్కా చిరునామా ఇక

భారత్‌లో తొలిసారిగా గూగుల్‌ మాప్స్‌లో సరికొత్త ఫీచరును గూగుల్‌ ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదార్లు తమ ప్రస్తుత లొకేషన్‌కు ‘ప్లస్‌ కోడ్స్‌’ చిరునామాను కనుగొనవచ్చు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఈ ఓపెన్‌ సోర్స్‌డ్‌ డిజిటల్‌ చిరునామాలు లొకేషన్లకు కచ్చిత చిరునామాను ఇవ్వగలుగుతాయి. సరైన, అధికారిక చిరునామా లేని ప్రదేశాలకు సైతం ఇవి ఈ సేవలు అందిస్తాయి. వీధి, ప్రాంతం పేర్లకు బదులుగా ఈ ప్లస్‌ కోడ్స్‌ అనేవి అక్షాంశ, రేఖాంశాల (లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌) ఆధారంగా అంకెలు, అక్షరాల రూపంలో చిరునామాను అందిస్తాయి. ఇవి ఒక అపార్ట్‌మెంట్‌కు ఉండే పలు గేట్లలో కచ్చితంగా ఏ గేటు అన్నది కూడా చూపగలవు. తద్వారా డెలివరీలకు, ఇతరత్రా అవసరాలకు సులువుగా నేవిగేషన్‌ లభిస్తుంది. రోజువారీ అవసరాలకు వినియోగదార్లు ఈ ‘ప్లస్‌కోడ్‌’ చిరునామాలను నేరుగా వినియోగించుకోవచ్చని గూగుల్‌ మాప్స్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ అమండా బిషప్‌ పేర్కొన్నారు.

లాల్‌చౌక్‌లో 30 ఏళ్ల తర్వాత మువ్వన్నెల రెపరెప

శ్రీనగర్‌లోని చారిత్రక క్లాక్‌టవర్‌ లాల్‌చౌక్‌లో 30 ఏళ్ల తర్వాత మువ్వన్నెల జెండా మళ్లీ ఎగిరింది. చివరిసారిగా 1992లో భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇక్కడ పతాకావిష్కరణ చేశారు. స్థానికంగా ఘంటా ఘర్‌గా పిలుచుకునే ఈ కేంద్రంలో సామాజిక కార్యకర్తలు సాజిద్‌ యూసుఫ్‌ షా, సాహిల్‌ బషీర్‌ భట్‌ కొంతమంది మద్దతుదారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్లాక్‌టవర్‌పై జాతీయ జెండా ఏర్పాటుకు హైడ్రాలిక్‌ క్రేన్‌ ఎలివేటర్‌ను వాడారు.

ఛత్తీస్‌గఢ్‌ ఉద్యోగులకు వారంలో 5 రోజులే పని

గణతంత్ర వేడుకల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని భూపేశ్‌ బఘేల్‌ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో అయిదు రోజులు విధులకు హాజరైతే చాలని ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్‌దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. రైతులకు కూడా తీపికబురు చెప్పింది. 2022 - 23 ఖరీఫ్‌ సీజను నుంచి పప్పుధాన్యాలు అన్నింటినీ కనీస మద్దతుధరకే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

తండ్రి ఆస్తుల్లో.. దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం: సుప్రీం కోర్టు

వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తండ్రి స్వయంగా సంపాదించిన, ఆస్తుల విభజన ద్వారా పొందినవాటిపై కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలుపై ధర్మాసనం విచారించింది. చనిపోయిన హిందూ పురుష వ్యక్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.

తండ్రి మరణించాక ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా, సొంత కుమార్తెకు వారసత్వ హక్కు లేదా అనే అంశాలపై ధర్మాసనం విచారణ జరిపి 51 పేజీల తీర్పు వెలువరించింది. 1994లో దిగువ న్యాయస్థానం, 2009లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.


50 ఏళ్ల తర్వాత ఆరనున్న అమర్‌జవాన్‌ జ్యోతి

దేశ రాజధానిలోని ఇండియా గేట్‌ వద్ద ఉండే అమర్‌ జవాన్‌ జ్యోతిని జనవరి 21న ఆర్పివేస్తారు. అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉన్న ‘జాతీయ యుద్ధ స్మారకం’ వద్ద ఉండే జ్యోతితో దీన్ని కలిపివేస్తారు. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా అమర్‌ జవాన్‌ జ్యోతిని ఒక స్మారకంగా నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి 25న జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అక్కడ 25,942 మంది సైనికుల పేర్లను స్వర్ణాక్షరాలతో గ్రానైట్‌ ఫలకాలపై లిఖించారు.

కొవాగ్జిన్‌పై తపాలా స్టాంపు

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రాముఖ్యతను గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తపాలా స్టాంపును ఆవిష్కరించారు. వీడియో లింక్‌ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొవిడ్‌ టీకా పంపిణీ యజ్ఞాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని.. అది భారతీయులకు గర్వకారణమని మాండవీయ పేర్కొన్నారు.

‘నేషనల్‌ స్టార్టప్‌ డే’గా జనవరి 16

భారతదేశం జనవరి 16ను ‘నేషనల్‌ స్టార్టప్‌ డే (జాతీయ స్టార్టప్‌ దినోత్సవం)’గా జరుపుకోబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. స్టార్టప్‌ల కల్చర్‌ దేశమంతటా విస్తరించేలా చేయడానికి జనవరి 16ను నేషనల్‌ స్టార్టప్‌ డేగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని 150 స్టార్టప్‌ల ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి స్టార్టప్‌ ఇండియా ఇన్నోవేషన్‌ వీక్‌ కూడా ఉంటుందని చెప్పారు.

