జనవరి ఆర్ధిక అంశాలు

టాటా గ్రూప్‌ అధీనంలోకి ఏయిరిండియా


→ ఎయిరిండియాను స్థాపించిన 21 ఏళ్ల తరవాత జాతీయీకరణకు అంగీకరించిన టాటా గ్రూప్‌ భారీ నష్టాల పాలవుతున్న ఆ సంస్థను దాదాపు 7 దశాబ్దాల తరవాత మళ్లీ తన ఆధీనంలోకి తీసుకుంది.
→ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం టాటా గ్రూప్‌నకు అధికారికంగా అప్పగించింది. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది.
→ ‘ఎయిరిండియాను టాటా సన్స్‌ అనుబంధ కంపెనీ అయిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించాం.
→ ఇక నుంచి ఆ సంస్థే యజమాని’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ సందర్భంగా తెలిపారు.
→ 1932లో టాటా గ్రూప్‌ ఎయిరిండియాను స్థాపించగా స్వాతంత్య్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు.
→ సుమారు 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా తిరిగి సొంతగూటికి చేరింది. ఎయిరిండియా యాజమాన్య బదిలీ పూర్తయింది.
→ ఎయిరిండియాకు చెందిన 100 శాతం షేర్లను టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన టాలెస్‌ ప్రై.లి.కు బదిలీ చేయడంతో పాటు, యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు.
→ కొత్త సంస్థకు సంబంధించిన బోర్డు ఇకపై ఎయిరిండియా బాధ్యతలను చూసుకుంటుందని తెలిపారు. గత ఏడాది అక్టోబరులో టాటా గ్రూప్‌ రూ.18,000 కోట్లతో ఎయిరిండియాకు బిడ్‌ దాఖలు చేసి విజయవంతమైంది.
→ ఇందులో రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు రూ.15,300 కోట్ల రుణాలను టాటా గ్రూప్‌ తీర్చనుంది.
→ ఎయిరిండియా ప్రస్థానం ఇదీ:-
→ టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో ఎయిరిండియాను 1932లో టాటా గ్రూప్‌ వ్యవస్థాపకులైన జేఆర్‌డీ టాటా ప్రారంభించారు. దేశంలో తొలి విమానయాన సంస్థ ఇది. అవిభక్త భారతావనిలో కరాచీ నుంచి ముంబయికి ఉత్తరాల సర్వీసుతో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1946లో టాటా సన్స్‌కు చెందిన విమానయాన విభాగం ఎయిరిండియా పేరుతో నమోదైంది. 1948లో ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ ఐరోపాకు విమాన సర్వీసుల్ని ప్రసిద్ధ ‘మహారాజా మస్కట్‌తో’ ప్రారంభించింది. భారత్‌లో తొలి ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం కింద అంతర్జాతీయ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం, టాటాల వాటా 25 శాతం కాగా, మిగతాది ప్రజలకు ఉండేది. 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంస్థను జాతీయం చేశాక, నాలుగు దశాబ్దాల పాటు ఎదురులేని విధంగా సాగింది.
→ 1932: టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ పేరుతో జేఆర్‌డీ టాటా విమానయాన సంస్థను ప్రారంభించారు. తొలి ఏడాదిలో 10.7 టన్నుల మెయిల్స్, 155 మంది ప్యాసింజర్లను తరలించింది.
→ 1938: టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ పేరు టాటా ఎయిర్‌లైన్స్‌గా మార్పు. ఇదే ఏడాదిలో తొలి విదేశీ విమానం కొలంబో ప్రయాణం.
→ 1946: 2వ ప్రపంచ యుద్ధం తర్వాత టాటా ఎయిర్‌లైన్స్‌ పబ్లిక్‌ కంపెనీగా అవతరణ. ఎయిరిండియాగా పేరు మార్పు.
→ 1953: ఎయిరిండియా జాతీయీకరణ.
→ 2022: మళ్లీ టాటాల చేతికి.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌


