జనవరి ఆంధ్ర ప్రదేశ్ అంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం తిరోగమనం
→ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం వృద్ధి రేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018 - 19లో 8.24%, 2019 - 20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2020 - 21లో మైనస్ 6.71%కి పడిపోయినట్లు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది.
→రాష్ట్ర స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 2018 - 19లో 42.25% ఉండగా, 2019 - 20లో అది 41.86%, 2020 - 21లో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధి రేటు మూడేళ్లుగా క్రమంగా తగ్గుతోంది.
→2018 - 19లో 7.91% ఉన్న ఈ వృద్ధిరేటు 2019 - 20లో 5.69 శాతానికి చేరింది. 2020 - 21లో అది ఏకంగా మైనస్ 3.94 శాతానికి పడిపోయింది.
→ ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుద్ధ్య వసతులున్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015 - 16 ఆరోగ్య సర్వే - 4 ప్రకారం 77.3% ఉండగా 2019 - 21 ఆరోగ్య సర్వే - 5 నాటికి 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా, తాజాగా 62%కి పడిపోయింది.
→ విశాఖ పోర్టులో సరకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్ అరౌండ్ (సరకు లోడింగ్, అన్‌లోడింగ్)కు సగటున 3.15 రోజులు పడుతోంది. కోల్‌కతా, మర్మగోవా, వైజాగ్ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరకు రవాణా ట్రాఫిక్ నమోదైంది.
→ 2022 - 25 మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ (మానిటైజ్) చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
→ లక్ష హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉంది.
→ నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020 - 21లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాలపరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొంది.
మైనస్‌లో నికర ఉత్పత్తి వృద్ధి రేటు
→ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తొలి ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రెండంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధిరేటు 2020 - 21లో ఏకంగా 1.6%కి పడిపోయింది. 2011 - 22 సిరీస్‌ను అనుసరించి తాజా ధరల ప్రకారం ఏపీ నికర ఉత్పత్తి వృద్ధి రేటు 2014 - 15లో 14%, 2015 - 16లో 15.7%, 2016 - 17లో 12.4%, 2017 - 18లో 15.3%, 2018 - 19లో 10.8%, 2019 - 20లో 11.3% నమోదుకాగా 2020 - 21లో మాత్రం 1.6%కి పడిపోయింది. రాష్ట్ర నికర ఉత్పత్తి విలువ 2019 - 20లో రూ.8,70,064 కోట్లుగా నమోదుకాగా, 2020 - 21లో రూ.8,84,199 కోట్లకు, తలసరి నికర ఉత్పత్తి విలువ రూ.1,68,480 నుంచి రూ.1,70,215కి చేరింది.
గండికోట లోయపై తపాలా కవర్
→కడప జిల్లాలోని గండికోట లోయపై తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. స్థానిక సబ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఈ కవర్‌ను ఆవిష్కరించారు.
→ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గండికోట చరిత్రను ఇనుమడింప చేయాలన్నారు.
→తపాలా డివిజినల్ సూపరింటెండెంట్ ఆదినారాయణ మాట్లాడుతూ ‘ది గ్రేట్ గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా’ పిలుచుకొనే గండికోట ప్రకృతి రమణీయ ప్రదేశమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు
→కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్లు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో పేర్కొన్నారు.
→ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు.
→ గెజిట్ నోటిఫికేషన్లలో మాత్రం... కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు.
→ ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లుగా తెలిపారు.
→ అలాగే రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్ మెమోరాండంలో పేర్కొనగా, గెజిట్ నోటిఫికేషన్‌లో కనిగిరి పేరు తీసేశారు.
→ కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొనగా, గెజిట్ నోటిఫికేషన్‌లో మాత్రం పెనుగొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో ఇక 26 జిల్లాలు
→ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది.
→వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
→రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది.
→ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
కొన్నింటికి పాతపేర్లే
→జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి శ్రీ బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టారు.
→ విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేశారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ, విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఆయన పేరు పెట్టారు.
→ అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాలవ్యావహారిక నామాలతో ఏర్పాటు చేశారు.
→ ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.
→ చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాçయ్యే శ్రీ బాలాజీ జిల్లాలోకి తెచ్చారు.
→ మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటైనఎన్టీఆర్ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.
‣ హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురం పక్కనే ఉంటుంది. జిల్లాల పునర్విభజనలో దాన్ని అనంతపురం జిల్లా పరిధిలోకి తెచ్చారు.
కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు :-
→నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు రెవెన్యూ డివిజన్లతో బాపట్ల జిల్లాను ఏర్పాటు చేయనుండగా ఈ రెండింటినీ కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అన్ని జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రెవెన్యూ డివిజన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరంలో బొబ్బిలి, విశాఖలో భీమునిపట్నం, నరసాపురంలో భీమవరం, విజయవాడలో నందిగామ, తిరువూరులను, బాపట్లలో బాపట్ల, చీరాల (ఈ రెండూ కొత్తవే), ప్రకాశంలో కనిగిరి, నంద్యాలలో డోన్, ఆత్మకూరులను, అనంతపురంలో గుంతకల్, పుట్టపర్తిలో పుట్టపర్తి, కడపలో బద్వేలు, రాయచోటిలో రాయచోటి, చిత్తూరులో పలమనేరు ఏర్పాటు చేస్తున్నారు.
→ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసి, కావలి డివిజన్‌లో కలిపారు.
జనాభాలో కర్నూలు, విస్తీర్ణంలో ప్రకాశం టాప్ :-
→ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 26 జిల్లాల్లో జనాభాపరంగా 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటిస్థానంలో నిలిచింది. పాడేరు కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభాతో చివరి స్థానంలో నిలిచింది.
శ్రీకాకుళం బాలికకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్
→శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు ధైర్య సాహసాల విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం దక్కింది.
→జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందజేశారు.
→2018లో జమ్మూకశ్మీర్ ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సమయంలో ఓ రోజు ఇంట్లో హిమప్రియ, ఆమె తల్లి పద్మావతి ఉన్నప్పుడు తీవ్రవాదులు మారణాయుధాలతో దాడి చేశారు.
→ సుమారు నాలుగు గంటల పాటు జరిగిన దాడిలో తల్లికి తీవ్రగాయమైంది. ఆ సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆమె తల్లితో పాటు క్వార్టర్స్‌లోని కొంత మందిని కాపాడినందుకు ఈ అవార్డు దక్కింది.
వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు
→రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల మధ్య వివాదాల పరిష్కారానికి రాష్ట్రస్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కారద్యర్శి, పీసీసీఎఫ్, ముఖ్య ఆర్థిక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
→హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
సైనిక్ స్కూల్‌పై రూపొందించిన పోస్టల్ కవర్ విడుదల: వజ్రోత్సవాలు
→విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి.
→ఈ సందర్భంగా సైనిక్ స్కూల్‌పై రూపొందించిన పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
→పూర్వ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వేడుకలను వీక్షించారు.
‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’గా బి.పద్మావతి
→ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు.
→ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవా (ఎన్‌జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్‌లైన్ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు.
→2021 సెప్టెంబరులో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వంద మంది మహిళలు ఎంపిక కాగా వీరిలో 36 మంది అర్హత సాధించారు.
→జనవరి 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,07,36,279
→ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 4,07,36,279కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - 2022 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రచురించింది.
→దీని ప్రకారం రాష్ట్రంలో నికరంగా 29,544 మంది (0.07%) ఓటర్లు పెరిగారు. 2020 నవంబరు 1న రాష్ట్రంలోని 174 నియోజకవర్గాలకు సంబంధించి, నవంబరు 15న బద్వేలు నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది.
→వాటి ప్రకారం రాష్ట్రంలో 4,07,06,804 మంది ఓటర్లుండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది.
→తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,62,880 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ వివరాలను ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ వెల్లడించారు.
→ఏపీలో గతంలో 45,917 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. వాటి సంఖ్యను 33 పెంచడంతో మొత్తం 45,950కు చేరాయి.
9 జిల్లాల్లో పెరుగుదల... 4 జిల్లాల్లో తగ్గుదల
→అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 16,745 మంది, కర్నూలు జిల్లాలో 15,092 మంది, తూర్పుగోదావరిలో 13,377 మంది ఓటర్లు పెరిగారు.
→అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 28,721 మంది, ప్రకాశంలో 8,432 మంది, కడపలో 1,738 మంది, చిత్తూరులో 1,221 మంది ఓటర్లు తగ్గారు.
ప్రొద్దుటూరులో తొలి పురపాలక సంఘం పెట్రోలు బంకు
→ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెట్రోలు బంకును కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు.
→పురపాలక సంఘాల ఆర్థిక పరిపుష్టి కోసం ఈ ప్రయోగం చేసినట్లు చెప్పారు.
తుంగభద్ర నుంచి 212 టీఎంసీల రికార్డు వినియోగం
→తుంగభద్ర జలాశయం నుంచి 2021 - 22 నీటి సంవత్సరానికిగానూ 212 టీఎంసీలను తీసుకోగలిగినట్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శి నాగమోహన్ తెలిపారు.
→2021 డిసెంబరు 31 వరకు చేసిన నికర వినియోగం ఆధారంగా ఇంత నీటిని సంగ్రహించినట్లు వివరించారు. 45 ఏళ్ల కిందట కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డులో కేటాయించిన నీటికి ఇది సమానమని పేర్కొన్నారు.
→1980 - 81 తర్వాత ఇంత భారీగా నీటిని వినియోగించుకోగలగటం జలాశయ చరిత్రలో ఇదే తొలిసారని వివరించారు.