‘రైలు గార్డు’ ఇక నుంచి ‘ట్రైన్‌ మేనేజర్‌’

‘రైలు గార్డు’ అని అనొద్దని, ఇకపై ‘ట్రైన్‌ మేనేజర్‌’గా పిలువాలని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘గార్డ్‌’ పోస్ట్‌ను ‘ట్రైన్‌ మేనేజర్‌’ గా మార్చాలని నిర్ణయించింది. అసిస్టెంట్‌ గార్డ్‌ను అసిస్టెంట్‌ పాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, గూడ్స్‌ గార్డ్‌ను గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, సీనియర్‌ గూడ్స్‌ గార్డ్‌ను సీనియర్‌ గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, సీనియర్‌ పాసింజర్‌ గార్డ్‌ను సీనియర్‌ పాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ను మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ మేనేజర్‌గా వ్యవహరించాలని పేర్కొంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

లోంగేవాలాలో భారీ జాతీయ పతాకం

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులకు సమీపంలో భారీ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రదర్శించనున్నారు. ఖాదీ వస్త్రంతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ జెండా ప్రపంచంలో అతి పొడవైనది. 1971లో పాకిస్థాన్‌తో చరిత్రాత్మక యుద్ధం జరిగిన రాజస్థాన్‌లోని లోంగేవాలా వద్ద దీనిని పదర్శించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.సైనిక దినోత్సవం సందర్భంగా అక్కడ భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. పొడవు 225 అడుగులు, వెడల్పు 150 ఉండే ఈ పతాకం బరువు 1400 కిలోలు. ఈ భారీ పతాకాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ఇది అయిదో సారి.

శానిటరీ నాప్కిన్‌ రహితంగా కుంబలంగి

దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్‌ రహిత గ్రామంగా కేరళలోని కుంబలంగి నిలిచింది. ఎర్నాకులం జిల్లాలోని ఈ చిన్న లంక గ్రామంలో మహిళలు నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌కప్స్‌ వాడుతుండటంతో ఈ ఘనత సాధించింది. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘కుంబలంగి నైట్స్‌’ సినిమా ద్వారా కుంబలంగి గ్రామం ఇదివరకే ప్రాచుర్యం పొందింది. ఇదేచోట అమలుచేసిన ‘అవల్కాయి’ (ఆమె కోసం) అనే కార్యక్రమం విజయవంతమై మరోసారి వార్తల్లో నిలిచింది. అవల్కాయి కార్యక్రమాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సాయంతో ఇక్కడ అమలుచేశారు. మహిళలు రుతుస్రావం సమయంలో నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వాడేలా అవగాహన కల్పించారు.

రైలు గార్డు.. ఇక రైలు మేనేజర్‌

ఇప్పటివరకు రైలు గార్డుగా ఉన్న హోదాను రైలు మేనేజర్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై అసిస్టెంట్‌ గార్డు పేరును అసిస్టెంట్‌ ప్యాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, గూడ్స్‌గార్డ్‌ పేరును గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా, సీనియర్‌ గూడ్స్‌గార్డ్‌ పేరును సీనియర్‌ గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌గా మారుస్తున్నట్లు ఇందులో పేర్కొంది. అయితే హోదా పేరు మార్చినంత మాత్రాన వేతనాలు, భత్యాలు, ఈ పోస్టుల నియామక ప్రక్రియ, బాధ్యతలు, సీనియార్టీ, ప్రమోషన్‌ అవకాశాల్లో మార్పు ఉండదని బోర్డు స్పష్టంచేసింది.

భారత సైన్యానికి కొత్త యూనిఫాం యూనిఫాం

భారత సైన్యం యూనిఫాంలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 15న వీటిని తొలిసారి ప్రదర్శించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కోటి సూర్య నమస్కారాలు

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల్లో భాగంగా కేంద్రం నిర్వహించిన ‘సూర్య నమస్కారాలతో తేజస్సు’ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ సహా అన్ని దేశాల్లో కలిపి కోటిమందికి పైగా పాల్గొని ఆసనాలు వేసినట్టు కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్‌-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేదుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. కేంద్ర ఆయుష్‌ మంత్రి సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి ముంజపర మహేంద్రభాయ్‌ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

‘బ్రహ్మోస్‌’ కు 2,773 కోట్లు చెల్లిస్తున్న ఫిలిప్పీన్స్‌

భారత్‌లో తయారయ్యే సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’ కొనుగోళ్లకు ఫిలిప్పీన్స్‌ సిద్ధమైంది. భూభాగంతో పాటు నౌకలు, విమానాల నుంచి ప్రయోగించగలిగే ఈ అస్త్రాన్ని తన నావికాదళంలోనూ మోహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం తమతో రూ.2,773 కోట్ల (374 మిలియన్‌ డాలర్లు) విలువైన ఒప్పందం కుదుర్చుకుని.. డబ్బు చెల్లిస్తోందని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ కంపెనీ తెలిపింది.

ఐవీఎఫ్‌ పద్ధతిలో పుంగనూరు లేగదూడ జననం

ప్రపంచవ్యాప్తంగా పొట్టిగా ఉండే పశువుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు జాతి ఒకటి. ఇవి నానాటికీ అంతరించిపోతున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 500 కంటే తక్కువే ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. పుంగనూరు జాతికి చెందిన ఓ లేగ దూడ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) పద్ధతి ద్వారా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది. దేశంలో ఈ సాంకేతికతను ఉపయోగించి పురుడు పోసుకున్న తొలి పుంగనూరు ఆవు దూడ ఇదేనని మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది.

దేశీయంగా అంతరించిపోతున్న పశువులను సంరక్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర పాడిపరిశ్రమల శాఖ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు ఉమ్మడిగా చేపట్టాయి. అరుదైన గోవులను రక్షించేందుకు పశుసంవర్ధక శాఖ ఐవీఎఫ్‌ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. పుంగనూరు జాతి ఆవులనే గాక బన్ని, తార్పాకర్, ఒంగోలు లాంటి మేలిమి జాతుల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది.


దేశంలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో పురపాలక చట్టం

తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టాన్ని అంధులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ముద్రించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బ్రెయిలీ లిపిలో ముద్రించిన పురపాలక చట్టం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రోజువారీ వ్యవహారాల్లో అనేక మందికి పురపాలక చట్టం అవసరం ఉంటుందని, దివ్యాంగులకూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

2022లో 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ

2022లో మొత్తం 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ వివరాలను రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. జూన్‌ 21 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది. ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానాలన్నీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైకాపా, తెరాసలకే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే సూచనలున్నాయి. మరో మూడు స్థానాల్లో కొత్తవారు రానున్నారు. ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభలో భాజపాకు 97, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యుల బలం ఉంది. ప్రాంతీయ పార్టీల్లో డీఎంకే, వైకాపా బలం పెరగనుంది.

భాజపా పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ (కర్ణాటక), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఝార్ఖండ్‌), పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), జైరాం రమేశ్‌ (కర్ణాటక), ఏకే ఆంటోనీ (కేరళ), పి.చిదంబరం (మహారాష్ట్ర), అంబికా సోనీ (పంజాబ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు మళ్లీ ఏదో ఒక రాష్ట్రం నుంచి ఎన్నికవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త రాజ్యసభ సభ్యుల ఎంపిక జరుగుతుంది.


భారత్‌-నేపాల్‌ మధ్య వంతెన నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం

భారత్, నేపాల్‌ మధ్య ఉత్తరాఖండ్‌లోని ధార్‌చూలాలో మహాకాళి నదిమీద‌ వంతెన నిర్మాణంపై కుదరనున్న అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే విపత్తుల నిర్వహణలో పరస్పర సహకారంపై భారత్, తుర్క్‌మెనిస్థాన్‌ల మధ్య ఎంవోయూకు కేబినెట్‌ ఆమోదించింది.


లోక్‌సభ స్థానం ఎన్నికల వ్యయం రూ.95 లక్షలు

కేంద్రం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిమితులను సవరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా, అసెంబ్లీ స్థానం ఖర్చును రూ.40 లక్షలుగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు-2022 పేరిట విడుదల చేసిన నిబంధనలు అధికారిక గెజిట్‌లో ముద్రించిననాటి నుంచి అమలులోకి వస్తాయి.


ఐదో అత్యంత వేడి సంవత్సరంగా 2021

దేశంలో గత శతాబ్ద కాలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో 2021 ఐదో స్థానంలో నిలిచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతల పరంగా 2016, 2009, 2017, 2010 మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో 2021 చేరింది. గతేడాది సగటు వాతావరణ ఉష్ణోగ్రత కంటే 0.44 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైంది.


ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు కమిటీ

ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రత వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్‌ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహించనున్నారు. పంజాబ్‌-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, చండీగఢ్‌ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఐజీ, పంజాబ్‌ అదనపు డీజీపీ (సెక్యూరిటీ) సభ్యులుగా ఉంటారు.

సర్వోన్నత న్యాయస్థాన మాజీ జడ్జి అయిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఆ పదవిలో 2018 ఏప్రిల్‌ 27 నుంచి 2021 మార్చి 13 వరకు కొనసాగారు. అంతకుముందు 2007లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపుపొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిలో నేరుగా నియమితులైన తొలి మహిళా న్యాయవాదిగా చరిత్ర సృష్టించారు. పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె కీలకమైన తీర్పుల్లో భాగస్వామి.


మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభం

దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో రూ.53 కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆక్సిజన్‌-18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి ఆరు అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన మన దేశం చేరింది.

భారత అణుశక్తి విభాగం ఛైర్మన్‌ కేఎన్‌ వ్యాస్‌ ‘ఆక్సిజన్‌-18’ ప్లాంటును వర్చువల్‌ పద్ధతిలో ఆవిష్కరించారు.

ఆక్సిజన్‌-18ను పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ (పీఈటీ) స్కానింగ్‌లో వినియోగిస్తారు. పీఈటీ అనేది న్యూక్లియర్‌ ఇమేజింగ్‌లో ఓ టెక్నిక్‌. ఇది శరీరంలోని జీవ రసాయనిక ప్రక్రియలను, కణతులను, క్యాన్సర్‌ వివిధ దశలను, చిత్త వైకల్యం తదితర వ్యాధులను వంద శాతం కచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. శరీరధర్మ, జీవక్రియల అధ్యయనానికీ ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఇతర అనేక వైజ్ఞానిక అవసరాలకు ఆక్సిజన్‌-18 ఉపకరిస్తుంది.

ఆక్సిజన్‌ సహజసిద్ధంగా 16, 17, 18 అనే స్థిర ఐసోటోపులను కలిగి ఉంటుంది. సాధారణ నీటిలో ఆక్సిజన్‌-18 ఐసోటోపు 0.204 శాతంగా ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా దాన్ని 95.5 శాతం ఆక్సిజన్‌-18 ఐసోటోపుగా మార్పు చెందిస్తారు. ఆ నీటిని సుసంపన్న ఆక్సిజన్‌-18 ఐసోటోపు నీటిగా, డబ్లీ లేబుల్డ్‌ వాటర్‌గా పిలుస్తారు. ఆ నీటిని ఉత్పత్తి చేసే ప్లాంటును ఆక్సిజన్‌-18 ప్లాంటుగా వ్యవహరిస్తారు. 95.5 శాతం ఆక్సిజన్‌-18 ఐసోటోపు సుసంపన్నంగా ఉండే నీటిని మణుగూరు ప్లాంటులో ఏడాదికి పది కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. 10 శాతం ‘ఆక్సిజన్‌-18’ ఉండే నీటిని ఏడాదికి వంద కిలోలు ఉత్పత్తి చేస్తారు.


గణతంత్ర వేడుకల్లో 12 రాష్ట్రాల శకటాల కవాతు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు స్థానం దక్కలేదు. ఈసారి మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చోటు దక్కింది. విద్య - నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా తొమ్మిది శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. అమృతోత్సవాల ఇతివృత్తంతో కూడిన అంశాలను ఇవి ప్రదర్శించనున్నాయి. ఈసారి కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10.30కి మార్చారు. మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేందుకు ఈ మార్పుచేశారు. ఈసారి ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగరనున్నాయి.