→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారత్‌ 9.2 శాతం వృద్ధిని సాధించబోతోంది.
→ తద్వారా చైనాను తోసిరాజని ‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా మన దేశం తిరిగి గుర్తింపు పొందబోతోంది. ఆ హోదాను కనీసం రెండేళ్ల పాటు నిలబెట్టుకునే అవకాశం ఉంది.
→ బడ్జెట్‌ సమావేశంలో వెలువడిన ఆర్థిక సర్వే ఈ మేరకు అంచనాలు వేసింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 - 8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు కట్టింది.
→ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం ఇంకా ఉందని సర్వే తేల్చింది.
→ మొత్తం మీద స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సూచీలను పరిశీలిస్తే భవిష్యత్‌ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సన్నద్ధంగా ఉందని వివరించింది.
→ దేశంలో పెరుగుతున్న వ్యాక్సినేషన్‌ విస్తృతి, సరఫరా రంగంలో వచ్చిన సంస్కరణలు, నియంత్రణల సడలింపు వంటివి వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవనున్నాయని పేర్కొంది.
→ ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు
→ వచ్చే ఏడాది చమురు ధరలు పీపాకు 70 - 75 డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాల ప్రాతిపదికన సర్వేలో లెక్కలు కట్టారు. 2022 - 23 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుకు సంబంధించి సర్వేలో పేర్కొన్న అంచనాలు ప్రపంచబ్యాంకు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వేసిన 9 శాతం అంచనా కన్నా ఇది తక్కువగా ఉంది. ఎస్‌ అండ్‌ పీ, మూడీస్‌ కట్టిన లెక్కల కన్నా ఇది స్వల్పంగా ఎక్కువగా ఉంది.
→ 2022 - 23లో అంచనా వేసిన 8 - 8.5 శాతం వృద్ధి అనేది తక్కువ ప్రాతిపదికన రూపొందించింది కాదు. 2021 - 22లో వాస్తవ జీడీపీ వృద్ధి 9.2 శాతంగా ఉండొచ్చని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. కొవిడ్‌ ముందు నాటి (2019 - 20) ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ప్రాతిపదికన చూస్తే దాన్ని 10 శాతంగా పరిగణించొచ్చు.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి పెరిగింది. దీంతో ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని కొనసాగించడానికి, అవసరమైతే పెంచడానికి సర్కారుకు వెసులుబాటు లభించింది. 2021 - 22 బడ్జెట్‌లో పేర్కొన్న 6.8 శాతం ద్రవ్యలోటుకు పరిమితం కావడానికి ఇది వీలు కల్పిస్తోంది.
→ గత రెండేళ్లలో కొవిడ్‌ ఉద్ధృతి దేశ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చింది. ఎంఎస్‌ఎంఈ రంగాలు, వాణిజ్యం, రవాణా, పర్యాటకం, చిల్లర వ్యాపారం, హోటల్, వినోదం వంటి రంగాలతో కూడిన ఒక భాగం మొదటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఆ ప్రభావం నుంచి చివరిగా బయటపడేది కూడా ఆ రంగాలే. మరోవైపు పలు రంగాలు కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా తట్టుకొన్నాయి. కొన్ని మహమ్మారి సమయంలోనూ వృద్ధి సాధించాయి. మొత్తం మీద 2019 - 20లో సేవారంగం వాటా 55 శాతంగా ఉండగా 2021 - 22లో అది 53 శాతానికి తగ్గింది.
→ సామర్థ్య పెంపు చర్యలను వేగవంతం చేస్తున్న దృష్ట్యా రైల్వే రంగంలో రాబోయే పదేళ్లలో భారీ స్థాయి మూలధన పెట్టుబడులు రానున్నాయి. 2030 నాటికి డిమాండు కంటే రైల్వే అన్ని విధాలా ముందుంటుందని అంచనా. సరకు రవాణాలో రైల్వే వాటా ఇప్పుడున్న 26 - 27% నుంచి 40 - 45 శాతానికి చేరుతుంది. 2014 వరకు ఏటా సగటున రూ.46,000 కోట్ల లోపు పెట్టుబడులు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.2,15,000 కోట్లు దాటింది. రైలు మార్గాల విద్యుదీకరణ 2023 డిసెంబరుకు పూర్తవుతుంది. ఏటా 1835 కి.మీ. మేర నూతన రైలు మార్గాలు సిద్ధమవుతున్నాయి. 2030 నాటికి సామర్థ్యం ఇప్పుడున్న 470 కోట్ల టన్నుల నుంచి 820 కోట్ల టన్నులకు చేరుతుంది.
→ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2020 - 21లో 13,327 కి.మీ. మేర జాతీయ మార్గాలు నిర్మించారు. మునుపటి ఏడాది కంటే ఇది 30% ఎక్కువ. రహదారులకు కేటాయింపులు పెరగడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