ఈసారి రిపబ్లిక్‌ డే, బీటింగ్‌ రిట్రీట్‌ కోసం ఔషధ మొక్కలైన అశ్వగంధ, ఉసిరి, కలబంద విత్తనాలను నిక్షిప్తం చేసిన పర్యావరణ అనుకూలమైన ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. మొత్తంగా 5,000 - 8,000 మందినే అనుమతిస్తారు.

రిపబ్లిక్‌ డే పెరేడ్‌ చూసే అవకాశం రాని ఆటోరిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, సఫాయి కార్మికులు, కరోనాపై పోరులో ముందుంటున్నవారు పెరేడ్, బీటింగ్‌ రిట్రీట్‌ ఉత్సవాలు చూసేందుకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. జనవరి 29న విజయ్‌చౌక్‌లో జరిగే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ సందర్భంగా దిల్లీ ఐఐటీ సహకారంతో బోట్‌లాబ్‌ అనే అంకురం పది నిమిషాల పాటు డ్రోన్‌ షో నిర్వహించనుంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన వెయ్యి డ్రోన్లు ఇందులో పాల్గొంటాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ విజయాన్ని చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర ప్రస్థానాన్ని బీటింగ్‌ రిట్రీట్‌ ముగింపు సందర్భంగా నార్త్, సౌత్‌బ్లాక్‌ గోడలపై 3 - 4 నిమిషాల లేజర్‌ షో రూపంలో ప్రదర్శిస్తారు. బీటింగ్‌ రిట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్‌ షో ఉండటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి.


రూ.1400 కోట్లతో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌

దేశంలోనే మొదటి గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.1400 కోట్లతో నిర్మించామని, దీనిని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్‌కో నిర్మించిన ఈ సబ్‌స్టేషన్‌కు మంత్రి వెళ్లి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి విద్యుత్‌ వలయం ఏర్పాటు చేశాం. దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్‌ పోదు. రాయదుర్గంలో నాలుగు సబ్‌స్టేషన్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సాధారణంగా 100 ఎకరాల స్థలం అవసరం కానీ 5 ఎకరాల స్థలంలో అధునాతన పరిజ్ఞానంతో వాటిని నిర్మించాం. ఈ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌కు 3 కిలోమీటర్ల కేబుల్స్‌ భూగర్భంలో ఏర్పాటు చేశాం. దేశంలో మొదటిసారి మోనోపోల్స్‌ కూడా వాడుతున్నాం. ఈ సబ్‌స్టేషన్‌తో హైదరాబాద్‌కు మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయవచ్చు అని వివరించారు.

‘నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌’లో వరంగల్‌కు స్థానం

జాతీయ స్థాయిలో గ్రేటర్‌ వరంగల్‌కు గుర్తింపు లభించింది. నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌ (ఎన్‌ఎన్‌సీ) పోటీలో దేశంలోని టాప్‌-10 నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా మాతా, శిశు సంరక్షణ, సంరక్షకులకు మౌలిక సదుపాయాలు, పిల్లలను ఆహ్లాదపరిచే పార్కు, ఆటస్థలం, క్రీడాసామగ్రి తదితరాలు సమకూర్చిన నగరాల నుంచి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ 2020, నవంబరులో దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 63 నగరాలు దరఖాస్తులను పంపించగా గతంలో మొదటి విడతలో 25 నగరాలను ఎంపిక చేసింది. దిల్లీలో రెండో విడతలో టాప్‌-10 నగరాల జాబితాను ప్రకటించింది. బెంగళూర్, హుబ్బళ్లి, ఇండోర్, కాకినాడ, జైపుర్, కొచ్చి, కొహిమ, రవుర్కెలా, వడోదరా, వరంగల్‌ మొదటి 10 నగరాల జాబితాలో నిలిచాయి.

గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో విన్యాసాలు

దేశ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వాయుసేన ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేపట్టనున్నట్లు వాయుసేన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. విన్యాసాల్లో రఫేల్, జాగ్వార్, మిగ్‌-29 యుద్ధ విమానాలు, చినూక్‌ హెలికాప్టర్‌లు పాల్గొంటాయని వాయుసేన అధికారులు తెలిపారు. ఎంఐ 17 హెలికాప్టర్‌ల ‘ధ్వజ్‌’ ఆకృతితో విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నాలుగు తేలికపాటి హెలికాప్టర్లతో ‘రుద్ర’, ఐదు హెలికాప్టర్లతో ‘రాహత్‌’ విన్యాసాలు ఉంటాయని వెల్లడించారు.

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి పోటీ చేయనున్నారు. మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొదటి రెండు దశలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తొలి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో దశలో 55 శాసనసభ స్థానాలకు గానూ 48 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి యోగి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఇదే నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్‌ ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం

గణతంత్ర వేడుకలు జనవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 24న ప్రారంభమయ్యే గణతంత్ర వేడుకలను సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఇదే రోజున గణతంత్ర వేడుకలు మొదలవుతాయని తెలిపింది.

భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను స్మరించుకోవడంలో భాగంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని (జనవరి 23) పరాక్రమ్‌ దివాస్‌గా నిర్ణయించింది.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో 26న జరిగే గణతంత్ర వేడుకలకు కేవలం 24 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనాకు ముందు 2020లో జరిగిన రిపబ్లిక్‌ వేడుకల్లో దాదాపు లక్షా 25 వేల మంది పాల్గొన్నారు. గతేడాది కొవిడ్‌ నిబంధనల మధ్య 25 వేల మందిని అనుమతించించారు.


అన్ని కార్లలో ఇకపై ఆరు ఎయిర్‌ బ్యాగులు

వాహనదారుల భద్రతను పెంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమల్లోకి రానున్న ఈ నిబంధనకు సంబంధించిన నోటిపికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదించారు. ముందటి రెండు సీట్లకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి చేసే నిబంధన 2022 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. తాజాగా రెండు నుంచి ఎనిమిది సీట్ల వరకు ఉండే రకరకాల కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి చేసే ముసాయిదాకు ఆమోదం తెలిపినట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. అంటే ఎంట్రీ లెవెల్‌ కారులో కూడా ఆరు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి కానున్నాయి. దీంతో కారులో ఎక్కడ కూర్చున్న ప్రయాణికులకైనా భద్రత లభిస్తుంది.

ముంబయిలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌

డేటా కేంద్రాలను నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్‌ఎస్‌ అతిపెద్ద గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌)ను ముంబయిలో ఏర్పాటు చేసింది. డేటా సెంటర్ల కోసం ఏర్పాటు చేసిన జీఐఎస్‌లలో ఆసియాలోనే ఇది పెద్దది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు ఇది ఉపయోగపడుతుందని కంట్రోల్‌ఎస్‌ తెలిపింది. ప్రస్తుతం దీని సామర్థ్యం 300 మెగావాట్లు ఉండగా, భవిష్యత్తులో 700 మెగావాట్లకు పెంచుకునేందుకు వీలుందని పేర్కొంది. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్‌ క్యాంపస్‌లో 10 డేటా కేంద్రాలకు ఇది విద్యుత్‌ను అందించనుంది. టెలికాం, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, కొత్తతరం కంపెనీల అవసరాలకు అనుగుణంగా డేటా కేంద్రాలను నిర్వహించేందుకు జీఐఎస్‌ తోడ్పడుతుందని కంట్రోల్‌ఎస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు.

వార్తలకు మళ్లీ బార్క్‌ రేటింగ్‌: కేంద్రం

దేశంలో ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతున్న వార్తలకు తక్షణం రేటింగును విడుదల చేయాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌)ని కోరింది. బార్క్‌లో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణం వార్తల రేటింగును మొదలుపెట్టడంతోపాటు గత మూడు నెలల డేటాను నెలవారీగా విడుదల చేయమని సూచించినట్లు పేర్కొంది. టీఆర్పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌) కుంభకోణం బయటపడ్డాక టెలివిజన్‌ న్యూస్‌ రేటింగులను ఏడాదికాలంగా నిలిపివేసింది.

కొత్త విధానం ప్రకారం.. వార్తలు, ప్రముఖ విషయాల రిపోర్టింగు గురించి నాలుగు వారాల సగటు ఆధారంగా బార్క్‌ రేటింగు ఇస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీఆర్‌పీ కమిటీ నివేదిక, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) 2020 ఏప్రిల్‌ 28న ఇచ్చిన సిఫార్సుల స్ఫూర్తిని అనుసరించి తన రేటింగు విధాన ప్రక్రియ, ప్రొటోకాల్స్, పర్యవేక్షణ యంత్రాంగం, పాలక నిర్మాణంలో మార్పులకు బార్క్‌ శ్రీకారం చుట్టిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


తమిళనాడులో 11 వైద్య కళాశాలలు ప్రారంభం

తమిళనాడులో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 11 కొత్త వైద్య కళాశాలలను దిల్లీ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.4వేల కోట్లతో నిర్మించిన వీటిని ఒకేసారి ప్రారంభించడం ఓ రికార్డుగా ప్రధాని అభివర్ణించారు. వీటి ద్వారా తమిళనాడులో 1,450 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.

తమిళ సంస్కృతి, భాషపై పరిశోధన చేసేందుకు చెన్నైలో నిర్మించిన చెన్నై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్లాసికల్‌ తమిళ్‌ (సీఐసీటీ), పుదుచ్చేరిలో పెరుంతలైవర్‌ కామరాజర్‌ మణిమండపం, ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను, పుదుచ్చేరిలోనే జాతీయ యువజన మహోత్సవాలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014లో దేశంలో 384 వైద్య కళాశాలలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 596కు చేరిందని, 82 వేలు ఉన్న వైద్య సీట్లను 1.48 లక్షలకు, 7 ఎయిమ్స్‌లను 22కు పెంచినట్లు ఆయన తెలిపారు.


పేదలకు 19.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాల పంపిణీ

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన 5వ విడత కింద ఇప్పటి వరకు 19.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలను పేదలకు అందించినట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ తెలిపింది. 2020 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఈ పథకం కోసం రూ.2.6 లక్షల కోట్ల విలువైన 759 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించిందని పేర్కొంది. 2021 డిసెంబరు నుంచి 2022 మార్చి వరకు అమల్లో ఉండే 5వ దశ పథకం కింద 163 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ 66,687 రూట్‌ కిలోమీటర్లు

దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ 66,687 రూట్‌ కిలోమీటర్లు ఉంటే అందులో రాష్ట్రంలో ఉన్నది కేవలం 1,737 రూట్‌ కిలోమీటర్లే. అంటే 2.8 శాతం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. బిహార్‌తో పోల్చిచూస్తే ఇక్కడ అందులో సగం కూడా లేవు.

రాష్ట్రం ఆవిర్భవించాక రైల్వే మార్గాల విస్తరణ నెమ్మదిగా సాగుతోంది. విజయవాడకు రోడ్డు మార్గంలో నాలుగు గంటల్లో చేరుకునే పరిస్థితి ఉంది. అదే సమయంలో రైల్వే మార్గాలు ఏడేళ్లలో పెరిగింది కేవలం 6.6 శాతమే. దీంతో విజయవాడకు రైలు ప్రయాణం ఆరు గంటలు పడుతోంది. హైదరాబాద్‌ నుంచి మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూరుకు ఇప్పటికీ సింగిల్‌ లైను రైలు మార్గమే ఉంది. ఒకే ట్రాక్‌పై వచ్చేపోయే రైళ్లు ఆగుతూ, సాగుతూ వెళ్లాల్సిన పరిస్థితి. కొత్త లైన్ల మంజూరుతోపాటు సింగిల్, డబుల్‌ లైన్లలో రెండో, మూడోలైన్లు విస్తరిస్తేనే రైళ్ల వేగం పెరుగుతుంది.

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పేరిట తపాలా కవరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించిన అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పేరిట తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేసింది. ధవళేశ్వరంలోని కాటన్‌ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, విశాఖపట్నం రీజియన్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు కవరు విడుదల చేశారు.