హైదరాబాద్‌లో ఒపో ఇండియా పవర్‌ ల్యాబ్‌


→ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒపో ఇండియా భారత్‌లో ఒక పవర్, పర్ఫామెన్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న పరిశోధన - అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రంలో మార్చికల్లా ఇది ఏర్పాటవుతుంది.
→ ఈ ల్యాబ్‌ కంపెనీకి మూడోది అవుతుంది. భవిష్యత్తులో విడుదల చేసే స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడంపై ఈ ల్యాబ్‌ దృష్టి సారిస్తుందని కంపెనీ హెడ్‌ (పరిశోధన - అభివృద్ధి), వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌ తెలిపారు.

‘యూనికార్న్‌’ క్లబ్‌లో డార్విన్‌బాక్స్‌


→ హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్, ‘యూనికార్న్‌’ క్లబ్‌లో చేరింది.
→ సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) కంటే అధికంగా ఉన్న అంకుర సంస్థలను యూనికార్న్‌లుగా పరిగణిస్తున్నారు.
→ డార్విన్‌ బాక్స్‌ తాజాగా 72 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.538 కోట్లు) మూలధన నిధులు సమీకరించింది. బిలియన్‌ డాలర్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ నిధులు లభించినట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది.
→ తద్వారా హైదరాబాద్‌ నుంచి తొలి ‘యూనికార్న్‌’గా ఈ సంస్థ నిలిచింది. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని అంకుర సంస్థలకు ఇంతకు ముందు ఈ గుర్తింపు లభించింది.
→ అయితే పూర్తిగా స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన చైతన్య పెద్ది, జయంత్‌ పాలేటి, రోహిత్‌ చెన్నమనేని కలిసి 2015లో హైదరాబాద్‌లో నెలకొల్పిన, పూర్తిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలు విస్తరించిన ‘డార్విన్‌బాక్స్‌’, ‘యూనికార్న్‌’గా గుర్తింపు పొందడం ప్రత్యేకత. తాజాగా ఈ సంస్థకు టెక్నాలజీ క్రాస్‌ఓవర్‌ వెంచర్స్‌ (టీజీవీ), సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్, సిఖోయా, లైట్‌స్పీడ్, ఎండియా పార్టనర్స్, 3వన్‌4కేపిటల్‌ నిధులు సమకూర్చాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు 110 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) మేరకు మూలధన నిధులు సమీకరించింది.
→ తాజాగాలభించిన మూలధనంతో తన వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరిస్తామని, నూతన టెక్నాలజీ సేవలు ఆవిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది.

డెకా కార్న్‌గా ఘనత సాధించిన స్విగ్గీ


→ దేశంలో మరో డెకా కార్న్‌ (10 బిలియన్‌ డాలర్లు, సుమారు రూ.75000 కోట్ల విలువైన) సంస్థగా ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు దేశీయ అంకురాల్లో పేటీఎం, ఓయో, బైజూస్‌ ఈ ఘనత సాధించాయి.
→ 1 బిలియన్‌ డాలర్‌ (సుమారు రూ.7500 కోట్ల) విలువ కలిగిన సంస్థను యూనికార్న్‌గా వ్యవహరిస్తుండగా, అంతకు పది రెట్ల విలువ కలిగిన సంస్థను డెకా కార్న్‌గా పేర్కొంటారు.

40,000 డాలర్ల దిగువకు బిట్‌కాయిన్‌


→ క్రిప్టో కరెన్సీల విలువలు దిగి వస్తున్నాయి. అత్యంత ఎక్కువగా ట్రేడ్‌ అయ్యే క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ విలువ 40,000 డాలర్లకు దిగి, 38,462 డాలర్లకు చేరింది. ఇది 5 నెలల కనిష్ఠస్థాయి. దీని విలువ 7.4 శాతం తగ్గింది.
→ మరో క్రిప్టో కరెన్సీ ఈథర్‌ విలువ కూడా 3,000 డాలర్ల దిగువకు చేరింది. నవంబరు గరిష్ఠాల నుంచి ఈ డిజిటల్‌ టోకెన్ల విలువ 1,00,000 కోట్ల డాలర్ల మేర తగ్గిందని కాయిన్‌మార్కెట్‌క్యాప్‌ గణాంకాలు చెబుతున్నాయి.
→ అమెరికాలో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడంతో పాటు టెక్నాలజీ స్టాక్‌ల పతనంతో క్రిప్టో కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. బినాన్స్‌ కాయిన్, కార్డనో, సొలానా తదితర క్రిప్టో కరెన్సీల విలువలు కూడా తగ్గుతున్నాయి.
→ గత రెండేళ్లలో బిట్‌ కాయిన్‌ విలువ నాలుగింతలకు పైగా పెరిగి 69,000 డాలర్లకు చేరింది. అక్కడ నుంచి సుమారు 30,000 డాలర్ల మేర పతనమైంది.

223 కోట్ల డాలర్లు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు


→ దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2022 జనవరి 14తో ముగిసిన వారానికి 222.9 కోట్ల డాలర్ల మేర పెరిగి 63,496.5 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.
→ జనవరి 7తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 87.8 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు), పసిడి నిల్వలు అధికమై విదేశీ మారకపు నిల్వలు పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది.
→ ఎఫ్‌సీఏలు 134.5 కోట్ల డాలర్ల మేర పెరిగి, 57,073.7 కోట్ల డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 72.6 కోట్ల డాలర్ల మేర పెరిగి 3,977 కోట్ల డాలర్లకు చేరాయి.

మూడో ఏడాదీ ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ


→ ప్రపంచంలో మూడో అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజీగా వరుసగా మూడో ఏడాదీ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిలిచింది.
→ ఫ్యూచర్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఏ) వివరాల ప్రకారం.. 2021లో అంతర్జాతీయంగా ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్‌లో ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యాపరంగా ఎన్‌ఎస్‌ఈ ఈ ఘనత సాధించింది.
→ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజీస్‌ (డబ్ల్యూఎఫ్‌ఈ) గణాంకాల ప్రకారం 2021లో క్యాష్‌ ఈక్విటీస్‌ విభాగంలో లావాదేవీల సంఖ్యాపరంగా ఎన్‌ఎస్‌ఈ నాలుగో స్థానం దక్కించుకుంది.

డిసెంబరు ఎగుమతుల్లో 39% వృద్ధి


→ దేశీయ ఎగుమతులు గత డిసెంబరులో 37.81 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2.85 లక్షల కోట్ల)కు చేరాయి. ఒక నెలలో అత్యధిక ఎగుమతులు ఇవే కావడం విశేషం.
→ 2020 ఇదే నెల ఎగుమతులు 27.22 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే, ఈసారి 38.91 శాతం పెరిగాయి. సమీక్షా మాసంలో దిగుమతులు సైతం 38.55 శాతం పెరిగి 59.48 బిలియన్‌ డాలర్లకు చేరాయి.
→ ఫలితంగా వాణిజ్యలోటు 21.68 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,62,600 కోట్లు)గా నమోదైంది. 2020 డిసెంబరులో వాణిజ్య లోటు 15.72 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021 ఏప్రిల్‌- డిసెంబరులో ఎగుమతులు 301.38 బి.డాలర్లకు చేరాయి.