170 ఏళ్ల కిందట బ్యారేజీ నిర్మించినప్పటి పరిస్థితులు గుర్తుకు తెచ్చేలా బొమ్మూరులోని కాటన్‌ స్మారక నివాసం నుంచి ఆయన వేషం ధరించిన ఓ వ్యక్తి గుర్రంపై ప్రత్యేక తపాలా కవరును ధవళేశ్వరంలోని మ్యూజియం వద్దకు చేర్చారు.


కెప్టెన్‌ పార్టీకి హాకీ స్టిక్‌ చిహ్నం

‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ (పీఎల్‌సీ) పేరుతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ప్రారంభించిన కొత్త పార్టీకి ఎన్నికల చిహ్నంగా హాకీ స్టిక్‌ - బాల్‌ లభించింది. ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకుని పీఎల్‌సీ పోటీ చేస్తుంది.

మూడో విడత సాగర పరీక్షలకు ‘విక్రాంత్‌’

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన భారత తొలి విమానవాహక నౌక (ఐఏసీ) విక్రాంత్‌ మూడో విడత సముద్ర పరీక్షలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఇది సాగరంలో సంక్లిష్ట విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆగస్టులో లాంఛనంగా ఇది నౌకాదళంలో చేరనుంది. 40వేల టన్నుల బరువుండే విక్రాంత్, భారత్‌ నిర్మించిన యుద్ధనౌకలన్నింటిలోకీ అత్యంత సంక్లిష్టమైంది. రూ.23 వేల కోట్లతో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ దీన్ని రూపొందించింది. దీంతో ఈ సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. ‣ గత ఏడాది ఆగస్టులో ఈ యుద్ధనౌక తొలిసారిగా ఐదు రోజుల పాటు సముద్ర పరీక్షలకు బయలుదేరింది. గత అక్టోబరులో 10 రోజుల పరీక్షలు పూర్తి చేసుకుంది. మూడో విడత ప్రయోగాలను నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నోలాజికల్‌ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఈ యుద్ధనౌకపై మిగ్‌-29కె యుద్ధవిమానాలు, కామోవ్‌-31 హెలికాప్టర్లు, ఎంహెచ్‌-60ఆర్‌ బహుళ ప్రయోజన హెలికాప్టర్లను మోహరించనున్నారు. 2300 కంపార్ట్‌మెంట్లతో కూడిన విక్రాంత్‌లో 1700 మంది సిబ్బంది ఉంటారు. మహిళా అధికారుల కోసం ప్రత్యేక వసతులను కల్పించారు.

5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు.

ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో యూపీలో ఎన్నికలు జరుగుతాయి. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 14న; మణిపుర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో 8.55 కోట్ల మంది మహిళలు ఉనానరు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్‌చంద్ర పేర్కొన్నారు.


పంజాబ్‌ నూతన డీజీపీగా వీరేశ్‌ కుమార్‌ భావ్రా

పంజాబ్‌ నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీరేశ్‌ కుమార్‌ భావ్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తాత్కాలిక డీజీపీగా బాధ్యతల నిర్వహిస్తున్న సిద్ధార్థ్‌ చటోపాధ్యాయ నుంచి భావ్రా పగ్గాలు స్వీకరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భారీ భద్రత వైఫల్యం తలెత్తడంతో చటోపాధ్యాయపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

రైలు టికెట్లపై అభివృద్ధి పన్ను భారం

దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులపై అభివృద్ధి పన్ను భారం పడనుంది. రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్న రైల్వేస్టేషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. స్టేషన్‌ అభివృద్ధి రుసుం (స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీ /ఎస్డీఎఫ్‌) పేరిట ప్రయాణికుల నుంచి టికెట్‌ స్థాయినిబట్టి రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. రైల్వే టికెట్ల బుకింగు సమయంలోనే ఈ అదనపు మొత్తాన్ని కలుపుతారు.

మదర్‌ థెరిస్సా సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌

మదర్‌ థెరిస్సా నెలకొల్పిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ (ఎంఓసీ)కి కేంద్ర హోం శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద లైసెన్సును పునరుద్ధరించింది. దీంతో ఆ సంస్థ విదేశీ దాతల నుంచి విరాళాలను పొందేందుకు మార్గం సుగమమైంది. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును వినియోగించుకోవచ్చు. నిరుపేదలు, అనాథల కోసం ఎంఓసీని 1950లో మదర్‌ థెరిస్సా కోల్‌కతాలో ప్రారంభించారు. ఆ సంస్థకున్న ఎఫ్‌సీఆర్‌ఏ లెసెన్సును రద్దు చేసినట్లు 2020 డిసెంబరు 27న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును పునరుద్ధరించింది.

‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’పై సుప్రీంకోర్టు తీర్పు

ప్రకృతిలో సహజంగా సంభవించే తుపాన్లు, వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి వాటి కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలనే న్యాయ పరిభాషలో దైవిక చర్య (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌)గా భావించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ అగ్గిరాజుకున్నా దానిని ఆర్పే సాధనాలు అందుబాటులో ఉంటే నష్టాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చు. ఇవేవీ పాటించని పరిస్థితుల్లో జరిగే అగ్ని ప్రమాదాలన్నిటినీ దైవిక చర్యలుగా పరిగణనలోకి తీసుకోబోమని జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరీ, జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. మద్యం తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దైవిక చర్యగా పేర్కొనడంతో పాటు ఆ సంస్థకు ఎక్సైజ్‌ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. పన్నుల కింద రూ.6.39 కోట్లు చెల్లించాల్సిందిగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఎక్సైజ్‌ శాఖ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీని ఆదేశించింది.

భారత నౌకాదళానికి బొలార్డ్‌ టగ్‌ అప్పగింత

విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డులో తయారు చేసిన బొలార్డ్‌ టగ్‌ ‘బల్బీర్‌’ను భారత నౌకాదళానికి అప్పగించినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ముంబయి డాక్‌యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కమాండర్‌ జేపీ గుప్తా, కమొడోర్‌ కుంజమాన్‌ మాట్లాడారు. 50 టన్నుల సామర్థ్యం గల బొలార్డ్‌ టగ్‌ నిర్మాణంతో షిప్‌యార్డులో 200వ వెసల్‌ తయారు చేసిన మైలురాయిని చేరుకున్నట్లు తెలిపారు. నౌకాదళ అవసరాల కోసం నిర్మించిన ఈ వెసల్‌ 12 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని వెల్లడించారు.

దేశంలో కరోనా టీకా పంపిణీలో 150 కోట్ల మైలురాయి

కొవిడ్‌ టీకా పంపిణీలో దేశం మరో కీలక మైలురాయిని దాటింది. ఇప్పటివరకు అందించిన కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 150 కోట్లు దాటింది. దేశంలో కరోనా టీకా డోసుల సంఖ్య గత ఏడాది అక్టోబరు 21తో 100 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో వయోజన జనాభాలో 91% మందికి పైగా కనీసం ఒక డోసు వేసుకున్నారు. 66% మంది రెండు డోసులూ తీసుకున్నారు. అర్హులైన కౌమారుల్లో 22% మందికి మొదటి డోసు అందింది. దేశంలో కరోనా టీకా పంపిణీ గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తంగా 87.80 కోట్లకు పైగా తొలి డోసులు, 62.71 కోట్లకు పైగా రెండో డోసులను అందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

హరిత ఇంధన నడవా రెండో దశకు కేబినెట్‌ ఆమోదం

హరిత ఇంధన నడవా (జీఈసీ) రెండో దశకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ దశ ప్రాజెక్టులో భాగంగా 2026 నాటికి ఏడు రాష్ట్రాల్లో (గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌) 10,750 సర్క్యూట్‌ కిలోమీటర్ల మేర విద్యుత్తు ప్రసార లైన్లను ఏర్పాటుచేస్తారు. ఇందుకోసం రూ.12,031 కోట్లు వ్యయం చేయనున్నారు.

సైన్యం చేతికి గుల్మార్గ్, సోనామార్గ్‌ భూములు

జమ్మూ-కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్‌ పర్యాటక రిసార్టుల్లో 70 హెక్టార్ల భూభాగాన్ని ‘వ్యూహాత్మక ప్రాంతాలు’గా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ భూములను సైనిక దళాలు స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమమైంది. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలైనప్పటికీ వ్యూహాత్మక భూభాగాలుగా ప్రకటించిన చోట సైనిక దళాలు మౌలిక వసతులను అభివృద్ధి చేయవచ్చు.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. అసెంబ్లీ సమావేశాలను మీడియాతోపాటు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు డీఎంకే ప్రముఖులు వివరించారు. డీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలు కలైవానర్‌ అరంగంలో నిర్వహిస్తున్నారు.

రాతి శిలల ప్రదర్శనశాల ప్రారంభం

హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం(ఎన్‌జీఆర్‌ఐ)లో ఏర్పాటు చేసిన రాతి శిలల ప్రదర్శనశాలను కేంద్ర శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, భూవిజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రారంభించారు. ఎన్‌జీఆర్‌ఐ భూకంప అధ్యయన కేంద్రం రూపొందించిన లఖ్‌నవూ, దేహ్రాదూన్‌ల భూకంప ముప్పు సూచి పటాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనశాలలో 350 కోట్ల ఏళ్ల క్రితం నాటివి మొదలుకొని ఇటీవలి వరకు శాస్త్రవేత్తలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన రాతి శిలలను ఉంచారు.

పెదఅమిరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటుడు సాయికుమార్, పలు రాజవంశాల వారసులు, ప్రాచీన, ఆధునిక కవుల వారసులకు పూర్ణకుంభ పురస్కారాలను ప్రదానం చేశారు. పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ సభ జరిగింది.
ఎలక్ట్రోథెర్మ్‌ (ఇండియా) లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ కేసు గుజరాత్‌ రాష్ట్రంలో అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రోథెర్మ్‌ (ఇండియా) లిమిటెడ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి దాదాపు రూ.632 కోట్లు రుణాల కింద సేకరించిన ఈ కంపెనీ మోసానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో మొత్తం ఆరుచోట్ల తనిఖీలు చేపట్టిన సీబీఐ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కంపెనీ డైరెక్టర్లు నిధులను పక్కదోవ పట్టించినట్లు అభియోగం, బ్యాంకు ఫిర్యాదు మేరకు కంపెనీ డైరెక్టరు ముకేశ్‌ భన్వర్‌లాల్‌ భండారీ, మేనేజింగ్‌ డైరెక్టర్లు శైలేశ్‌ భండారీ, అవినాశ్‌ భండారీ, పూర్తికాల డైరెక్టరు నరేంద్ర దలాల్‌తోపాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో బ్యాంకు ఈ రుణాలను మంజూరు చేసింది.

15 - 18 ఏళ్ల వయసు వారికి టీకాల్లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు

బాలలకు కరోనా టీకా వేయడంలో ఏపీ రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారు 24.41 లక్షల మంది ఉండగా గత 3 రోజుల్లో 53 శాతం మందికి టీకా వేశారు. జాతీయ సరాసరి 17.13 శాతంగా ఉంది. టీకా వేయడంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్‌ 49.98 శాతంతో రెండో స్థానంలో ఉంది. జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 15 - 18ఏళ్ల వయస్సు ఉన్న 12,93,797 మందికి మొదటి డోసు టీకా వేశారు.

అగ్రస్థానంలో సింగరేణి థర్మల్‌ కేంద్రం

విద్యుదుత్పత్తి శాతం (పీఎల్‌ఎఫ్‌) అంశంలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. సింగరేణి సౌర, థర్మల్‌ విద్యుత్కేంద్రాల పనితీరుపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కంటే మిన్నగా 2021 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు నాటికి సగటున 87.18 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి సింగరేణి ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) 73.98 శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచిందని వివరించారు.