దేశంలో తొలిసారిగా క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌


→ హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అంకుర సంస్థ టోరస్‌ క్లింగ్‌ ట్రేడింగ్‌ ఇండియా, రిలయన్స్‌ కేపిటల్‌ మాజీ సీఈఓ అయిన శ్యామ్‌ ఘోష్‌ ఏర్పాటు చేసిన కాస్మియా ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ (సీఎఫ్‌హెచ్‌) తో కలిసి దేశంలో తొలిసారిగా ‘క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌’ ను ఆవిష్కరించనుంది.
→ దీని కోసం టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చైన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంయుక్త సంస్థ క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌ను తీసుకురావడానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చెందిన ఇండియా ఐఎన్‌ఎక్స్‌ (ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌) తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ వేదికగా క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించనున్నట్లు టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చైన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ వెల్లడించింది.
→ ‣ దీన్లో బిట్కాయిన్, ఎథేరియమ్‌ ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌లు భాగంగా ఉంటాయి. అమెరికా వెలుపల ఇదే మొదటి క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌ (బిట్కాయిన్, ఎథేరియమ్‌ ఫ్యూచర్స్‌) కావడం ప్రత్యేకత. దీంతో పాటు యూఎస్‌లో నమోదైన మెటావర్స్‌ లార్జ్‌ క్యాప్‌ డిస్కౌంట్ సర్టిఫికెట్లను సైతం అందిస్తుంది. ‘క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్‌’ ను తమ ప్రపంచ వ్యాప్త మార్కెటింగ్‌ వ్యవస్థ, భాగస్వాముల ద్వారా పంపిణీ చేయనున్నట్లు టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చైన్‌ ఐఎఫ్‌ఎస్‌సీ వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో 100 కోట్ల డాలర్ల (దాదాపు రూ.7,500 కోట్లు) క్రిప్టో ఫ్యూచర్స్‌ ఈటీఎఫ్, డిస్కౌంట్ సర్టిఫికెట్్స టర్నోవర్‌ (ఏయూఎం) సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది.

రూ.37,500 కోట్లతో గుజరాత్‌లో ఉక్కు ప్లాంటు


→ గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీలు జట్టు కట్టాయి. గుజరాత్‌లో ఒక ఏకీకృత ఉక్కు మిల్లు నెలకొల్పడంతో పాటు పలు ప్రాజెక్టులపై 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37,500 కోట్లు) పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

మందకొడిగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి


→ పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా మూడో నెలా మందకొడిగానే నమోదైంది. నవంబరులో ఇది 1.4 శాతానికి పరిమితమైంది. గనుల రంగం మెరుగైన పనితీరును కనబర్చినప్పటికీ, ‘ఏడాది క్రితం నాటి తక్కువ ప్రాతిపదిక ప్రభావం’ తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. పారిశ్రామికోత్పత్తి వృద్ధిని పారిశ్రామికోత్పత్తి సూచీతో (ఐఐపీ) లెక్కిస్తారు. 2021 నవంబరులో ఇది 128.5 పాయింట్లు గా నమోదైంది. 2020 డిసెంబరులో ఇది 126.7 పాయింట్లుగా ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది.
→ ‣ ఐఐపీలో 77.63 శాతం వాటా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి నవంబరులో 0.9 శాతం పెరిగింది. గనుల రంగ ఉత్పత్తి 5%, విద్యుదుత్పత్తి 2.1% మేర పెరిగాయి. 2020 నవంబరు ఐఐపీ 1.6 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరు మధ్య ఐఐపీ 17.4 శాతం వృద్ధి సాధించింది.

6 నెలల గరిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం


→ 2021 డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో 5.59 శాతంగా నమోదైందని, ఇది ఆరు నెలల గరిష్ఠస్థాయి అని ప్రభుత్వం తెలిపింది. 2021 మేలో 6.3 శాతం, జూన్‌లో 6.26 శాతం, జులైలో 5.59 శాతం, ఆగస్టులో 5.3 శాతం, సెప్టెంబరులో 4.35 శాతంగా తగ్గుతూ వచ్చినా, మళ్లీ అక్టోబరు నుంచి మళ్లీ పెరుగుతోంది.
→ ‣ 2021 అక్టోబరులో 4.48 శాతంగా, నవంబరులో 4.91 శాతంగా నమోదైంది. డిసెంబరులో ఇంకా పెరిగినా, ఆర్‌బీఐ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతానికి లోపే ఉండటం గమనార్హం. గత డిసెంబరులో ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతానికి పెరిగింది. నవంబరులో ఇది 1.87 శాతంగానే ఉంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల సమయంలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

భారీస్థాయి బ్యాంకు మోసాలపై సలహా బోర్డు పరిధి పెంచిన సీవీసీ


→ భారీస్థాయిలో జరిగే బ్యాంకు మోసాలపై ప్రాథమిక పరిశీలన జరిపే సలహా బోర్డు పరిధిని కేంద్ర విజిలెన్సు కమిషన్‌ (సీవీసీ) విస్తరించింది. ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా ఉన్న కేసుల్లో మాత్రమే బ్యాంకింగ్, ఆర్థిక మోసాల సలహా బోర్డు (ఏబీబీఎఫ్‌ఎఫ్‌) ప్రాథమిక పరిశీలన జరిపి, సీబీఐ వంటి పరిశోధన సంస్థలకు సిఫార్సులు చేసేది. ఇకపై రూ.3 కోట్లకు పైగా ఉన్న అన్ని కేసులను ఈ బోర్డు పరిశీలిస్తుందని సీవీసీ ఆదేశాలు జారీ చేసింది.
→ ‣ అన్ని స్థాయిల అధికారులు, పూర్తికాల డైరెక్టర్లు, మాజీ అధికారులు/ డైరెక్టర్లు బోర్డు పరిధిలోకి వస్తారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఆర్థిక మొత్తాలనుబట్టి ప్రత్యేక సలహా బోర్డుల ఏర్పాటును కూడా పరిశీలిస్తారు. ఆర్‌బీఐతోపాటు సలహా బోర్డును సంప్రదించాక పార్ట్‌టైం ప్రాతిపదికన బోర్డుకు ఓ కార్యదర్శిని కమిషన్‌ నియమిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ మోసాలపై నేర పరిశోధన ప్రారంభించక ముందే ఈ బోర్డుకు నివేదించాలి. అవసరాన్నిబట్టి సీబీఐ కూడా బోర్డును సంప్రదించవచ్చు.

దేశంలో వ్యవస్థాగతంగా ముఖ్య బ్యాంకులు


→ ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు దేశంలో వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకులని (డి-సిబ్‌లు: డొమెస్టిక్‌ సిస్టమికల్లీ ఇంపార్టెంట్‌ బ్యాంక్స్‌) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఈ బ్యాంకులు విఫలం చెందడం అనేది చాలా పెద్ద విషయం (టూ బిగ్‌ టు ఫెయిల్‌ - టీబీటీఎఫ్‌) అని పేర్కొంది. టీబీటీఎఫ్‌ అనే ముద్ర ఉంటే ఆపద సమయంలో ఈ బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఈ ముద్ర వల్ల ఆయా బ్యాంకులకు ఫండింగ్‌ విపణిలో ప్రయోజనాలుంటాయి. 2020లో డి-సిబ్‌లుగా ఉన్న ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లను అదే నిర్మాణం కింద కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2015, 2016లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రమే డి-సిబ్‌లుగా ఉండగా, 2017 మార్చి 31న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అందించిన డేటా ఆధారంగా దాన్ని కూడా ఈ జాబితాలో ఆర్‌బీఐ చేర్చింది. 2021 మార్చి 31న ఆయా బ్యాంకులు అందించిన సమాచారం ఆధారంగా తాజాగా జాబితాను ప్రకటించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

మహిళా పారిశ్రామికవేత్తలకు ఐ-విన్‌


→ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అంకురాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ‘వుమెన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ (ఐ-విన్‌)ను ప్రారంభించినట్లు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తెలిపింది.
→ ఐ-వెంచర్స్‌ జీ ఐఎస్‌బీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేసింది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ అంకురాలను పూర్తిస్థాయి వ్యాపారాలుగా మలచుకునేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఐఎస్‌బీ పేర్కొంది.
→ మార్కెట్‌లోకి వెళ్లడం, ఉత్పత్తులు, సాంకేతికతలను మరింత అభివృద్ధి చేయడం తదితరాలకు ఇది సహాయం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కీలకమని ఐవెంచర్స్‌ జీ ఐఎస్‌బీ డైరెక్టర్‌ సౌమ్య కుమార్‌ తెలిపారు.