మహారాజా బీర్‌బిక్రం ఎయిర్‌పోర్ట్‌ రెండో టెర్మినల్‌ ప్రారంభం

రెండు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన త్రిపుర రాజధాని అగర్తలా చేరుకున్నారు. రూ.3,400 కోట్ల వ్యయంతో నిర్మించిన మహారాజా బీర్‌బిక్రం విమానాశ్రయ రెండో టెర్మినల్‌ భవనాన్ని, మరికొన్ని పథకాలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రానికి మారుపేరుగా ఉన్న త్రిపుర రాష్ట్రం భాజపా పాలనలోకి వచ్చాక అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోందని చెప్పారు. రెండు ఇంజిన్లతో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి త్రిపుర ఒక ఉదాహరణ అని తెలిపారు. మణిపుర్‌లో రూ.4,815 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ముంబయిలో హైస్పీడ్‌ వాటర్‌ ట్యాక్సీలు

ముంబయి వాసుల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు సరికొత్త వాటర్‌ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇకపై ముంబయి నుంచి నవీ ముంబయికి నిమిషాల వ్యవధిలోనే వెళ్లవచ్చు. దీంతో గంటల సమయం ఆదా అవుతుంది.

నెరుల్, బెలాపుర్, జేఎన్‌పీటీ, ఎలిఫాంటా కేవ్స్‌కు పావు గంటలోనే మెరుపు వేగంతో చేరొచ్చు.

ప్రస్తుతం ముంబయి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే గంటల సమయం పడుతోంది. సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా జలమార్గ ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం.

మొత్తం 12 మార్గాల్లో వాటర్‌ ట్యాక్సీల సేవలను తీసుకొస్తోంది. కొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ హైస్పీడ్‌ వాటర్‌ ట్యాక్సీలు గంటకు 12 - 25 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్లగలవు.

ఫలితంగా సాధారణంగా 7 గంటలు పట్టే ప్రయాణ సమయం. వీటి ద్వారా 15 - 17 నిమిషాలకే పరిమితం కానుంది.


జమ్మూకశ్మీర్‌ పోలీసులకు అత్యాధునిక సిగ్‌ సావర్‌ రైఫిళ్లు

దేశంలో ఏ రాష్ట్ర పోలీసులకు లేని విధంగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోనున్నారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలను మరింత సమర్థంగా చేపట్టేందుకు అమెరికా తయారీ సిగ్‌ సావర్‌ రైఫిళ్లను, పిస్టళ్లను వారికి అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా, పాకిస్థాన్‌లతో మనకున్న సరిహద్దుల వద్ద సైన్యం ఇప్పటికే ఈ ఆయుధాలను ఉపయోగిస్తోంది. సిగ్‌ సావర్‌ - 716 రైఫిళ్లు, సిగ్‌ సావర్‌ ఎంపీఎక్స్‌ 9ఎంఎం పిస్టళ్ల కొనుగోలుకు జమ్మూకశ్మీర్‌ పోలీసు శాఖ ఇటీవలే గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించిందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా సుశిక్షుతులైన పోలీస్‌ సిబ్బందికి ఈ ఆధునిక ఆయుధాలను ఇస్తారు.

ప్రస్తుతం పోలీసులు వినియోగిస్తున్న ఇన్సాస్‌ రైఫిళ్ల కన్నా సిగ్‌ సావర్‌ - 716 రైఫిళ్లు అత్యంత శక్తిమంతమైనవి. వీటిలో 7.61×51ఎంఎం తూటాలను ఉపయోగిస్తారు. ఒక్కో రైఫిల్‌ బరువు 3.82 కిలోలు (తూటాల్లేకుండా). నిమిషానికి 650 - 850 తూటాలు పేల్చగలదు. వీటి నిర్వహణ సులభం. అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తాయి.

సిగ్‌ సావర్‌ ఎంపీఎక్స్‌ 9ఎంఎం పిస్టల్‌ ఒక్కొక్క దాని బరువు 2.94 కిలోలు (తూటాల్లేకుండా). నిమిషానికి 850 తూటాలను పేల్చగలదు.

2019లో సిగ్‌ సావర్‌ నుంచి 72,400 రైఫిళ్లను సుమారు రూ.700 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది.

2017లో భారత సైన్యం 7 లక్షల రైఫిళ్లను, 44 వేల తేలికపాటి మిషన్‌ గన్లను, 44,600 కార్బైన్‌ తుపాకులను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది.


న్యాయమూర్తులను ‘సార్‌’ అంటే చాలు: ఒడిశా హైకోర్టు

ఒడిశా హైకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులను మైలార్డ్, యువరానర్‌ అని న్యాయవాదులు సంబోధిస్తారని, ఇకపై దానికి బదులుగా ‘సార్‌’ అని పిలిస్తే సరిపోతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్, జస్టిస్‌ ఆర్‌.కె.పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది.

‘సార్‌’ అంటే చాలని ఇతర మర్యాదపూర్వక పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.


సమయ పాలనలో చెన్నై విమానాశ్రయానికి 8వ ర్యాంకు

విమానాల రాకపోకల్లో సమయ పాలన పాటిస్తున్నందుకు చెన్నై విమానాశ్రయం ‘లార్జ్‌ ఎయిర్‌పోర్ట్స్‌’ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించింది.

సిరియమ్‌ అనే అంతర్జాతీయ ఎయిర్‌ ట్రావెల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని పెద్ద విమానాశ్రయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది.

టాప్‌-20లో మన దేశం నుంచి చెన్నై ఒక్కటే ఉందని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

చెన్నై నుంచి 89.32 శాతం విమానాలు కచ్చితమైన సమాయానికి రాకపోకలు సాగిస్తున్నాయని వెల్లడించారు.


మహారాష్ట్రలో పేదల ఇళ్లపై ఆస్తిపన్ను రద్దు

మహారాష్ట్ర ప్రభుత్వం బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిధిలోని 500 చదరపు అడుగుల్లోపు నివాసస్థలాలపై ఆస్తిపన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం రూ.468 కోట్ల ఆదాయం కోల్పోతుంది.

బీఎంసీ పరిధిలోని 16 లక్షల ఇళ్ల యజమానులకు లబ్ధి చేకూరుతుందని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ శిండే పేర్కొన్నారు.